జెహనాబాద్‌ జైల్‌ బ్రేక్: భారతదేశపు అతిపెద్ద జైల్‌ బ్రేక్ ఘటనలో ఆ రోజు ఏం జరిగింది?

అజయ్ కాను

ఫొటో సోర్స్, Swastik pal

ఫొటో క్యాప్షన్, జైలు నుంచి ఖైదీలు తప్పించుకొనే ప్లాన్‌కు సూత్రధారి ‘అజయ్ కాను’ అని పోలీసులు ఆరోపించారు.
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌కు చెందిన జర్నలిస్ట్‌ రాజ్‌కుమార్ సింగ్‌కు 2005 నవంబర్‌లోని ఒక ఆదివారంనాడు ఫోన్ కాల్ వచ్చింది.

‘’మావోయిస్టులు దాడి చేశారు. మనుషుల్ని చంపేస్తున్నారు. నేను టాయిలెట్‌లో దాక్కున్నా’’ అని అవతలి వ్యక్తి చెప్పారు. బ్యాక్ గ్రౌండ్‌లో గన్ కాల్పుల శబ్దం విన్నారు సింగ్.

ఫోన్ చేసిన వ్యక్తి జెహనాబాద్‌ జైలులో ఖైదీ. బిహార్‌లో పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో జెహనాబాద్ ఒకటి. ఆ సమయంలో వామపక్ష భావజాలానికి బలమైన కోటగా ఉండేది.

కేవలం 230 మంది సామర్థ్యానికే నిర్మించిన ఈ జైలులో అప్పట్లో దాదాపు 800 మంది ఖైదీలను నిర్బంధించారు. అందులో 13 బ్యారక్‌లు ఉన్నాయి. అవి మురికిగా, చీకటిగా ఉండేవని అప్పటి నివేదికలు తెలిపాయి.

1960ల చివరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కుగ్రామమైన నక్సల్‌బరిలో ప్రారంభమైన మావోయిస్టు తిరుగుబాటు బిహార్‌తో సహా భారతదేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది.

దాదాపు 60 సంవత్సరాలుగా నక్సలైట్లు (గెరిల్లాలు) కమ్యూనిస్ట్ సమాజాన్ని స్థాపించడానికి పోరాడారు. ఈ ఉద్యమం అక్కడ కనీసం 40,000 మంది ప్రాణాలను బలిగొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జెహనాబాద్ జైలు

ఫొటో సోర్స్, Prashant Ravi

ఫొటో క్యాప్షన్, 2005 నవంబర్ 13న జెహనాబాద్ జైలు నుంచి 389 మంది ఖైదీలు పారిపోయారు.

389 మంది ఖైదీలు పరారి

జెహనాబాద్ జైలు కిక్కిరిసిపోయింది. అందులో మావోయిస్టులు, వారి శత్రువులు (అగ్రకుల ప్రైవేట్ సైన్యాల సభ్యులు) ఖైదీలుగా ఉన్నారు. చాలామంది వారివారి కేసులలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, కొంతమంది గార్డులు డబ్బులు తీసుకొని కొందరు ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడటాన్ని అనుమతించేవారు.

“ఈ ప్రదేశం తిరుగుబాటుదారులతో దద్దరిల్లుతోంది. చాలామంది బయటకు వెళ్తున్నారు" అని జర్నలిస్టు సింగ్‌తో ఆ సమయంలో అక్కడున్న 659 మంది ఖైదీలలో ఒకరు నెమ్మదిగా చెప్పారు.

2005 నవంబర్ 13న జైలు నుంచి తిరుగుబాటుదారులతో సహా 389 మంది ఖైదీలు పారిపోయారు. ఇది భారత్‌లో అతిపెద్ద ‘జైల్‌బ్రేక్‌’లలో ఒకటిగా మారింది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు. పోలీసు రైఫిల్స్‌ను దొంగిలించారు.

తిరుగుబాటుదారులు మావోయిస్టు వ్యతిరేక గ్రూపులో సభ్యులైన "30 మంది ఖైదీలను కూడా అపహరించారు" అని 2005లో ఉగ్రవాదంపై అమెరికాకు చెందిన ‘యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ది కోఆర్డినేటర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ అనే నివేదిక తెలిపింది.

కాగా, ఈ జైలు కుట్రలో (ఖైదీలు తప్పించుకోవడం) సూత్రధారి ‘రెబల్ నాయకుడైన అజయ్ కాను’ అని పోలీసులు ఆరోపించారు. అజయ్ ఆ సమయంలో అదే జైలులో ఖైదీ. ఆయన తన గ్రూప్‌తో ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసుల వాదనను కాను ఖండించారు.

జైలుకు చేరుకోవడానికి వందలమంది తిరుగుబాటుదారులు పోలీసు వేషధారణతో ఒక వాగును దాటి వచ్చారు. గోడలు ఎక్కడానికి వెదురు నిచ్చెనలను ఉపయోగించారు.

