సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోతే ప్రపంచం ఆగిపోతుందా, వాటిని ఎలా రిపేర్ చేస్తారు?

కేబుల్ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్ర గర్భంలో పరిచే ఇంటర్నెట్ కేబుళ్లు ఇవే...
    • రచయిత, విల్లియం పార్క్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ప్రపంచంలో 99% డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ సముద్ర గర్భంలోని కేబుళ్లపై ఆధారపడి ఉంది. ఒకవేళ, ఇవి తెగిపోతే, ప్రపంచం స్తంభించిపోతుందా..? సముద్ర గర్భంలో ఉన్న ఈ కేబుళ్లలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా బాగు చేస్తారో తెలుసా?

భూగోళంపై విస్తరించిన ఉన్న మహాసముద్రాలన్నింట్లో కలిపి సుమారు 14 లక్షల కి.మీల పొడవైన టెలికమ్యూనికేషన్స్ కేబుళ్లు ఉన్నాయి.

వాటిని సరళరేఖగా పేరిస్తే సూర్యుని వ్యాసం అంత పొడవు కనిపిస్తాయి. ఇంత పొడవుండే ఈ కేబుళ్ల సైజు ఎంత ఉంటుందో తెలిస్తే ఎవరైన ఆశ్చర్యపోతారు. ఇవి కేవలం 2 సెంటీ మీటర్ల వ్యాసంతో ఉంటాయి.

ఈ కేబుల్ వ్యవస్థలో లోపాలను సరిచేయడం, వాటిని నిరంతరం పర్యవేక్షించడం 19వ శతాబ్దం మధ్య నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యవస్థను విస్తరించడమో, అప్‌డేట్ చేయడమో చేస్తూనే ఉన్నారు.

సముద్ర గర్భం ద్వారా సాగే ఈ కేబులింగ్ వ్యవస్థ అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు కారణమైంది. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

అంతకుముందు ఎన్నడూ లేనంతగా సముద్ర గర్భంలో గూఢచర్యానికి దీని ద్వారా అవకాశం కలిగింది. అలాగే, రికార్డు స్పీడులో ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యేందుకు సహకరించింది.

మన రోజువారీ జీవితం, ఆదాయం, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అన్ని అంశాలలో ఇంటర్నెట్‌పై ఆధారపడటం పెరిగింది.

దీనికోసం క్లిష్టమైన సముద్ర గర్భంలో పరిచిన కేబుళ్ల నెట్‌వర్క్‌పై ఆధారపడాల్సి వస్తోంది. మరి, అవి పాడైనా, తెగిపోయినా ఏమవుతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘చాలా వరకు గ్లోబల్ నెట్‌వర్క్‌లు ఇలాంటివి ఏవైనా సమస్యలు వస్తే మరమ్మతులు చేసుకోగలవు’’ అని సముద్ర గర్భ వ్యవస్థలపై తీవ్రమైన పరిణామాలు చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే ఇంటర్నేషనల్ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ మెరైన్ ఎన్విరాన్‌మెంటల్ అడ్వయిజర్ మైక్ క్లేర్ అన్నారు.

‘‘ఈ గ్లోబల్ గ్రిడ్‌కు ఏటా 150 నుంచి 200 వరకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 14 లక్షల కిలోమీటర్ల పొడవైన కేబుల్ వ్యవస్థలో ఈ సమస్యలు చాలా చిన్నవి. నష్టం కూడా తక్కువే. చాలా వరకు సమస్యలను వెంటనే మరమ్మతు చేస్తారు.’’ అని క్లేర్ తెలిపారు.

అయితే, ఇంత సన్నని కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ప్రకృతి విపత్తుల నుంచి ఈ కేబుల్ వైర్లను ఎలా సంరక్షిస్తున్నారు? అనేది ఆశ్చర్యకరం.

సబ్‌మెరైన్ కేబుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదాలు

19వ శతాబ్దంలో(టెలిగ్రాఫ్ యుగం ప్రారంభమైనప్పుడు) తొలి ట్రాన్స్‌-అట్లాంటిక్ కేబుళ్లు వేయడం ప్రారంభించినప్పటి నుంచి, తీవ్రమైన పర్యావరణ ముప్పుల బారినపడ్డాయి ఈ కేబుళ్లు.

