షారుఖ్ ఖాన్-బాజీగర్ టు జవాన్: యాంటీ రోల్స్ నుంచి రొమాంటిక్ హీరోగా మారిన నటుడు...

ఫొటో సోర్స్, PUNEET KUMAR
- రచయిత, వందన
- హోదా, సీనియర్ న్యూస్ ఎడిటర్, బీబీసీ న్యూస్
1992లో షారుఖ్ ఖాన్ హీరోగా 'దీవానా' చిత్రం విడుదలైనప్పుడు ఒక ప్రామిసింగ్ స్టార్ మా గుండె తలుపులు తట్టినట్లు అనిపించింది. 'దీవానా'లో కేర్‌లెస్, రెబెల్ రాజాగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నేరుగా ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశించారు షారుఖ్ .
1993లో షారుఖ్ నటించిన ‘బాజీగర్’, ‘డర్’ సినిమాలు నెల వ్యవధిలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి.
ఈరోజు షారుఖ్‌ను 'కింగ్ ఆఫ్ రొమాన్స్' అని పిలుస్తున్నప్పటికీ, ఆయన యాంటీ హీరోగా సినిమా తొలిమెట్లు ఎక్కారు. యాంటీ హీరోగా బాజీగర్ నుంచి మొదలైన షారుఖ్ ప్రయాణం నేడు 'జవాన్' వరకు సాగింది.


ఫొటో సోర్స్, PUNEET KUMAR
గ్లోబల్ రొమాంటిక్ హీరో
"బాజీగర్, డర్ చిత్రాలలో షారుఖ్ యాంటీ-హీరో ఎమోషన్ అనేది అతనికి అమ్మాయిపై ఉన్న ప్రేమ నుంచి పుట్టింది. కానీ తరువాత ఆ ఇమేజ్‌ను వదిలి కూల్, గ్లోబల్, అర్బన్ రొమాంటిక్ హీరోగా మారారు" అని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నమ్రతా జోషి అన్నారు.
"గత కొన్నేళ్లుగా షారుఖ్ తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన సినిమాలు ఆడలేదు. అయితే, 2023లో పఠాన్, జవాన్ సినిమాల ద్వారా అది సాధ్యమైంది. జవాన్ చిత్రంలో షారుఖ్ ‘ప్రభుత్వాన్ని’ ప్రశ్నించారు. హిందీ సినిమాకి ఇలాంటి ధోరణి కొత్త" అని నమ్రతా అన్నారు.
"బాజీగర్‌లో వ్యక్తిగత ప్రతీకారం కోసం యాంటీ హీరో అయ్యారు. కానీ జవాన్‌లో మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా యాంటీ హీరోగా మారారు. రెండింటి మధ్య కొంచెం తేడా ఉంది. ఇదే షారుఖ్ ప్రయాణాన్ని హైలైట్ చేస్తోంది" అంటారు నమ్రతా.
అబ్బాస్-మస్తాన్ సినిమా 'బాజీగర్' 30 సంవత్సరాల కిందట అంటే 1993 నవంబర్ 13న విడుదలైంది.
అప్పటికి కొన్ని సీరియల్స్, ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన కొత్త హీరో, హంతకుడి పాత్రను పోషిస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
'బాజీగర్' సినిమా ప్రారంభంలో షారుఖ్, శిల్పాశెట్టిల మధ్య రెండు రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. సినిమాలో ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి వెళతారు. కానీ, షారుఖ్ హఠాత్తుగా శిల్పాశెట్టిని ఎత్తైన భవనం నుంచి కిందకు తోసేస్తాడు. దీనినే ఇంగ్లీషులో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డర్’ అంటారు.
రొమాన్స్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ సన్నివేశం సినిమా చూసే ప్రేక్షకుడిని ఉలిక్కిపడేలా చేసింది. ఇది చాలా షాకింగ్, ఎవరూ ఊహించని సీన్.
ఆ సమయంలో సల్మాన్ ఖాన్ 'మైనే ప్యార్ కియా'లో ప్రేమ కోసం ప్రతి పరీక్షను ఎదుర్కొంటాడు. 'ఖయామత్ సే ఖయామత్ తక్'లో అమీర్ ఖాన్ ప్రేమ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు.
అయితే, ‘బాజీగర్’లో అజయ్ శర్మ అలియాస్ విక్కీ మల్హోత్రా పాత్ర ద్వారా బాలీవుడ్ హీరో ఇమేజ్‌ను బద్దలు కొట్టాడు షారుఖ్.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
మూస ధోరణిని ఛేదించే ప్రయత్నం
'బాజీగర్' భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచి షారుఖ్‌ను యాంటీ హీరో పాత్రలో నిలబెట్టిందని సినిమా చరిత్రకారుడు అమృత్ గంగార్ అన్నారు.