తుపాకులతో కాల్పులు జరుపుతూ జైలులోకి ప్రవేశించారు. వంటగదిలో ఆహారం ఆలస్యంగా వండటంతో సెల్‌లు ఇంకా తెరిచే ఉన్నాయి. తిరుగుబాటుదారులు జైలు ప్రధాన గేట్లను తెరిచారు. వీరిని గార్డులు ఆపలేకపోయారు. చాలామంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు.

తప్పించుకున్న వారిలో 30 మంది మాత్రమే దోషులు, మిగిలిన వారు విచారణ ఖైదీలు.

గేట్ల నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చి, అలా చీకట్లో కలిసిపోయారు. ఇదంతా గంటలోపే అయిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటన బిహార్‌లో పేలవమైన భద్రత, పెరుగుతున్న మావోయిస్టుల ప్రభావాన్ని హైలైట్ చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో జైలుకు భద్రత తగ్గించారు. తిరుగుబాటుదారులు తమ ప్రణాళికను అనుకున్నట్లుగా అమలు చేయగలిగారు.

బిహార్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఘటన జరిగిన రాత్రి జెహనాబాద్ జైలు దగ్గర పోలీసులు.

భూస్వాముల ప్రైవేటు సైన్యం నాయకుడి హత్య

పాత్రికేయుడు రాజ్‌కుమార్ సింగ్ ఆ రాత్రి ఘటనలను గుర్తు చేసుకున్నారు. దాడి గురించి ఫోన్ కాల్ అందుకున్న సింగ్ బైకు తీసుకొని తన ఆఫీసుకు బయలుదేరారు.

దారిలో తుపాకి శబ్దాలు వినిపించాయి. తిరుగుబాటుదారులు చుట్టుపక్కల ఉన్న పోలీసు స్టేషన్లపై కూడా దాడికి ప్రయత్నించారు. మెయిన్ రోడ్డుకు రాగానే పోలీసుల యూనిఫారంలో ఉన్న డజన్ల మంది సాయుధ పురుషులు, మహిళలు రోడ్డును అడ్డగించి, మెగా ఫోన్‌లో అరుస్తుండటం కనిపించింది.

‘’మేము మావోయిస్టులం, మేం ప్రజలకు వ్యతిరేకం కాదు. కేవలం ప్రభుత్వానికే. జైలు నుంచి తప్పించుకోవడం మా నిరసనలో భాగం’’ అని వారు అన్నారు.

తిరుగుబాటుదారులు రోడ్డుపై బాంబులు అమర్చారు. అప్పటికే కొన్ని పేలుతున్నాయి.

సింగ్ తన కార్యాలయానికి చేరుకున్నాక, ఖైదీ నుంచి మరొక కాల్ వచ్చింది.

“అందరూ పరిగెడుతున్నారు, నేనేం చెయ్యాలి?’’ అని ఖైదీ అడిగారు.

"ఒకవేళ అందరూ తప్పించుకుంటే, మీరు కూడా అదే చేయండి" అని సింగ్ బదులిచ్చారు.

తర్వాత సింగ్ ఖాళీగా ఉన్న వీధుల గుండా జైలుకు వెళ్లారు. ఆయన చేరుకునే సరికి గేట్లు తెరిచి ఉన్నాయి. వంటగదిలో అన్నం చెల్లాచెదురై ఉంది. సెల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అక్కడ జైలర్‌గానీ, పోలీసులుగానీ ఎవరూ కనిపించలేదు.

ఓ గదిలో ఇద్దరు పోలీసులు గాయాల పాలై కనిపించారు. అక్కడ రక్తసిక్తమైన బడే శర్మ అనే వ్యక్తి మృతదేహాన్నీ చూసినట్లు సింగ్ చెప్పారు. బడేశర్మ అక్కడి ‘రణవీర్ సేన’ నాయకుడు. ఇది అగ్రవర్ణాలకు చెందిన భూస్వాముల ప్రైవేటు సైన్యం.

తిరుగుబాటుదారులు వెళ్లిపోతూ ఆయనను కాల్చిచంపారని పోలీసులు తెలిపారు. అక్కడ తిరుగుబాటుదారులు విడిచివెళ్లిన చేతిరాత కరపత్రాలు కనిపించాయి. వాటి మీద రక్తపు మరకలు ఉన్నాయి.

"విప్లవకారులను, పోరాడుతున్న ప్రజలను అరెస్టు చేసి జైలులో పెడితే.. మార్క్సిస్ట్ విప్లవాత్మక మార్గంలో వారిని జైలు నుంచి ఎలా విడిపించాలో మాకు తెలుసని ఈ చర్య ద్వారా మేము రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం" అని ఒక కరపత్రంలో రాసి ఉంది.

