షార్ట్ టర్మ్ పాలసీ అంటే ఏంటి, శరీర భాగాలకూ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బోడ నవీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల కాలంలో రకరకాల ఇన్సూరెన్స్ స్కీములు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ ఒకటి. వీటినే షార్ట్‌టర్మ్ పాలసీలు అంటున్నారు. అంటే వీటి కాలవ్యవధి చాలా స్వల్పం.
ఉదాహరణకు రేపు రాబోయే దీపావళికి ఫోన్ పే యాప్ 9 రూపాయల ప్రీమియానికి ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను తీసుకొచ్చింది. దీపావళినాడు బాణాసంచా కాల్చేటప్పుడు గాయాలైతే ఈ పాలసీ కింద 25వేల రూపాయల వరకు కవరేజీ లభిస్తుంది.
ఈ ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ కాలవ్యవధి కేవలం 10 రోజులు. ఇలా ఓ నిర్ణీత వ్యవధికి లోబడి చేసే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ పాలసీలు అంటున్నారు. ఫోన్ పే అందిస్తున్న ప్లాన్‌లో హాస్పిటలైజేషన్, డే-కేర్ ట్రీట్‌మెంట్ సౌకర్యాలతో పాటు ప్రమాదవశాత్తు మరణిస్తే డబ్బులు కూడా వస్తాయి
“9 రూపాయలకు వాళ్లిస్తున్న సౌకర్యాలు మంచివే. కానీ, ఈ తరహా షార్ట్ టర్మ్ పాలసీలు మనల్ని కాపాడే గొప్ప కవచం అని భావించొద్దు” అని హెచ్.సతీశ్ కుమార్ చెప్పారు. ఈయన ‘అష్యూర్ ప్లస్ ఫిన్‌సర్వ్’ వ్యవస్థాపకులు. కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.
“హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌ల గురించి చాలా మందికి తెలుసు. షార్ట్ టర్మ్ పాలసీల గురించి కొద్ది మందికే తెలుసు. వాటి గురించి అవగాహన పొందాకే పాలసీ తీసుకోవాలి” అని సతీశ్ అన్నారు.


ఫొటో సోర్స్, @RailMinIndia/X
షార్ట్ టర్మ్ పాలసీ అంటే..?
సాధారణంగా వారం రోజుల నుంచి ఏడాది లోపు కాలవ్యవధికి తీసుకునే ఇన్సూరెన్స్‌లను ‘షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్’ అంటారు. వీటినే తాత్కాలిక ఇన్సూరెన్స్ అని కూడా అంటారు.
షార్ట్ టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏడాదికి తీసుకుంటారు. ఇప్పుడు ఫోన్‌పే సంస్థ ఇస్తున్నట్లుగా కొన్ని సంస్థలు 3నెలలు, 6 నెలల వ్యవధికి ఇన్సూరెన్స్ ఇస్తుంటాయి. ప్రీమియం తక్కువగా పడుతుందని దీనిని తీసుకోవడానికి కొందరు ఇష్టపడుతుంటారు.
అలాగే, ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక ఇన్సూరెన్స్‌కు మారే క్రమంలో తక్కువ కాల వ్యవధి కోసం ఇలాంటి వాటిని ఆశ్రయిస్తుంటారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్:
ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. 45 పైసలు కడితే, ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా 10 లక్షల రూపాయిలు వస్తాయి.
ఇదే తరహాలో ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి సంస్థలు కూడా తక్కువ మొత్తంలో చార్జ్ చేస్తూ ఆ ప్రయాణానికి ఇన్సూరెన్స్ ఇస్తాయి
అయితే ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరేం కాదు.
“ప్రయాణాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్‌సీటీసీ, ఇతర సంస్థలు నామమాత్రపు చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నాయి. కానీ, భారీ మొత్తంలో విడిగా టర్మ్ ఇన్సూరెన్స్ , హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్న వారికి ఇలాంటి వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే , ఎలాంటి ఇన్సూరెన్స్‌లు లేనివారు ఈ పాలసీలు తీసుకోవడం మంచిదే” అని సతీశ్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద బీమా తప్పనిసరి
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యఖర్చులు, వైకల్యం, మృతి వంటి వాటికి యాక్సిడెంట్ బీమాతో రక్షణ పొందవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఎక్కువగా ఈ కేటగిరికి చెందుతాయి.
