దుబాయ్‌కి వీసా లేకుండానే వెళ్లొచ్చు, అదెలాగంటే..

దుబాయ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తనీషా చౌహాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులకు విమానాశ్రయాల్లో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని కల్పిస్తోంది యూఏఈ.

భారతీయ పౌరులకు ఇప్పటికే పలు దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

అయితే, అసలు ‘వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? వీసా-ఫ్రీ దేశాలతో పోలిస్తే ఇదెలా భిన్నమైనది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి.

‘వీసా ఆన్ అరైవల్’ దేశాలకు వెళ్లినప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేమిటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి?

మీరు వెళ్లాలనుకుంటున్న దేశం ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పిస్తుంటే, మీరు ముందస్తుగా వీసా తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లిపోవచ్చు. ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత అక్కడి విమానాశ్రయాలు లేదా నౌకాశ్రయాల్లోనే వీసాను పొందవచ్చు.

ఆకస్మిక విదేశీ ప్రయాణాలకు లేదా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

మీరు ఆ దేశంలో ల్యాండ్ అయ్యాక, విమానాశ్రయాల్లో ఉండే ‘వీసా ఆన్ అరైవల్ కౌంటర్’ వద్దకు వెళ్లి, మీ డాక్యుమెంట్లను చూపించి వీసాను తీసుకోవచ్చు.

ఒకవేళ మీరు చూపించిన డాక్యుమెంట్లలో ఏమైనా లోపాలుంటే, మీ వీసా తిరస్కరణకు గురవుతుంది.

వీసా జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కొన్ని దేశాలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి.

అయితే, ‘వీసా ఆన్ అరైవల్’ అనేది శాశ్వత వీసా కాదు. అంటే, ఈ వీసాతో ఆ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండలేరు.

భారతీయ పాస్‌పోర్టుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు యూఏఈ ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పిస్తోంది

వీసా ఫ్రీ కంట్రీ అంటే ఏమిటి?

వీసా ఫ్రీ కంట్రీ అంటే.. వీసా లేకుండా మీరు ఒక దేశాన్ని సందర్శించడం అన్నమాట.

మీ దగ్గర పాస్‌పోర్టు, అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది.

వీసా ఫ్రీ కంట్రీల్లో కూడా కొంతకాలం మాత్రమే ఉండటానికి వీలుంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఏ ఫీజులూ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

వీసా ఆన్ అరైవల్ నిబంధనలేంటి?

‘వీసా ఆన్ అరైవల్’ నిబంధనలు ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటాయి. కానీ, కింద పేర్కొన్న అంశాలను మాత్రం తప్పనిసరిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి.

సమాచారం – మీరు ఏ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నారో, తొలుత దానికి సంబంధించిన నిబంధనలను చదవాలి. వెళ్లడానికి ముందే అవసరమైన డాక్యుమెంట్లు, షరతుల గురించి తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన సమాచారమంతా కూడా ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు చెందిన వెబ్‌సైట్లలో ఉంటుంది.

వీసా ఆన్ అరైవల్ – ఆ దేశ విమానాశ్రయానికి లేదా పోర్టుకు వెళ్లిన తర్వాత, ఇమ్మిగ్రేషన్ ఏరియాలో వీసా ఆన్ అరైవల్ కౌంటర్ వద్దకు వెళ్లాలి.

డాక్యుమెంట్లు – ముందస్తుగానే అవసరమైన డాక్యుమెంట్లన్నింటిన్నీ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా, పాస్‌పోర్టు, పాస్‌పోర్టు సైజు ఫోటో, అరైవల్-డిపార్చర్ ఫామ్, ప్రయాణానికి గల కారణం, హోటల్ బుకింగ్ సమాచారం, మీ ఖర్చులకు అవసరమైన డబ్బులు, రిటర్న్ టిక్కెట్‌ లాంటివన్నీ దగ్గర ఉంచుకోవాలి.

అప్లికేషన్ ఫీజు – ఇమ్మిగ్రేషన్ అధికారికి ఈ సమాచారమంతా ఇవ్వాలి. మరేదైనా ఫామ్ అవసరమైతే, దాన్ని కూడా నింపాలి. లోకల్ కరెన్సీలో లేదా ఆ దేశంలో చట్టబద్ధమైన మరేదైనా కరెన్సీలో వీసా ఫీజు చెల్లించాలి. అన్ని డాక్యుమెంట్లు సరైనవి అయితే, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మీ వీసా ప్రక్రియను చేపడతారు. వీసాను జారీ చేసి, పాస్‌పోర్టుపై స్టాంప్ వేస్తారు.

బ్యాగేజీ కౌంటర్

ఫొటో సోర్స్, Getty Images

వీసా ఆన్ అరైవల్ పొందడం తేలికేనా?

వీసా ఆన్ అరైవల్ అనేది చాలా మంచి సౌకర్యమని, కానీ, వీలైతే ముందుగానే మీరు వీసాను పొందేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్నిసార్లు డాక్యుమెంట్లలో తప్పులు ఉండొచ్చు. మీ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైతే, మీరు అక్కడి నుంచి వెనక్కి రావాల్సి రావొచ్చు. కాబట్టి, ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకోవడం మంచిదని ‘సీ వే కన్సల్టెంట్స్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

వీసా ఆన్ అరైవల్ దేశాలు తమ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉంటాయన్నారు.

నిబంధనలకు సంబంధించిన సమాచారమంతా కూడా ముందస్తుగా చదువుకోవడం అత్యంత అవసరమని చెప్పారు.

వీసా పొడిగింపుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీని కోసం సరైన ప్రణాళిక అవసరమని అన్నారు.

అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు ఏది?

లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ అనే సంస్థ ఏటా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేస్తుంది.

2024 జాబితాలో, ఆరు దేశాలు ముందంజలో నిలిచాయి. వాటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌దారులు వీసాలు లేకుండా 194 దేశాలకు ప్రయాణించవచ్చు.

భారత్‌ ఈ జాబితాలో 83వ ర్యాంకును సంపాదించుకుంది. ఈ జాబితా ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్‌దారులు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్లొచ్చు.

యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

యూఏఈ అందిస్తున్న వీసా ఆన్ అరైవల్ సౌకర్యం

భారతీయ పౌరుల కోసం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఒకవేళ మీ వద్ద వాలిడ్ పాస్‌పోర్టు ఉంటే, యూఏఈలో ఏదైనా ఎంట్రీ పాయింట్‌కు చేరుకుని వీసాను పొందవచ్చు.

యూఏఈ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, ఈ సౌకర్యం కింద భారతీయ ప్రయాణికులకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. మరో 14 రోజులు పొడిగించుకునే వెసులుబాటు ఉండే 14 రోజుల వీసా లేదా ఎలాంటి పొడిగింపు లేని 60 రోజుల వీసాను తీసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)