కోయంబత్తూరు: 50 ఏళ్ల కిందట దొంగిలించిన 37 రూపాయలను, భారీ మొత్తంలో వడ్డీతో తిరిగిచ్చిన వ్యాపారవేత్త, అసలేం జరిగిందంటే..

వ్యాపారవేత్త రంజిత్
ఫొటో క్యాప్షన్, కోయంబత్తూర్‌లో వ్యాపారవేత్త రంజిత్ నుంచి డబ్బులు తీసుకుంటున్న పాలనియాంది
    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యాభై ఏళ్ల కిందట తాను దొంగిలించిన డబ్బులను ఇటీవల తిరిగి ఇచ్చారు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త.

ఈ వ్యాపారవేత్త ఎవరు? అసలేం జరిగింది? ఆయన దొంగిలించిన డబ్బెంత? ఇప్పుడు ఎంత ఇచ్చారు?

50 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

అది 1970 మధ్య కాలం. సుబ్రమణ్యం, ఎలువాయి దంపతులు శ్రీలంకలోని నువారా ఎలియా జిల్లాలో మస్కెలియాకు సమీపంలోని అలకోలా ప్రాంతంలో ఉన్న తేయాకు తోటలో పనిచేసేవారు. ఈ దంపతులు తమ ఇంటిని ఖాళీ చేసి, మరో ప్రాంతానికి వెళ్లాలకున్నారు.

ఇంటిని ఖాళీ చేస్తోన్న సమయంలో, వారు తమ ఇంటికి పక్కనే ఉండే రంజిత్ అనే యువకుడి సాయం తీసుకున్నారు. సామాన్లను తరలించేందుకు రంజిత్ వారికి సాయం చేశారు.

పాత ఇంటిలోని ఒక దిండును తీస్తున్న సమయంలో, దాని కింద కొంత డబ్బును చూశారు రంజిత్.

ఆ డబ్బును లెక్కపెడితే రూ.37.50 పైసలు (శ్రీలంక కరెన్సీ) ఉన్నాయి. ఆ సమయంలో రంజిత్‌కు ఉద్యోగం లేదు. దీంతో, ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులను రంజిత్ తీసి, దాచుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ తర్వాత కాసేపటికి, ఎలువాయికి దిండు కింద డబ్బులు పెట్టిన విషయం గుర్తు వచ్చింది.

సామాన్లను కొత్త ఇంటికి తరలించిన తర్వాత, ఆ డబ్బులేమన్నా రంజిత్ చూశారేమోనని ఆ దంపతులు పదేపదే అడిగారు. కానీ, తాను ఆ డబ్బులను తీసుకున్నట్లు రంజిత్ అంగీకరించలేదు.

ఆ సమయంలో తేయాకు తోటల్లో పనిచేసే వారిని పేదరికం వెంటాడేది. రూ.37 కూడా అప్పుడు వారికి పెద్ద మొత్తమే.

ఆ తర్వాత, ఎలువాయి ఒక ఆలయానికి వెళ్లి, దేవుడి వద్ద తన డబ్బులు పోయిన విషయాన్ని చెప్పుకుని బాధపడ్డారు. ఎలువాయితో పాటు ఆ ఆలయానికి రంజిత్ కూడా వెళ్లారు.

ఎలువాయితో పాటు రంజిత్ కూడా దేవుడి వద్ద తన మొరను వినిపించుకున్నారు.

‘‘నేను ఆ డబ్బులు తీశాను. నాకేం జరగకుండా చూడు దేవుడా’’ అని ప్రార్థించారు రంజిత్.

సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులు
ఫొటో క్యాప్షన్, సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులు

తమిళనాడుకు వచ్చిన రంజిత్

రంజిత్ తల్లి మరియమ్మాళ్, తండ్రి పళనిచామి. ఇద్దరూ శ్రీలంకలోని ఎత్తయిన ప్రాంతాలలో తేయాకు తోటల్లో కార్మికులుగా పనిచేశారు.

రంజిత్‌ది చాలా పెద్ద కుటుంబం. ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు. పేదరికంతో రంజిత్ రెండో తరగతికి మించి చదువుకోలేకపోయారు.

1977లో రంజిత్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు, పనిచేసుకుని బతకడం కోసం తమిళనాడుకు వచ్చారు.

ఇంట్లో నుంచి కొంత బంగారాన్ని ఆయన వెంట తెచ్చుకున్నారు.

తమిళనాడుకు వచ్చిన తర్వాత, మొదట్లో ఇబ్బంది పడినప్పటికీ క్రమంగా తన పరిస్థితి మెరుగుపడిందని రంజిత్ గుర్తు చేసుకున్నారు.

‘‘మా ఇంట్లోంచి తీసుకొచ్చిన బంగారాన్ని అమ్మాను. ఆ డబ్బులతో డబ్బా కొట్టు పెట్టాను. అందులో నష్టం వచ్చింది. మళ్లీ వీధుల్లోకి వచ్చాను. ఆ తర్వాత టేబుల్ తుడిచే వ్యక్తిగా, రెస్టరెంట్లలో రూమ్ బాయ్‌గా పనిచేశాను. బస్టాండులో సేల్స్‌మాన్‌గా కూడా పనిచేశాను. ఏ ఉద్యోగం కూడా ఎక్కువ కాలం చేయలేకపోయాను. ఆ తర్వాత మెల్లమెల్లగా వంట చేయడం నేర్చుకున్నా. కొద్దికాలంలోనే అందులో మంచి నైపుణ్యం సాధించాను. తర్వాత చిన్న స్థాయి కేటరింగ్ కంపెనీ పెట్టాను. ఇప్పుడది 125 మంది పనిచేసే పెద్ద కంపెనీగా మారింది’’ అని చెప్పారు రంజిత్.

