9ఏళ్ల నుంచి నకిలీ కోర్టును నడుపుతూ, జడ్జీలా తీర్పులు ఇస్తూ.. చివరకు ఈ మోసం ఎలా బయటపడిందంటే..

గుజరాత్, ఫేక్ కోర్టు, ఫేక్ జడ్జ్, మోరిస్ శ్యాముల్ క్రిస్టియన్‌

ఫొటో సోర్స్, Bhargav Parikh

ఫొటో క్యాప్షన్, నకిలీ కోర్టు ఏర్పాటుచేసి నకిలీ తీర్పులు ఇచ్చిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్
    • రచయిత, భార్గవ పారిఖ్
    • హోదా, బీబీసీ కోసం

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఓ షాపింగ్ సెంటర్ ఉంది. ఇరుకైన మెట్ల మీద ఉదయం నుంచి కూర్చుని ఉన్న ప్రజలు తమవంతు కోసం వేచి చూస్తున్నారు. కోర్టు బంట్రోతు వచ్చి పిలవడంతో అక్కడున్న వారంతా తమ న్యాయవాదులతో లోపలికి వెళుతున్నారు. ఓ వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చొని వాదనలు వింటూ, తీర్పులు ఇస్తున్నారు.

కోర్టులో ఎలా జరుగుతుందో అచ్చం ఇక్కడ కూడా అలాగే జరుగుతోంది.

కానీ, సాయంత్రానికి మొత్తం మారిపోతుంది. కోర్టు వేళలు ముగిసిన తరువాత, ఓ క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు న్యాయమూర్తి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒక వేళ ఆ డీల్ కుదిరితే ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు వస్తుంది.

ఈ కథ సినిమా స్టోరీలా ఉంది కదా..! కానీ, ఇది నిజం. గాంధీనగర్‌లో నకిలీ న్యాయస్థానం నడుపుతూ మధ్యవర్తిత్వ కేసుల్లో తీర్పులు ఇస్తున్న నకిలీ న్యాయమూర్తిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్టోబర్ 22 మంగళవారం పోలీసులు నకిలీ న్యాయమూర్తి మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తానో మధ్యవర్తిత్వ న్యాయమూర్తినని శామ్యూల్ క్రిస్టియన్ జడ్జీకి తెలిపారు. పైగా నేరం చేసినట్టు ఒప్పుకోవాలని పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో మోరిస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

నకిలీ కోర్టు నడుపుతూ ప్రజలను ఎలా మోసం చేశారనే అంశంపై ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులు, పోలీసులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోసాలు, కుట్ర, ప్రజలు , గాంధీనగర్

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, మోరిస్ నడిపే నకిలీ న్యాయస్థానంలోకి వెళ్లేందుకు ప్రజలు ఇక్కడే బారులు తీరేవారు

ఒక్క ఏడాదిలో 500 తీర్పులు

గత 9 ఏళ్లుగా నకిలీ న్యాయస్థానాన్ని మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ నిర్వహిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మోరిస్ న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ ఉన్నట్టు చెప్పుకున్నారు. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ భూవివాద కేసుల్లో తనను ఆర్బిట్రేటర్(మధ్యవర్తి)గా చెప్పుకున్నారు.

“మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ సబర్మతికి చెందినవారు. కొన్నేళ్ల కిందట గాంధీనగర్‌లో నకిలీ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసు కంప్లైంట్ నమోదవడంతో దానిని వేరే చోటుకు తరలించారు. ప్రస్తుతం గాంధీనగర్‌లోని సెక్టార్-24లో ఈ నకిలీ న్యాయస్థానాన్ని నడుపుతున్నారు” అని అహ్మదాబాద్ జోన్-2 డీసీపీ శ్రీపాల్ శేషమా బీబీసీతో చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం... అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరలోని భూవివాదాలకు సంబంధించి కిందటేడాది సుమారు 500 కేసుల్లో తీర్పులు ఇచ్చినట్లు సిటీ సివిల్ కోర్టులో మోరిస్ ఒప్పుకున్నారు.

‘ఉన్నతాధికారిలా ఉండేవారు’

“మోరిస్ చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేవారు. తెలిసిన వాళ్ల దగ్గరి నుంచి అప్పులు తీసుకుని, వాటిని తిరిగి ఇచ్చేవారు కాదు” అని శామ్యూల్ ఫెర్నాండెజ్ బీబీసీతో చెప్పారు. సబర్మతి ప్రాంతంలోని కబీర్ చౌక్‌కు చెందిన ఈయన అప్పట్లో మోరిస్ ఇంటి చుట్టుపక్కల ఉండేవారు.

