అమెరికాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తే డబ్బులిస్తారా? భారత్‌తో పోల్చితే అక్కడ ప్రచారం ఎలా ఉంటుంది?

యూఎస్ ఎన్నికలు 2024, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెక్‌డొనాల్డ్స్‌లో షెఫ్‌గా మారిన డోనల్డ్ ట్రంప్
    • రచయిత, బోడ నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో ప్రధానంగా కొన్ని రకాల అంశాల చుట్టూ ఎన్నికలు, రాజకీయాలు తిరుగుతుంటాయి. వాటిలో కులం, మతం, ఉచిత పథకాలు వంటివి ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతుంటారు.

మరి, అమెరికాలో ఎన్నికల ప్రచారం ప్రధానంగా దేనిపై నడుస్తుంది? ఎలాంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి?

వీటి గురించి తెలుసుకునేందుకు అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ‘బీబీసీ తెలుగు’ సంప్రదించింది.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వీడియో క్యాప్షన్, చిత్తి బ్రిగేడ్: అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ కోసం పనిచేస్తున్న ఈ మహిళలు ఎవరు?

అమెరికా ఎన్నికలు: ప్రచారంలో కీలక అంశాలేంటి?

భారత్‌లో జాతీయ స్థాయిలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ, ప్రాంతీయ పార్టీలు అనేకం. ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా చాలా ఎక్కువే.

కానీ, అమెరికాలో ఎక్కువగా రెండు రాజకీయ పార్టీల చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఒకటి డెమొక్రటిక్ పార్టీ, ఇంకొకటి రిపబ్లికన్ పార్టీ. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డోనల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.

“విద్య, ఉపాధి, ఆర్థిక ప్రగతి, వైద్య రంగం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో సంస్కరణలు వంటి అంశాల చుట్టే అమెరికాలో ప్రధానంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది” అని లోకేశ్ ఆర్ ఎదారా చెప్పారు.

లోకేశ్ వెస్ట్రన్ మిషిగన్ యూనివర్సిటీలోని మెడిసిన్ విభాగంలో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. గతంలో తానాకు చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

“చాలా సర్వేల్లో ఈ అంశాలపైనే ఓటర్లు ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. పీఈడబ్ల్యూ రీసర్చ్ సెంటర్ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాలు గ్రౌండ్ రియాలిటీని తెలియజేసేలా ఉన్నాయి” అని లోకేశ్ చెప్పారు.

కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్

గ్రూపుల ఆధారంగా ఓట్లు

“భారత్‌లో మాదిరి కులం, మతం గురించి ఇక్కడ బహిరంగంగా ప్రస్తావించరు. కానీ, అంతర్లీనంగా దీని ప్రభావం అయితే కచ్చితంగా ఉంటుంది” ప్రసాద్ జాలాది చెప్పారు.

ఈయన 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. టెక్సస్‌లో ఉండే ప్రసాద్, పర్యావరణ పరిరక్షణకు పనిచేసే ‘సురక్ష’ సంస్థ వ్యవస్థాపకులు.

“క్రైస్తవ మతం, తెల్ల-నల్ల జాతి, దక్షిణాసియా, స్పానిష్ మాట్లాడేవాళ్లు.. ఇలా రకరకాలైన గ్రూపులు ఉంటాయి. అయితే, సభల్లో కాకుండా ప్రైవేట్ మీటింగ్స్‌లో ఫలానా వారు మన గ్రూప్‌కు చెందిన వారు కాబట్టి వాళ్లకు ఓటేయండి అంటూ అభ్యర్థిస్తారు” అని ప్రసాద్ జాలాది చెప్పారు.

ఎన్నికల ప్రచారం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచారానికి వెళ్తే డబ్బులిస్తారా?

అమెరికాలో ఎన్నికల ప్రచారం మూడు రకాలుగా ఉంటుందని ప్రముఖ వైద్య నిపుణులు జంపాల చౌదరి చెప్పారు. జంపాల చౌదరి గతంలో తానా అధ్యక్షులుగా పని చేశారు.

1. క్యాండిడేట్ మీటింగ్స్: ఇక్కడ సభలు ఉంటాయి. కానీ, భారత్‌లో జరిగినట్లు భారీ బహిరంగ సభలు ఉండవు.

2. మీడియా ద్వారా: టీవీల్లో, రేడియాల్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అలాగే.. మెయిల్, పోస్ట్‌ల ద్వారా కూడా తమకు ఓటేయాలని వేడుకుంటారు.

3. డోర్ టు డోర్ క్యాంపెయిన్: ఇందులో భాగంగా ఆయా పార్టీల వలంటీర్లు గడప గడపకు వచ్చి ఓట్ల కోసం అభ్యర్థిస్తుంటారని జంపాల చౌదరి చెప్పారు.

“భారత్‌లో ప్రచారానికి వస్తే బీరు, బిర్యానీలు ఇస్తామని ఆఫర్లు ఇస్తుంటారు. కానీ, ఇక్కడ పార్టీ తరఫున ప్రచారం చేసే వాళ్లకు కనీస సౌకర్యాలైన ఫుడ్, ట్రావెల్ వంటివి మాత్రమే చూస్తారు” అని ప్రసాద్ జాలాది చెప్పారు.

“ఇక్కడ ఎన్నికలను జనాలు పర్సనల్‌గా తీసుకోరు. వారెవరో డబ్బులిస్తారని గానీ, ఒకవేళ ఇచ్చినా తీసుకుందామనే ఆలోచనలో గానీ పెద్దగా ఎవరు ఉండరు" అని అక్కడి ఐటీ ఉద్యోగి ప్రసన్న తెలిపారు. దాదాపు 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ప్రసన్నకు అక్కడ ఓటు హక్కు కూడా ఉంది.

