అమెరికా ఎన్నికలకు ప్రపంచంలోని యుద్ధాలు, సంఘర్షణలకు సంబంధం ఏంటి?

కమలా హారిస్, ట్రంప్
    • రచయిత, లీస్ డూసెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలియన్‌స్కీతో కలిసి 2023 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీయెవ్ వీధులలో నడుస్తున్నప్పుడు సైరన్లు మోగాయి. “ఆ సమయంలో ప్రపంచానికి వెలుగు చూపించే దీపం అమెరికానే అని గతంలో ఎప్పుడూ అనిపించనంత బలంగా అనిపించింది’’ అని తరువాత బైడెన్ గుర్తు చేసుకున్నారు.

వచ్చే వారం జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఓటు వేసిన తర్వాత ఆ స్వీయ ప్రకటిత దీపం బాధ్యతను ఎవరు చూస్తారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

“ఈ అస్థిర సమయాల్లో అమెరికా వెనక్కి తగ్గదని నిరూపించేందుకు” కమలా హారిస్ జో బైడెన్ అడుగుజాడల్లో నడుస్తూ తన పట్టుదలను ప్రదర్శిస్తారా? లేక డోనల్డ్ ట్రంప్ విజయం సాధించి తన నినాదమైన “అమెరికానే ఫస్ట్” అనే మార్గంలో ముందుకెళతారా?

అమెరికా పరపతి ప్రశ్నార్థకంగా మారిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ప్రాంతీయ శక్తులు తమ సొంత మార్గంలో వెళుతుండగా, నియంతృత్వ పాలకులు తమ సొంత కూటముల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

గాజా, యుక్రెయిన్‌లో జరుగుతున్న విధ్వంసకర యుద్దాలు, మిగతా ప్రాంతాల్లో ఘర్షణలు వాషింగ్టన్ పాత్రకున్న విలువ గురించి అసౌకర్యమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. కానీ అమెరికాకు ఉన్న ఆర్థిక, సైనిక శక్తి వల్ల, అనేక కూటములలో ఆ దేశం పోషిస్తున్న కీలక పాత్ర వల్ల అమెరికా గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే అమెరికా ఎన్నికలు ప్రపంచంపై ఎటువంటి పరిణామాలను చూపుతాయనే విషయంపై నేను కొంతమంది పరిశీలకులతో మాట్లాడాను.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చమురుబావి మంట

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాక్‌లో మండుతున్న చమురు బావి వైపు నడిచి వెళుతున్న అమెరికన్ సైనికుడు (ఫైల్ ఫోటో)

సైనిక శక్తి

“ఈ హెచ్చరికలకు నేను తీపి పూత పుయ్యడం లేదు. డోనల్డ్ ట్రంప్ యూరప్‌దేశాలకు ఓ పీడకల, నేటో నుంచి వైదొలుగుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి” ” అని నేటో మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ రోజ్ గొట్టెన్ మోయిల్లర్ అన్నారు.

నేటోలోని సభ్య దేశాల రక్షణ బడ్జెట్‌ల కంటే అమెరికా రక్షణ కేటాయింపులు రెండు,మూడు రెట్లు ఎక్కువ. నేటో కాకుండా అమెరికా సైనిక వ్యయం చైనా, రష్యా సహా మరో పది దేశాల కేటాయింపుల కంటే అధికం.

నేటోలోని మిగతా దేశాలు నేటో కోసం తమ ఖర్చులకు సంబంధించిన లక్ష్యాల్ని చేరుకోవాలని ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నారు. నేటోలోని ప్రతి దేశం తమ జీడీపీలో 2శాతం నేటోకు కేటాయించాలనేది ఆయన వాదన. 2024లో కేవలం 23 దేశాలు మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి.

