మోదీ,షీ జిన్‌పింగ్ సమావేశం: భారత్, చైనా ప్రకటనలలో వ్యత్యాసం ఎందుకు ఉంది?

మోదీ-షీ జిన్‌పింగ్ సమావేశం

ఫొటో సోర్స్, Getty Images

ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలోని కజాన్‌లో సమావేశమయ్యారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ఇటీవల సాధించిన పురోగతిపై ఇరువురు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.

భారత్, చైనా పురాతన నాగరికతలున్న దేశాలని, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా కలిసి పనిచేసుకోవాలని షీ జిన్‌పింగ్ అన్నారు.

ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న ఇరు దేశాలు పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్త్వంతో ముందుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రకటనలలో వ్యత్యాసం

మోదీ,షీ జిన్‌పింగ్ సమావేశం కావడానికి ముందు, చైనాతో ఉన్న సరిహద్దులో బలగాల గస్తీపై ఒక ఒప్పందానికి వచ్చినట్లు భారత్ ప్రకటించింది.

అయితే, సరిహద్దు వివాదం విషయంలో ఇరు దేశాలు ఎలాంటి పరిష్కారానికి రాలేకపోయాయని తాజాగా తెలిసింది. ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్‌ సమావేశం తర్వాత, ఇరు దేశాలు జారీ చేసిన ప్రకటనలలో చాలా వ్యత్యాసం కనిపించింది.

ఒకే సమావేశంపై రెండు దేశాలు జారీ చేసిన ఈ భిన్నమైన ప్రకటనలు.. ఇరు దేశాల ఆలోచనా విధానాన్ని, ప్రాధాన్యాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తున్నాయి.

భారత్, చైనా దేశాల ప్రకటనలు ఏళ్ల తరబడి ఒకేలా ఉన్నాయని, వాటిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

మోదీ, జిన్‌పింగ్ సమావేశం

ఫొటో సోర్స్, @narendramodi

‘సరిహద్దే అసలు సమస్య’

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి తీసుకురాలేమని భారత్ అంటుండగా.. ఈ వివాదం ఇతర అంశాలపై ప్రభావం చూపకూడదని, వాణిజ్య సంబంధాలు కొనసాగాలని చైనా కోరుకుంటోంది. అయితే సరిహద్దులో శాంతి నెలకొల్పితేనే సంబంధాల్లో ఆప్యాయత ఉంటుందనేది భారత వాదన.

ఒక్క వివాదం వల్ల, రెండు దేశాల మధ్య ఇతర సంబంధాలను నిలిపివేయకూడదని ఇరు దేశాలు అంగీకరించినట్లు షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమైన తర్వాత చైనా పేర్కొంది.

ఇదే సమయంలో, రెండు దేశాల మధ్య వివాదాలను, వ్యత్యాసాలను సక్రమంగా పరిష్కరించుకోవాలని భారత్ నొక్కి చెబుతోంది.దీంతో పాటు, ఏ పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో శాంతికి భంగం వాటిల్లకూడదని ప్రధాని మోదీ అన్నారు. స్థిరమైన, స్నేహపూర్వకమైన సంబంధాలు ఇతర విషయాల్లోనూ అనుకూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బహుళ ధ్రువ ప్రపంచమా? బహుళ ధ్రువ ఆసియానా?

చైనా కూడా తన ప్రకటనలో సరిహద్దును ప్రస్తావించింది కానీ, దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ముమ్మరంగా చర్చలు జరిపిన తర్వాత, సరిహద్దు వివాద పరిష్కారంలో తాజాగా సాధించిన పురోగతిని ఇరు దేశాలు కొనియాడాయి.

సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలనే ఒప్పందాలను ప్రధాని మోదీ స్వాగతిస్తున్నారని భారత్ చెప్పింది. సరిహద్దు అంశానికి భారత్ తొలి ప్రాధాన్యం ఇచ్చింది.

