షిర్డీ సాయిబాబాపై నడుస్తున్న వివాదం ఏంటి, సంస్థాన్ ట్రస్ట్, భక్తులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, facebook/Shri Saibaba Sansthan Trust, Shirdi
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మేం షిర్డీని నవంబర్ మొదటివారంలో సందర్శించాం. ఆ సమయంలో రద్దీ కొంచెం తక్కువగానే కనిపించింది. గతంలో షిర్డీలో రద్దీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గిందనిపిస్తోంది.
‘‘భక్తుల రద్దీ తగ్గిన మాట నిజమే. కొన్ని రోజులుగా షిర్డీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం ప్రభావం పడిందని అనుకుంటున్నాం’’ అని షిర్డీలో హోటల్ నిర్వహిస్తున్న తెలుగు వ్యక్తి ఒకరు నాతో చెప్పారు.
దీపావళి సెలవులు ఉండటంతో ఉత్తర భారతం నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా కనిపించారు.
షిర్డీ విషయంలో గాని, సాయిబాబా మతం విషయంలో గాని వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఈ వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి.
కానీ ప్రస్తుత వివాదం కొంత భిన్నమైనది. అసలు ఏమిటీ వివాదం, ఎందుకు మొదలైంది.. అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.


సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదమేంటి?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సాయిబాబా ఆలయాల నుంచి బాబా విగ్రహాలు తొలగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించి బయట పడేసినట్లుగా ఆ వీడియోల్లో ఉంది. సాయిబాబా హిందువుల దేవుడు కాదని ఆరోపిస్తూ సనాతన్ రక్షాదళ్ ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సంస్థ ఉత్తర్‌ప్రదేశ్ ప్రముఖ్ అజయ్ శర్మను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
‘‘సాయిబాబా అసలు ఎవరు? పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ ఆయన ప్రస్తావన లేదు. ఆయన భగవంతుడు కాదు. మీరు పూజ చేయాలనుకుంటే ఇంట్లోనో.. వేరొకచోటో పెట్టి పూజించండి. హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్న చోట సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని ఆ సందర్భంలో మీడియాతో అజయ్ శర్మ అన్నారు.
ఇదే విషయంపై షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యుడు సచిన్ తాంబే బీబీసీతో మాట్లాడారు.
‘‘సాయిబాబా తనకు తాను దేవుడు అని చెప్పుకోలేదు. సాయిబాబా లీలలు, సాక్షాత్కారం కారణంగా భక్తులే ఆయన్ను దేవుడిగా భావించారు. ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతున్న అద్భుతాలను గమనించి లక్షలాది మంది భక్తులు ఆయన్ను భగవంతుడిగా కొలుస్తున్నారు. మా వరకు సాయిబాబాను భగవంతుడిగా కొలుస్తున్నాం. కొలుస్తూనే ఉంటాం’’ అని సచిన్ తాంబే చెప్పారు.
నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు
సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిపై షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కేసులు పెట్టింది.
ఇప్పటివరకు నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడటంతోపాటు సోషల్ మీడియాలో సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంపై మహారాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గోరక్ష గాడిల్కర్ బీబీసీకి చెప్పారు.
‘‘బాబాపై ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై సంస్థాన్ సంరక్షణాధికారి కేసు పెట్టారు. బాబా గురించి చెడుగా మాట్లాడిన ఇద్దరికి లీగల్ నోటీసులు ఇచ్చాం. వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా కోర్టులో కూడా పిటిషన్ వేయాలని అనుకుంటున్నాం. షిర్డీ సంస్థాన్ చేస్తున్న సేవా కార్యక్రమాల ప్రచారానికి సంస్థాన్ తరఫున ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. భక్తుల తరఫున కూడా ప్రత్యేకంగా ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్యానెల్ ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నాం’’ అని గాడిల్కర్ తెలిపారు.

ట్రస్ట్ నిధులపై వివాదమేంటి?