“రైళ్లు, విమానాలు, క్యాబుల్లో ప్రయాణించేటప్పుడు మాత్రమే ప్రమాదాలు జరుగుతాయా? ఎక్కడైనా, ఏ విధంగానైనా జరగొచ్చు. కాబట్టి, షార్ట్ టర్మ్ పాలసీలతో పోల్చితే, ఏడాదికి వర్తించే యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం మంచిది” అని బిజినెస్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి కుందవరం చెప్పారు.
“వెయ్యి రూపాయలలోపే ప్రీమియంతో యాక్సిడెంట్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదంలో వైకల్యం కలిగినా, చాలా రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా, అందువల్ల కలిగే ఆర్థిక నష్టం వంటివి యాక్సిడెంట్ పాలసీలో కవర్ అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి కవర్ కావు. కాబట్టి, విడిగా యాక్సిడెంట్ పాలసీ తీసుకోవాలి. ఉద్యోగులు, ఇతర పనుల మీద నిత్యం రోడ్లపైకి వచ్చేవారు ఈ పాలసీ తీసుకోవడం అవసరం” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @SrBachchan/X
అవయవాలకూ ప్రత్యేకంగా బీమా..!
సెలబ్రిటీలు కొందరు తమ అందం, గొంతుతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఇక క్రీడాకారుల్లో కూడా ఒక్కోరకం క్రీడకు ఒక్కో శరీరావయవం కీలకంగా మారొచ్చు. అలాంటి వారికి ప్రమాదవశాత్తు ఆ బాడీ పార్ట్ పని చేయడం ఆగిపోతే వారి ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే ఆ అవయవ వైకల్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటారు.
“ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు తమ శరీర అవయవాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అమితాబ్ బచ్చన్ తన వాయిస్‌కు, సానియా మీర్జా తన చేతులకు బీమా చేయించుకున్నారు” అని సతీశ్ కుమార్ చెప్పారు.
అయితే, బీబీసీ దీన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
“ఎవరైనా సరే సెలబ్రిటీలు తమకు ఉన్న ప్రత్యేకతను చూపించి దానికి ఇన్సూరెన్స్ చేయమని కంపెనీలను సంప్రదించవచ్చు. అప్పుడు, ఆయా కంపెనీలు ఆ సెలబ్రిటీ హోదా, ఆ అవయవాలకు ఉన్న రిస్క్ వంటివి అంచనావేసి ప్రీమియం లెక్కగడతాయి” అని సతీశ్ చెప్పారు.
ఈ బీమాల గురించి తెలుసా?
ఉద్యోగ బీమా..
అనివార్య కారణాల వల్ల అంటే ‘లే ఆఫ్స్’, ‘కంపెనీ మూసివేయడం’ వంటి కారణాలతో అకస్మాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
వివాహ బీమా
ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల గానీ, అనుకోని మరణాల వల్ల పెళ్లి ఆగిపోతే ఈ బీమాతో అప్పటి వరకు పెట్టిన ఖర్చులు భర్తీ చేసుకోవచ్చు.
ప్రయాణ బీమా :
ఈ బీమా వల్ల ప్రయాణంలో అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తినా, లగేజీ చోరీ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, ట్రావెల్ బుకింగ్స్ అన్నీ చేసుకున్నాక చివరి క్షణంలో అనుకోని కారణాల వల్ల పర్యటన రద్దు చేసుకుంటే కూడా రీయంబర్స్ చేసుకోవచ్చు. ఆపరేటర్ ఆ ట్రిప్‌ను రద్దు చేసినా మనం పరిహారాన్ని కోరవచ్చు.
పెంపుడు జంతువులకూ..
పెంపుడు జంతువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అవి అనారోగ్యానికి గురైనా, యాక్సిడెంట్స్ జరిగినా ఈ బీమా ద్వారా రక్షణ పొందవచ్చు.
“ఇంటర్నెట్ యుగంలో ఒక్క క్లిక్‌తో పాలసీ తీసుకోవచ్చు. కానీ, నియమ నిబంధనలు చదివిన తరువాతే పాలసీ తీసుకోవడం ఉత్తమం. సైబర్ మోసాలు కూడా భారీగా జరుగుతున్నాయి కాబట్టి, అధీకృత యాప్స్, వెబ్‌సైట్స్ ద్వారానే పేమెంట్స్ చేయాలి. తక్కువలోనే పాలసీ వస్తుందని ఏ లింక్ అంటే ఆ లింక్‌పై క్లిక్ చేస్తే ఇన్సూరెన్స్ ఏమో గానీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు పోయే ప్రమాదం ఉంది” అని సతీశ్ చెప్పారు.
(గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