సముద్ర గర్భంలో వచ్చే అగ్నిపర్వతాల విస్ఫోటనాల నుంచి తుపాన్లు, వరదల వరకు ఈ కేబుళ్ల వ్యవస్థను చాలాసార్లు దెబ్బతీశాయి. అయితే, ఈ కేబుళ్లకు సహజసిద్ధంగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టం చాలా తక్కువ.

ప్రపంచంలోని 70 నుంచి 80% వరకు కేబుల్ ప్రమాదాలు మానవ చర్యలతోనే ముడిపడ్డాయి.

చేపలు పట్టే పడవలు వలలు వేసి లాగడం, లంగర్లు వేయడం వాటి వల్ల కేబుళ్లకు నష్టం ఎక్కువగా వాటిల్లుతుందని గ్లోబల్ మెరైన్‌కు చెందిన యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మెయింటనెన్స్ హెడ్ స్టీఫెన్ హోల్డెన్ అన్నారు.

గ్లోబల్ మెరైన్ అనేది సబ్‌సీ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది సబ్‌సీ కేబుళ్ల రిపేర్ వ్యవహారాలను చూస్తోంది.

200 నుంచి 300 మీటర్ల లోతుల వద్ద ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి ( కమర్షియల్‌గా చేపలు పట్టే పడవలు, ఓడలు సముద్రంలో ఒక్కోసారి దాదాపు 1,500 మీటర్ల కింది వరకు వలలు వేసి చేపలు పడుతుంటాయి)

సహజ విపత్తుల వల్ల కేవలం 10 శాతం నుంచి 20 శాతం వరకే కేబుళ్ల వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నయి.

సొర చేపలు (షార్క్‌లు) కొరకడం వల్ల కేబుళ్లు దెబ్బతింటాయని చాలామంది భావిస్తుంటారని, కానీ ప్రస్తుతం అలాంటి కేసులు చాలా వరకు తగ్గిపోయాయని క్లేర్ అన్నారు.

ప్రస్తుతం కేబుల్ ఇండస్ట్రీ వాడుతున్న పూత (కోటింగ్) కారణంగా ఈ కేబుళ్లు బలంగా ఉంటున్నాయని క్లేర్ వెల్లడించారు.

మరమ్మతులు చేయడానికి, అవసరమైతే బయటకు లాగడానికి వీలుగా సన్నని, తేలికైన కేబుళ్లను వాడాల్సి ఉంటుంది. బరువైనవైతే వీటిని సముద్ర గర్భంలో మెయింటెయిన్ చేయడం కష్టమవుతుంది.

సబ్‌మెరైన్ కేబుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

నిత్యం అందుబాటులో ఆర్మీ రిపేర్ షిప్‌లు...

ఒకవేళ ఎక్కడైనా సముద్ర గర్భంలోని కేబుళ్లలో లోపం ఏర్పడితే, వెంటనే రిపేర్ షిప్‌లను పంపిస్తారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ నౌకలన్నింటినీ వాటి బేస్‌ల నుంచి 10 నుంచి 12 రోజుల్లో వ్యవధిలో చేరుకునేలా వ్యూహాత్మకంగా నిలిపి ఉంచుతారు’’ అని ఆల్కాటెల్ సబ్‌మెరైన్ నెట్‌వర్క్స్ మారిటైమ్ ఆపరేషన్స్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ మిక్ మెక్‌ గవర్న్ అన్నారు.

సముద్ర గర్భంలో అధునాతన విధానంలో మరమ్మతులకు....ప్రాంతం, వాతావరణాన్ని బట్టి వారం లేదా రెండు వారాలు పడుతుందని మెక్ గవర్న్ చెప్పారు. అంటే, ఈ వారమంతా ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులో ఉండవని అనుకోవాల్సిన పనిలేదన్నారు.

చాలా దేశాలు ప్రత్యామ్నాయ కేబుళ్లను, బ్యాండ్‌‌విడ్త్‌ను నిర్వహిస్తుంటాయి. అవసరమైన దాని కంటే ఎక్కువగానే వీటిని అందుబాటులో ఉంచుతాయి.