కమలాహారిస్ గెలిస్తే, “నేటో వాషింగ్టన్ చేతుల్లోకి వెళ్లిపోతుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు” అని రోజ్ గొట్టెన్ మోయిల్లర్ నమ్ముతున్నారు. అయితే ఆమె కూడా దీనిపై హెచ్చరిస్తున్నారు. “యుక్రెయిన్‌లో విజయం సాధించడానికి యూరోపియన్ దేశాలు, నేటోతో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. అయితే ఆమె నేటో ఖర్చుల విషయంలో యూరప్ మీద ఒత్తిడిని తగ్గించడానికి సిద్ధంగా లేరు”

కానీ వైట్‌హౌస్‌లోని హారిస్ బృందం సెనేట్ లేదా దిగువ సభతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది, ఇవి త్వరలో రిపబ్లికన్ చేతుల్లోకి రావచ్చు. రిపబ్లికన్లు విదేశీ యుద్ధాలకు మద్దతు ఇవ్వడానికి తక్కువ మొగ్గు చూపుతారు.అయితే అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లలో ఎవరు అధ్యక్షుడైనా సరే, యూఎస్ చట్టసభ సభ్యులు భారీ సహాయ ప్యాకేజీలను ఆమోదించడానికి విముఖత చూపుతున్నందున ఈ యుద్ధం నుంచి బయటపడే దారి చూడాలని కీయెవ్‌పై ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. యుక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక ప్యాకేజీలను ఆమోదించడాన్ని అమెరికన్ చట్టసభల సభ్యులు మొండిగా వ్యతిరేకిస్తున్నారు.

ఏం జరిగినా సరే, “ఇలాంటి సవాళ్లను నేటో ఎదుర్కోగలుగుతుందని నమ్ముతున్నా.నేటోను ఐక్యంగా ఉంచేందుకు యూరప్‌ ముందడుగు వేస్తుంది ” అని గొట్టెన్ మోయిల్లర్ చెప్పారు.

ఆంటోని బ్లింకెన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గాజాలో కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ బందీల విడుదల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పదిసార్లు పశ్చిమాసియాలో పర్యటించారు.

శాంతిదూత

ప్రచ్చన్న యుద్ధం తర్వాత ప్రపంచంలో తీవ్రమైన ఘర్షణ జరుగుతోంది. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వీటన్నింటి మీద పని చేయాల్సి ఉంటుంది.

“శాంతి భద్రతల విషయంలో అమెరికా ఎప్పటికీ ప్రపంచంలో కీలకంగా ఉంటుంది” అని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ సీఈఓ కంఫర్ట్ ఇరో నాతో చెప్పారు. అయితే ఆమె మరో విషయాన్ని కూడా జోడించారు. “వైరుధ్యాలను పరిష్కరించడంలో అమెరికా శక్తి తగ్గిపోతోంది” అని అన్నారు.

యుద్ధాలను ముగించడం చాలా కష్టంగా మారుతోంది. ‘‘పెద్ద దేశాల శక్తి ప్రదర్శన పోటీ పెంచుతుంటే మధ్యలో కొన్ని దేశాలు కూడా ఈ కోవలోకి చేరుతున్నాయి’’అని ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఇరో వర్ణించారు.

యుక్రెయిన్ లాంటి యుద్ధాలు అనేక శక్తులను ఆకర్షిస్తాయి. . సూడాన్‌ లాంటి అంతర్యుద్ధాలు ప్రాంతీయ శక్తులను ఒకరితో ఒకరు కలహించుకునేలా లాగుతున్నాయి. మరి కొన్ని దేశాలు మౌలిక వసతుల కల్పన కంటే యుద్ధం మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి.

అమెరికా నైతికంగా దిగజారుతోంది అని ఇరో ఎత్తి చూపారు. “యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ విషయంలో ఒక మాదిరిగా, గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో మరో విధంగా వ్యవహరించడాన్ని ప్రపంచ శక్తులు పరిశీలిస్తున్నాయి. సూడాన్‌లో అంతర్యుద్ధం వల్ల అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అమెరికా దాన్ని ద్వితీయశ్రేణి అంశంగా భావిస్తోంది” అని ఆమె చెప్పారు.

“హారిస్ గెలిస్తే ప్రస్తుత పరిపాలనకు కొనసాగింపుగా మారతారు. అదే ట్రంప్ గెలిస్తే గాజాలో ఇజ్రాయెల్‌కు మరింత స్వేచ్చను ఇస్తారు. రష్యాతో యుక్రెయిన్ సమస్యను పరిష్కరించుకునే బాధ్యతను కీయెవ్ నెత్తిన పెడతారు” అని ఇరో అన్నారు.