"అది షారుఖ్ నటనా సామర్థ్యానికి నిదర్శనం. ఆయన రేంజ్‌ను చూపుతుంది. అలాగే, బాలీవుడ్ కాస్టింగ్‌లో కనిపించే మూస పద్ధతులను బద్ధలు కొట్టడంలో షారుఖ్ సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుంది. 'డర్'లో కూడా యష్ చోప్రా అతనికి నెగిటివ్ రోల్ ఇచ్చాడు" అని గుర్తుచేశారు అమృత్.
'బాజీగర్' పాత్ర చాలా డార్క్‌గా ఉండటంతో పెద్ద హీరోలు ఈ పాత్ర చేయడానికి నిరాకరించారు. ఇండస్ట్రీకి కొత్త అయినప్పటికీ ఈ రిస్క్ తీసుకునే ధైర్యం చూపించిన హీరో షారుఖ్.
'బాజీగర్' విడుదలైన ఒక నెల తర్వాత అంటే 1993 డిసెంబర్ 24న యష్ చోప్రా సినిమా 'డర్' విడుదలైంది. ఇందులో షారుఖ్ మానసికంగా అస్థిరంగా ఉండే యువకుడి పాత్రను పోషించారు. అతని వన్ సైడ్ లవ్ ఎంత దూరం తీసుకెళుతుందంటే.. అది అతనితో పాటు అతను ప్రేమించే వ్యక్తికి ప్రమాదకరంగా మారేంతగా. నేటి మాటల్లో చెప్పాలంటే 'డర్'లో షారుఖ్ నటించిన రాహుల్ పాత్ర ఒక స్టాకర్.
'డర్'లో రాహుల్ పాత్రను యశ్ చోప్రా మొదట రిషి కపూర్‌కు ఇచ్చారు. రిషి కపూర్ తన ఆత్మకథ 'ఖుల్లాం ఖుల్లా'లో "యష్ చోప్రా నాకు ఆ పాత్ర ఇచ్చినప్పుడు, నేను విలన్ పాత్రకు న్యాయం చేయలేనని చెప్పాను" అని తెలిపారు.
‘’నేను ఇప్పుడే నీతో ‘చాందిని’ ( శ్రీదేవీ, రిషి కపూర్ నటించిన రొమాంటిక్ చిత్రం) సినిమా చేశాను. ఖోజ్ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తే ఫ్లాప్ అయింది. మీరు షారుఖ్‌ని తీసుకోవచ్చు. నేను అతనితో పనిచేశాను. సమర్థుడు, తెలివైన వ్యక్తి అని చెప్పాను’’ అని రిషి కపూర్ పుస్తకంలో తెలిపారు.
రిషి కపూర్ దగ్గరి నుంచి సినిమా అమీర్‌ఖాన్, అజయ్ దేవగన్‌ల వద్దకు వెళ్లింది. వారిద్దరూ నిరాకరించడంతో ఆ పాత్రను షారుఖ్ చేశాడు.
'బాజీగర్' విక్కీ అయినా, 'డర్' రాహుల్ అయినా షారుఖ్ ఆ రెండు పాత్రల్లో చేసిన పని మీలో అసహ్యం కలిగించొచ్చు. కానీ ప్రేక్షకులకు హీరో (సన్నీ డియోల్) లేదా సినిమాలోని ఇతర పాత్రలు కనిపించలేదు. అందరికీ కనిపించింది షారుఖ్ ఖాన్. మీరు దీని క్రెడిట్‌ని స్క్రీన్‌ప్లే రచయిత లేదా దర్శకుడికి ఇవ్వొచ్చు. కానీ, తెరపై చూసిన షారుఖ్‌ను మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
యువత వెతికే ఎమోషన్
"1990లలో చాలా మారింది. ప్రేక్షకులు షారుఖ్ వ్యక్తిత్వంతో అనుబంధం పెంచుకున్నారు. అతని యాంటీ రోల్స్ ప్రేమ, రొమాంటిక్ ఎమోషన్స్‌తో కలిసిపోయాయి" అని అమృత్ గంగార్ అన్నారు.
"ఈ పాత్రలలో యువత వెతికే ఒక రకమైన 'పిచ్చి' ఉంది. ఉదాహరణకు హిందీ సినిమాలలో కనిపించని ఎమోషన్‌ను 'డర్' చూపించింది. తెరపై షారుఖ్ యువ, ఆకర్షణీయమైన ప్రజెంటేషన్ ప్రేక్షకులకు నచ్చింది." అని అన్నారు.
చాలామంది డర్ సినిమాలో షారుఖ్ పాత్రను టాక్సిక్ (ప్రమాదకరమైన) అని విమర్శించారు. అయితే, డర్, బాజీగర్ రెండింటిలోనూ యాంటీ హీరో పాత్రను పోషించిన షారుఖ్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
కింగ్ ఖాన్‌గా షారుఖ్ ఖాన్
'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'దిల్ తో పాగల్ హై', 'కుచ్ కుచ్ హోతా హై' ఇలా వచ్చిన అన్ని సినిమాలూ షారుఖ్ ఖాన్‌ను కింగ్ ఖాన్‌గా మార్చాయి. అయితే, షారుఖ్ యాంటీ-హీరో పాత్రలే అతడి విజయానికి పునాది చేశాయి. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న నటుడిని కూడా ప్రేక్షకుడికి పరిచయం చేశాయి. అది 'అంజాం కావచ్చు, 'మాయా మేమ్‌సాబ్' లేదా 'ఓ డార్లింగ్ యే హై ఇండియా' కావచ్చు.