కరపత్రాలు

ఫొటో సోర్స్, Prashant Ravi

ఫొటో క్యాప్షన్, సంఘటన స్థలంలో రక్తపు మరకలతో కూడిన చేతిరాత కరపత్రాలు ఉన్నాయి.

బిహార్ మోస్ట్ వాంటెడ్

జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్ కాను (57)ను కొన్ని నెలల కిందట నేను పట్నాలో కలిశాను.

ఆ సంఘటన జరిగిన సమయంలో మీడియా కథనాలు ఆయనను "బిహార్ మోస్ట్ వాంటెడ్"గా చిత్రీకరించాయి. జైలు నుంచి తప్పించుకునే సమయంలో రెబల్స్‌లో ఒకరు అజయ్‌కి ఏకే-47 ఇవ్వగానే పరిస్థితిని తక్షణమే ఆయన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నారో అధికారులు వివరించారు. అజయ్ ఆయుధం గురించి బాగా తెలిసిన వ్యక్తిలా దానిని ఉపయోగించారని పలు రిపోర్టులు ఉన్నాయి.

15 నెలల తర్వాత 2007 ఫిబ్రవరిలో అజయ్‌‌ను బిహార్ నుంచి కోల్‌కతా వెళుతుండగా రైల్వే ప్లాట్‌ఫారం మీద అరెస్టు చేశారు.

రెండు దశబ్ధాల తర్వాత తనపై ఉన్న 45 క్రిమినల్ కేసుల్లో 6 మినహా మిగిలిన అన్నింటిలో అజయ్ నిర్దోషిగా విడుదలయ్యారు.

అందులో చాలా కేసులు జైలు నుంచి తప్పించుకున్న ఘటనలోనే పెట్టారు. ఇందులో శర్మ హత్య కూడా ఉంది. అయితే, ఒక కేసులో మాత్రం అజయ్ కాను ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించారు.

ఒకప్పుడు మావోయిస్టుగా పోరాడిన అజయ్ ఇపుడు రాజకీయ నాయకుడిగా మారారు.

అజయ్ కాను

ఫొటో సోర్స్, Swastik Pal

ఫొటో క్యాప్షన్, అజయ్ కాను రాజకీయాల్లో చేరారు.

అజయ్ నేపథ్యం ఏమిటి?

అజయ్‌ది వెనకబడిన కులానికి చెందిన కుటుంబం. తండ్రి ఒక రైతు. చిన్నతనంలోనే రష్యా, చైనా, ఇండోనేషియాలలో కమ్యూనిస్ట్ తిరుగుబాట్ల గురించి తండ్రి కథలు చెబుతుండగా వినేవారు.

అజయ్ ఎనిమిదో తరగతిలో ఉండగా ఉద్యమం వైపు నడవాలని పలువురు సూచించారు.

ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్థానిక భూస్వామి కుమారుడి జట్టుపై గోల్ చేసిన తర్వాత, ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు ఆయుధాలతో అజయ్ ఇంటిపై దాడి చేశారు.

"నేను లోపలికెళ్లి తాళం వేసుకున్నాను. వారు నా కోసం, నా సోదరి కోసం వచ్చారు. ఇల్లు దోచుకున్నారు, అన్నీ నాశనం చేశారు" అని అజయ్ గుర్తుచేసుకున్నారు.

కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విద్యార్థి విభాగానికి అజయ్ నాయకత్వం వహించారు. అప్పట్లో మావోయిజానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ అది.

జెహనాబాద్‌

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2004లో జెహనాబాద్‌లో తుపాకులు పట్టుకుని నిల్చున్న గ్రామస్తులు

మావోయిస్టుగా మారి..

గ్రాడ్యుయేషన్ తర్వాత అజయ్ ఒక పాఠశాలను ప్రారంభించారు. అయితే, ఆ ఇంటి యజమాని అజయ్‌ను బలవంతంగా బయటకు పంపారు. గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత స్థానిక భూస్వామితో గొడవలు జరిగాయి.

స్థానికంగా పలుకుబడి గల ఒక వ్యక్తి హత్యకు గురవడంతో 23 ఏళ్ల అజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయన పేరును పోలీసు ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. దీంతో అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

“అప్పటి నుంచి నేను నా జీవితంలో ఎక్కువగా పరారీలోనే ఉన్నాను. కార్మికులు, రైతులను సమీకరించడానికి ఇంటి నుంచి త్వరగా బయటికెళ్లాను. మావోయిస్టుల్లో చేరి అండర్ గ్రౌండ్ వెళ్లిపోయాను.” అని అజయ్ చెప్పారు.

అజయ్ కాను రాడికల్ కమ్యూనిస్ట్ గ్రూపు అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)లో చేరారు.