పశ్చిమాసియా విషయానికి వస్తే ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందన్న జో బైడెన్ వాదననే కమలా హారిస్ కూడా వినిపిస్తున్నారు. అయితే “అమాయక పాలస్తీనీయుల్ని చంపడం ఆపేయాలని” ఆమె నొక్కి చెబుతున్నారు.

ఖాన్ యూనిస్‌లో మంటలు
ఫొటో క్యాప్షన్, ఖాన్ యూనిస్‌లో ధ్వంసమైన ఇళ్ల మధ్య చలిమంట వేసుకున్న పాలస్తీనీయులు

యుక్రెయిన్ యుద్ధంపై ఎవరు ఎటు?

“ప్రజలను చంపడం మానేసి శాంతి స్థాపన కోసం కృషి చేయాలి” అని ట్రంప్ కూడా ప్రకటన చేశారు. అయితే ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో మాత్రం “మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి” అని చెప్పారు.

రిపబ్లికన్ అభ్యర్థి తనను తాను శాంతి స్థాపకుడిగా ప్రకటించుకుంటున్నారు. “నేను త్వరలోనే పశ్చిమాసియాలో శాంతిని స్థాపిస్తాను” అని ఆయన సౌదీ అరేబియాకు చెందిన అల్ అరబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

2020 అబ్రహాం ఒప్పందాల్ని మరింత విస్తరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు ఇజ్రాయెల్, మరికొన్ని అరబ్బు దేశాల మధ్య సంబంధాల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చాయి. అయితే అందులో పాలస్తీనీయుల్ని పక్కన పెట్టిన విషయాన్ని కూడా గుర్తించాలి. పాలస్తీనీయుల్ని పట్టించుకోకపోవడం వల్లే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది.

యుక్రెయిన్ విషయానికొస్తే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీద తనకున్న ప్రేమను ట్రంప్ ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చెయ్యలేదు. యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలనే తన అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. యుక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక, ఆర్థిక సాయాన్ని కూడా ఆపేయాలనేది ట్రంప్ ఆలోచన. “నేను అందులో నుంచి బయటకు వస్తాను, మనం బయటకు రావాల్సిందే” అని ఆయన ఇటీవలి ఎన్నికల ప్రచార సభలో కూడా పునరుద్ఘాటించారు.

కమలా హారిస్ వైఖరి దీనికి భిన్నంగా ఉంది. “యుక్రెయిన్‌కు అండగా నిలవడం నాకు గర్వకారణం. యుక్రెయిన్‌కు మద్దతివ్వడాన్ని నేను కొనసాగిస్తాను. ఈ యుద్ధంలో యుక్రెయిన్ గెలిచేందుకు నేను చేయాల్సిందంతా చేస్తాను” అని కమలా హారిస్ చెప్పారు.

అయితే ఇరో దాని గురించే ఆందోళన చెందుతున్నారు. ఎవరు గెలిచినా సరే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆమె చెప్పారు.

కమలాహారిస్, జెలియన్‌స్కీ
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అండగా ఉంటామని కమలా హారిస్ జెలియెన్‌స్కీకి హామీ ఇచ్చారు.

బీజింగ్‌తో వాణిజ్యం

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్నులను 60శాతం పెంచాలన్న ప్రతిపాదన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ అనేది చైనాలో ప్రముఖ స్కాలర్ రానా మిట్టర్ అభిప్రాయం.

ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానంలో భాగంగా చైనా మీద, ఇతర వ్యాపార భాగస్వాముల మీద ఖర్చుల భారాన్ని భరించలేని విధంగా పెంచారు. అదే సమయంలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సంబంధాలను బలో పేతం చేసుకోవడంలో విజయం సాధించారు. చైనా కనుక తైవాన్‌ను చుట్టుముడితే తాను ఎలాంటి జోక్యం చేసుకోనని డోనల్డ్ ట్రంప్ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ బోర్డుకు చెప్పారు. ఎందుకంటే “చైనా అధ్యక్షుడు తనను గౌరవిస్తాడని, తాను ‘క్రేజీ’ అనే విషయం ఆయనకు తెలుసు” అని అన్నారు.

