బెంగళూరు: ఈ నగరంలో అకస్మాత్తుగా వరదలు ఎందుకు వస్తున్నాయి? ఉపశమనం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
గత సోమవారం నుంచి బుధవారం వరకు (అక్టోబర్ 21 నుంచి 23 వరకు ) మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ఐటీ నగరం బెంగళూరును అతలాకుతలం చేశాయి. ఈ వరదలకు జనజీవనం స్తంభించింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మంగళవారం బాబూసాపాళ్యలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది గాయపడ్డారు.
అదే రోజు ఉదయం యలహంకలోని ఒక అపార్ట్‌మెంట్‌ను వరద నీరు చుట్టుముట్టడంతో లోపల చిక్కుకున్న వారిని యుద్ధప్రాతిపదికన బయటకు తీసుకొచ్చారు.
బెళందూరు, మారత్తహళ్లి, మాన్యతా టెక్ పార్క్, క్రిష్ణరాజపుర, యలహంకల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరగా, యలచేనహళ్ళి రామకృష్ణనగర్, సర్జాపుర, బెళ్లందూరు, కోరమంగళతోపాటూ నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించగా, పై అంతస్తుల్లో ఉంటున్నవారు ఇళ్లలోనే చిక్కుకుపోయారు.


ఐటీ ఉద్యోగుల ఇక్కట్లు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనివారు ఆఫీసుకు వెళ్లే దారిలో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయారు.
మాన్యత టెక్ పార్క్ లాంటి ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అయినా తమను వరద కష్టాలు వీడడం లేదని టాటా నగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి శ్వేత బీబీసీతో అన్నారు.
‘‘కొన్ని అపార్ట్‌మెంట్లలో సెల్లార్లు పూర్తిగా నిండిపోయాయి. అక్కడ పెట్టిన కార్లన్నీ పాడైపోయాయి. కరెంట్ లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడ్డాం. రెండురోజులైతే ఫుడ్ తెచ్చుకోవడం కూడా కష్టమైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేని పరిస్థితి. కొంతమంది బయటకు వెళ్లి హోమ్ స్టే తీసుకోవడం, హోటల్ రూమ్‌లలో ఉండడం లేదా బంధువులు ఇళ్లకు వెళ్లడం లాంటివి చేశారు. పిల్లల కోసం మేం ఎటూ వెళ్ళలేక సెలవులు పెట్టి ఇక్కడే ఉన్నాం. ఇలాగే మరో 15 రోజులు ఉంటే జాబ్ పోతుంది’’ అని శ్వేత అన్నారు.

ఆరు గంటల్లో 157 మి.మీ. వర్షపాతం
యలహంకలో సోమవారం (అక్టోబర్ 21న) అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కేవలం ఆరు గంటల్లో 157 మి.మీ వర్షపాతం నమోదైందని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) తెలిపింది.
స్థానికులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లలో వెళ్లి నిత్యవసరాలు తెచ్చుకుంటున్నామని, గత పదేళ్లుగా వర్షాలు పడితే మురుగునీటితోనే సహజీవనం చేస్తున్నామని సాయి లేఔట్‌లో ఉంటున్న విజయమ్మ బీబీసీకి చెప్పారు.
"దుబాయ్, దిల్లీలో ఏం జరుగుతుందో తెలుసు. దిల్లీలో కాలుష్యం, కరవు పీడిత ప్రాంతమైన దుబాయ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రకృతిని ఆపలేం, మేనేజ్ చేస్తున్నాం’’ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అన్నారు.

‘వర్షాలు పడే తీరు మారింది’
అయితే, అసలు బెంగళూరులో అకస్మాత్తుగా వచ్చిన ఈ వరదలకు కారణమేంటి, వీటి నుంచి నగరవాసులకు ఉపశమనం కల్పించడమెలా అనేదానిపై నిపుణులతో మాట్లాడింది బీబీసీ.
వర్షాలు పడే తీరు మారిపోవడం, పట్టణీకరణ పెరగడం వల్ల బెంగుళూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని కర్ణాటక నేచురల్ డిజాస్టర్ సెంటర్ మాజీ డైరెక్టర్, శాస్త్రవేత్త జీఎస్ శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘ఒక నెలలో పడాల్సిన వర్షం 8 రోజుల్లో పడటం, ఎనిమిది రోజుల్లో పడాల్సిన వర్షం ఒక రోజులో పడటం, ఒక రోజులో పడే వర్షం ఒక గంటలో పడటం...మొత్తంగా చూస్తే ‘అమౌంట్ ఆఫ్ రెయిన్ ఫాల్’ పెద్దగా పెరగలేదుగానీ, వర్షం పడే తీరులో మాత్రం వేరియేషన్ ఎక్కువవుతోంది’’ అని అన్నారు.

