జపాన్‌ ఎన్నికలు: పార్లమెంటులో మెజార్టీ కోల్పోయిన అధికార పార్టీ

జపాన్ ఎన్నికలు, షిగెరు ఇషిబా, జపాన్ ప్రధానమంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా
    • రచయిత, షైమా ఖలీల్, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

జపాన్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) పార్లమెంట్‌లో తన మెజార్టీ కోల్పోయింది. దశాబ్ద కాలంలో ఆ పార్టీకి ఇదే అత్యంత దారుణమైన ఫలితం.

ప్రతినిధుల సభలో ప్రతిపక్షాలు సగం కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్నాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 233 సీట్లు సాధించాలి. కానీ, ఎల్‌డీపీ నేతృత్వంలోని కూటమి 215 సీట్లకే పరిమితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

సెప్టెంబర్‌ చివర్లో ఎల్‌డీపీ నూతన నాయకుడిగా షిగేరు ఇషిబా ఎంపికైన మూడు రోజుల తరువాత, ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన ఎన్నికలకు పిలుపునిచ్చారు.

“ఓటర్లు మా పట్ల కఠినమైన తీర్పునిచ్చారు. అయినప్పటికీ, ఈ ఫలితాన్ని వినయంగా అంగీకరించాల్సిందే” అని ఆయన అన్నారు.

పొలిటికల్ ఫండ్‌ రైజింగ్ కుంభకోణం వెలుగు చూసిన తరువాత ఈ ఏడాది మొదట్లో సర్వేల్లో ఎల్‌డీపీ పార్టీకి 20 శాతం కంటే తక్కువ ఆమోదం లభించింది.

అయినప్పటికీ, ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వాన్ని నడపడానికి తాము సమర్థులమని ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో వెనుకబడ్డాయి.

పార్లమెంట్ రద్దు కంటే ముందు ప్రధాన ప్రతిపక్షానికి కేవలం 6.6 శాతం మద్దతే లభించింది.

“ఏ పార్టీని ఎంచుకోవాలి అన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. దీనిపై ప్రజలు క్రమంగా ఆసక్తి కోల్పోతున్నారు” అని దీర్ఘకాలంగా ఎల్‌డీపీకి మద్దతుదారులుగా ఉన్న మియుకి ఫుజిసాకి ఎన్నికల ప్రారంభానికి ముందు బీబీసీకి చెప్పారు. ఆమె కేర్-హోమ్ రంగంలో పని చేస్తున్నారు.

అవినీతి ఆరోపణలతో ఎల్‌డీపీ సతమతమవుతోంది. కానీ, ప్రతిపక్షాలు కూడా ప్రత్యామ్నాయం చూపించలేకపోయాయని ఆమె అన్నారు.

“ప్రతిపక్షాలు బలంగా ఆరోపణలు చేయగలవు. అంతమాత్రాన, వాళ్లు ఏం చేయగలమో క్లారిటీగా చెప్పినట్లు కాదు” అని ఆమె అన్నారు.

జపాన్‌లో ఓట్ల లెక్కింపు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్‌లో ఓట్ల లెక్కింపు

గత కొన్ని నెలల్లో జపాన్‌ రాజకీయాల్లో వేడి పెరిగింది.

2021 నుంచి ప్రధాని పదవిలో ఉన్న ఫుమియో కిషిడా ఈ ఏడాది ఆగస్టులో పదవి నుంచి దిగిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత అధికార పార్టీ మెజార్టీ సభ్యుల మద్దతుతో షిగేరు ఇషిబా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన బాధ్యతలు చేపట్టాక, నెల కూడా పూర్తి కాకముందే ఎన్నికల్లో అధికార పార్టీ ఘోర పరాజయం పాలైంది.

“ఇది ప్రజల తీర్పు” అని గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన ఇషిబా అభివర్ణించారు.

వరుస కుంభకోణాలతో అధికార పార్టీ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ వివాదాల్లో ప్రధానమైనది యూనిఫికేషన్ చర్చ్‌తో పార్టీ సంబంధాలు. విమర్శకులు దీనిని ‘కల్ట్’ గా చెబుతున్నారు.

ఆ తరువాత వెలుగు చూసింది పొలిటికల్ ఫండ్ రైజింగ్ కుంభకోణం. ఈ కేసులో డజన్ల కొద్ది ఎల్‌డీపీ నాయకులు న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ కుంభకోణం విలువ లక్షల డాలర్లు ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.

“అధికార పార్టీ ఎంతో దయనీయమైన స్థితిలో ఉంది” అని టోక్యో శివార్లలోని ఉరావా స్టేషన్‌ వద్ద నిర్వహించిన ప్రతిపక్ష ప్రచార ర్యాలీ సందర్భంగా మిచికో హమాదా ఈ వ్యాఖ్యలు చేశారు.

జపాన్‌లో ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ కుంభకోణం వెలుగుచూడటం దారుణమని మిచికో హమాదా అన్నారు.

మూడు దశాబ్దాలుగా వేతనాల్లో మార్పులు పెద్దగా లేవు. కానీ, గడిచిన అర్ధ శతాబ్దంలో గత 2 ఏళ్లలోనే ధరలు అత్యంత వేగంగా పెరిగాయని ఆమె చెప్పారు.

ఈ నెలలోనే వేలాది ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అంతేకాకుండా ఔషధాలు, విద్యుత్, గ్యాస్ వంటి రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగాయి.

ప్రస్తుత ధరలు చూస్తుంటే తాను పార్ట్ టైమ్ వర్క్ చేయాల్సిందేనని పెన్షనర్ చియే షిమిజు అంటున్నారు.

“గంటకు ఇచ్చే వేతనం కొద్దిగా పెరిగింది. కానీ, అది పెరుగుతున్న ధరలకు ఏ మాత్రం సరిపోవడం లేదు” అని ఆమె బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)