నువారా ఎలియా తేయాకు తోటలు

రుణాలు తిరిగి చెల్లించాలనుకున్న రంజిత్

ఓసారి తన ఆరోగ్యం బాలేనప్పుడు బైబిల్ చదివానని, అందులో ‘‘దుష్టులు అప్పు తీర్చలేరు, నీతిమంతులు అప్పులను తిరిగి చెల్లిస్తారు’’ అనే వాక్యం తనను ఆలోచింపజేసిందని రంజిత్ చెప్పారు.

‘‘ఆ తర్వాత ఎవరి దగ్గర్నుంచైనా చిన్న మొత్తంలో డబ్బులు తీసుకున్నా సరే, మాట ప్రకారం వారికి ఇచ్చేసేవాడిని. బ్యాంకుకు చెల్లించలేకపోయిన రూ.1500ను, చాలా ఏళ్ల తర్వాత తిరిగి కట్టేశాను. కానీ, ఆ వృద్ధ దంపతుల నుంచి దొంగిలించిన 37.50 రూపాయలను మాత్రం ఇన్నాళ్లూ ఇవ్వలేకపోయాను’’ అని రంజిత్ చెప్పారు.

‘‘ఆ వృద్ధ దంపతుల్లో అమ్మమ్మ (ఎలువాయి) చనిపోయారని తెలిసింది. దాంతో, ఆ డబ్బును తిరిగి ఆమె వారసులకు ఇవ్వాలనుకున్నా. శ్రీలంకలోని నా స్నేహితుల ద్వారా వారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా’’ అని రంజిత్ చెప్పారు.

పాలనియాంది

రూ.37.50 తిరిగి ఇచ్చేసిన రంజిత్

సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులకు ఆరుగురు పిల్లలు. వారిలో ముగ్గురు మురుగయ్య, పాలనియాంది, కృష్ణన్ కొడుకులు. వీరమ్మాళ్, అజగమ్మాళ్, సెల్లమ్మాళ్ అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

ముగ్గురు కొడుకుల్లో మురుగయ్య చనిపోయారు. ఆయనకు భార్య, నలుగురు కొడుకులు ఉన్నారు.

పాలనియాంది కొలంబో నగరానికి సమీపంలో ఉంటున్నారు. కృష్ణన్ నువారా ఎలియాకు దగ్గర్లోనే ఉంటున్నారు.

రంజిత్ వీరికి ఫోన్ చేశారు. సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులకు ఇవ్వాల్సిన డబ్బులను వారి పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

2024 ఆగస్టులో కొలంబో వెళ్లిన రంజిత్, ఒక రెస్టరెంట్లో సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను కలిశారు.

1970ల్లో జరిగిన సంఘటన గురించి వారికి చెప్పారు. వారి కోసం తీసుకొచ్చిన కొత్త బట్టలను ఇచ్చారు. ఆ తర్వాత, తాను దొంగిలించిన రూ.37.50 మాత్రమే కాక, మురుగయ్య, పాలనియాంది, కృష్ణన్‌లకు ఒక్కొక్కరికీ రూ.70 వేల చొప్పున శ్రీలంక కరెన్సీని ఇచ్చారు.

సుబ్రమణ్యం-ఎలువాయి కుటుంబానికి ఇది ఆశ్చర్యకరంగా అనిపించింది.

రంజిత్ నుంచి డబ్బులు పొందుతున్న సుబ్రమణ్యం-ఎలువాయి దంపతుల కుటుంబం
ఫొటో క్యాప్షన్, రంజిత్ నుంచి డబ్బులు తీసుకుంటున్న సుబ్రమణ్యం-ఎలువాయి కుటుంబ సభ్యులు

ఇంకా షాక్‌లోనే సుబ్రమణ్యం కొడుకులు

కొలంబోలో నివసిస్తున్న పాలనియాంది మాట్లాడుతూ.. ‘‘ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అనే దానిపై ఆశ్చర్యం వేసింది. ఆయన తిరిగి వచ్చి, మా చిరునామా కనుక్కొని మా డబ్బులు తిరిగి ఇచ్చారు. మాకు సంతోషాన్ని కలిగించారు. ఈ సమయంలో ఈ డబ్బులు మాకెంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నా చిన్న తమ్ముడు, ఆయన భార్యకు చాలా అవసరం ఉంది. వారికి చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.

ఆ డబ్బులు పోయాయన్న విషయం కనీసం తమకు తెలియదన్నారు. ‘‘12 నుంచి 13 ఏళ్ల వయసున్నప్పుడు నేను కొలంబో వచ్చాను. ఆ సమయంలో ఏం జరిగిందో మాకు తెలియదు. రంజితే ఈ డబ్బులు తీసుకున్నారని మా అమ్మకు తెలిసి ఉండకపోవచ్చు. ఎవరికీ ఈ విషయం తెలిసి ఉండదు’’ అని పాలనియాంది అన్నారు.

సెల్లమ్మాళ్ కుటుంబం తిరుచ్చికి సమీపంలో ఉంటుందని, వారికి కూడా కొంత డబ్బు పంపుతానని రంజిత్ చెప్పారు.

ఆ డబ్బులను తిరిగి ఇచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని రంజిత్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)