భర్తను వదిలేయాలంటే ఇక్కడి అమ్మాయిలు లక్షల రూపాయలు కట్టాల్సిందే...

- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
“మా దగ్గర చిన్నప్పుడే నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తరువాత అమ్మాయికి సంబంధించిన అన్ని నిర్ణయాలను అత్తమామలే తీసుకుంటారు. ఒక వేళ అమ్మాయి ఆ వివాహ బంధం నుంచి బయటపడాలనుకుంటే భారీగా డబ్బులు చెల్లించాలి. మా అత్తమామలు రూ. 18 లక్షలు కట్టాలని నన్ను డిమాండ్ చేశారు”
ఇది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పగారియా గ్రామానికి చెందిన కౌసల్య ఆవేదన. ఈ గ్రామంలో తరతరాలుగా ‘ఝగడా నాతరా’ అనే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని ఆమె తెలిపారు.
కౌసల్య రైతు కుటుంబంలో జన్మించారు. ‘ఝగడా నాతరా’ సంప్రదాయం ప్రకారం ఆమెకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నిశ్చితార్థం చేశారు. 22 ఏళ్ల వయసు వచ్చాక 2021లో పెళ్లి చేశారు.
“నేను ఈ మూడేళ్లలో అనేక చిత్రహింసలు అనుభవించాను. 5 లక్షల రూపాయలు, ఒక బైకు తీసుకురావాలని వారు నన్ను వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక నేను మా పుట్టింటికి వచ్చేశాను” అని కౌసల్య చెప్పారు.


ఫొటో సోర్స్, Kaushalya
కౌసల్య కన్నీటి గాథ
వివాహ బంధం నుంచి బయటపెడితే సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో కౌసల్య తల్లిదండ్రులు ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడట్లేదు.
సర్దుకుపోవాలంటూ కౌసల్యకే నచ్చజెబుతూ అనేక సార్లు ఆమెను తిరిగి అత్తారింటికి పంపించారు.
“నన్ను కొట్టారు. చదువుకుని ఉద్యోగం చేయాలని నాకుంది. ఈ బంధాన్ని తెంచుకోవాలనుకుంటే వాళ్లు రూ.18 లక్షలు డిమాండ్ చేస్తున్నారు” అని కౌసల్య చెప్పారు.
2023లో తన పుట్టింటికి వచ్చిన కౌసల్య ఇక జన్మలో అత్తారింటి గడప తొక్కకూడదని నిర్ణయించుకున్నారు.
అయితే, మళ్లీ కౌసల్యకు నచ్చజెప్పడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. అత్తమామలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ భారీ మొత్తం చెల్లించడం సాధ్యం కాదన్న విషయం కౌసల్యకు తెలుసు.
ఈ సమస్య గ్రామ పెద్దల ముందుకు వెళ్లింది. ఒక వేళ కౌసల్య ఈ బంధం నుంచి బయటపడాలనుకుంటే రూ.18 లక్షలు చెల్లించాల్సిందేనని అక్కడ పెద్దమనుషులు నిర్ణయించారు.
కౌసల్య వెనుకబడిన వర్గమైన సోందియాకు చెందినవారు. ఈ సముదాయానికి చెందినవారు సాధారణంగా తమ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లరు. ఊర్లో పెద్దమనుషుల ముందే పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకుంటారు.

అభివృద్ధిలోనూ వెనుకబడిన గ్రామం
అభివృద్ధిలోనూ పగారియా గ్రామం వెనుకబడి ఉంది. ఈ గ్రామంలోకి అడుగుపెట్టగానే ధ్వంసమైన రోడ్డు కనిపిస్తుంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, రాజ్‌గఢ్ జిల్లాలో 52 శాతం మహిళలు నిరక్ష్యరాసులు. ఆ మహిళల్లో 20-24 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు 46 శాతం ఉన్నారు. వాళ్లలో చాలా మందికి 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, రాజ్‌గఢ్ జిల్లా మొత్తం జనాభా 15.45 లక్షలు కాగా, అందులో మహిళల సంఖ్య 7.55 లక్షల కంటే ఎక్కువగా ఉంది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌తో పాటు రాజస్థాన్‌లోని అగర్ మాల్వా, గుణ, ఝలావర్, చిత్తోర్‌గఢ్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

