‘మా దగ్గరికి వచ్చి డబ్బులు సంపాదించుకోండి’ అంటూ విదేశీయులను ఆహ్వానిస్తున్న అమెరికన్ రాష్ట్రం

అమెరికా, మెక్సికో, వలసలు, చేపల వ్యాపారం, కార్డోవా, ఉద్యోగాలు, డబ్బు

ఫొటో సోర్స్, Jorge Luis Perez Valery

ఫొటో క్యాప్షన్, ఎడ్గార్ వేగా గార్సియా (ఎడమ) మెక్సికోలో ఒక సంవత్సరం పాటు హాయిగా జీవించడానికి తగినంత డబ్బును కార్డోవాలో సంపాదిస్తున్నట్లు చెప్పారు.
    • రచయిత, గ్యుల్లెర్మో మోరెనో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా ఎన్నికల్లో అక్రమ వలసల అంశంపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మెక్సికో నుంచి తమ దేశంలోకి అక్రమంగా వచ్చే వారి సంఖ్యను తగ్గిస్తామని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు.

అయితే, ఒక రిపబ్లికన్ రాష్ట్రం ఎక్కువ మంది వలసదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రం అలాస్కా.

గల్ఫ్ ఆఫ్ అలాస్కాలోని కాపర్ రివర్ డెల్టా సమీపంలో చిన్న మత్స్యకార పట్టణం ఉంది. ఇక్కడ పనిచేసే వ్యక్తుల ప్లేట్లలో ‘టాకోస్ టోర్టిల్లా’ అని పిలిచే మెక్సికన్ ఆహారం ఎక్కువగా కనిపిస్తుంది.

అలాస్కాలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారాల్లో పని చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వలసదారులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చినవారు తమ సొంత ప్రాంతంలో సంపాదించే డబ్బు కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు.

మెక్సికో నుంచి ఇక్కడికి వచ్చిన ఎడ్గార్ వేగా గార్సియా, తాను ఇక్కడ 4 నెలలు పనిచేసి 27,000 అమెరికన్ డాలర్లు (సుమారు 22.7 లక్షల రూపాయలు) పైగా సంపాదించినట్లు చెప్పారు. మెక్సికోలో సంవత్సరానికి సగటు కుటుంబ ఆదాయం 16,269 డాలర్ల (సుమారు 13 లక్షల రూపాయలు) కంటే తక్కువని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది.

కార్డోవా పట్టణంలో, ఏడాదిలో అత్యధిక కాలం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఏడాది పొడవునా ఎక్కువ భాగం భారీ వర్షం లేదా మంచు కురుస్తుంది. ఇక్కడ ఏడాదిలో రెండు నెలలు సూర్యుడు కనిపించడు. స్థానికులు ఈ కాలాన్ని పోలార్ నైట్ అని పిలుస్తారు.

వేసవి రాగానే స్థానికులకు చలి నుంచి విముక్తి లభిస్తుంది. వేసవి ప్రారంభం కాగానే స్థానిక ప్రజలు సాల్మన్ చేపలతో పాటు ఇతర రకాల చేపల్ని పట్టుకుంటారు.

ఈ సమయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి ఉన్న కొద్ది రోజుల్లో వీలైనన్ని ఎక్కువ చేపలు పట్టుకోవాలని భావిస్తారు. ఈ పట్టణంలో సగానికి పైగా ఉద్యోగాలు మత్స్య పరిశ్రమకు సంబంధించినవే.

