మన్నత్: ఈ ఇల్లు షారుఖ్ ఖాన్ చేతికి ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యాసిర్ ఉస్మాన్
- హోదా, సినీ చరిత్రకారుడు, బీబీసీ కోసం
ఇప్పటి వరకు హిందీ సినిమాల చరిత్రలో ఉనికిలో లేని ఎన్నో బంగ్లాల గురించి మనం మాట్లాడుకున్నాం.
కానీ, నేటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, కళా సాంస్కృతిక చిహ్నమైన ఒక బంగ్లా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరునామాల్లో ఇదొకటి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
అదే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సుసంపన్నమైన ఆరు అంతస్తుల బంగ్లా. దాని పేరు మన్నత్. ఇది ముంబయి నగరంలో 27000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.
తరచూ మన్నత్ భవనంపై నిల్చుని షారుఖ్ ఖాన్, వేలమంది తన అభిమానులకు అభివాదం చేస్తుంటారు.

ముంబయిలోని బాంద్రాలో ల్యాండ్స్ ఎండ్‌లో గల ఈ సుసంపన్నమైన బంగ్లా కథేంటి అసలు?
150 ఏళ్ల కిందట, మండికి చెందిన 16వ రాజు రాజా విజయ్ సేన్ తన భార్య కోసం బాంబేలోని బ్యాండ్‌స్టాండ్ దగ్గర సముద్రతీరానికి కుడివైపున అత్యంత విలాసవంతమైన ఒక బంగ్లాను కట్టించారు.
అప్పట్లో ఈ బంగ్లా పేరు విల్లా వియన్నా. బాంబేలో ఆ సమయంలో అత్యంత సుందరమైన భవనాల్లో ఇదొకటి.
రాజా విజయ్ సేన్ మరణానంతరం ఈ బంగ్లాను బాంబేలోని అత్యంత సంపన్నుడైన పార్సీ వ్యాపారవేత్త మానెక్ జీ బట్లివాలా కొనుగోలు చేశారు.
కొన్నేళ్ల తర్వాత మానెక్‌జీ బట్లివాలా కుటుంబం విల్లా వియన్నాకు పక్కనే ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ మరో భవనాన్ని నిర్మించింది.
ఆ కొత్త బంగ్లా పేరు కికీ మంజిల్. తమ మనవడు కీకూ గాంధీ పేరు ఈ బంగ్లాకు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కీకూ గాంధీ ఎవరని మీరు అడగొచ్చు? బాంబే కళా ప్రపంచానికి, కళా సంస్కృతిలో భాగమైన వారికి ఎక్కువగా పరిచయమున్న పేరిది.
పెయింటింగ్స్ కోసం ఫ్రేమ్‌లను తయారు చేసే కంపెనీని కీకూ స్థాపించారు. ఈ కంపెనీ చాలా సక్సెస్ అయింది కూడా.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ, బాంబే ఆర్ట్ సొసైటీ, బాంబేలోని ఫేమస్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, లలిత్ కళా అకాడమీ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు కీకూ గాంధీ.
చిత్రలేఖనం మీద ఆసక్తి ఉన్న వారికి ఆనాటి బాంబేలో రెండు ముఖ్యమైన కేరాఫ్ అడ్రస్‌లు ఉండేవి. అవే కికీ మంజిల్, విల్లా వియన్నా అనే రెండు బంగ్లాలు.
ఆ తర్వాత కొన్నేళ్లకు విల్లా వియన్నా చేతులు మారుతూ వచ్చింది. రాజా విజయ్ సేన్ నిర్మించిన విల్లా వియన్నా చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కలల సౌధంగా మారిపోయింది.
షారుఖ్ ఖాన్ ఈ బంగ్లాను కొనకముందు, చాలామంది సినీ స్టార్లకు ఆ ఇల్లు సినిమాలో ఇల్లుగా ఉండేది.