అసలేంటి ఈ ఆచారం?
ఇక్కడ ఈ సంప్రదాయాన్ని వందేల ఏళ్లుగా అనుసరిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘ఝగడా నాతరా’ సంప్రదాయానికి సంబంధించి ఎలాంటి రాతపూర్వకమైన చరిత్ర లేదని సీమా సింగ్ తెలిపారు.
ఈమె రాజ్‌గఢ్‌లో ఒక పీజీ కాలేజీలో సోషియాలజీ పాఠాలు చెబుతుంటారు.
“ఈ సంప్రదాయం ప్రకారం వితంతువులు, పెళ్లి కానీ అమ్మాయిలు, పురుషులు కలిసి జీవించే అవకాశం ఉంటుంది. వితంతువులు పునర్వివాహం చేసుకుని సమాజంలో తలెత్తుకుని తిరగొచ్చు. కానీ, కాలక్రమేణా ఈ ఆచారం వెనకున్న అసలు ఉద్దేశాలు మారిపోయాయి. ప్రస్తుతం ఇది మహిళల బేరసారంగా మారిపోయింది. చిన్నప్పుడే అమ్మాయిలకు నిశ్చితార్థం లేదా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎప్పుడైనా ఈ బంధంలో సమస్యలు ఏర్పడితే బయటపడటానికి పురుషుడి తరఫువారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు” అని ఆమె తెలిపారు.
“ఒక వేళ ఈ బంధాన్ని తెంచుకోవాలనుకున్నా, అబ్బాయి తరఫు వాళ్లు డిమాండ్ చేసిన డబ్బులు చెల్లించకోపోయినా ఈ సమస్య పంచాయితీ ముందుకు వస్తుంది. పంచాయితీలో వారి కులానికి సంబంధించిన పెద్దలు ఉంటారు. అమ్మాయి స్వేచ్ఛ కోరుకుంటున్నందుకు బదులుగా అబ్బాయికి ఎంత డబ్బులు చెల్లించాలి అనేది కులపెద్దలు నిర్ణయిస్తారు” అని సీమా సింగ్ తెలిపారు.
“ఈ సంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. కోర్టు మ్యారెజీల కంటే ఈ నిశ్చితార్థానికే ఎక్కువగా విలువ ఇస్తారు” అని సామాజిక కార్యకర్త, స్థానిక జర్నలిస్ట్ భాను ఠాకూర్ తెలిపారు.

భారీగా కేసులు
గడిచిన మూడేళ్లలో ఒక్క రాజ్‌గఢ్ జిల్లాలోనే దాదాపుగా 500కిపైగా ‘ఝగడా నాతరా’కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.
ఇవి కేవలం నమోదైన కేసులు మాత్రమే. ఇంకా బయటికి రాని ఘటనలు భారీగానే ఉంటాయని భాను ఠాకూర్ చెప్పారు.
కౌసల్య కేసుకు సంబంధించి రాజ్‌గఢ్ జిల్లా ఎస్పీ ఆదిత్య మిశ్రాతో బీబీసీ మాట్లాడింది.
“మహిళల హక్కులను కాలరాసే ఈ సంప్రదాయం చట్టవిరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం” అని ఎస్పీ ఆదిత్య మిశ్రా తెలిపారు.
“చిన్నప్పుడే నిశ్చితార్థాలు చేస్తారు. పెద్దయ్యాక అమ్మాయి ఆ బంధం నుంచి బయటపడాలంటే అబ్బాయి తరఫు కుటుంబానికి లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ తరహా కేసులే ఎక్కువగా వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను ఈ రకమైన పద్ధతులు పూర్తిగా అణచివేస్తున్నాయి. గడిచిన మూడేళ్లలో దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ఇదో మంచి పరిణామంగానే చూస్తున్నాం. ఎందుకంటే, కనీసం ఇప్పుడైనా బాధితులు ధైర్యంగా తమ సమస్యను బయటికి చెబుతూ న్యాయ సాయం కోరుతున్నారు” అని ఎస్పీ ఆదిత్య మిశ్రా తెలిపారు.
“ఈ పద్ధతిని ‘మహిళల బేరసారాలు’గా పిలువొచ్చు. ఎందుకంటే, ఈ బంధం నుంచి బయటపడాలంటే సదరు అబ్బాయి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఆ డబ్బులు చెల్లించడానికి ఏ అబ్బాయి ముందుకు వస్తాడో అతడితో బిడ్డకు ఇంకొక వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. అలా, రెండవ అబ్బాయి ఇచ్చిన డబ్బులతో మొదటి అబ్బాయికి చెల్లిస్తున్నారు” అని సీమా సింగ్ తెలిపారు.