ఏదైనా కేబుల్‌ డ్యామేజ్ అయినప్పుడు, వెంటనే మిగిలినవి పనిచేయడం ప్రారంభిస్తాయి. దీన్నే సిస్టమ్ రిడండెన్సీ అంటారు. ఈ రిడండెన్సీ కారణంగా చాలా వరకు సముద్ర గర్భంలో కేబుళ్లు పాడైన విషయం కూడా తెలియదు.

ఏవైనా వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ కేబుళ్లే ఉపయోగపడతాయి.

సముద్ర గర్భంలో కేబుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

2006లో వచ్చిన భూకంపం వల్ల దక్షిణ చైనా సముద్రంలో డజన్ల కొద్ది కేబుళ్లు దెబ్బతిన్నాయి. కానీ, వాటిల్లో చాలా వరకు అందుబాటులోనే ఉన్నాయి.

పాడైన భాగానికి మరమ్మతులు చేసేందుకు, గ్రాప్లింగ్ హుక్ ద్వారా వాటిని పైకి తీసి, కేబుల్‌ను కట్ చేస్తారు. వదులుగా ఉన్న చివరి భాగాన్ని ఉపరితలానికి తీసుకొస్తారు.

పాడైన భాగాన్ని నౌకలో ఒక గదికి తీసుకొచ్చి, లోపాలు ఎక్కడున్నాయో చూస్తారు. ఆ తర్వాత వాటిని రిపేర్ చేసి, నౌక నుంచి తీరానికి సిగ్నల్ పంపి పరీక్షించి, సీల్ చేస్తారు. కేబుల్‌కు మరోవైపు కూడా ఇదే రకమైన ప్రక్రియ చేపడతారు.

ఆ తర్వాత ఇరువైపులా వాటిని కలిపి, ప్రతి ఆప్టికల్ ఫైబర్‌ కూడా సరిగ్గా అతికిందా లేదా అన్నదాన్ని మైక్రోస్కోప్ ద్వారా చెక్ చేస్తారు. యూనివర్సల్ జాయింట్‌తో దాన్ని సీల్ చేస్తారని మెక్ గవర్న్ చెప్పారు.

మరమ్మతులు చేసిన కేబుళ్లను తిరిగి నీటిలోకి దింపుతారు. నౌకలు ఎక్కువగా తిరిగే సముద్ర గర్భాల్లో వాటిని కందకాల్లో పూడ్చిపెడతారు.

లోతైన జలాల్లో, హైపవర్ జెట్లతో ఎక్విప్ అయిన కొంకీ ( వస్తువులను తగిలించడానికి వీలుగా వంక తిరిగి ఉండే పరికరం)లతో ఈ పనిని నిర్వహిస్తారు. పెద్ద పెద్ద రిపేర్ షిప్‌లతో సముద్ర గర్భం వెంబడి వీటిని లాగుతారు. కొన్ని కొంకీలు 50 టన్నులకన్నా ఎక్కువ బరువుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ, క్లిష్టమైన పనులు చేస్తాయి.

సముద్ర గర్భంలో కేబుళ్ల వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

శాస్త్రీయ ఆవిష్కరణలు

ఇలా సముద్రంలో కేబుళ్లు వేయడం, వాటికి మరమ్మతులు చేయడం వల్ల కొన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ ఆవిష్కరణలకు కారణమయ్యాయి.

1929లో, కెనడా బురిన్ ద్వీపకల్ప తీరంలో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం సునామీగా మారడంతో 28 మంది మరణించారు. 28 ప్రాంతాల్లో కనీసం 12 ట్రాన్స్-అట్లాంటిక్ సబ్‌మెరైన్ కేబుళ్లు దెబ్బతిన్నాయి.

ఈ కేబుళ్లను పరిశీలించే సమయంలో, భూకంప సమయంలో కేబుళ్లు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. ఒకవేళ అన్ని కేబుళ్లు భూకంపం వల్ల దెబ్బతిని ఉంటే, ఒకేసారి అవి ఎలా దెబ్బతిన్నాయి? అన్న అనుమానం శాస్త్రవేత్తలలో కలిగింది. ఆ తర్వాత దానిపై రీసెర్చ్ చేయడం ప్రారంభించారు.

