హైదరాబాద్: సంతలో మోమోస్ తినడం వల్లే ఆ మహిళ మరణించారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'హైదరాబాద్‌లో మోమోస్ తినడంతో ఒక మహిళ మరణించారు' అనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
సంతలో మోమోలు తినడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని, దానివల్లే ఆమె మరణించారని బంధువులు, స్థానికుల ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, ఆ మోమోస్ తిన్నవారు పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలైనట్లూ వారు చెబుతున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా వారాంతపు సంతలు పెరిగాయి. ఈ సంతల్లో కూరగాయలతో పాటు ఇతర తినుబండారాలు అమ్ముతుంటారు.
అక్టోబర్ 25న బంజారాహిల్స్‌లోని సింగిడికుంటకు చెందిన రేష్మ కూడా సంతకు వెళ్లి, అక్కడ అమ్ముతున్న మోమోస్ తిన్నట్లు ఆమె బంధువులు తెలిపారు.
ఆ తరువాత నుంచి రేష్మకు వాంతులు, విరేచనాలు అయ్యాయని, పరిస్థితి తీవ్రం కావడంతో సోమవారం నిమ్స్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె మరణించారని చెప్పారు.
శని, ఆదివారాల్లో నంది నగర్, సింగిడికుంట, గౌరీ శంకర్ కాలనీల పరిసరాల నుంచి పలువురు వాంతులు, విరేచనాలతో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆసుపత్రుల్లో చేరారు. వీరితో స్థానికులు మాట్లాడినప్పుడు, అందరూ తాము శుక్రవారం సంతలో మోమోస్ తిన్నట్టుగా చెప్పారు.
దీంతో ఆయా కాలనీల్లోని కొందరు స్థానికులు, నంది నగర్‌లో ఉండే స్థానిక రాజకీయ నాయకుడు బల్లు రాథోడ్ కలసి సంతలో మోమోస్ అమ్మిన వ్యక్తిని గుర్తించి, పోలీసులకు అప్పగించారు.


ఫొటో సోర్స్, Getty Images
'అమ్మిన వ్యక్తి ఫోటోలు బాధితులకు చూపించాం'
‘‘నేను చాలామంది కాలనీ వాసుల్ని కలిశాను. ఎవరిని అడిగినా మోమోస్ తిన్నామనే చెబుతున్నారు. నాలుగైదు ఆసుపత్రుల్లో పేషెంట్లు ఉన్నారు. అందరికీ వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. మరణించిన మహిళకు 30 ఏళ్లు ఉండవచ్చు. ఆమెను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు'' అని బల్లు రాథోడ్ మీడియాతో చెప్పారు.
''మేము మోమోస్ అమ్మిన వ్యక్తిని గుర్తించాం. బాధితులకు ఆయన ఫొటోలు చూపించి వాటిని అమ్మింది ఆయనేనా? కాదా అని ధ్రువీకరించుకున్నాం. ఆ వివరాలు పోలీసులకు అందజేశాం. నంది నగర్ బస్టాప్, సింగిడి కుంట, గౌరీ శంకర్ కాలనీల్లోని వారాంతపు సంతల్లో వీరు మోమోస్ అమ్ముతారు. బాధితుల సంఖ్య 60 వరకూ ఉండొచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించారు. అమ్మేవారు మంచి పదార్థాలు వాడటం లేదని మేం గమనించాం’’ అన్నారు.
రేష్మ మరణం, ఇతరుల అనారోగ్యానికి కారణం మోమోసేనా, మరేదైనా ఉందా అనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. దీనిపై బంజరాహిల్స్ పోలీసులను బీబీసీ సంప్రదించింది, వారు స్పందించాల్సి ఉంది.
‘కేవలం మోమోస్ తింటే చనిపోతారా?’
కేవలం మోమోస్ తినడం వల్లే మనిషి చనిపోతారా అంటే , అది మనిషిని బట్టి మారుతుందని వివరిస్తున్నారు నిపుణులు.
‘‘ఫుడ్ పాయిజనింగ్ తీవ్రత కొందరిలో ఎక్కువ ఉంటుంది. కొందరిలో రిస్కు తక్కువ ఉంటుంది. అప్పటికే వివిధ రకాల సమస్యలు, ఇమ్యూనిటీ దెబ్బతిన్న వారు, డీహైడ్రేట్ అయిన వారు, దానికితోడు వరుస వాంతులు, విరేచనాలతో ఎలక్టోరైట్లు పోగొట్టుకున్న వారు.. ఇలా కొందరిలో ఫుడ్ పాయిజినింగ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’’ అని బీబీసీతో చెప్పారు నూట్రిఫుల్ యూ (nutrifulyou) ఫౌండర్, నూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.
