బ్రిక్స్ సదస్సు: మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు, వెల్లడించిన విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్
వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణకు భారత్ -చైనా దేశాలు ఓ అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో, బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బ్రిక్స్ సమావేశాలలో బుధవారంనాడు ద్వైపాక్షి క చర్చలు జరుగుతాయని నేను ధ్రువీకరిస్తున్నాను’’ అంటూ మిస్రీ పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, AFP
బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలోనే భారత్ చైనాల మధ్య ఒక ఒప్పందం జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ సోమవారం వెల్లడించారు.
“2020లో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలకు పరిష్కారం దిశగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి” అని మిస్రీ వెల్లడించారు.
2020లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో రెండు దేశాల వైపు ప్రాణనష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
“వాస్తవాధీన రేఖ వెంట వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి, సైనికుల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించాయి” అని మిస్రీ చెప్పారు.
అయితే, సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న అన్ని పాయింట్స్ నుంచి సైనికుల ఉపసంహరణ జరుగుతుందా? లేదా? అన్న వివరాలు మిస్రీ వెల్లడించలేదు.
బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని మోదీ రష్యాకు బయలుదేరడానికి ఒక్క రోజు ముందు... భారత విదేశాంగ శాఖ సెక్రటరీ ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన చేశారు. బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా.
భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందా? లేదా? అన్న దానిపై మిస్రీ మంగళవారం నాడు స్పష్టత ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్వాన్ లోయ ఘర్షణ తరువాత, అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య సోమవారం (2024 అక్టోబర్ 21న) కీలక పరిణామం చోటు చేసుకుందని మిస్రీ చెప్పారు.
సరిహద్దుల్లో గన్స్, పేలుడు పదార్థాలు ఉపయోగించరాదని 1996లో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గల్వాన్ లోయ ఘర్షణలో సైనికులు కర్రలతో దాడులు చేసుకున్నారు.
ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు గత నాలుగేళ్లుగా ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు ఎన్నోసార్లు చర్చలు జరిపినప్పటికీ, అవి ఒక కొలిక్కిరాలేదు.
2021లో ఉత్తర సిక్కింలో, 2022లో తవాంగ్ సెక్టార్ సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి.
సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు భారత్-చైనా సంబంధాలపై దశాబ్దాలుగా ప్రభావం చూపిస్తున్నాయి. 1962లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది.
ఈ టెన్షన్ వాతావరణం ఇరు దేశాల వాణిజ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తోంది.
భారత్-చైనాల మధ్య సుమారు 3,440 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దు ఉంది.
నదులు, సరస్సులు, మంచు పర్వతాలున్న ఈ సరిహద్దు రేఖ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సరిహద్దు వెంబడి రోడ్లు, వంతెనల నిర్మాణాల్లో రెండుదేశాలూ పోటీపడడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