“డబ్బులు తీసుకోవడమే తప్పా, తిరిగి ఇవ్వకపోవడంతో సబర్మతిలో అందరూ అతడికి దూరంగా ఉండేవారు. మోరిస్ కుటుంబం కూడా ఇక్కడి నుంచి వేరే ప్రాంతాకి వెళ్లిపోయింది. కొన్నాళ్ల క్రితం మోరిస్‌ను కలిసినప్పుడు తాను విదేశాల్లో చదువుకున్నానని, న్యాయమూర్తిగా పని చేస్తున్నట్లు తెలిపారని” ఫెర్నాండెజ్ చెప్పారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం... మోరిస్ లైఫ్ స్టైల్ ఓ ఉన్నతాధికారిలాగా ఉండేది. కార్లలో తిరిగేవారు, పక్కనే బ్యాగులు మోయడానికి ఓ వ్యక్తి కూడా ఉండేవారు.

గాంధీనగర్, షాపింగ్ కాంప్లెక్స్, మోరిస్

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లోనే మోరిస్ నకిలీ కోర్టును నడిపారు.

నకిలీ కోర్టును ఎలా సృష్టించారు..?

నకిలీ కోర్టు ఎలా ఏర్పాటు చేశారనే విషయంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ తెలిపిన వివరాల ప్రకారం...

కోర్టులపై భారం తగ్గించేందుకు 2015లో ప్రభుత్వం మధ్యవర్తుల(arbitrators) నియామకాలు జరిపింది. ఇందులో భాగంగా ఇరుపక్షాల ఆమోదంతో సెటిల్‌మెంట్‌కు వచ్చిన కేసులు వీరు పరిష్కరిస్తారు.

ఆ సమయంలో ఎక్కడి నుంచో మోరిస్ మధ్యవర్తిగా ఓ సర్టిఫికెట్ సంపాదించారు. అనంతరం గాంధీనగర్‌లోని సెక్టార్-21లో నకిలీ న్యాయస్థానం ఏర్పాటు చేశారు.

ఈ కోర్టులో ఇద్దరు టైపిస్టులను, ఒక బంట్రోతును పెట్టుకుని ..న్యాయమూర్తిలా భూవివాదాలు, బిల్డింగ్ తగాదాల కేసుల్లో తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టారు.

“న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు మధ్యవర్తులను నియమించారు. మధ్యవర్తిత్వం నియమాల్లోని ఆర్టికల్ 7, 89 ప్రకారం ఈ నియమాకాలు జరిగాయి. ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వచ్చిన తరువాత, రాతపూర్వకంగా సెటిల్‌మెంట్ ఎలా చేసుకోవాలో వారికి వివరించడమే ఆర్బిట్రేటర్(మధ్యవర్తి) పని. ఆ లిఖితపూర్వకసెటిల్‌మెంట్‌ను ఇరు పక్షాలు అంగీకరించాలి.అలాగే, వాటిపై ఆర్బిట్రేటర్ సంతకం ఉంటేనే చెల్లుతుంది” అని దీపక్ భట్ బీబీసీతో చెప్పారు. ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ లీగల్ హెడ్ అడ్వకేట్.

“కోర్టుల మాదిరి ఆదేశాలు ఇచ్చే అధికారం ఓ ఆర్బిట్రేటర్‌కు లేదు. ఆర్బిట్రేటర్ ఓ సెటిల్‌మెంట్‌ చేసినప్పటికీ అది కోర్టు ఆమోదిస్తేనే చెల్లుతుంది” అని దీపక్ భట్ చెప్పారు.

“గాంధీనగర్‌ సెక్టార్-21లో మోరిస్ నకిలీ కోర్టు నడుపుతున్నారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీంతో, రాత్రికి రాత్రే సెక్టార్-24కు మోరిస్ మకాం మార్చారు. అంతేకాదు, భవనాన్ని అద్దెకు తీసుకునే ముందే తాను సూచించినట్లుగానే ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని షరతులు విధించేవారు” అని డీసీపీ శ్రీపాల్ చెప్పారు.

డిగ్రీ పట్టా, న్యాయ శాస్త్రం, పీహెచ్‌డీ

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, ‘లా’లో పీహెచ్‌డీ చేసినట్టు చెప్పుకున్న మోరిస్

గతంలోనే ఫిర్యాదు

అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌లో గతంలోనే మోరిస్‌పై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. అంతేకాదు, మణినగర్, చాంద్‌ఖేడాలోనూ ఫిర్యాదులు ఉన్నాయి. తొలుత గుజరాత్ బార్ కౌన్సిల్‌లో ఫిర్యాదు నమోదైంది.