షారుఖ్ ఖాన్ దీన్ని కొనడానికి ముందు, సినిమా షూటింగ్‌లకు, వ్యాపార ప్రకటనలకు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు ఈ బంగ్లాను అద్దెకు ఇచ్చేవారు.
హిందీ సినిమాల్లో ఎక్కువసార్లు కనిపించిన బంగ్లా బహుశా ఇదే కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
షారుఖ్ ఖాన్‌కు ముందు ‘మన్నత్’ లో అడుగుపెట్టిన స్టార్ ఎవరు?
1959లో విడుదలైన ‘అనారి చిత్రంలో, రాజ్ కపూర్ బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో తిరుగుతూ... ‘...జీనా ఇసీ క నామ్ హై’ అంటూ సాగే పాట పాడుతూ కనిపిస్తారు. ఈ పాట ప్రారంభంలో రాజ్ కపూర్ వెనక కనిపించేది విల్లా వియన్నా బంగ్లాయే.
1970ల్లో వచ్చిన ‘సఫర్’ సినిమాలో ఇది ఫిరోజ్ ఖాన్ బంగ్లాగా కనిపిస్తుంది. 1973లోని ‘రాజా రాణి’ సినిమాలో రాజేశ్ ఖన్నా దొంగగా నటించారు. ఆ సినిమాల్లో ఒక రాత్రి విలాసవంతమైన బంగ్లాలో దొంగతనానికి వెళ్తారు హీరో. అలా వెళ్లేది విల్లా వియన్నాలోకే.
అంటే, షారుఖ్ ఖాన్ అడుగు పెట్టకముందే, ఈ బంగ్లాకి చాలామంది ప్రముఖులు వెళ్లారన్నమాట.
1989లో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన ‘తేజాబ్’ సినిమాలో ఇది మాధురి దీక్షిత్ బంగ్లాగా కనిపిస్తుంది.
ఇదే బంగ్లా అమీర్ ఖాన్ ‘రాఖ్’ చిత్రంలో కూడా ఉంది. దర్శకుడు శశిలాల్ నాయర్ తెరకెక్కించిన ‘అంగార్’ చిత్రంలో గాడ్ ఫాదర్ లాంటి పాత్రలో కాదర్ ఖాన్ ఈ బంగ్లాలోనే కనిపిస్తారు. ‘అంగార్’ సినిమా షూటింగ్ చాలా వరకు ఈ బంగ్లాలోనే జరిగింది.
ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, షారుఖ్ ఖాన్ సొంత సినిమా ఎస్ బాస్(1997)లో కూడా ఈ బంగ్లా ఉంటుంది.
‘బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై’ అనే పాటలో షారుఖ్ ఖాన్ తన కలల గురించి చెబుతున్నప్పుడు ఈ బంగ్లా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ బంగ్లా షారుఖ్ ఖాన్‌ను ఆకర్షించిందని చెప్పొచ్చు. సముద్ర తీరానికి ముఖద్వారంగా ఉన్న ఈ పెద్ద బంగ్లా ఆయన కలల సౌధంగా మారింది.
1991లో బాంబే వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్‌కు సొంతిల్లు లేదు. కొన్నిసార్లు నిర్మాత వివేక్ వాస్వాని ఇంట్లో, కొన్నిసార్లు డైరెక్టర్ అజీజ్ మీర్జా ఇంట్లో ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాల్లో విజయం సాధించి, ఒక స్టార్‌గా ఎదిగిన తర్వాత, కార్టర్ రోడ్డులోని శ్రీ అమృత్ అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు షారుఖ్.
ముంబయిలో షారుఖ్ ఖాన్ తొలి ఇల్లు ఇదే. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయన కల సాకారమైంది. సముద్ర తీరానికి ముఖ ద్వారంగా ఉన్న విల్లా వియన్నా ఆయన సొంతమైంది.
షారుఖ్ తొలుత ఈ బంగ్లాకు ‘జన్నత్’ అనే పేరు పెట్టారు. కానీ, కొంతకాలం తర్వాత ఈ పేరును ‘మన్నత్’ అని మార్చారు.