చైనా తన ప్రకటనలో బహుళ ధ్రువ ప్రపంచాన్ని మూడుసార్లు ప్రస్తావించింది. కానీ, ఎక్కడా భారత్‌లాగా బహుళ ధ్రువ ఆసియా గురించి పేర్కొనలేదు. అమెరికా ఆధిపత్య ప్రపంచాన్ని చైనా నిరాకరిస్తుండగా.. ఆసియాలో చైనా ఆధిపత్యం పెరుగుతోందని భారత్ భావిస్తోంది. అందుకే బహుళ ధ్రువ ఆసియా గురించి భారత్ మాట్లాడుతోంది.

‘‘బహుళ ధ్రువ ప్రపంచం కోసం రెండు దేశాలు పనిచేయాలి. ఇందుకు ప్రధాని మోదీ కూడా అనుకూలంగా ఉన్నారు’’ అని చైనా తన ప్రకటనలో చెప్పింది.

ఇరు దేశాల నేతలు బహుళ ధ్రువ ప్రపంచానికి,ఆసియాకు అనుకూలంగా ఉన్నారని భారత్ చెప్పింది. మరోవైపు, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన దేశంగా చైనా తనకు తాను అభివర్ణించుకుంటోంది కానీ భారత్ దీనిని గుర్తించడం లేదు.

బ్రిక్స్ సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షీ జిన్‌పింగ్, పుతిన్, మోదీ

చైనా,భారత్ సంబంధాలలో ఎత్తుపల్లాలు

1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను మావో జెడాంగ్ స్థాపించారు. 1950 ఏప్రిల్ 1న ఆ దేశాన్ని భారత్ గుర్తించి, దౌత్య సంబంధాలను ప్రారంభించింది. చైనాకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి కమ్యూనిస్టుయేతర దేశం ఇండియానే.

1954లో టిబెట్‌పై చైనా సౌర్వభౌమత్వాన్ని భారత్ గుర్తించింది. అంటే, చైనాలో టిబెట్ భాగమని భారత్ అంగీకరించిందని అర్థం. ‘హిందీ-చినీ, భాయ్-భాయ్’ అనే నినాదం కూడా అప్పట్లో బాగా వినిపించేది.

1954 జూన్ నుంచి 1957 జనవరి మధ్య కాలంలో, చైనా తొలి ప్రధానమంత్రి జౌ ఎన్‌లై నాలుగుసార్లు భారత్‌ను సందర్శించారు. 1954 అక్టోబర్‌లో నెహ్రూ చైనాకు వెళ్లి వచ్చారు.

చైనాలో నెహ్రూ పర్యటనలపై అమెరికా వార్తా పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడిన తర్వాత ఒక తొలి కమ్యూనిస్టుయేతర ప్రధానమంత్రి ఆ దేశాన్ని సందర్శించారని తన కథనంలో పేర్కొంది.

విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్ల మేర చైనా ప్రజలు చప్పట్లు కొడుతూ నెహ్రూకు స్వాగతం పలికారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ పర్యటనలో నెహ్రు మావోను కూడా కలిశారు.

మరోపక్క టిబెట్‌ను ఆక్రమించుకోవడంలో చైనా దూకుడు పెంచింది. 1950లో టిబెట్‌పై చైనా దాడి చేసి, దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దాడి ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితులన్నింటిన్నీ మార్చేసింది. చైనా ఆక్రమణకు ముందు టిబెట్‌‌కు చైనాకంటే భారత్‌తోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఆ తరువాత టిబెట్ ఏనాడూ స్వతంత్రదేశంగా లేదు.

1950 మధ్యకాలం నుంచి భారత్ భూభాగాలను కూడా చైనా ఆక్రమించుకోవడం ప్రారంభించింది. 1957లో అక్సాయ్ చిన్ గుండా పశ్చిమం దిశగా 179 కి.మీల రోడ్డును చైనా నిర్మించింది. సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య 1959 ఆగస్టు 25న తొలిసారి ఘర్షణలు చెలరేగాయి.

ఈ ఏడాది అక్టోబర్‌ 21న లడఖ్‌లోని కాంగ్‌కాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో 17 మంది భారత సైనికులు మృతి చెందారు. ఆత్మ రక్షణలో భాగంగానే తాము ఈ కాల్పులు జరిపినట్లు చైనా చెప్పింది.

తమ సైనికులపై అకస్మాత్తుగా దాడి జరిగిందని భారత్ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)