ఇది మంగీబాయి కథ
రాజ్‌గఢ్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడ్క్యా గ్రామానికి చెందిన మంగీబాయిది కూడా కౌసల్య తరహా కథే.
తన గురించి చెబుతున్నప్పుడు మంగీబాయి భావోద్వేగానికి లోనయ్యారు.
“నాకు అక్కడ తినడానికి తిండి, పడుకోవడానికి బెడ్ కూడా లేదు. నా భర్త మద్యం సేవించడాన్ని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు నన్ను కొట్టేవాడు. అక్కడ నా జీవితం నాశనమైంది. నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. నాకు పెద్దపెద్ద కోరికలు లేవు. కేవలం సంతోషంగా జీవించాలని ఉంది” అని ఆమె చెప్పారు.
ఈ బంధం నుంచి బయటపడాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని మంగీబాయిని డిమాండ్ చేశారు. ఈ సమస్య పంచాయితీ ముందుకు వెళ్లినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
దీంతో, తనను వేధింపులకు గురి చేస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తన భర్త, అతని కుటుంబ సభ్యులపై 2023 జనవరిలో రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగీబాయి ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్షన్ 498-ఏ కింద మంగీబాయి భర్త కమల్ సింగ్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు బెయిల్‌పై బయట ఉన్నారు.
మంగీబాయి తల్లిదండ్రులతో ఉంటున్నారు. మంగీబాయి తండ్రి, ఆమె సోదరులు ఇద్దరు కూలీ పనులకు వెళ్తుంటారు.
రూ.5 లక్షలు కట్టే స్థోమత తన దగ్గర లేదని మంగీబాయి తండ్రి చెప్పారు. ఆ డబ్బులు కట్టేంత వరకు తన బిడ్డకు ఇంకో పెళ్లి కాదని ఆయన అన్నారు.

మరోవైపు, మంగీబాయి భర్త కమలేష్ మాత్రం మరొక పెళ్లి చేసుకున్నారు.
“మంగీబాయి తండ్రికి నేను రూ.3 లక్షలు ఇచ్చాను. పెళ్లి సమయంలో మంగీబాయికి తులం బంగారం, కిలో వెండి మేము పెట్టాం. మేము ఏదైతే ఇచ్చామో అదే వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నాం. అంతే తప్ప ఇంకేమీ అడగట్లేదు” అని కమలేష్ బీబీసీతో చెప్పారు.
అయితే, ఆ డబ్బులు మంగీబాయి తండ్రికి ఎందుకు ఇచ్చారని అడగ్గా... కమలేష్ సమాధానమివ్వలేదు.
కమలేష్ రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ, డబ్బుల కోసం ఇంకా తనను వేధిస్తున్నారని మంగీబాయి ఆరోపించారు.

