అధ్యక్ష ఎన్నికలు 2024: అమెరికాలోని తెలుగు వాళ్లు ఏమంటున్నారు? ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు?
- అమెరికాలో గణనీయంగా తెలుగు జనాభా
- ప్రభావం చూపే స్థాయి లేకున్నా అధ్యక్ష ఎన్నికలపట్ల తెలుగు వారిలో ఆసక్తి
- మాతృభూమి మీద మమకారంతో చాలామంది అమెరికా పౌరసత్వానికి ఆసక్తి చూపరు.
- గ్రీన్‌కార్డ్ ఉన్నా, పౌరసత్వం వచ్చేవరకు ఓటు వేసే అవకాశం ఉండదు.
- ఇమిగ్రేషన్‌లో సరళమైన విధానాలు అనుసరించే వారిపట్ల తెలుగు వారి మొగ్గు
- నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ట్రంప్ విధానాలకు భారతీయుల మద్దతు
- రచయిత, బోడ నవీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాతో తెలుగు వాళ్లకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ‘సంబంధాలు’ కూడా ఏర్పడుతున్నాయి.
కొన్ని దశాబ్దాల కిందట తెలుగు నేల నుంచి మొదలైన వలసల ప్రవాహం, నేటికీ నిర్విరామంగా కొనసాగుతోంది.
ఇప్పుడు అక్కడ వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వాళ్ల జీవితాల్లో అమెరికా ఒక భాగమై పోయింది.
‘మెక్‌డోనల్డ్ మూర్తి’, ‘షికాగో సుబ్బారావు’ల రూపంలో తెలుగు సినిమాల్లో కూడా ఆ వాసనలు కనిపిస్తున్నాయి.
న్యూయార్క్ అకాడమీ, డాలస్ సెంటర్ అనేవి అమెరికాలో లేవు. ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అమెరికా విమానం ఎక్కడం కోసం అమీర్‌పేటలో అడుగుపెట్టే వాళ్లు ఎందరో. ‘చిలుకూరి బాలాజీ’ కాస్త ‘వీసా బాలాజీ’గా మారిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అమెరికా చుట్టూ తెలుగు వాళ్లు అల్లుకున్న బంధానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అలాంటి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉండే తెలుగు వాళ్లతోపాటు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వారికి కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో పెరుగుతున్న తెలుగు జనాభా
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యూఎస్ సెన్సస్ బ్యూరో గణాంకాల ప్రకారం 2016లో తెలుగు వారి జనాభా 3.2 లక్షల మంది కాగా, 2024 నాటికి వారి సంఖ్య 12.3 లక్షలకు చేరింది.
అత్యధికంగా కాలిఫోర్నియాలో 2 లక్షల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఆ తరువాత టెక్సస్ (1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1 లక్షలు), ఇల్లినాయిస్(83వేలు), వర్జీనియా(73 వేలు), జార్జియా(52 వేలు) రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటారు.
అమెరికా రాజకీయాల్లోనూ తెలుగు వాళ్ల ప్రాతినిధ్యం కొంతమేరకు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చివుకుల ఉపేంద్ర గతంలో న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆంధ్రాకే చెందిన అరుణ మిల్లర్ (అరుణ కాట్రగడ్డ) ప్రస్తుతం మేరిలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్.
తెలుగు వాళ్ల జనాభా పెరుగుతున్నప్పటికీ అమెరికా రాజకీయాల్లో ఇంకా ప్రభావం చూపగలిగే స్థాయికి ఎదగలేదు. ఇందుకు ప్రధానం కారణం అక్కడ చాలా మందికి పౌరసత్వం లేకపోవడమే. పౌరులు కానివారు అమెరికా ఎన్నికల్లో ఓటు వేయలేరు.
గతంలో ఇక్కడ జర్నలిస్టుగా పని చేసిన దాసరి కృష్ణమోహన్, ప్రస్తుతం టెక్సస్ రాష్ట్రంలో ఉంటున్నారు. డాలస్ సిటీలో వ్యాపారం చేస్తున్నారు.
