బ్రిక్స్‌లో పాకిస్తాన్ ప్రవేశాన్ని భారత్ అడ్డుకుందా, మోదీ మాటలు చైనా, రష్యాలకు ఇబ్బంది కలిగించాయా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జోహన్నెస్‌బర్గ్‌లో ఆమోదించిన ప్రక్రియ, సూత్రాన్ని అనుసరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సమావేశంలో అన్నారు.

బ్రిక్స్‌లో సభ్యత్వం కోసం రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ 2023 నవంబర్‌లో దరఖాస్తు చేశారు. పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఉంది. రష్యా కూడా సానుకూలంగా ఉంది.

గత నెలలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాఖ్ దార్‌తో కలిసి రష్యా ఉప ప్రధాని అలెక్సీ ఓవర్‌చుక్ మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం సంతోషంగా ఉంది. బ్రిక్స్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) స్నేహ పూర్వక సంస్థలు. బ్రిక్స్‌లో పాకిస్తాన్ సభ్యత్వానికి మేం మద్దతు ఇస్తున్నాం’’ అని తెలిపారు.

బ్రిక్స్‌ను 2006లో స్థాపించారు. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు సభ్య దేశాలుగా ఉండేవి. దక్షిణాఫ్రికా 2011లో చేరింది. ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ 2024లో సభ్యత్వం పొందాయి. సౌదీ అరేబియాను కూడా ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఆహ్వానించారు, ఇంకా కుదరలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిక్స్‌లో పాకిస్తాన్‌ను చేర్చాలని రష్యా, చైనాలు ఆశించాయి.

అందరి ఆమోదం కావాలి: మోదీ

బ్రిక్స్‌లో సభ్యత్వాన్ని భారత్ అంగీకరించదనే విషయం బహుశా పాకిస్తాన్‌ ముందే ఊహించే ఉంటుంది. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చేసిన వ్యాఖ్యలను బట్టి ఇది స్పష్టమైంది.

బ్రిక్స్‌లో కొత్త సభ్యులను భారత్ స్వాగతిస్తోందని, అయితే దానికి సంబంధించిన ప్రతి నిర్ణయం ఏకగ్రీవంగా జరగాలని మోదీ అన్నారు.

బ్రిక్స్ వ్యవస్థాపక దేశాలలో భారత్ ఒకటి. ఏదైనా కొత్త సభ్యుడిని చేర్చుకోవడానికి భారత్ సమ్మతి అవసరం. ఈ క్రమంలోనే బ్రిక్స్‌ విస్తరణపై భారత్‌ వైఖరిని మోదీ స్పష్టం చేశారు.

‘’జోహన్నెస్‌బర్గ్‌లో మనం ఆమోదించిన ప్రక్రియ, సూత్రాన్ని అనుసరించాలి'’ అని నరేంద్ర మోదీ అన్నారు.

బ్రిక్స్‌లో చేరేందుకు 30కి పైగా దేశాలు ఆసక్తి చూపాయి. వీటిలో పాకిస్తాన్, శ్రీలంక, తుర్కియే, మలేషియా, అజర్‌బైజాన్, కొలంబియాలు ఉన్నాయి.

పాకిస్తాన్ విషయానికొస్తే.. భారత్‌తో ఈ దేశానికి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు లేవు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా బాగా లేవు. రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చైనాకు విధేయత చూపే దేశాలను బ్రిక్స్‌లో చేర్చుకోవడాన్ని భారత్ నిరాకరిస్తోంది. చైనా ఆధిపత్యం ఉన్న వేదికగా బ్రిక్స్‌ మారడం భారత్‌కు ఇష్టం లేదు.

భారత్‌-చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గుముఖం పడుతోందని, దీంతో పాకిస్తాన్‌కు బ్రిక్స్‌ మార్గం సులభమవుతుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్‌ తన కథనంలో పేర్కొంది. చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు బాగుంటే భారత్‌ను ఒప్పించవచ్చని పాకిస్తాన్ భావిస్తోందని తెలిపింది.

బ్రిక్స్‌లోకి యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిక్స్‌లో యూఏఈ సభ్యత్వం పొందింది.

పాకిస్తాన్‌ను ఎవరు అడ్డుకున్నారు?

పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ "పాకిస్తాన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం" అని అన్నారు.

కజాన్ సమ్మిట్‌లో బ్రిక్స్ భాగస్వామ్య దేశాలను కూడా ప్రకటించారు. అందులో పాకిస్తాన్ పేరు లేదు. అల్జీరియా, బెలారస్, బొలీవియా, క్యూబా, ఇండోనేషియా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, తుర్కియే, యుగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాంలను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా చేర్చారు.

బ్రిక్స్ సభ్యత్వం దక్కకపోవడంపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ టీంలోని రాణా అహ్సన్ అఫ్జల్ ఖాన్ స్పందించారు.