తన భార్య గౌరీ ఖాన్ పుస్తకం ‘మై లైఫ్ ఇన్ డిజైన్’ లాంచ్ సందర్భంగా మాట్లాడిన షారుఖ్ ఖాన్, ఈ బంగ్లా డిజైన్ గురించి చెప్పారు.
‘మేం ఎలాగోలా ఈ బంగ్లాను కొన్నాం. కానీ, దీన్ని పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ బంగ్లా పూర్తిగా పాడుబడి పోయింది. అందంగా అలంకరించుకునేందుకు ఆ సమయంలో మా దగ్గర డబ్బులు లేవు. డిజైనర్ అడిగిన మొత్తం ఒక నెలలో నేను సంపాదించే దానికంటే ఎక్కువ’’
‘‘అప్పుడు నేను గౌరిని, నువ్వే హోమ్ డిజైనర్‌గా ఎందుకు మారకూడదు అన్నాను. అలా మా ‘మన్నత్’ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏళ్లలో మేం సంపాదించింది, ఇంటి కోసం చిన్నచిన్న వస్తువులు కొనేందుకు ఉపయోగించాం.’’ అని షారుఖ్ ఖాన్ తెలిపారు.
ఏళ్లు గడిచేకొద్దీ షారుఖ్ ఖాన్ ఈ బంగ్లాను సర్వాంగ సుందరంగా మార్చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎవరైనా మన్నత్‌ను సందర్శిస్తే, దాని అందాన్ని ఎన్నటికీ మర్చిపోరు.
గ్రేడ్ 3 హెరిటేజ్ బంగ్లా అయిన మన్నత్, సంప్రదాయ, ప్రాచీన డిజైన్ ఉట్టిపడేలా కనిపిస్తుంది. 15 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఒక జిమ్, స్విమ్మింగ్ పూల్, బాక్సింగ్ రింగ్, లైబ్రరీ, షారుఖ్ ఖాన్ ఆఫీసు...ఇలా అన్నీ దీనిలో ఉండేలా రూపొందించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ముంబయి నా ఇల్లు. అక్కడే నా అందమైన భవనం ఉంది’
బంగ్లాలోకి వెళ్లడానికి ఏడాది ముందు, షారుఖ్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నిర్మాతగా తీసిన తొలి చిత్రం, ‘ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ’ ఫ్లాప్ అయింది.
భారీ నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత జోష్, వన్ 2 కా 4 వంటి చిత్రాలు కూడా నిరాశపరిచాయి.
అదే సమయంలో, హృతిక్ రోషన్ తన తొలిచిత్రం ‘కహోనా ప్యార్ హై’తో రాత్రికి రాత్రే బిగ్ స్టార్ అయ్యారు. షారుఖ్ ఖాన్ కెరీర్ కిందకి పడిపోతుందని మీడియాలో వార్తలు వచ్చాయి.
విల్లా వియన్నాను కొనుగోలు చేసిన తర్వాత, ఆయన జీవితంలో అపూర్వ విజయాలు మొదలయ్యాయని సినీ ఇండస్ట్రీలో టాక్‌గా మారింది.
ఒకదాని తర్వాత ఒకటి విజయాలు దక్కాయి. కభీ ఖుషీ కభీ ఘమ్, దేవదాస్, చల్తే చల్తే, కల్ హో న హో, వీర్-జారా వంటి చిత్రాలు ఆయన్ను దేశంలోనే అతిపెద్ద స్టార్‌గా నిలిపాయి.
2016లో దిల్లీలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా, మీ ఇల్లు దిల్లీయా, ముంబయా అని అడిగినప్పుడు ‘‘దిల్లీ వస్తే నా జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తాయి. కళ్లు చెమ్మగిల్లుతాయి. కానీ, ముంబయి నా ఇల్లు. అక్కడే నా అందమైన భవనం ఉంది.’’ అని షారుఖ్ ఖాన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