అయోధ్య రామ మందిర నిర్మాణానికి షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నుంచి నిధులు ఇవ్వలేదంటూ మరో వివాదం సోషల్ మీడియాలో నడుస్తోంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ గత కొన్ని రోజులుగా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అంతేకాకుండా డబ్బును సంచిలో నింపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వైరల్ అవుతోంది.
షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నిధులను హిందూ ఆలయాలకు కాకుండా మరో మతానికి ఇస్తున్నారని కొందరు పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది.
అయితే ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఈ వీడియోను చూసిన ఏపీకి చెందిన ఒక భక్తుడు షిర్డీలో బీబీసీతో మాట్లాడారు.
‘‘గతంలో కూడా షిర్డీ చుట్టూ కొన్ని వివాదాలు చెలరేగాయి. సాయిబాబా సంస్థాన్ వారు రామమందిరానికి ఫండింగ్ చేయకపోవడం బాధాకరం. హిందూ ధర్మం వల్లే షిర్డీకి కొంత ఆదాయం వస్తోంది. హిందువులను కూడా గౌరవించి, వాళ్లకు సంబంధించిన వాటిని కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం’’ అని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కలిదిండి శివప్రసాద రాజు బీబీసీతో అన్నారు.
అయోధ్యకు నిధులు ఇవ్వలేదని మీకు ఎలా తెలుసని ఆయన్ను ప్రశ్నిస్తే తాను యూట్యూబ్‌లో చూశానని చెప్పారు.
‘‘ఒకవేళ నిధులు ఇచ్చి ఉంటే ఆ రసీదులు బయట పెట్టి ఉండవచ్చు కదా’’ అని ఆయన అన్నారు.
ఈ విషయంపై షిర్డీ సాయి విశ్వసమాజ్ సభ్యులు మైనంపాటి ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
‘‘అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ ఒక దుష్ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్‌లు, సంస్థల నుంచి కాకుండా సాధారణ వ్యక్తుల నుంచి నిధులు సేకరించిందని ప్రజలు గమనించాలి. అంతేకాదు, రామ మందిర ప్రారంభోత్సవానికి షిర్డీ సంస్థాన్ ట్రస్టుకు కూడా ఆహ్వానం అందింది’’ అని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Shree Saibaba Sansthan Trust
నిధులు, ఖర్చులు
షిర్డీ సంస్థాన్‌కు విరాళాలు, హుండీ రూపంలో ఆదాయం వస్తుంటుంది. బంగారం, వెండి, బ్యాంకు డిపాజిట్లతోనూ ఆదాయం ఉంటుంది.
2022-23 ఆడిట్ నివేదిక ప్రకారం సుమారు రూ.900 కోట్ల ఆదాయం వచ్చిందని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ చెబుతోంది.
ప్రతిరోజూ దాదాపు 60 వేల మంది షిర్డీని దర్శించుకుంటారని అధికారులు బీబీసీకి చెప్పారు.
‘‘2004లో చేసిన ప్రత్యేక చట్టం షిర్డీ సంస్థాన్ ట్రస్టుకు సంబంధించిన నిధులను ఎలా ఖర్చు చేయాలనేది చెబుతుంది. దాన్ని అనుసరించి నిధులు వినియోగిస్తాం. ఆ చట్టాన్ని కాదని ఒక్క రూపాయి కూడా వినియోగించేందుకు వీలుండదు’’ అని సీఈవో గాడిల్కర్ బీబీసీకి తెలిపారు.
ప్రస్తుతం షిర్డీ సంస్థాన్ ట్రస్టుకు కమిటీ లేదు. మహారాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అహ్మద్‌నగర్ కలెక్టర్, ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి, ట్రస్టు సీఈవోతో కూడిన ‘అడ్‌హాక్ కమిటీ’ని ప్రభుత్వం నియమించింది.
‘‘రూ.50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అడ్‌హాక్ కమిటీకి వీలుంటుంది. అంతకు మించి చేసే ఖర్చులకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి’’ అని గాడిల్కర్ చెప్పారు.