“ఓ సారి మోరిస్‌ను డిగ్రీ గురించి అడిగినప్పుడు, తాను విదేశాలలో న్యాయశాస్త్రం పట్టా పొందానని, ఆ పట్టాతో ఏ దేశంలోనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చని చెప్పారు. అయితే, అంత పెద్ద పట్టా పొందితే సుప్రీం కోర్టు, హైకోర్టులలో ప్రాక్టీస్ చేయకుండా దిగువ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ఎందుకనే సందేహం కలిగింది” అని న్యాయవాది అనిల్ కెల్లా బీబీసీతో చెప్పారు. ఈయన గుజరాత్ బార్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్.

“అలాంటి డిగ్రీలు ఉండవని మాకు తెలుసు. దీంతో, మోరిస్ డిగ్రీ సర్టిఫికెట్ పరిశీలించగా అది తప్పుడు డిగ్రీ అని తేలింది. మేం 2007లో క్రైమ్ బ్రాంచ్‌లో ఆయనపై ఫిర్యాదు చేశాం. ఆ తరువాత ఆయన కోర్టులో కనిపించలేదు. నకిలీ పాస్‌పోర్టు, వీసాల కేసులో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారని తరువాత తెలిసింది. కానీ, ఇలా ఓ నకిలీ న్యాయస్థానాన్నే నడుపుతున్న విషయం మాకు తెలియదు” అని న్యాయవాది అనిల్ కెల్లా చెప్పారు.

మోరిస్ పై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ లో ఫిర్యాదు నమోదైందని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. 2012లో చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్ లో, 2015లో మణినగర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు డాక్యుమెంట్ల విషయంలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

తీర్పు, ఆర్డర్ కాపీ , న్యాయమూర్తి

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, నకిలీ జడ్జీ మోరిస్ జారీ చేసిన ఆర్డర్ కాపీ

ఎలా వెలుగు చూసింది?

అహ్మదాబాద్‌లో పాల్దీలోని ఠాకోర్వాస్‌లో నివసిస్తున్న బాబూ ఠాకూర్ కూలి పనులు చేసేవారు. ఈయనకు పాల్దీలో ఉన్న భూమి విషయంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో వివాదం ఉంది.

“నేను సాధారణ కూలీని. నా భూమి వివాదంలో చిక్కుకుంది. దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేసేంత డబ్బు నా వద్ద లేదు.. అందుకే సాయం కోసం మోరిస్ క్రిస్టియన్‌ను సంప్రదించాను” అని బాబూ ఠాకూర్ బీబీసీతో ఫోన్‌లో చెప్పారు.

“ఆ భూమి విలువ 200 కోట్ల రూపాయలని మోరిస్ మాకు చెప్పారు. నీకు ఆ భూమి ఇప్పిస్తాను కానీ, ఫీజు కింద 30 లక్షలు, డాక్యుమెంట్‌లో ఒక శాతం తనకు ఇవ్వాలని మోరిస్ చెప్పిన దానికి నేను అంగీకరించాను. 2019లో, ఆ భూమి ఇక నాదే అని ఆర్డర్ కాపీ ఇచ్చారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లపై నాతో ఓ న్యాయవాదిగా సంతకం పెట్టించుకున్నారని అహ్మదాబాద్ కలెక్టర్‌ ఆఫీసు వాళ్లు చెబితే తరువాత తెలిసింది. ” ఠాకూర్ చెప్పారు.

“నేను ఈ కేసు చూసినప్పుడు, ఠాకూర్ భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకుందని పేర్కొన్నారు. 8 నుంచి 10 లైన్లతో ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ ఉందనే విషయాలు రాయలేదు. ఆ ఆర్డర్ కాపీ అసలు స్టాంప్ పేపర్‌పైనే లేదు” అని ప్రభుత్వ న్యాయవాది వి.బి. సేథ్ బీబీసీతో చెప్పారు.

“ మేం ఠాకూర్ న్యాయవాది క్రిస్టియానాను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు తాను సివిల్ న్యాయవాదిని కాదని, క్రిమినల్ న్యాయవాదినని కోర్టులో అంగీకరించారు. తానూ, మోరిస్, ఒకే సామాజిక వర్గానికి చెందినవారం కావడంతో తాను ఇలాంటి ఓ నాలుగు కేసులు అంగీకరించినట్టు చెప్పారు. ఇక మోరిస్ క్రిస్టియనాపై పలు క్రిమినల్ ఉన్నట్లు మేం గుర్తించాం” అని వి.బి.సేథ్ చెప్పారు.

ఇలా అన్ని ఆధారాలు చూసిన తరువాత నకిలీ కోర్టును సృష్టించడం, కోర్టు లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, మధ్యవర్తిత్వ అర్హత లేకపోయినా నకిలీ ఉత్తర్వులు జారీ చేయడంపై మోరిస్ క్రిస్టియానాపై కుట్ర, మోసం అభియోగాలపై కేసు నమోదు చేయాలని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జయేష్ చౌతియా ఆదేశాలిచ్చారని వి.బి. సేథ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)