“చాలామంది గ్రీన్ కార్డు స్టేటస్‌లోనే ఉన్నారు. సిటిజన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అందుకే వాళ్లు రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేరు” అని ఆయన బీబీసీతో అన్నారు.
“గ్రీన్‌కార్డ్ ఉన్నంత మాత్రాన యూఎస్‌లో ఓటు హక్కు రాదు. యూఎస్ పౌరసత్వం ఉంటేనే ఓటు హక్కు వస్తుంది. ఉత్తరాది భారతీయులతో పోల్చితే తెలుగువాళ్లలో పౌరసత్వం ఉన్నవాళ్లు తక్కువే” అని సాగర్ దొడ్డపనేని తెలిపారు.
సుమారు 30 ఏళ్లుగా సాగర్ దొడ్డపనేని అమెరికాలో ఉంటున్నారు.
“కాలిఫోర్నియా, టెక్సస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియా వంటి రాష్ట్రాలలో పౌరసత్వం ఉన్న తెలుగువాళ్లు ఎక్కువ మంది ఉంటారు. కానీ, ఏ రాష్ట్రంలోనూ వారి సంఖ్య లక్షల్లో ఉండదు. వేలల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపలేరు’’ అని సాగర్ అన్నారు.
ఇన్ని దశాబ్దాలుగా అక్కడ తెలుగు వాళ్లు నివసిస్తున్నా మరి పౌరసత్వం లేకపోవడానికి కారణం ఏంటి?
‘‘తెలుగువాళ్లకు మాతృభూమి మీద ప్రేమ ఎక్కువ. దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నప్పటికీ భారతదేశ పౌరసత్వాన్ని వదలుకుని అమెరికా పౌరసత్వాన్ని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు” అని సాగర్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు వాళ్లు చూసే అంశాలు ఏంటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే తెలుగు వాళ్ల సంఖ్య తక్కువగానే ఉండొచ్చు.
కానీ ఎన్నికల్లో వచ్చే ఫలితం తెలుగు కమ్యూనిటీ మీద ప్రభావం చూపుతుంది. గ్రీన్‌కార్డ్ హోల్డర్లు, హెచ్1బీ వీసాల మీద ఉండేవాళ్లు, అమెరికాకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్న వాళ్లు, విద్యార్థులు ఇలా అనేక వర్గాల వారు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది ఐటీ ఉద్యోగులు అమెరికాకు వెళ్తుంటారు. అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే.
తెలుగు వాళ్ల ప్రాధాన్యాలలో ఇమిగ్రేషన్ కచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. వాళ్లకు ఓటు లేకపోయినా, ఫలానా పార్టీ వస్తే మనకు అనుకూలమైన నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తారు.
“రిపబ్లికన్ పార్టీతో పోల్చితే డెమొక్రటిక్ పార్టీ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ. హెచ్1 బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ విషయంలో అనుకూలంగా ఉన్న పార్టీ వైపు యువత మొగ్గు చూపొచ్చు” అని తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి అన్నారు.
అయితే భారత్‌లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కాస్త మార్పు కనిపిస్తోందని ఆయన చెబుతున్నారు.
“ఒకప్పుడు భారతీయులు ఎక్కువగా డెమొక్రాట్స్ వైపు ఉండేవారు. కానీ, క్రమంగా బీజేపీ విధానాలకు దగ్గరగా ఆలోచించే వారు ట్రంప్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇస్లామిక్ వలసదారుల పట్ల ట్రంప్ కఠినంగా వ్యవహరించడంతో వారు అటువైపుగా మొగ్గు చూపుతున్నారు” అని జంపాల చౌదరి వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
‘‘ఆర్థికవ్యవస్థ బాగా ఉండాలంటే ట్రంప్ రావాలి’’
ప్రస్తుతం జో బైడెన్ పాలనలో అమెరికా ఆర్థికవ్యవస్థ పనితీరు బాగా లేదని కొందరు తెలుగువాళ్లు భావిస్తున్నారు.
