సగం టీమ్ డక్‌అవుట్.. కెప్టెన్ నిర్ణయమే కొంపముంచిందా?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘’పిచ్ స్పిన్నర్ల కోసం తయారుచేశారు. కానీ, పిచ్‌లో అంత జీవం ఉంటుందని, అది న్యూజీలాండ్‌కు ఇంతలా ఉపయోగపడుతుందని భారత్ అనుకొని ఉండదు’’

భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్, అనలిస్ట్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలివి.

ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ పతనమైన తీరు చూస్తే.. చాలామందికి కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకొని తప్పు చేశాడేమో అనిపిస్తుంది.

చూస్తుండగానే భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. క్రీజులో పది నిమిషాలు కూడా నిలవలేకపోయారు భారత బ్యాటర్లు. ఇంతకీ భారత బ్యాటింగ్ ఇలా కుప్పకూలడానికి కారణమేంటి?. క్రికెట్ అనలిస్టులు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మ్యాట్ హెన్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

అసలేం జరిగింది?

టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద రోహిత్ రూపంలో తొలి వికెట్ పడింది. కేవలం 2 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్.. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లే ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు.

యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

విరాట్‌ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు.

న్యూజీలాండ్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కేలు భారత బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు. దీంతో కేవలం 31.2 ఓవర్లలోనే భారత్ 46 పరుగులకు ఆలౌటైంది.

హెన్రీ ఐదు వికెట్లు తీయగా, రూర్కే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రవీంద్ర జడేజా ఔట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

కారణమిదే: సంజయ్ మంజ్రేకర్

మొదటి ఇన్నింగ్స్‌లో మొదటి గంటలో ‘కాంబినేషన్’ ప్రముఖ పాత్ర పోషించిందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో క్రికెట్ అనలిస్ట్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

‘’బంతి పైచేయి సాధించింది. న్యూజీలాండ్ బౌలర్ల కాంబినేషన్ బాగా కుదిరింది. చాలా బాగా బౌలింగ్ చేశారు, భారత బ్యాటర్లు వారి బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు ఆటతీరుతో కౌంటర్ ఇవ్వాలనుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ కూడా అలాగే కనిపించింది. విరాట్ ముందుకు వచ్చి ఆడబోయాడు, చిక్కుల్లో పడ్డాడు. వికెట్లు పడటంతో క్రీజులో ఉండటానికి యశస్వి జైస్వాల్ ప్రయత్నించాడు’’ అని తెలిపారు.

పిచ్‌ను చూసే టీమిండియా ముగ్గురు స్పినర్లను తీసుకుందని, ఇది కేవలం మొదటి సెషన్ మాత్రమేనని, ఇంకా ఆట మిగిలి ఉందని తెలిపారు. అయితే, కోహ్లీ మూడో నంబర్‌లో బ్యాటింగ్ రావడం మంచిదేనని సంజయ్ అభిప్రాయపడ్డారు. అది జట్టుకు లాభిస్తుందని తెలిపారు.

అయితే, మరో మాజీ ఆటగాడు, ఒకప్పటి టీమ్‌ఇండియా కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం మంజ్రేకర్‌కు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోహ్లీకి మూడో స్థానం సరికాదన్నారు.

విరాట్ నాలుగో స్థానంలో రావాల్సింది: కుంబ్లే

భారత్ 46 పరుగులకే ఆలౌట్ కావడంపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించారు.

‘‘విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఉండాల్సింది, అతను అక్కడ బెస్ట్ ప్లేయర్. ఇక నంబర్ 3 స్థానంలో ఛతేశ్వర్ పుజారా లాంటి వ్యక్తి చాలా ఏళ్లు ఆడాడు. పుజారా హిట్టింగ్‌కు వెళ్లకుండా బంతిని చూసుకుంటూ ఆడతాడు. అతను డిఫెన్స్‌ ఆడుతూ భారత్‌ను గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జట్టులో అలాంటి ఆటగాడు కనిపించలేదు. ఈ అంశంలో భారత్ ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంది” అని అనిల్‌ కుంబ్లే ‘జియో సినిమా’తో పేర్కొన్నారు.

కేఎల్ రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెంగళూరు టెస్టులో కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.

మూడో అత్యల్ప స్కోరు

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ప్రకారం.. భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. 2020లో ఆస్ట్రేలియా చేతిలో 36 పరుగులకే ఇండియా ఆలౌటైంది. 1974లో లార్డ్స్‌లో ఇంగ్లండ్ చేతిలో 42 పరుగులకు కుప్పకూలింది.

టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో 50 పరుగులలోపు స్కోరు నమోదు చేయడం భారత్‌కు ఇదే మొదటిసారని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో కథనంలో పేర్కొంది.

గతంలో 1987లో దిల్లీలో వెస్టిండీస్‌పై 75 పరుగులకే ఆలౌట్ అయింది. 2021లో ముంబయి వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇదే న్యూజీలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెంగళూరు టెస్టులో రిషబ్ పంత్ చేసిన 20 పరుగులే భారత్ తరఫున అత్యధికం.

ఆసియాలో అత్యల్పం

టెస్టు క్రికెట్‌లో భారత్‌ చేసిన 46 పరుగులే ఆసియాలో ఏ జట్టుకైనా అత్యల్పం. 1986లో ఫైసలాబాద్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్‌, 2002లో షార్జాలో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ 53 పరుగులకే ఆలౌట్ కావడం గతంలో ఆసియాలో అత్యల్పం.

టెస్టుల్లో న్యూజిలాండ్‌పై ఏ జట్టుకైనా ఇదే (46) అత్యల్ప స్కోరు. గతంలో 2012లో నేపియర్‌లో జింబాబ్వే 51 పరుగులకే ఆలౌట్‌ అయింది.

అంతేకాదు భారత్ డౌకట్లలో కూడా రికార్డు సృష్టించింది. టాప్ 7 బ్యాటర్లలో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఖాతా తెరవకుండానే ఔటైన ఇన్నింగ్స్‌లో తాజా ఇన్నింగ్స్ మొదటి స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో 35 పరుగులలోపే భారత టాప్ 7 బ్యాటర్లు పెవిలియన్ చేరారు.

2014లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులలోపే భారత టాప్ 7 బ్యాటర్లు ఔటవగా అందులో నలుగురు డకౌటయ్యారు. 1952లో అదే జట్టుపై 129 పరుగులకే భారత్ టాప్ 7 బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టగా, అందులోనూ నలుగురు డకౌటయ్యారు.

పుజారా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయింది.

అడిలైడ్ టెస్టును గుర్తుకు తెచ్చిన మ్యాచ్

భారత్ వికెట్లు పతనమైన తీరు 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డ మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 36 పరుగులకు ఆలౌట్ కావడాన్ని గుర్తుకు తెచ్చింది.

ఆడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 53 పరుగుల ఆధిక్యం సంపాదించి, భారీ అంచనాలతో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. అయితే పృథ్వీ షా అవుట్ కావడంతో మొదలైన వికెట్ల పతనం 45 నిమిషాల్లో టీం అంతా కుప్పకూలే దాకా సాగింది. భారత బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక స్కోరు.

అయితే సొంత గడ్డ మీద ఇంత తక్కువ స్కోరు (46)కు భారత్ ఆలౌట్ కావడాన్ని అభిమానులు నమ్మలేకపోతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేస్తే గానీ, భారత్ ఈ మ్యాచ్‌‌ గెలవడం కష్టం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)