‘‘ఇక మోమోల సంగతికి వస్తే, అందులో పెట్టే పదార్థం (ఫిల్లింగ్) మాంసం బేస్డ్, ప్లాంట్ బేస్డ్ రెండూ ఉంటాయి. ఆ ఫిల్లింగ్ ని సరిగా హ్యాండిల్ చేయకపోతే, అంటే వాటిని సరిగా వండకపోయినా, ఉడక్కపోయినా, సరిగా వేడి చేయకపోయినా బాక్టీరియా వృద్ధి చెంది, పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. కొందరు ముందు రోజు మిగిలిపోయిన సరుకు మరునాడు అమ్ముతారు. ఆ సమయంలో మరోసారి వేడి చేసినప్పుడు ఫిల్లింగ్ మధ్య భాగం సరిగా వేడికాక కూడా ఇబ్బంది వస్తుంది. కొనేప్పుడు వేడిగా ఉన్నా, తినేప్పుడు బాగా చల్లారిపోతే కూడా ఈ సమస్య ఉంటుంది.’’ అన్నారు డాక్టర్ లహరి.
‘‘అందులో ఏ బాక్టీరియా, ఏ వైరస్ వృద్ధి చెందింది అనేదాన్ని బట్టి మనిషిలో లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని బాక్టీరియాలు అరగంట నుంచి రెండు గంటల్లో ప్రభావం చూపితే, హెపటైటిస్ ఎ వంటి వైరస్ లు తిన్న ఐదారు రోజుల తరువాత కనిపించడం మొదలు అవుతుంది. మోమోస్ తో పాటూ వాటికి తోడుగా ఇచ్చే సైడ్ డిష్ ల వల్ల కూడా సమస్య ఉండొచ్చు అంటున్నారు డాక్టర్ లహరి.
ఫుడ్ పాయిజనింగ్ కి కారణాలు:
స్టఫింగ్ ని సరిగా వండకపోవడం, స్టోర్ చేయకపోవడం
పదార్థాలను నిల్వ ఉంచే పాత్రలు, రవాణా చేసే పాత్రలు శుభ్రంగా లేకపోవడం, వాటిని కడగడానికి వాడే నీరు కలుషితంగా ఉండడం. మోమోలను వేరే చోట ఉడికించి, వాటిని రవాణా చేసే పాత్రలు సరిగా లేకపోయినా ఇబ్బంది.
వడ్డించే ప్లేట్లు, వడ్డించే వారి చేతులు, పాత్రలు, ప్లేట్లు కడిగే నీరు శుభ్రంగా లేకపోవడం.
చిల్లీ సాస్, మేనీస్ వంటి వాటని సరిగా ఫ్రీజ్ చేయకపోవడం, పాతవి కొత్తవీ, సగం వాడిన పాత్రలోనివీ, కొత్త పాకెట్లోనివీ కలపడం.. ఇలా అనేక రకాలుగా ఇది కలుషితం అయ్యే అవకాశం ఉంది.
చవకగా ఆహారం అందించే వారు ప్రధాన ఫుడ్ అప్పటికప్పడు వండినా, ఈ సాస్ ల నిల్వ విషయంలో అలసత్వం జరగవచ్చు. ఖర్చులు ఆదా చేసుకోవడం కోసం ఫ్రిజ్ వాడకపోవచ్చు. మోమోస్ సాసులను చాలా సార్లు పాతవి, కొత్తవి కలుపుతారు. పాత వాటిలో వేరే ఆహార పదార్థాలు చేరితే అక్కడ, బాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
పానీ పూరీ వంటివి ఇంకా ప్రమాదం. నీరు అతి ముఖ్యమైన కారణం.
‘‘ఒక విషయం మాత్రం స్పష్టం. వేడి పదార్థలతో రిస్కు తక్కువ. చల్లబడిన వాటితో రిస్కు ఎక్కువ. మొత్తంగా ఆహారం చుట్టూ రిస్కు అయితే ఉంటుంది.’’ అన్నారు డాక్టర్ లహరి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