భూకంప కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికీ సముద్ర గర్భంలో వేసిన కేబుళ్ల సీక్వెన్స్‌ అంత విశాలమైన ప్రాంతంలోనూ నిర్ణీత దూరాలలో ఎందుకు దెబ్బతింటుందో 1952 వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు.

అయితే, భూకంపాల వల్ల ల్యాండ్‌స్లైడింగ్ జరగడం వల్ల ఇలా కేబుళ్లు దెబ్బతింటాయని తర్వాత గుర్తించారు. అప్పటి వరకు, ఎవరికీ కూడా టర్బిడిటీ కరెంట్స్ ఉంటాయన్న విషయం తెలియదు.

కేబుళ్లను ప్రయోగాత్మకంగా సముద్ర జలాల్లోకి పంపి కూడా పరిశోధనలు చేపట్టారు. అంటే పరిశోధకులు కేబుళ్లను రీసెర్చ్ టూల్స్‌ మాదిరి వాడటం ప్రారంభించారు.

19వ శతాబ్దంలో తొలి ట్రాన్స్-అట్లాంటిక్ కేబుళ్లను సముద్ర గర్భంలో పెట్టినప్పుడు లోతైన సముద్ర జలాల నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో లోతు పెరగడాన్ని కేబుల్ ఆపరేటర్లు గమనించారు. ఇలాగే అనూహ్యంగా మిడ్ అట్లాంటిక్ రిడ్జ్‌‌ను గుర్తించారు.

పెద్ధ పెద్ద సముద్రాల్లో తిమింగలాలు, నౌకలు, ప్రకృతి విపత్తులు, భూకంపాల వంటి వాటిని గుర్తించేందుకు ‘అకౌస్టిక్ సెన్సర్లు’(శబ్దాలను గుర్తించే పరికరాలు) మాదిరిగా నేడు టెలికమ్యూనికేషన్స్ కేబుళ్లను ఉపయోగించుకుంటున్నారు.

సముద్ర గర్భంలో ఉన్న కొత్త ప్రమాదాలను అర్థం చేసుకునేందుకు కేబుళ్లు చెడిపోయిన ఘటనలు ఉపయోగపడుతున్నాయని క్లేర్ చెప్పారు.

ఒకవేళ ఆ కేబుళ్లు చెడిపోకుండా ఉంటే అగ్నిపర్వతాలు బద్దలైన తర్వాత సముద్ర గర్భంలో ల్యాండ్‌స్లైడ్స్ జరుగుతాయని మనకు తెలిసేదికాదని క్లేర్ చెప్పారు.

ప్రకృతి విపత్తులు

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పు అనేది మరింత ఇబ్బందిగా మారుతుంది. కేబుళ్లకు జరిగే కొన్ని నష్టాలను తప్పించలేకపోతున్నామని నిపుణులు భావిస్తున్నారు.

2021-22లో హుంగా టోంగా - హుంగా హాపై అగ్నిపర్వతం బద్దలు కావడంతో, మిగిలిన ప్రపంచంతో టోంగా అనే ద్వీపకల్ప దేశానికి అనుసంధానమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ దెబ్బతింది.

ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఈ కేబుళ్లకు పూర్తిగా మరమ్మతులు చేసేందుకు 5 వారాల సమయం పట్టింది. వారం తర్వాత కొన్ని సర్వీసులను పునరుద్ధరించగలిగారు.

షిప్పింగ్‌లో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్(ఏఐఎస్) రావడం ద్వారా యాంకరింగ్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలిగారని హోల్డెన్ చెప్పారు.

కానీ, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ అనుభవం ఉన్న సిబ్బంది చేపలు పట్టే నౌకలను ఆపరేట్ చేస్తున్నారు. దీంతో యాంకర్ డ్యామేజ్ ఇంకా కొనసాగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

అలాంటి ప్రాంతాల్లో ముందుగా ప్రజలకు తెలియజేయడం, కేబుళ్లు ఎక్కడున్నాయో అవగాహన కల్పించడం ముఖ్యమని క్లేర్ అన్నారు. ఇంటర్నెట్ నిరతరం పనిచేసేలా చూడటం ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)