ఫొటో సోర్స్, Kaushalya
పంచాయితీలోనే సెటిల్‌మెంట్
పంచాయితీలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్లో 70 ఏళ్ల పవన్ కుమార్(పేరు మార్చాం) ఒకరు.
వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నామని, పంచాయితీలో సాధారణంగా అబ్బాయి వైపే తీర్పులు వస్తుంటాయని ఆయన తెలిపారు.
“మన దేశంలో ఈ తరహా సమస్యల్లో పంచాయితీ తీర్పులే ఫైనల్. నేను చాలా సార్లు పంచాయితీలో కూర్చొని రూ. 60వేల నుంచి 8 లక్షల మధ్యలోని వివాదాలకు పరిష్కారం చూపెట్టాను” అని పవన్ కుమార్ తెలిపారు.
“తెలిసి తెలియనితనంలోనే పెళ్లిళ్లు నిర్ణయించడంతో సాధారణంగా అమ్మాయిలే ఈ బంధం నుంచి బయపడాలని అనుకుంటారు.
కొన్ని సార్లు అబ్బాయిలు కూడా ఈ బంధానికి స్వస్తి పలకాలని భావిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో చిన్న మొత్తాలను అమ్మాయి తరఫు కుటుంబానికి చెల్లించాలని చెబుతుంటాం. కానీ, 90 శాతం కేసుల్లో అమ్మాయి తరఫు వాళ్లే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది” అని ఆయన అన్నారు.

సామాజిక కార్యకర్తలు ఏం చెబుతున్నారు?
ఈ సంప్రదాయం మహిళలకు వ్యతిరేకమని, పితృస్వామ్య ఆలోచనను ప్రోత్సహిస్తుందని సామాజిక కార్యకర్త మోనా సుస్తానీ అన్నారు. ఈ ఆచారానికి వ్యతిరేకంగా ఆమె దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా పోరాటం చేస్తున్నారు.
“రాజకీయ నేపథ్యం ఉన్న ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. పెళ్లి తరువాత 1989లో ఇక్కడి వచ్చాను. ఈ ప్రాంతంలోని ఈ ఆచారాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాలని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని ఆమె తెలిపారు.
‘ఝగడా నాతరా’ సంప్రదాయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు మోనా సుస్తానీకి చెందిన సంస్థ అండగా నిలుస్తోంది.
అమ్మాయిలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా, ఈ సంస్థ ద్వారా వారి కేసుల్లో జోక్యం చేసుకుని మోనా సుస్తానీ అనేక కేసులు గెలిచారు.
తమ సంస్థ ద్వారా గడిచిన 5 ఏళ్లలో ఈ బందీఖానలో నుంచి 237 అమ్మాయిలకు విముక్తి కలిగించామని మోనా సుస్తానీ తెలిపారు. ఆ అమ్మాయిలంతా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే స్థోమత లేనివాళ్లు.
“ఇది చాలా కష్టమైన పని. చాలా సందర్భాల్లో రాజకీయంగా, పోలీసుల పరంగా అనేక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ, గడచిన 5 ఏళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 237 అమ్మాయిలు ఈ దురాచారం నుంచి బయటపడ్డారు. వాళ్లంతా ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు” అని మోనా సుస్తానీ తెలిపారు.

ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు రామ్‌కళ 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.
ఈ ఆచారానికి గురైన బాధితుల్లో ఆమె ఒకరు.
ఈ ఆచారం వల్ల ఆమె తన ఇంటిని వదిలి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం పీజీ చదువుతున్న ఆమె... ఈ సంప్రదాయం కారణంగా ఇబ్బందులకు గురవుతున్న అమ్మాయిలకు, మహిళలకు అండగా నిలబడుతున్నారు.
“దీని నుంచి అమ్మాయిలను బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. అమ్మాయిలు డబ్బులు కట్టాల్సిందిగా సమాజం వీరిపై ఒత్తిడి పెడుతుంది. ఈ సమస్య మా దగ్గరికి రాగానే వెంటనే పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాం. చాలా సందర్భాల్లో అబ్బాయి తరఫు కుటుంబంతోనూ మాట్లాడుతాం. వాళ్లు ఒప్పుకుంటే సరేసరి లేకుంటే న్యాయ పరంగా అమ్మాయికి అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తాం” అని ఆమె తెలిపారు.
రామ్‌కళ, మోనా సుస్తానీ వంటి ఎంతో మంది ఈ దురాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ, ఇంకా ఎంతో మంది మహిళలు కౌసల్య, మంగీబాయిలాగా తమ స్వేచ్ఛ కోసం లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














