హ్యాకింగ్: పిల్లల మెయింటెనెన్స్ ఎగ్గొట్టేందుకు చీటింగ్ ప్లాన్ వేసి...

ఫొటో సోర్స్, Grayson County Detention Centre
పిల్లలకు చెల్లించాల్సిన మెయింటనెన్స్‌ను ఎగగొట్టేందుకు ఓ వ్యక్తి తాను చనిపోయినట్లు నాటకమాడారు. ఇందుకోసం ప్రభుత్వ డేటాబేస్‌ను హ్యాక్ చేశారు. ఈ కేసులో ఆయనకు ఆరేళ్లకు పైగా జైలు శిక్ష పడింది.
కంప్యూటర్ ఫ్రాడ్, సీరియస్ ఐడెంటిటీ చీటింగ్‌కు పాల్పడినందుకు అమెరికాలోని కెంటకీ ప్రాంతానికి చెందిన జెస్సీ కిఫ్‌కు 81 నెలలు జైలు శిక్ష పడింది.
గత ఏడాది జనవరి నెలలో హవాయి డెత్ రిజిస్ట్రీ సిస్టమ్‌ను తాను యాక్సెస్ చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు.
తన మరణానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఒక ‘కేస్’ను సృష్టించారు. ఆ తర్వాత హవాయి స్టేట్ డెత్ సర్టిఫికేట్ వర్క్‌షీటులో మార్పులు చేశారు. డాక్టర్ డిజిటల్ సంతకాన్ని వాడి తాను మరణించినట్లు ధ్రువీకరించుకున్నారు.
దీంతో చాలా ప్రభుత్వ డేటా బేస్‌లలో ఆయన చనిపోయినట్లుగా రిజిస్టర్ అయ్యింది.
తన పిల్లలకు మెయింటనెన్స్ కింద లక్ష డాలర్లకు పైగా అంటే భారతీయ కరెన్సీలో రూ.83 లక్షలకు పైగా కిఫ్ చెల్లించాల్సి ఉంది. దాన్ని నుంచి తప్పించుకునేందుకు తాను ఈ పని చేసినట్లు కిఫ్ అంగీకరించారు.

తాను దొంగలించిన వైద్యుల, ఉద్యోగుల వివరాలను ఉపయోగించి, ఇతర డెత్ రిజిస్ట్రీ సిస్టమ్స్, కంపెనీల యాక్సెస్‌ను కూడా పొందారు కిఫ్.
ఈ సిస్టమ్‌ల యాక్సెస్ పొంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్లున్న వ్యక్తుల ప్రైవేట్ సమాచారపు డేటాబేస్‌లను దొంగలించారు. వాటిని డార్క్ నెట్‌లోని సైబర్ నేరగాళ్లకు అమ్మకానికి పెట్టారు.
బ్రౌజర్ గుర్తింపు కనిపించకుండా స్పెషల్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటర్నెట్‌లో కొంతభాగాన్ని యాక్సెస్ చేయడమే డార్క్ నెట్. చాలా డార్క్ నెట్ మార్కెట్‌లు చాలా ఉన్నాయి. హ్యాక్ చేసిన ఐటీ సిస్టమ్‌ల డేటాను సైబర్ నేరగాళ్లు ఇక్కడ అమ్ముకుంటుంటారు.
తాను దొంగలించిన సమాచారాన్ని అల్జీరియా, రష్యా, యుక్రెయిన్‌లతో పాటు ఇతర అంతర్జాతీయ కస్టమర్లకు కిఫ్ అమ్మారని కోర్టు గుర్తించింది.
ప్రభుత్వ చట్టాల ప్రకారం కిఫ్ తన శిక్షలో 85 శాతం జైలులో గడపాల్సి ఉంటుంది. అమెరికా ప్రొబేషన్ ఆఫీసు పర్యవేక్షణలో మూడేళ్లు ఉంటారు.
ప్రభుత్వ, కంపెనీల కంప్యూటర్ సిస్టమ్‌లకు దొంగతనం ద్వారా హాని చేసినందుకు, తన పిల్లల మెయింటనెన్స్‌ను ఎగ్గొట్టినందుకు ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,95,758.65 డాలర్లకు అంటే కోటిన్నర రూపాయలకు పైగా చేరుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