చేపలను ప్రాసెస్ చేయడానికి, ప్యాక్ చేయడానికి, అమ్మడానికి కంపెనీలకు ఎక్కువ మంది కార్మికులు అవసరం. స్థానికంగా అవసరమైనంత మంది కార్మికులు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు తీసుకువస్తుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, మెక్సికో, వలసలు, చేపల వ్యాపారం, కార్డోవా, ఉద్యోగాలు, డబ్బు

ఫొటో సోర్స్, Jorge Luis Perez Valery

ఫొటో క్యాప్షన్, కార్డోవాలో ఏడాదిలో అత్యధిక కాలం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది

వలసదారులకు ఆకర్షణీయ జీతాలు

రాష్ట్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం, అలాస్కా మత్స్య పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల్లో 80 శాతం మంది విదేశీయులే. అమెరికాలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా కార్మికులు ఇక్కడికి వస్తారు. విదేశీ కార్మికుల్లో ఎక్కువ మంది యుక్రెయిన్, పెరు, తుర్కియే, ఫిలిప్పీన్స్, మెక్సికో నుంచి వచ్చినవారే.

విదేశీయుల్ని ఆకర్షిస్తున్న ప్రధాన అంశాలు జీతాలు, వర్క్ కల్చర్. జీతం తమ సొంత దేశంలో కంటే ఇక్కడే ఎక్కువని విదేశీయులు చెబుతున్నారు.

ఒక మత్స్యకారులు గంటకు 18 డాలర్ల చొప్పున సంపాదిస్తారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పని చేస్తే గంటకు దాదాపు 27 డాలర్లు సంపాదించచ్చు. (అలాస్కా చట్టాల ప్రకారం ఓవర్ టైమ్ పని చేస్తే వేతనంలో 50% అధికంగా చెల్లించాలి)

ఇక్కడ చాలా కంపెనీలు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు బస చేసేందుకు ఇల్లు, మూడు పూటలా భోజనం అందిస్తున్నాయి. దీంతో వారు కార్డోవాలో పెద్దగా డబ్బు ఖర్చు పెట్టే అవసరం రాదు. కార్మికులు తాము సంపాదించిన సొమ్మును డిపాజిట్ చేసుకునేందుకు కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి.

కార్డోవాలో సినిమా హాలు లేదా షాపింగ్ మాల్ లేదు. చేపలు పట్టడానికి వాతావరణం అనుకూలించకపోతే జాలర్లు పట్టణంలోని బార్‌లో మద్యం తాగి స్నూకర్ ఆడతారు.

కార్డోవా చేరుకోవాలంటే నౌకలు లేదా విమానాల్లో మాత్రమే వెళ్లాలి. దీంతో కార్మికుల్ని నియమించుకున్న కంపెనీలు రాను పోను టిక్కెట్లకు డబ్బులు చెల్లిస్తాయి.

అయితే, కార్డోవాలో చేపల కర్మాగారాల్లో పని చేసే కార్మికుల జీవితాలు అంత గొప్పగా ఏమీ ఉండవని కొందరు చెబుతున్నారు.

షిప్పింగ్ కంటైనర్‌తో తయారు చేసిన గదిలో నలుగురు నివసిస్తున్నారు.

పని చాలా కష్టంగా ఉంటుంది. చాలావరకు ఉదయం షిఫ్టులు ఉంటాయి. ఒక్కో షిప్టులో18 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుంది.

కార్మికులు రోజుకు వేల కిలోల చేపలను పట్టుకోవాలి.

అమెరికా, మెక్సికో, వలసలు, చేపల వ్యాపారం, కార్డోవా, ఉద్యోగాలు, డబ్బు

ఫొటో సోర్స్, Jorge Luis Perez Valery

ఫొటో క్యాప్షన్, చేపల ప్రాసెసింగ్ ప్లాంట్లలో షిఫ్టులు ఉదయాన్నే మొదలవుతాయి.

భారీ చేపల వ్యాపారం

అలాస్కాలో చేపల ప్రాసెసింగ్ పెద్ద వ్యాపారం. రాష్ట్ర ఫిషింగ్, సీఫుడ్ పరిశ్రమలు సంవత్సరానికి 2,000 టన్నులకు పైగా చేపలను ప్రాసెస్ చేస్తాయని యూనివర్శిటీ ఆఫ్ అలాస్కా ఫెయిర్‌బ్యాంక్స్ చెబుతోంది. ఇది మొత్తం అమెరికన్ చేపల పరిశ్రమలో సగం కంటే ఎక్కువ.