‘రుతుపవనాల ప్రభావం’
నైరుతి రుతుపవనాలు కర్ణాటకను వీడి వెళ్లే సమయంలో సెప్టెంబర్ చివరి రెండు వారాలు, అక్టోబర్ చివరి రెండు వారాలు బెంగళూరులో వర్షాలు పడుతుంటాయని ఏపీ వెదర్ మెన్ సాయి ప్రణీత్ బీబీసీకి చెప్పారు.
ఆ తర్వాత, రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఆ సమయంలో దక్షిణ భారత్‌లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఆయన అన్నారు.
‘‘బెంగళూరులో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడాల్సిన వర్షం కంటే తక్కువగానే పడింది. కానీ, ఒక్కసారిగా గత రెండు వారాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అది కూడా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటం వల్ల పడ్డాయి. మరో తుపాను ఒడిశాకు పోయింది. ఆ సమయంలో కూడా బెంగళూరు, ఆంధ్రాలో వర్షాలు పడ్డాయి’’ అని చెప్పారు.

బెంగళూరు వరదలకు కారణమేంటి?
బెంగళూరులో అకస్మాత్తుగా వచ్చిన వరదలకు పెరుగుతున్న పట్టణీకరణ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.
‘‘పట్టణీకరణ ఎక్కడెక్కడ పెరుగుతుందో అక్కడ ఇలాంటి వరదలు వస్తాయి. జనాభా పెరిగితే నీటి డిమాండ్ ఎక్కువ అవుతుంది. భూమి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఖాళీగా కనిపించే ప్రాంతమంతా నిర్మాణాలతో నిండిపోతుంది’’ అని శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బెంగళూరు జనాభా పెరుగుతోందని, ఆక్రమణలు పెరగడం కూడా దీనికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘బెంగుళూరులో 1951 జనాభా గణాంకాలు చూస్తే ఏడు లక్షలు ఉండేవారు. అప్పుడు ఏరియా 69 చదరపు కిలోమీటర్లు ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా కోటీ 30 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం నగర వైశాల్యం సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్లు అయ్యింది. కానీ అప్పుడు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ ఉందో, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆక్రమణలు ఎక్కువైపోయి డ్రైనేజీ వెడల్పు తగ్గిపోయింది. దీనికి తోడు వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల అవి కూడా మూసుకుపోతున్నాయి’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బెంగళూరులో ఒకప్పుడు 500 చెరువులు ఉండేవని, దాదాపు 100 చెరువులు కనిపించకుండా పోయాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
శివార్లలో ఒకప్పుడు వ్యవసాయ భూములు ఉండేవని, అక్కడంతా భవనాలు కట్టడం వల్ల ఇప్పుడు వర్షాలు పడితే నీళ్లు భూమిలోకి ఇంకడం లేదని అన్నారు.
ఒక రోజులో 24 గంటలూ ఆగకుండా 100 మిల్లీ మీటర్లు వర్షపాతం కురిసినా నగరానికి ఏ సమస్యా లేదన్న శ్రీనివాస్ రెడ్డి, ఒక గంటలో అదే వర్షపాతం నమోదయినప్పుడు వచ్చే వరద నీటిని మేనేజ్ చేసే సామర్థ్యం బెంగళూరుకు లేదని చెప్పారు.
‘‘బెంగళూరు చాలా ఎత్తులో ఉంది. వేరే నగరాలు ఏవీ ఇలా లేవు. ఈ సిటీలో ఏ నది లేదు, ఇది తీరప్రాంతం కూడా కాదు. సిటీ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. వర్షాలు పడితే వరద నీళ్లు డ్రైనేజీల్లోకి పోకుండా, రోడ్లపైనే పోతున్నాయి’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అయితే, ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. వరద నీరు వెళ్లిపోయే కాలువలను అడ్డుకునేలా చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాల్సిందిగా బీబీఎంపీ అధికారులకు తాను సూచించానని డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక రిపోర్ట్ చేసింది.
‘‘ఇలాంటి పరిణామాలు మళ్లీ జరక్కుండా ఉండేలా ప్రణాళికలు రచించేందుకు జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్, వరద నీటి నిర్వహణాధికారులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. వరదనీటి నిర్వహణకు అవసరమైన ప్రణాళికలను, దీనికయ్యే ఖర్చుల అంచనాలపై ఈ కమిటి నివేదిక ఇస్తుంది’’ అని శివకుమార్ చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

