విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల శకం ముగిసిందా, బైబై చెప్పే సమయం వచ్చిందా...

ఫొటో సోర్స్, Abhishek Chinnappa/Getty Images
- రచయిత, విమల్ కుమార్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
- హోదా, బీబీసీ కోసం
భారత టెస్టు జట్టు న్యూజీలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యాక భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయి ఉండొచ్చు.
జట్టులో సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఆడకపోయినప్పటికీ టీం ఇండియా కోటను న్యూజీలాండ్ బద్దలుకొట్టింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి జోరు మీదున్న టీం ఇండియాకు న్యూజీలాండ్ బ్రేకులు వేసింది.
పుణె టెస్టులో మెరిసిన మిషెల్ శాంటర్న్ ముంబయి టెస్టులో ఆడకపోయినప్పటికీ టీం ఇండియా ఓడిపోవడం చూస్తే , గత పాతికేళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత చెత్త దశగా చెప్పుకోవచ్చు.

1999-2000 సమయంలో సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో టీం ఇండియా వైట్‌వాష్‌కు గురైంది. ఆ సమయంలో కెప్టెన్‌గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్, ఆ సిరీస్ తరువాత కెప్టెన్సీకి శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం నుంచి బయటపడటానికి టీం ఇండియా ప్రయత్నిస్తున్న సమయం అది.
ఆ తరువాత, సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత క్రికెట్‌లో నూతన శకం ఆరంభమైంది.
స్వదేశంలో ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవడంతో భవిష్యత్‌కు బలమైన పునాదులు పడ్డాయి. తద్వారా, సొంతగడ్డపై చరిత్రాత్మక విజయాలు దక్కడంతో పాటు విదేశాల్లోనూ టీం ఇండియా అనేక విజయాలు సాధించింది.

ఫొటో సోర్స్, Duif du Toit/Gallo Images/Getty Images
సీనియర్లకు చెక్ పెడతారా?
ఇప్పుడు టీం ఇండియా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.
ఈ సమయంలో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన, వారి భవిష్యత్‌పై హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కార్ నిజాయతీగా తమ అభిప్రాయాన్ని వెల్లడించగలరా?
న్యూజీలాండ్ సిరీస్‌లో తేలిపోయిన సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌లో సత్తా చాటే అవకాశం ఉంది.
కానీ, భారత క్రికెట్ ఓ చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిన తరుణమిది. అదేంటంటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆధిపత్యం ఇక ముగిసిందని న్యూజీలాండ్ సిరీస్‌తో అర్థమవుతోంది.
అవును, వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లే. అందులో సందేహం లేదు. ఒక్క రాత్రిలో వారి ఆటను తీసిపారేయలేం.
కానీ, ఈ ప్రాతిపదికన సీనియర్ ఆటగాళ్ల భుజాలపై భారత క్రికెట్ భవిష్యత్‌ను నిర్మించలేం కదా!
ఒకసారి క్రికెట్ చరిత్రను మనం పరిశీలిస్తే, ఎంత ముద్దుల కొడుకు అయినా సరే, చివరి దశలో అతడి పట్ల క్రికెట్ నిర్దాక్షిణ్యంగానే ప్రవరిస్తుంది. సర్ డాన్ బ్రాడ్‌మన్ పై కూడా ఈ గేమ్ కనికరం చూపించలేదు. ఇంకో నాలుగు పరుగులు చేస్తే అతడి యావరేజ్ 100 గా ఉండేది. అయినప్పటికీ, తన చివరి ఇన్నింగ్స్‌లో సున్నా పరుగుల వద్దే వీడ్కోలు పలికేలా చేసింది.
వయసు మీదపడటం తమ ఆటపై ప్రభావం చూపిస్తుందని వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాళ్లు సైతం ఒప్పుకున్నారు.