‘‘అమెరికా ఆర్థికవ్యవస్థ బావుండాలన్నా సరిహద్దుల్లో భద్రత బలంగా ఉండాలన్నా ట్రంప్ వస్తే బాగుంటుంది’’ అని అమెరికాలో వ్యాపారం చేస్తున్న ఎం.వెంకటేశ్వరరెడ్డి అన్నారు.
ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు సమస్యాత్మకంగా మారినట్లు మరికొందరు చెబుతున్నారు.
‘‘అధిక వడ్డీరేట్ల వలన చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు’’ అని న్యూజెర్సీలో ఐటీ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న కర్నాటి అంజన్ చెబుతున్నారు.
డెమొక్రాట్ల పాలనలో ‘అక్రమ’ వలసలు పెరిగాయని, స్కూళ్లు, కాలేజీలు వాళ్లతో నిండిపోతున్నాయని అంజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘అక్రమంగా వలస వస్తున్న వారి వల్ల పౌరులు, చట్టబద్దంగా వచ్చిన వలసదారులకు దక్కాల్సిన సేవలు దక్కడం లేదు. పన్నులు కట్టే వారు సరైన ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. లీగల్ ఇమిగ్రెంట్స్ పిల్లలకు స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు సమస్యగా మారాయి’’ అని కర్నాటి అంజన్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అమెరికా ప్రెసిడెంట్ అయితే మధ్యతరగతికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు ఎయిరిండియాలో పని చేసే గీత అన్నారు.
‘‘మా గ్రీన్ కార్డులు, హెచ్1బీల విషయంలో కాస్త సరళమైన విధానాలు తీసుకొస్తే బాగుంటుంది. కమలా హారిస్ అయితే మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ప్రయోజనం కలుగుతుంది’’ అని గీత అభిప్రాయపడ్డారు.
ఇన్సూరెన్స్ మరొక కీలక అంశంగా భావిస్తున్నట్లు కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్ట్‌గా పని చేస్తున్న స్వర్ణ అన్నారు.
‘‘ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. చాలా మంది దాని విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. కొత్త ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. భారతీయ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూరేలా కమలా హారిస్ నిర్ణయాలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’’ అని స్వర్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘తెలుగు సంఘాలను కలుస్తుంటారు...’’
ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌లలో ఎవరు గెలిచినా భారత కమ్యూనిటీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చివుకుల ఉపేంద్ర అన్నారు.
‘‘ఇమిగ్రేషన్ విషయంలో కమలా హారిస్ కాస్త అనుకూలంగా ఉండొచ్చు. కొంతకాలంగా ట్రంప్ కూడా భారతసంతతి వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్టూడెంట్ వీసాల మీద అమెరికా వచ్చి చదువుకున్న వాళ్లకు గ్రీన్ కార్డులు ఇస్తానని ట్రంప్ చెబుతున్నారు’’ అని ఆయన చెప్పారు.
రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెలుగు సంఘాల వారిని కలుస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారని ఉపేంద్ర తెలిపారు.
‘‘టెక్సస్‌లో ఉండే తెలుగు వాళ్లు రిపబ్లికన్ల వైపు చూస్తుంటారు. న్యూజెర్సీలో ఉండే వాళ్లు డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపుతుంటారు’’ అని ఆయన అన్నారు.
ఇక అమెరికాలోనే పుట్టి పెరిగిన తరం మాత్రం స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వాళ్ల మీద తల్లిదండ్రుల ప్రభావం ఉండదని ఉపేంద్ర తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో భారతసంతతి వారు నాలుగు అంశాలు ప్రధానంగా చూస్తారని చివుకుల ఉపేంద్ర అన్నారు.
1.హిందూమత పరిరక్షణ
2.పన్నుల తగ్గింపు
3.అక్రమ వలసలను అడ్డుకోవడం
4.యుద్ధాలను ఆపడం
ట్రంప్ లేదా కమలా హారిస్ ఈ నాలుగు అంశాల్లో ఎవరు మెరుగ్గా అనిపిస్తే వారివైపు ఓటర్లు మొగ్గు చూపొచ్చని ఉపేంద్ర అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