దీనికి పరిష్కారం ఎలా?
బెంగళూరులో ఉన్న చెరువుల జల సామర్థ్యాన్ని పెంచడం లాంటి చర్యలు తీసుకోవడంతో నగరానికి హఠాత్ వరదల ముప్పు కొంత తగ్గించవచ్చని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘ఇప్పుడు ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో? వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, మైదానాలలో అక్కడ పడిన నీళ్లు భూమిలోకి వెళ్లేట్లు చేయాలి. ఫుట్‌పాత్‌లో నీళ్లు పడితే అక్కడే లోపలకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలి’’ అని ఆయన సూచించారు.
‘‘ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోకూడదో అవగాహన కల్పించాలి. కాలువలు పోయే దగ్గర బఫర్ జోన్ ఎంత వదలాలి అనేది చెప్పాలి. డ్రైనేజీ పొంగిపొర్లకుండా అడ్డుకునేందుకు నిర్మించిన గోడపైనే(డ్రైనేజీ రిటైనింగ్ వాల్‌పైనే) భవనాలు నిర్మించారు. వాటిని ఖాళీ చేయించి డ్రైనేజీ వెడల్పు చేయాలి. బ్లాక్ అయిన కాలువలను వర్షాకాలానికి ముందే క్లియర్ చేయాలి’’ అని అన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు విధివిధానాలు ఏర్పాటు చేయాలని కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి విభాగం బెంగళూరులోనూ ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వేసవిలో నీటి కొరత, వర్షాకాలంలో వరదలు
ముఖ్యంగా ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు ఉన్నచోటే ఎక్కువ వరద నీరు నిల్వ అవుతోందని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. వేసవిలో సగం నగరం నీటి ఎద్దడితో అల్లాడిపోతోందని చెప్పారు.
‘’70 శాతం నీళ్లు కావేరీ నది నుంచి ఇస్తారు. ఇంకా 30 శాతం జనాభా గ్రౌండ్ వాటర్ అంటే బోర్ వెల్స్ వాటిపైన ఆధారపడుతున్నారు. ఒక్కొక్కసారి వర్షాలు రాకపోతే గ్రౌండ్ వాటర్ అడుగంటుతుంది. గత వేసవిలో పూర్తిగా నగరంలో 50 శాతం మందికి నీటి సమస్య ఎదురయ్యింది’’ అని గుర్తు చేశారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం వల్ల, వరద సమస్య తీరడంతోపాటు వేసవిలో నీటి ఎద్దడిని నివారించవచ్చని ఆయన సూచించారు.
‘‘గ్రౌండ్ వాటర్ రీచార్జ్‌కి ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టాలి. వర్షం పడితే 10 లేక 15 శాతం నేలలోకి ఇంకితే, అది గ్రౌండ్ వాటర్‌గా మారుతుంది. బోర్ వెల్స్‌లో నీళ్లు వస్తాయి. అప్పుడు ఏ సమస్యా ఉండదు. ఇక రెండోది. వర్షాలు పడినప్పుడు ఇళ్ల పైన పడే నీటిని ఆర్వో చేసి ఉపయోగించుకోవాలి. ఒక్కోసారి వరదలు వస్తున్నాయి, ఇంకోసారి వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలు తగ్గాలంటే నీటి వనరులు పెంచాలి’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