అలాస్కా చేపల పరిశ్రమలో పని చేయడానికి విదేశీ కార్మికుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. 2023లో ఇక్కడ పని చేసేందుకు అవసరమైన వలస కార్మికులకు ఇచ్చే తాత్కాలిక వీసాల సంఖ్యను పెంచేదుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

2022 సంవత్సరంలో వలస కార్మికులకు ఇచ్చే వీసాల సంఖ్య 66 వేలుగా ఉంది. అయితే 2023-2024 సంవత్సరంలో ఈ సంఖ్య సుమారు 1 లక్ష 30 వేలకు పెరిగింది.

ఎడ్గార్ ఈ సంవత్సరం కార్డోవాలోని 'నార్త్ 60 సీఫుడ్స్' అనే చిన్న చేపల ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. ఈ సంస్థ యజమాని రిచ్ వీలర్. కార్డోవాలో పని చేస్తున్న వలస కార్మికుల్లో కొంతమంది డ్రగ్స్ తీసుకుని వారిలో వారు గొడవలు పడటం వల్ల తమకు సమస్యలు వస్తున్నాయని రిచ్ వీలర్ చెప్పారు.

మెక్సికో నుంచి వచ్చిన వలస కార్మికుల వల్ల తన వ్యాపారం బాగా విస్తరించిందని ఆయన అన్నారు. మెక్సికన్లు లేకుండా తన వ్యాపారం ఇంతలా అభివృద్ధి చెందడం అసాధ్యమని, వారు ఎల్లప్పుడూ సమయానికి వస్తారని చెప్పారు.

చాలా మంది వలస కార్మికులకు కుటుంబాలను వదిలేసి అలాస్కాలో ఎక్కువ కాలం పని చేయడం అతిపెద్ద సవాలు. ఎడ్గార్ తల్లి రోసా వేగా18 ఏళ్లుగా ఏటా అలాస్కాకు వచ్చి వెళ్తున్నారు.

అమెరికా, మెక్సికో, వలసలు, చేపల వ్యాపారం, కార్డోవా, ఉద్యోగాలు, డబ్బు

ఫొటో సోర్స్, Jorge Luis Perez Valery

ఫొటో క్యాప్షన్, కార్డోవా స్థానికులు ఫిషింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లలో పనిచేయడానికి ఇష్టపడతారు

వలసదారులు లేకపోతే..

విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ అన్నారు. సరిహద్దుల్లో భద్రతను పెంచి, ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తెచ్చి అక్రమ వలసలను నియంత్రిస్తామని కమలా హారిస్ చెప్పారు.

కార్డోవా పట్టణ జనాభా 3 వేల కంటే తక్కువే ఉంటుంది. కానీ వేసవి వచ్చేసరికి ఈ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది.

వలసదారులు ఉద్యోగాలకు ముప్పు కాదని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వారే కీలకమని కార్డోవా మేయర్ డేవిడ్ ఎల్లిసన్ భావిస్తున్నారు.

ఆయన చాలా సంవత్సరాలు క్యానరీలో పనిచేశారు."250 మంది ఉద్యోగులు అవసరమని అలాస్కాలోని వార్తాపత్రికలో ప్రకటన ఇస్తే, 20కి మించి దరఖాస్తులు రావు" అని ఆయన చెప్పారు.

వలసదారులు లేకపోతే స్థానిక ప్రజలు పట్టుకున్న చేపలు కుళ్లిపోయి పనికి రాకుండా పోతాయని ఎల్లిసన్ తెలిపారు.

‘‘వలసదారులు లేకపోతే చేపల్ని ప్రాసెస్ చేసేందుకు ఎవరూ ఉండరు. చేపలు పట్టుకునే వారు లేకపోతే ఈ పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది’’ అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)