తమకు వచ్చే నిధులను వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ చెప్పింది.
‘‘షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ తరఫున చాలా పనులు సేవాభావంతోనే నడుస్తుంటాయి. సంస్థాన్ తరఫున రెండు ఆసుపత్రులు ఉన్నాయి. సాయినాథ్ ఆసుపత్రిలో రూ.10కే వైద్యం చేస్తున్నాం. అక్కడ చికిత్స, ఆపరేషన్లు ఉచితంగా చేస్తుంటాం. పేదల నుంచి ఎలాంటి ఫీజులూ తీసుకోకుండానే ఖరీదైన వైద్యం అందిస్తున్నాం.
అన్నదాన సత్రం ద్వారా ప్రతిరోజూ 45-50వేల మంది భక్తుల కడుపు నింపుతున్నాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నాం. ఇవి కాకుండా సంస్థాన్ ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ నిర్మించాం. పేద పిల్లలకు అక్కడ కళాశాల స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తున్నాం.
ట్రస్ట్ తరఫున వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా స్థానిక వృద్ధాశ్రమాలకు అన్నదానం చేస్తుంటాం. సునామీ వచ్చినప్పుడు తమిళనాడులో ఇళ్లు కట్టించాం. వరదల కారణంగా నష్టపోయిన కేరళలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించాం’’ అని గాడిల్కర్ బీబీసీకి చెప్పారు.
ట్రస్ట్ తరఫున ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉంటుందని, సాయిబాబా బోధనలను అనుసరిస్తూ సేవా కార్యక్రమాలకు ఆ నిధులు వినియోగిస్తున్నామని ఆయన వివరించారు.
ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, పశ్చిమబెంగాల్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి భక్తులు వస్తుంటారని గాడిల్కర్ తెలిపారు.

షిర్డీ వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందా?
తరచూ వివాదాలతో భక్తుల సంఖ్య తగ్గిందనే ప్రచారాన్ని ట్రస్ట్ ఖండించింది. షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదని ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఈ విషయంపై కొందరు భక్తులు బీబీసీతో మాట్లాడారు.
‘‘సాయిబాబాపై తరచూ వివాదాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు వాటిని ప్రచారం చేస్తుంటారు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని హరియాణాలోని గుర్‌గావ్‌కు చెందిన సోనియా బీబీసీకి చెప్పారు.
‘‘సాయిబాబాపై మాకు నమ్మకం ఉంది. ఆయన మా దృష్టిలో భగవంతుడు. షిర్డీకి ఇచ్చే విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావు లేదు’’ అని కోల్‌కతాకు చెందిన సురేష్ గోయెంకా అనే భక్తుడు బీబీసీకి చెప్పారు.
ఈ వివాదాలపై యూట్యూబర్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రస్ట్ సీఈవో గోరక్ష గాడిల్కర్ చెప్పారు.
‘‘షిర్డీ సంస్థాన్ ట్రస్టుపై వివాదాస్పద వీడియోలు రూపొందించే యూట్యూబర్లు అవి మానుకోవాలి. అలాంటి వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు చూడొచ్చు. మాతో చర్చించవచ్చు’’ అని గాడిల్కర్ బీబీసీతో అన్నారు.

తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం
షిర్డీకి, తెలుగు రాష్ట్రాలకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రజలు షిర్డీకి రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రస్తుతం షిర్డీకి వచ్చే భక్తులలో సగానికి పైగా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుంటారని షిర్డీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రాజా బీబీసీకి చెప్పారు.
ఆయన 23 సంవత్సరాల క్రితం షిర్డీకి వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఆపిల్ సాయి హోటల్, సాయి ప్రియా రెస్టారెంట్‌లను ఆయన నిర్వహిస్తున్నారు.