"బ్రిక్స్‌లో చేరే విషయంలో పాకిస్తాన్ ఆశావహంగా ఉంది. సమీప భవిష్యత్తులో చేరగలదని నమ్ముతున్నా. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు బ్రిక్స్ వేదిక. రష్యా నుంచి చమురు దిగుమతులను పాకిస్తాన్ పెంచుకోనుంది’’ అని అఫ్జల్ ఖాన్ అన్నారు.

గత ఏడాది సెప్టెంబరులో పాకిస్తాన్ సభ్యత్వానికి రష్యా మద్దతుగా నిలిచినపుడు థింక్ ట్యాంక్ రాండ్ కార్పొరేషన్‌లో ఇండో-పసిఫిక్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మాన్ స్పందిస్తూ "ఇండియాను ఎస్‌సీవోలో రష్యా చేర్చడంతో, పాకిస్తాన్‌ను చైనా చేర్చింది. ఇప్పుడు పాకిస్తాన్‌కు రష్యా మద్దతు ఇస్తోంది. బ్రిక్స్‌లో పాకిస్తాన్ ప్రవేశం ద్వారా చైనా ప్రయోజనం పొందుతుందనేది స్పష్టం" అని తెలిపారు.

బ్రిక్స్‌లో యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియాలను చేర్చడంపై చర్చ జరిగినప్పుడు, చైనా తనకు కావాల్సిన కొత్త సభ్యులను పొందుతోందనే వార్తలొచ్చాయి.

బ్రిక్స్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ప్రసంగంతో చైనా, రష్యాకు అసౌకర్యం?

2023 ఆగస్టులో వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ మాట్లాడుతూ.. “కొత్త సభ్యుల చేరిక చూస్తే చైనా ముద్ర ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా మద్దతుతో బ్రిక్స్‌ను చైనా దూకుడుగా విస్తరిస్తోంది. ఎస్‌సీవోలో భారత్‌ను పాకిస్తాన్‌తోపాటు మాత్రమే చేరడానికి చైనా అనుమతించింది. అలాగే బ్రిక్స్‌లో భారత్‌, చైనాతో పాటు ఇరాన్, సౌదీ రూపంలో ఇపుడు రెండు కొత్త భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు’’ అని అన్నారు.

యూఏఈతో ఇండియాకు ఎటువంటి సమస్యా లేదని చెల్లానీ అన్నారు. అయితే ఇరాన్, సౌదీ అరేబియా కీలక సమయాల్లో చైనాతో ఉంటాయని అభిప్రాయపడ్డారు.

బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం రష్యా, చైనాలను సంతోషపెట్టినట్లు లేదని థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో అయిన తన్వీ మదన్ అభిప్రాయపడ్డారు.

తన్వి మదన్ ప్రకారం.. మోదీ-జిన్‌పింగ్ సమావేశం అందరి దృష్టిని ఆకర్షించాలి కానీ, బ్రిక్స్ ముగింపు ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత్ ఏం కోరుకుంటుందో మోదీ వివరించారు. అదే సమయంలో చైనా, రష్యాలు చేయదల్చుకున్న విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్, జిన్‌పింగ్‌లకు అసౌకర్యంగా ఉండే కొన్ని విషయాలను ప్రధాని మోదీ తన ముగింపు ప్రసంగంలో చెప్పారు.

బ్రిక్స్‌లో మోదీ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోవాలని, బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యులను గౌరవించాలని ప్రధాని మోదీ అన్నారు.

అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల కోసం బ్రిక్స్‌ స్వరం పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సహజంగానే యూఎన్ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ డిమాండ్ చేస్తోంది, కానీ చైనా దానికి మద్దతు ఇవ్వడం లేదు.

భారత్ చర్చలకు, దౌత్యానికి మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని మోదీ అన్నారు. ఉగ్ర‌వాదానికి, దానికి ఆర్థిక సాయం చేసే వారి విషయంలో ఒకే గొంతుతో మాట్లాడాల‌ని అన్నారు. ఇలాంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదన్నారు మోదీ.

26/11 ముంబై దాడితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న లష్కర్‌కు చెందిన సాజిద్ మీర్‌ను ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదిగా ప్రకటించడానికి భారత్ ప్రయత్నించినప్పుడు, చైనా దానిని అడ్డుకుంది.

బ్రిక్స్ విభజించే సంస్థ కాదని, మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అని బ్రిక్స్ నుంచి స్పష్టమైన సందేశం రావాలని ప్రధాని మోదీ సూచించారు.

బ్రిక్స్ ప్రపంచ సంస్థలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదని, వాటి సంస్కరణల కోసం వాదిస్తున్నదని నరేంద్ర మోదీ అన్నారు.

రష్యా, చైనాలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలను పాశ్చాత్య అనుకూల సంస్థలుగా పిలుస్తాయి. అటువంటి పరిస్థితిలో బ్రిక్స్ వేదికపై నుంచి మోదీ ప్రకటన జిన్‌పింగ్, పుతిన్‌లకు సంతోష పెట్టేదైతే కాదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)