షారుఖ్‌కు ఈ సూపర్ స్టార్‌డమ్‌కి చేరుకునే దారిలో పూలు మాత్రమే ఎదురవలేదు. మొదట్లో ఆయన చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. షారుఖ్ సూపర్‌స్టార్ ఇమేజ్ వదలడం లేదని, కామన్ మ్యాన్ పాత్రలు చేయడం లేదని చాలామంది విమర్శించారు. చాలా ఏళ్ల పాటు షారుఖ్ వెండి తెరపై కనిపించలేదు. కానీ, టీవీ ప్రకటనల్లో కనిపించారు. ఆయన ఇచ్చిన కొన్ని ప్రకటనలపై రాజకీయ దుమారం చెలరేగింది. అతని కొడుకు ఆర్యన్ ఖాన్ ఒక కేసులో జైలు పాలయ్యారు. ఆ సమయంలో షారుఖ్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు.
2023లో ‘పఠాన్’ సినిమా తర్వాత వచ్చిన 'జవాన్'తో షారుఖ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సినిమాలో ‘కొడుకుని ముట్టుకోవడానికి ముందు తండ్రితో మాట్లాడు’ అంటూ తన డైలాగ్‌తో మౌనాన్ని వీడాడు.
‘జవాన్’ చిత్రంలో షారుఖ్ చెప్పిన ఈ డైలాగ్‌ను బయట ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకున్నారు.
నమ్రతా జోషి స్పందిస్తూ "జవాన్ విజయం సాధించింది. కానీ నాకు అది అంత బెస్ట్ ఫిల్మ్ అనిపించ లేదు. 'చక్ దే ఇండియా' వంటి చిత్రంలో షారుఖ్‌ను ఇష్టపడతాను. ‘జవాన్’ పురుషాధిక్య చిత్రం. ఈ సినిమాలో షారుఖ్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, లింగ సమానత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది అంత ఎఫెక్టివ్‌గా లేదు. అదే చక్ దే ఇండియా సినిమాలో మహిళలను గెలిపించే పాత్రలో షారుఖ్ కనిపిస్తారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాజీగర్ చిత్రం ఎలా మొదలైంది?
బాజీగర్‌తో చర్చ మొదలైంది కాబట్టి దానితోనే ముగిద్దాం. ఈ చిత్రం షూటింగ్ 1992 డిసెంబర్ లో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత బొంబాయి అల్లర్లతో ఆలస్యమైంది.
చాలా నెలల తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాలో పాత్రల కోసం శ్రీదేవి, మాధురిలతో పాటు పలువురు హీరోయిన్లతో మాట్లాడారు. అయితే షారుఖ్ చేతిలో శ్రీదేవి లాంటి పెద్ద హీరోయిన్ హత్యకు గురికావడం ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని దర్శకులు భావించారు.
ఈ సినిమాలో మదన్ చోప్రా పాత్రను దలీప్ తాహిల్ పోషించారు.
ఇటీవల 'అన్‌ట్రిగ్గర్డ్' అనే పాడ్‌కాస్ట్‌లో దలీప్ తాహిల్ మాట్లాడుతూ "నేను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఉన్నాను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి 'బాజీగర్'లో షారుఖ్ ఖాన్‌ను ఎందుకు అంతగా కొట్టావు? అని అడిగింది. ఆ అమ్మాయికి షారుఖ్‌పై అంత ఇష్టం ఉంది" అని అన్నారు.
‘బాజీగర్’, ‘డర్’ సినిమాల్లోని కిల్లర్, యాంటీ-హీరో క్యారెక్టర్‌లను కొంతవరకు మనుషులుగా మార్చడమే షారుఖ్ సాధించిన ఘనత.
రాజ్‌గా, భారత జట్టు కోచ్ కబీర్ ఖాన్‌గా, స్వదేశ్ సినిమాలో ఇండియాకు తిరిగి వచ్చే మోహన్‌గా, పహేలీ సినిమాలో గ్రామానికి చెందిన కిషన్‌లాల్‌గా, యస్ బాస్‌లో నక్షత్రాలు, చంద్రుడిని నేలకు దించాలనుకునే రాహుల్‌గా, 'హే రామ్' సినిమాలో అమ్జద్ అలీ ఖాన్‌గా, జీరోలో బావా సింగ్‌గా వెండి తెరపై కనువిందు చేశాడు షారుఖ్.
ఈ పాత్రలలో షారుఖ్‌ను కొందరు హీరోగా, మరికొందరు విలన్‌గా, ఇంకొందరు యాంటీ హీరోగా చూసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








