ఆసుపత్రిలో 10 మంది శిశువుల మృతి.. 20 మందిని కాపాడిన ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నగరంలో ఉన్న మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతిచెందారు.
ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో మంటలు చెలరేగి 10 మంది శిశువులు చనిపోయినట్లు ఝాన్సీ జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ ధ్రువీకరించారు.

యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ శనివారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
''ప్రమాదం ఎలా జరిగిందనే నిజాలు నిగ్గుతేలుస్తాం. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే బాధ్యత వహించడంతో పాటు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు'' అని డిప్యూటీ సీఎం అన్నారు.

అసలేం జరిగింది?
ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్లు ఝాన్సీ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సచిన్ మోహర్ తెలిపారు.
''ఎన్‌ఐసీయూలో 54 మంది శిశువులకు చికిత్స అందిస్తున్నారు. అకస్మాత్తుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే గదిలో ఆక్సిజన్ ఎక్కువగా వ్యాపించి ఉండడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఆ వెంటనే శిశువులను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. చాలామందిని రక్షించగలిగాం, 10 మంది చనిపోయారు'' అని ఆయన చెప్పారు.
ఈ సంఘటనపై ఝాన్సీ కలెక్టర్ అవినాశ్ కుమార్ శుక్రవారం రాత్రి మాట్లాడుతూ, ''సంఘటన జరిగిన సమయంలో అక్కడున్న సిబ్బంది చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్‌ఐసీయూలో 10.30 గంటల నుంచి 10.45 గంటల మధ్య షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి'' అని చెప్పారు.
''పది మంది పిల్లలు చనిపోయినట్లు సమాచారం. సిబ్బంది సకాలంలో చేరుకుని, చాలామంది పిల్లలను రక్షించారు. ప్రమాద ఘటనపై కమిషనర్, డీఐజీ పర్యవేక్షణలో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తుంది.''

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
మంటలు చెలరేగడంతో జాలీని పగలగొట్టి శిశువులను బయటకు తీసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తన బిడ్డ ఆచూకీ ఇంకా దొరకలేదని ఆయన చెప్పారు.
మరో ప్రత్యక్ష సాక్షి కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, "నేను ఆహారం ఇవ్వడానికి లోపలికి వెళ్లినప్పుడు, ఒక మేడమ్ కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు, ఆమె కాలికి మంటలు అంటుకుని ఉన్నాయి. దీంతో మేం వెంటనే 20 మంది శిశువులను బయటికి తీసుకొచ్చి అక్కడున్నసిబ్బందికి అప్పగించాం'' అన్నారు.
''కొంతమంది పిల్లలు ఆక్సిజన్‌పై ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మేం పిల్లలను తీసుకొచ్చి ఆస్పత్రి సిబ్బందికి అప్పగించాం. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని చెబుతున్నప్పటికీ, అక్కడి పరికరాలన్నీ విపరీతంగా వేడెక్కాయి. దీంతో చిన్నారులు చనిపోయారు'' అని ఆయన చెప్పారు.
మంటలు చెలరేగిన సమయంలో అంతా గందరగోళంగా మారిందని, ఆ సమయంలో 50 మంది వరకూ పిల్లలు ఉంటారని, చాలామంది పిల్లలను తీసుకుని ఎమర్జెన్సీ వైపు పరిగెత్తారని అక్కడే ఉన్న మరో ప్రత్యక్ష సాక్షి రిషబ్ యాదవ్ చెప్పారు.
కొందరు పిల్లల ఆచూకీ తెలియడం లేదని, వారి సంబంధీకులు ఆస్పత్రి సిబ్బందికి విషయం తెలియజేయాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వం ఏమంది?
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్ట ఘటన అంటూ ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
“ఝాన్సీ జిల్లాలో, మెడికల్ కాలేజీ ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం, హృదయవిదారకం. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగంతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించాం. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ శ్రీరాముడిని ప్రార్థిస్తున్నా'' అని ఎక్స్‌లో రాశారు.
ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, ''కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. మూడంచెల విచారణ జరగుతుంది. ఆరోగ్య శాఖ ప్రాథమిక విచారణ జరుపుతోంది. ఆ తర్వాత పోలీసుల ఆధ్వర్యంలో రెండో విచారణ కొనసాగుతుంది. అగ్నిమాపక శాఖ కూడా ఇందులో భాగమవుతుంది. మేజిస్ట్రేట్ స్థాయిలో మూడో విచారణ జరుగుతుంది. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. కారణాలు ఏవైనా వాస్తవాలు వెలుగులోకి తెస్తాం'' అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