అయితే చైనాతో సంబంధాల విషయంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లలో మెజార్టీ నేతలు వ్యతిరేకులే. ఈ రెండు పార్టీల నేతలు అవకాశం దొరికితే చైనాను అమెరికాను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తిగానే భావిస్తారు.

అయితే హార్వర్డ్‌లోనే కెన్నెడీ స్కూల్‌లో అమెరికా- ఏషియా సంబంధాలపై అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ చరిత్రకారుడు మిట్టర్ కొన్ని వైరుధ్యాలను గమనించారు. కమలా హరిస్ విషయానికొస్తే “ఆమె గెలిస్తే ప్రస్తుతం ఉన్నదాని నుంచి చిన్నగానైనా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవచ్చు. అదే ట్రంప్ గెలిస్తే పరిస్థితి ఊహించలేని విధంగా మారుతుందని” అన్నారు.

ఉదాహరణకు తైవాన్ విషయమే తీసుకుంటే అమెరికాకు దూరంగా ఉన్న ఒక ద్వీపం రక్షణకు ట్రంప్ వెళతారా లేదా అనే దానిపై మిట్టర్ సందేహం వ్యక్తం చేశారు.

చైనా నాయకత్వం మాత్రం ట్రంప్ అయినా, హారిస్ అయినా వారితో వ్యవహారం నడపడం కష్టమే అని భావిస్తుంది. “చైనా విషయంలో కమలా హారిస్ ఉత్తమ ప్రత్యర్థి కాగలరని చిన్న సమూహం నమ్ముతోంది. మరో గ్రూప్ ఒక వ్యాపారవేత్తగా ట్రంప్ చైనాతో అత్యుత్తమంగా బేరమాడగలరని నమ్ముతోంది. అయితే అలా జరక్కపోవచ్చు’’ అని మిట్టర్ చెప్పారు.

డెత్ వ్యాలీ బోర్డు
ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో తీవ్రమైన వేడి గురించి ఏర్పాటు చేసిన బోర్డు

వాాతావరణ సంక్షోభం

‘‘అమెరికా అధ్యక్ష ఎన్నిక కేవలం ఆ దేశ ప్రజల కోసం మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచం మొత్తానికి కీలకం” అని మేరీ రాబిన్సన్ చెప్పారు. ఆమె నెల్సన్ మండేలా ఏర్పాటు చేసిన చైర్ ఆఫ్ ఎల్డర్స్ అనే సంస్థకు అధ్యక్షురాలు, ఐర్లండ్ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగంలో హై కమిషనర్.

“వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తిప్పి కొట్టడంలో ప్రతి చర్యా ముఖ్యమైనదే, మిల్టన్, నార్మ్ లాంటి తుపానుల నుంచి భవిష్యత్‌ను రక్షించాలంటే ఇప్పుడే చర్యలు చేపట్టాలి” అని ఆమె చెప్పారు.

అయితే మిల్టన్, హెలెన్ లాంటి తుపానులు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు ట్రంప్ పర్యావరణ ప్రణాళికలను, వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే విధానాలను పక్కదారి పట్టించారు.

ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగినట్లే ఇప్పుడు కూడా వ్యవహరిస్తారని అనేక మంది భావిస్తున్నారు.

ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనను ఆయన ఆపలేరని రాబిన్సన్ నమ్ముతున్నారు. “అమెరికాలో సంప్రదాయ ఇంధన వనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మారుతున్న దృశ్యాన్ని ట్రంప్ ఆపలేరు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న కోట్ల కొద్దీ డాలర్లను కూడా వెనక్కి మళ్లించలేరు. అలుపెరగని కేంద్ర ఫెడరల్ ఉద్యమాన్ని ఆపలేరు” అని రాబిన్సన్ చెప్పారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలో తన విధానాన్ని కమలా హారిస్ ఇంకా స్పష్టం చెయ్యలేదు. “నాయకత్వాన్ని తీసుకోండి, ఇటీవలి సంవత్సరాల్లో ఊపందుకుంటున్న ఉద్యమాన్ని నడిపించండి. వేగాన్ని పెంచడానికి సంప్రదాయేతర ఇంధన వనరుల వ్యాప్తిని పెంచండి” అని రాబిన్సన్ కమలా హారిస్‌ను కోరారు.