ఫొటో సోర్స్, Philip Brown/Getty Images
కోహ్లీ, రోహిత్‌ల శకం ముగిసిందా?
ఈ లెక్కన చూసుకుంటే కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా క్రికెట్ కెరీర్‌లో ఆ చివరి దశకు చేరుకున్నారా?
“బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రిథమ్(లయ)లో లేను” అని రోహిత్ శర్మ అన్నారు. న్యూజీలాండ్‌తో సిరీస్ ఓడిపోయిన తరువాత ఈ విషయాన్ని స్వయంగా అతడే ఒప్పుకున్నాడు.
సాధారణంగా ఓ సిరీస్ ఓడిపోయిన తరువాత ఏ భారత కెప్టెన్ కూడా ఇలా తన తప్పులను బహిరంగంగా చెప్పుకోరు. కానీ, రోహిత్ శర్మ ఒప్పుకున్నాడు.
2014 ఇంగ్లండ్ టూర్ తరువాత విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదే చెత్త ఫేజ్‌గా చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో అతడి యావరేజ్ 50 నుంచి 30కి పడిపోయింది.
ఈ సమయంలో భారీ ఇన్నింగ్స్‌ల మాట పక్కనపెడితే సెంచరీలు కొట్టడానికి కూడా విరాట్ కోహ్లీ ఆపసోపాలు పడుతున్నారు. మరోవైపు అతడి సమకాలీనుడైన ‘జో రూట్’ ఈ 4 ఏళ్లలో 18 సెంచరీలతో కోహ్లీ రికార్డులను దాటేస్తున్నాడు.
కింగ్ కోహ్లీగా పేరున్న విరాట్ ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి వంద పరుగులు కూడా చేయకపోవడం అతడి స్థాయికి ఏ మాత్రం తగదు.

ఫొటో సోర్స్, Prakash Singh/Getty Images
ఈ ఓటమికి కారణం ఎవరు?
ముంబయి టెస్టులో రెండు ఇన్నింగుల్లోనూ 5 వికెట్లతో రవీంద్ర జడేజా రాణించడంతో అతడిని విమర్శకులు వదిలిపెట్టొచ్చు.
కానీ, అంతకుముందు గణాంకాలు పరిశీలిస్తే గత 24 ఇన్నింగ్సుల్లో కేవలం ఒకసారి మాత్రమే 5 వికెట్లు పడగొట్టాడు.
అలాగే, ఈ ఒక్క సిరీస్ ఆధారంగా రవిచంద్రన్ అశ్విన్‌ను తప్పుపట్టలేం. ఎందుకంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’.
ఈ ఏడాది టెస్టుల్లో టీం ఇండియా తరఫున ఎక్కువ పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్, బెంగళూరు టెస్టులో 151 పరుగులు చేసినప్పటికీ, ముంబయి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమైన సర్ఫరాజ్ ఖాన్‌లలో ఎవరిని విమర్శించగలం?
లేదా స్థిరంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ, తన స్థాయికి తగ్గ స్కోర్లు చేయలేకపోతున్న శుభ్‌మన్ గిల్‌ను తప్పుపట్టగలమా?
కీలకమైన మ్యాచుల్లో చేతులెత్తేస్తాడని కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ, గత రెండు మ్యాచుల్లో ప్లేయింగ్ 11లో అతడికి చోటే దక్కలేదు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Images
ఈ కష్ట సమయంలోనూ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లు మెరిశారు. గతంలో ఆస్ట్రేలియా టూర్‌లోనూ వీరిద్దరు తమ పెర్ఫార్మెన్స్‌తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, వీరిద్దరి ప్రదర్శనల ఆధారంగా త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో టీం ఇండియా కమ్ బ్యాక్‌ను అంచనా వేయలేం.
గతేడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లపై టీం ఇండియా నమ్మకాన్ని ఉంచింది. దీంతో, వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన 6 నెలల తరువాత టీ20 వరల్డ్ కప్ అందుకుని సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటారు.
అయితే, న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాభవం నుంచి కోలుకోవడానికి టీం ఇండియా దగ్గర 6 వారాల కంటే ఎక్కువ సమయం లేదు.
ఒక వేళ ఈ ఆరు వారాల్లో రోహిత్, విరాట్, అశ్విన్, జడేజా, బుమ్రాలు తమ రిథమ్(లయ)ను అందుకుంటే, బార్బడోస్‌లో 2O24 జూన్ 29న (టీ20 వరల్డ్ కప్ ఫైనల్) ఏం జరిగిందో అదే కథను సిడ్నీలో 2025 జనవరి 7న (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు చివరి రోజు) రిపీట్ చేయొచ్చు.
అదే కనుక జరిగితే, అదో అద్భుత విజయంగా నిలవడంతో పాటు ప్రస్తుత తరం చాంపియన్స్‌కు చిరస్మరణీయ వీడ్కోలు లభిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