‘‘షిర్డీలో అభివృద్ధి 2000 సంవత్సరం నుంచి మొదలైందని చెప్పవచ్చు. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగు వాళ్ల పాత్ర ఎంతో ఉంది. రైల్వే, ఎయిర్‌పోర్ట్, అన్నదాన ప్రసాదాలయం.. ఇలా అన్నీ తెలుగువాళ్లు కాంట్రాక్ట్ తీసుకుని కట్టినవే’’ అని చెప్పారు.
90వ దశకం తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని షిర్డీలో స్థిరపడిన మరో తెలుగు వ్యక్తి శ్రీనివాసరావు చెప్పారు. ఈయన గత 23 ఏళ్లుగా పున్నమి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
‘‘హైదరాబాద్‌లో ఒకామె ఉండేవారు. ఆమె పేరు గుర్తు లేదు. ఆవిడ వల్ల సాయిబాబా గురించి మాకు ఎక్కువగా తెలిసింది. పత్తి నారాయణరావు, అమ్ముల సాంబశివరావు వంటి వారు బాబా సత్ చరిత్ర అనువాదం చేయడం, భరద్వాజ మాస్టారు వంటి వారివల్ల ఎంతో మందికి బాబా గురించి తెలిసింది.
పువ్వాడలో సుబ్బారావు అనే ఆయన కూడా బాబా గురించి ప్రచారం చేశారు. వాళ్లు చేసిన ప్రచారం, భక్తుల నమ్మకం.. ఇలా ఎన్నో కారణాలతో సాయిబాబా అంటే తెలుగునాట భక్తి పెరిగింది’’ అని శ్రీనివాస రావు బీబీసీకి చెప్పారు.
గతంతో పోల్చితే షిర్డీలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య బాగా పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు నిర్మల అన్నారు.
‘‘1994లో నా వివాహమైంది. అప్పట్నుంచి ఇక్కడికి వస్తున్నాం. అప్పట్లో ఇంత హంగామా లేదు. సాయిబాబా మందిరం మాత్రమే ఉండేది. గట్టు మీద కూర్చుని చాలా సేపు పూజించేవాళ్లం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు హోటళ్లు, రెస్టారెంట్స్ బాగా ఎక్కువయ్యాయి. షిర్డీకి వచ్చినా హైదరాబాద్‌లో ఉన్నట్లుగానే ఉంటోంది’’ అని ఆమె బీబీసికి చెప్పారు.

పెరిగిన రవాణా సౌకర్యాలు.. కుల సత్రాలు
షిర్డీకి రాకపోకలు సాగించేవారే కాదు, అక్కడే స్థిరపడిన తెలుగు వారూ ఉన్నారు.
షిర్డీ తెలుగు అసోసియేషన్ పేరిట ఒక సంఘం ఏర్పాటైంది. దాదాపు 200 కుటుంబాలు అక్కడే స్థిరపడినట్లుగా సంఘం సభ్యులు చెబుతున్నారు.
‘‘పర్యటకపరంగా 2004-05 నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి పెరిగింది. టూరిజం, హాస్పిటాలిటీ, గెస్ట్ హౌస్‌లు, రెస్టారెంట్లు, మద్యం, ట్రావెలింగ్.. ఇలా ఎన్నో వ్యాపారాలను షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కిందట వారానికి ఒకసారి బస్సు వచ్చేది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ నుంచి రోజు దాదాపు 30 బస్సులు నడుస్తుంటాయి. రైళ్లు, విమానాలు కూడా నడుస్తున్నాయి’’ అని షిర్డీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రాజా అన్నారు.
మరోవైపు షిర్డీలో బీబీసీ పర్యటించినప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద కనిపించే కుల సత్రాల సంస్కృతి అక్కడా కనిపించింది. రెడ్డి, కమ్మ, కాపు, ఆర్య వైశ్య.. ఇలా కుల సత్రాలు పెరుగుతున్నాయి. ఈ సంస్కృతి మంచిది కాదని కొందరు చెబుతుంటే.. భోజన సదుపాయాల పరంగా సత్రాలు ఉపయోగపడుతున్నాయని మరికొందరు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