“నా వృత్తి విముక్తి, పేదల విముక్తి. అగ్రవర్ణాల దౌర్జన్యాలను ఎదిరించి నిలదీసేది” అని అజయ్ చెప్పారు.

2002లో అజయ్ తలకు ప్రభుత్వం రూ. 30 లక్షల రివార్డు ప్రకటించింది. ఒకరోజు పట్నా వెళుతుండగా ఆయనను అరెస్టు చేశారు. వాళ్లపై తిరగబడలేదని, లొంగిపోయానని అజయ్ అన్నారు.

తరువాతి మూడు సంవత్సరాలలో అజయ్ తప్పించుకుంటాడనే భయంతో ఆయనను పలు జైళ్లకు మార్చారు.

"అతనికి చాలా గుర్తింపు ఉంది, తెలివైన వాడు" అని ఒక సీనియర్ అధికారి నాకు చెప్పారు.

ప్రతి జైలులో అవినీతి, రేషన్‌ దొంగతనాలు, లంచాలకు వ్యతిరేకంగా, పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఖైదీల సంఘాలను ఏర్పాటు చేశానని అజయ్ కాను చెప్పారు.

ఒక జైలులో మూడు రోజుల నిరాహార దీక్షకు సైతం ఆయన నాయకత్వం వహించారు.

జెహనాబాద్
ఫొటో క్యాప్షన్, అజయ్ కాను

ఆ రోజు ఏం జరిగిందంటే?: అజయ్

జెహనాబాద్ జైలు గురించి అజయ్ వివరించారు.

“పడుకోవడానికి చోటు లేదు. నేనుండే మొదటి బ్యారక్‌లో 40 మంది ఉండే స్థలంలో 180 మంది ఖైదీలను పెట్టారు. మేము ఒక పద్దతి పెట్టుకున్నాం. ఒకసారి 50 మంది నాలుగు గంటలు నిద్రపోతాం. మిగతావాళ్లు కూర్చుని, వేచి ఉండి, చీకటిలో కబుర్లు చెప్పుకుంటారు. ఆ నాలుగు గంటలు అయిపోగానే మరో గ్రూపు వచ్చి నిద్రపోయేది. అలా ఆ గోడల మధ్య మా జీవితాన్ని గడిపాం" అని అజయ్ కాను గుర్తుచేసుకున్నారు.

2005లో ఆ జెహనాబాద్ 'జైలు కుట్ర' ఘటనలో అజయ్ కాను కూడా తప్పించుకున్నారు.

“మేం రాత్రి భోజనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తుపాకీ కాల్పులు జరిగాయి. బాంబులు, బుల్లెట్లతో అంతా గందరగోళంగా మారింది" అని అజయ్ అన్నారు.

"మావోయిస్టులు విరుచుకుపడ్డారు, మమ్మల్ని పారిపోండి అని అరిచారు. అందరూ చీకట్లోకి పరిగెత్తారు" అని అన్నారు.

అయితే, అజయ్ కాను వాదనలపై చాలామంది అనుమానం వ్యక్తంచేశారు.

"అది ఆయన చెప్పినంత సులభం కాదు" అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

"సాయత్రం వెలుతురు ఉన్న సమయంలోనే వండాల్సిన డిన్నర్ ఎందుకు ఆలస్యంగా చేశారు? సాధారణంగా ఆ సమయానికి సెల్‌లు తాళం వేసి ఉండాలి, అది ఒక్కటే అంతర్గత కుట్రపై అనుమానాలు రేకెత్తించింది" అని అన్నారు.

తప్పించుకున్న ఖైదీలలో చాలామందిని డిసెంబర్ మధ్య నాటికి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. కొందరు స్వచ్ఛందంగా వచ్చారు. తిరుగుబాటుదారులు ఎవరూ తిరిగి రాలేదు.

‘జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే ప్లాన్’ సూత్రధారి మీరేనా? అని నేను అజయ్ కనూని అడిగినప్పుడు, ఆయన నవ్వారు.

‘మావోయిస్టులు మమ్మల్ని విడిపించారు, విముక్తి చేయడమే వారి పని’ అని అజయ్ అన్నారు.

కానీ మళ్లీ అడిగితే.. ఆయన మౌనంగా ఉండిపోయారు. చివరగా అజయ్ జైలులో జరిగిన ఒక ఘటన గురించి చెప్పారు.

ఒక పోలీసు అధికారి ఒకసారి అజయ్‌ను తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? అని అడిగారు.

“అయ్యా, ఒక దొంగ తను ఏమి దొంగిలించబోతున్నాడో ఎప్పుడైనా చెబుతాడా?” అని కాను సమాధానం చెప్పారు.

జైలు నుంచి ఖైదీలు పారిపోవడంలో తన పాత్ర ఏమీ లేని అజయ్ కాను అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)