"మహా అయితే ‘ఎర్లీ ఓటింగ్’ వేసే బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం, పోలింగ్ బూత్‌ వరకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం వంటివి మాత్రమే ఆయా పార్టీల వలంటీర్లు చేస్తారు” అని ప్రసన్న చెప్పారు.

కమలా హారిస్, డెమొక్రటిక్ పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్

జనాల నుంచే డబ్బులు తీసుకుంటారు

అమెరికా ఎన్నికల్లో ‘ఫండ్ రైజింగ్ మీటింగ్స్’ చాలా కీలకం అని జంపాల చౌదరి చెప్పారు.

“ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఆయా పార్టీలు ‘ఫండ్ రైజింగ్ మీటింగ్స్’ ఏర్పాటు చేస్తాయి. ఉదాహరణకు డల్లాస్‌లో కమలా హారిస్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని ప్రకటిస్తారు. విరాళాలు ఇచ్చే వారికి ఆ మీటింగ్‌లో హారిస్‌తో కలిసి మాట్లాడటానికి, కలిసి తినడానికి, ఫొటోలు దిగడానికి అవకాశాలు కల్పిస్తారు. ఇలా విరాళాలు సేకరించి ప్రచారానికి వినియోగిస్తారు” అని జంపాల చౌదరి వివరించారు.

“జనాలకు తాయిలాలు ఇవ్వాలని లీడర్లు అనుకోరు. ఎన్నికలు వచ్చాయంటే పార్టీల నుంచి డబ్బులు వస్తాయని ఓటర్లూ ఇక్కడ అనుకోరు” అని మాజీ జర్నలిస్ట్ కృష్ణ మోహన్ దాసరి చెప్పారు. డల్లాస్‌లో ఉండే కృష్ణ మోహన్ అక్కడ వ్యాపారం చేస్తున్నారు.

ఉష చిలుకూరి, జె.డి. వాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉష చిలుకూరి, ఆమె భర్త జేడీ వాన్స్

ప్రాంతీయత చూస్తారా?

డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి.

రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ తెలుగు మూలాలున్న ఉష చిలుకూరి భర్త. ఈ తరుణంలో ‘మనోళ్లు’ అనే ప్రాతిపదికపై ఓటేసేవారు ఉంటారా? అని బీబీసీ తెలుగు అక్కడి వారిని అడిగింది.

దీనికి సమాధానంగా “అల్లుడికి ఓటేయాలా? కూతురుకు ఓటేయాలా?” అన్న సందిగ్ధంలో తెలుగు ఓటర్లు ఉన్నారని ప్రసాద్ జాలాది చమత్కరించారు.

“ఈ కోణంలో చూసి కూడా కొంతమంది ఓటేస్తారు. కానీ, వారి శాతం చాలా తక్కువగా ఉంటుంది. తెల్లజాతి, నల్లజాతి అనేది కూడా ఇక్కడ ప్రధానం. తనకు మద్దతునిచ్చినట్లుగానే నల్లజాతి మహిళ అయిన కమలా హారిస్‌కు మద్దతునివ్వాలంటూ ఒబామా ప్రచారంలోకి దిగారు. ‘మన’ అనే భావన ఏ దేశ ఎన్నికల్లో అయినా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో కూడా అంతే..” అని ఆయన అన్నారు.

యూఎస్ ఎన్నికలు 2024, ఓటు హక్కు, ఎర్లీ ఓటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎన్నికల ప్రక్రియలో కొన్ని తేడాలు

అమెరికాలో మూడు రకాలుగా ఓటు వేయవచ్చు. అవి, ఎన్నికల రోజు నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం, అబ్సెంటీ ఓటింగ్ త్రూ మెయిల్, ఎర్లీ ఓటింగ్ ఇన్-పర్సన్.

భారత్‌లో 5 ఏళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అంతేకానీ, ఖచ్చితంగా ఫలానా రోజుల్లోనే లేదా ఫలానా నెలలోనే జరగాలనే సంప్రదాయమేమి లేదు.

అమెరికాలో మాత్రం అలా కాదు, నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా నవంబర్‌లో తొలి సోమవారం తరువాత వచ్చే రోజు (మంగళవారం) ఎన్నికలు జరుగుతాయి. 1845 నుంచి ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఈ స్వతంత్ర సంస్థకు సర్వ అధికారాలు ఉంటాయి.

అమెరికాలో ఎన్నికల నిర్వహణను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (ఎఫ్‌ఈసీ), యూఎస్ ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ (ఈఏసీ)లు చూసుకుంటాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తేడాలే కనిపిస్తాయి.

“మనం భారత్‌కు చెందిన వాళ్లం కాబట్టి మన దేశంతో పోల్చుకుంటాం. అది సహజం. కానీ, అది సరికాదు. ఎందుకంటే, అమెరికా ప్రజాస్వామ్య ప్రస్థానం మొదలై 240 ఏళ్లు దాటింది. భారత్ ప్రస్థానం 77 ఏళ్లు మాత్రమే. అమెరికా స్థాయికి చేరుకోవడానికి సమయం పడుతుంది. అన్ని రంగాల్లో అమెరికాతో పోటీ పడే మనం.. ఎన్నికలను చూసే కోణం, నిర్వహణలోనూ పోటీపడాల్సిన అవసరం ఉంది” అని ప్రసాద్ జాలాది సూచించారు.

వీడియో క్యాప్షన్, జార్జియా: ఈ రాష్ట్రంలో కమలకు దూరమవుతున్న నల్లజాతీయులు ట్రంప్‌కు దగ్గరవుతున్నారా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)