అమెరికా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బైడెన్ వారసుల ముందు అనేక సవాళ్లు ఎదురు చూస్తున్నాయి.

మానవీయ కోణం

“అమెరికా ఎన్నికల ఫలితాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అమెరికా సైనిక, ఆర్థిక శక్తి ద్వారా మాత్రమే కాకుండా ప్రపంచాన్ని నైతిక మార్గంలో నడిపించే విషయంలోనూ అసమాన ప్రభావాన్ని చూపిస్తోంది” అని మార్టిన్ గ్రిఫిత్స్ చెప్పారు. ఆయన అంతర్యుద్ధాల పరిష్కారంలో మధ్యవర్తిగా పని చేశారు.

కమలా హారిస్ గెలిస్తే దివ్యంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. “హారిస్ నాయకత్వం ఆశలను రేకెత్తిస్తుంది” అని ఆయన చెప్పారు. దీనికి విరుద్దంగా “ట్రంప్ అధ్యక్షుడైతే ఏకీకరణ, గుత్తాధిపత్యం చెలరేగుతుంది. అది ప్రపంచానికి నిరాశను మాత్రమే మిగులుస్తుంది” అని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితి చేపడుతున్న అనేక కార్యక్రమాలకు భారీ స్థాయిలో ఉదారంగా విరాళాలు ఇస్తోంది అమెరికా. 2022లో అమెరికా 18.1 బిలియన్ డాలర్ల సాయం చేసింది.

అయితే ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు ఐక్యరాజ్య సమితిలోని విభాగాలకు అందిస్తున్న నిధులపై కోత విధించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బైటకు వచ్చారు. నిధుల లోటును భర్తీ చేసేందుకు ఇతర దేశాలు అష్టకష్టాలు పడ్డాయి. ఇలాగే జరగాలని ట్రంప్ కోరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న నిరాశను గ్రిఫిత్స్ ప్రస్తావించారు. పశ్చిమాసియాలో దిగజారుతున్న పరిస్థితుల విషయంలో జో బైడెన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడాన్ని ఆయన విమర్శించారు.

2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చెయ్యడాన్ని ఐక్యరాజ్య సమితి సహాయసంస్థల అధినేతలు పదే పదే ఖండించారు. అలాగే వాళ్లు గాజా, లెబనాన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల విషయంలో ఏదైనా చేయాలని అమెరికాను కూడా పదే పదే కోరారు.

గాజాకు మరింత సాయం అందించాలని బైడెన్ ఆయన సహచరులు అనేక మార్లు పిలుపునిచ్చారు. అయితే అమెరికా అందించిన సాయం, ఆ సాయం బాధితులకు అందించేందుకు చూపించిన చొరవ ఏ మాత్రం సరిపోవని విమర్శకులు చెప్పారు.

ఎన్నికల తర్వాత ఇజ్రాయెల్‌కు అందిస్తున్న సైనిక సాయాన్ని తగ్గిస్తామని అమెరికా హెచ్చరించింది.

“మానవీయ సంక్షోభాన్ని స్థిరమైన నైతిక స్పష్టతతో పరిష్కరించడంలోనే నిజమైన నాయకత్వం వస్తుంది. ప్రపంచ వేదిక మీద ప్రజల జీవితాల్ని కాపాడటం అనేది అమెరికా దౌత్య విధానానికి పునాది” అని గ్రిఫిత్స్ చెప్పారు.

ఏదేమైనప్పటికీ అమెరికా ఇప్పటికీ తిరుగులేని శక్తి అని ఆయన నమ్ముతున్నారు “ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణ, అనిశ్చితి ఉన్నప్పుడు, బాధ్యతాయుతమైన, సూత్రప్రాయమైన అమెరికా నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటుంది. మేం మరింత డిమాండ్ చేస్తున్నాం, మాకు మరింత రావాలి. మేంమరింత ఆశిస్తాం కూడా”..

గ్రిఫిత్ కోరుకుంటున్నది, ఆశిస్తున్నది నవంబర్ 5 తర్వాత అమెరికాను పాలించబోయే నాయకత్వం అందిస్తుందా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)