సొంత గడ్డపై న్యూజీలాండ్ చేతిలో టీమిండియా వైట్‌వాష్

ఫొటో సోర్స్, Getty Images
భారత పర్యటనలో ఉన్న న్యూజీలాండ్ జట్టు మూడో టెస్టులో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
ఈ టెస్టు సిరీస్‌ను న్యూజీలాండ్ 3-0తో కైవసం చేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు భారత్‌కు 148 పరుగుల విజయ లక్ష్యం ఉంది. కానీ భారత బ్యాట్స్‌మెన్ దానిని ఛేదించలేకపోయారు.
భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ కావడంతో మూడో టెస్టులో న్యూజీలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ తొలిసారిగా క్లీన్‌స్వీప్ అయ్యింది.


ఫొటో సోర్స్, Getty Images
భారత బ్యాటింగ్ పరిస్థితి దారుణంగా సాగింది. 8 మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల మార్కును కూడా అందుకోలేకపోయారు.
రిషబ్ పంత్ అత్యధికంగా (64) పరుగులు చేశాడు. రిషబ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులే అత్యధికం.
న్యూజీలాండ్ జట్టులో ఎజాజ్ పటేల్ 6 వికెట్లు తీశాడు.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. కాగా, న్యూజీలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్ తరఫున రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదేసి వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు, పుణె టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది.
బెంగళూరు టెస్టులో 8 వికెట్ల తేడాతో, పుణె టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
‘కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించలేకపోయాను’ - రోహిత్ శర్మ
న్యూజీలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
“ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. మేం గొప్పగా ఆడలేదు. న్యూజీలాండ్ జట్టు మా కంటే మెరుగ్గా ఆడింది. మేం చాలా తప్పులు చేశాం. ఆ విషయాన్ని మేం అంగీకరించాల్సిందే" అని అన్నాడు.
“నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, నా మనసులో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. కానీ అవి ఈ సిరీస్‌లో ఉపయోగపడలేదు. ఇది నాకు నిరాశ కలిగించింది. ఇలాంటి పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో పంత్, గిల్ చూపించారు. మేం మూడు నాలుగు సంవత్సరాలుగా అలాంటి పిచ్‌లపై ఆడుతున్నాం. ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ ఈ సిరీస్‌లో అలా చేయలేకపోయాం” అని రోహిత్ శర్మ చెప్పాడు.
కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించలేకపోయానని రోహిత్ అన్నాడు.
‘‘గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధిస్తోంది. మేమంతా సమిష్టిగా రాణించకపోవడమే ఈ ఓటమికి కారణం’’ అని చెప్పాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














