చాంపియన్స్ ట్రోఫీ: ‘మా దేశంలో ఎందుకు ఆడరు’ అంటూ భారత్‌పై పాకిస్తానీల ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును పంపించేందుకు భారత్ నిరాకరించడంతో, పాకిస్తాన్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకెలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్తాన్‌కు భారత్ రావడం లేదని ఐసీసీకి బీసీసీఐ తెలిపిందని, ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తెలిపిందని ఆ దేశ మీడియా పేర్కొంటోంది.
ఈ విషయంపై పాకిస్తానీలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వైఖరికి పాకిస్తాన్ గట్టిగా సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భారత్ ఇలా వ్యవహరిస్తే తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు కూడా భారత్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు తిరస్కరించే అవకాశం ఉందని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఈ-మెయిల్ ద్వారా ఆదివారం ఈ విషయాన్ని ఐసీసీ తెలియజేసిందని పీసీబీ అధికార ప్రతినిధి బీబీసీ ఉర్దూకు వెల్లడించారు.
చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టు రాలేకపోతోందని ఐసీసీకి రాతపూర్వకంగా బీసీసీఐ తెలిపిందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత జట్టు నిరాకరించిందని జియో న్యూస్‌కు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం.ఆసిఫ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్-ఇ-పాకిస్తాన్ తాలిబాన్ వంటి సంస్థలతో పాటు భారత్ తన మిత్రులతో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని జియో న్యూస్‌తో ఆసిఫ్ అన్నారు.
‘‘దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లలో హైబ్రిడ్ మోడల్‌పై నేను స్పందించలేను. ఆక్స్‌ఫర్డ్‌లో కశ్మీర్ విషయంపై జరుగుతున్న ప్రోగ్రామ్‌కు నేను హాజరు కావాల్సి ఉంది. భారతీయులంతా తమ పేర్లను ఈ కార్యక్రమం నుంచి ఉపసంహరించుకున్నారు’’ అని ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.
పాకిస్తాన్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో వారిపై ఉగ్రవాద దాడి జరిగింది.
‘‘దక్షిణాసియాలో పుట్టి, క్రికెట్‌ను ఫాలో కానీ అత్యంత కొద్దిమందిలో నేను ఒకర్ని. పాకిస్తాన్-భారత్ మధ్య మంచి సంబంధాలను నేను సమర్థిస్తున్నాను. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం తన జట్టును పంపకూడదని భారత్ నిర్ణయించుకుంది. దీనిబట్టి ఇంకా రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అర్థమవుతోంది’’ అని అమెరికాకు పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన హుసేన్ హఖాని అన్నారు.
మాజీ భారత క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఇటీవల క్వెట్టాలో జరిగిన బాంబు దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియోలో ప్రస్తావిస్తూ ‘‘పాకిస్తాన్‌లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చి, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూసే బాధ్యత ఆ దేశానిదే’’ అని పేర్కొన్నారు.
హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అనుకూలంగా లేదని, మ్యాచ్‌ను మరో దగ్గర నిర్వహించాలని భారత్ పిలుపునిచ్చిందని సోషల్ మీడియా ‘ఎక్స్’పై సీనియర్ పాకిస్తానీ స్పోర్ట్స్ జర్నలిస్టు డాక్టర్ నౌమన్ నియాజ్ రాశారు.
భారత్‌తో ఏ మైదానంలో కూడా ఏ ఫార్మాట్ మ్యాచ్‌నూ ఆడకూడదనే ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ జట్టు పాకిస్తాన్‌కు వచ్చి ఆడేందుకు అంగీకరిస్తే తప్ప, భారత్‌తో ఎలాంటి మ్యాచ్‌ను పాకిస్తాన్ ఆడదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించినట్లు కరాచికి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫైజన్ లఖానీ చెప్పారు.
ఇదిలా ఉండగా.. భారత్‌లో ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను ఆడకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం చూస్తోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జియో న్యూస్ వార్త రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల ప్రకటన ఆలస్యం
నవంబర్ 11న టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉందని, కానీ దాన్ని ఇప్పుడు నిలిపివేశారని పీసీబీ సీనియర్ అధికారులు బీబీసీకి చెప్పారు. దీనిపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
టోర్నమెంట్ ప్రారంభానికి 100 రోజుల ముందు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆతిథ్య దేశానికి, బ్రాడ్‌కాస్టర్లకు, ఇతర స్టేక్‌హోల్డర్లకు ఈ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యేందుకు సమయం ఉంటుంది.
చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు కరాచీలోని నేషనల్ స్టేడియాన్ని, లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని తీర్చిదిద్దేందుకు పీసీబీ పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించింది. వచ్చే రెండు నెలల్లో ఈ పనులు కూడా పూర్తవుతాయి.
పాకిస్తాన్, భారత్ మాత్రమే కాక, చాంపియన్స్ ట్రోపీలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు కూడా పోటీ పడతాయి.
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో లేకపోవడంతో శ్రీలంక జట్టు ఈ టోర్నమెంట్‌లో ఆడటం లేదు.
2023లో కూడా ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించారు. కానీ, పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో, పలు మ్యాచ్‌లను శ్రీలంకలో పెట్టారు.
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇప్పటి వరకు భారత్ అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు.
అంతకుముందు కూడా భారత్-పాకిస్తాన్ విషయంలో టెన్షన్లు ఉన్నాయి. కానీ, 2008 నవంబర్‌లో ముంబయి దాడుల తర్వాత, పాకిస్తాన్ పర్యటనకు వెళ్లకూడదని భారత్ నిర్ణయించింది.
ఐసీసీ టోర్నమెంట్లలోనే రెండు దేశాలు ఒకదానికొకటి పోటీపడతాయి.
2021లో పాకిస్తాన్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్యలో మహిళల క్రికెట్ సిరీస్ జరిగింది. రెండు దేశాల మధ్య పాయింట్ల పంపిణీలో, వన్డే ప్రపంచ కప్‌కు భారత్ అర్హత సాధించింది.
పాకిస్తాన్‌లో సిరీస్‌లు ఆడేందుకు అవసరమైన అనుమతులు పొందలేదని బీసీసీఐ తమకు తెలియజేసిందని ఐసీసీ చెప్పింది.
ఈ సిరీస్‌లో పాయింట్లను రెండు దేశాల మధ్య పంచుతామని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














