రూపాయి విలువ పడిపోతోంది, డాలర్ బలపడుతోంది, దీని ప్రభావం భారతీయులపై ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ ఎనలిస్ట్, బీబీసీ కోసం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతోంది. సరిగ్గా ఆరేళ్ల కిందట డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 అక్టోబర్ 15న జీవిత కాల కనిష్ఠ స్థాయి రూ.84.07కి పడిపోయింది.
ఈ అంశానికి సామాన్యులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా, భారతీయులందరిపైనా దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
అదెలాగో అర్థం అయ్యేందుకు ఒక ఉదాహరణ చూద్దాం..
రవి, సురేష్ ఇద్దరూ సోదరులు. రవి భారత్‌లో ఉంటున్నారు. సురేష్ 20 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే సెటిలైపోయారు. ఇద్దరూ ఉన్నతోద్యోగులే. సురేష్ డాలర్లలో సంపాదిస్తారు కాబట్టి, రవి కంటే మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. రవి కూడా ఇండియాలో పొదుపు చేసుకుంటూ బాగానే వెనకేశారు.
అమెరికాలో ఉంటున్న అన్నయ్య సురేష్ జీతంలో పెద్దగా మార్పులు లేకపోయినా ఇండియాలో ఆస్తులు కొంటూ ఉన్నారు. మొదట వాళ్ల అమ్మానాన్న పేర్ల మీద ఫ్లాట్, తర్వాత బంధువుల పేర్ల మీద పొలాలు, రియల్ ఎస్టేట్ వంటివి బాగా పోగేశారు.
ఇలా ఎందుకు జరుగుతోందో రవికి చాలాకాలం వరకు అర్థం కాలేదు. కానీ, ఈ మధ్యే అసలు విషయం తెలుసుకున్నారు. రూపాయి విలువ పడిపోవడం అన్నయ్యకు కలిసొచ్చిందని, అదే తనకంటే ఆయన్ను ఆస్తిపరుడిని చేసిందని రవికి అర్థమైంది.


ఫొటో సోర్స్, XE.COM
రూపాయి పతనానికి కారణమేంటి?
పదేళ్ల కిందట ఎవరైనా ఎన్‌ఆర్‌ఐ ఇండియాకి లక్ష డాలర్లు పంపించారని అనుకుందాం. అప్పటి రేట్ల ప్రకారం మన కరెన్సీతో లెక్కించి చూసుకుంటే రూ.65 లక్షలు వచ్చేవి. కానీ ఈ రోజున్న లెక్కల ప్రకారం అదే లక్ష డాలర్లకు రూ.84 లక్షలు వస్తోంది. సుమారు రూ.21 లక్షల అధిక లాభం.
మరో ఉదాహరణ చూద్దాం. శ్రీరామ్ వాళ్లబ్బాయి సురేంద్ర రెండేళ్ల కిందట యూఎస్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్లారు. మొదటి సంవత్సరం అబ్బాయి ఫీజు 50 వేల డాలర్లు కావడంతో రూ.37.50 లక్షలు ఏర్పాటు చేసుకున్నారు శ్రీరామ్.
అదే ఫీజు 50 వేల డాలర్లు చెల్లించడానికి ఇప్పుడు ఆయనకు రూ.42 లక్షలు కావాలి. అంటే సుమారుగా రెండేళ్లలో రూ.4.50 లక్షలు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. వీటన్నింటికీ రూపాయి విలువ పడిపోవడం కూడా ఒక కచ్చితమైన కారణం. ద్రవ్యోల్బణం కీలకపాత్ర పోషిస్తున్నా.. రూపాయి పతనం మనందరి జీవితాలపై పెద్ద ప్రభావమే చూపిస్తోంది.
నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ - డీజిల్ రేట్లు, ఔషధాలు, బంగారం, ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా ఒక్కటేమిటి, అన్నింటికీ రూపాయి బలహీనతతో ప్రత్యక్ష సంబంధమే ఉంటుంది.
అయితే, సుమారు 7 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న భారత్‌లో రూపాయి విలువ ఎందుకు పడిపోతోందనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది.
కరెన్సీ మారకం విలువలో ఒడిదుడుకులు మామూలే, కానీ స్థిరంగా బలహీనపడుతుంటే మాత్రం కారణాలు చూడాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. కానీ కరెన్సీ విలువ పడిపోతున్న వేగాన్ని గమనించాలి.
ఎగుమతులు, దిగుమతులు, ఆర్బీఐ పరపతి విధానం, ద్రవ్యోల్బణం, ఫారెక్స్ నిల్వలు, దేశంలో రాజకీయ స్థిరత్వం, విధానపరమైన నిర్ణయాలు, స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, వడ్డీ రేట్లు, ప్రపంచ దేశాల్లో అనిశ్చితి... సాధారణంగా ఇవే కరెన్సీ హెచ్చు తగ్గులకు ప్రధాన కారణాలు.

ఫొటో సోర్స్, Getty Images
క్రూడ్ ఆయిల్
భారత్ విషయానికి వస్తే.. ఈ దేశంలో వినియోగించే మొత్తం చమురులో 88 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. అంటే, ఈ దేశంలో ఉత్పత్తయ్యే చమురు కేవలం 12 శాతం అవసరాలను మాత్రమే తీర్చగలుగుతోంది.
అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చితి (యుక్రెయిన్ - రష్యా యుద్ధం, తాజాగా లెబనాన్ - ఇజ్రాయెల్ ఘర్షణ, ఒపెక్ ప్లస్ దేశాలు కూడబలుక్కుని ఉత్పత్తిని తగ్గించి కృత్రిమంగా డిమాండ్ పెంచడం లాంటివి) ఏర్పడితే క్రూడాయిల్ రేట్లు పెరుగుతాయి.
అయితే, ఈసారి ముడిచమురు ధరలు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా దిగొచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 89 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర అక్టోబర్‌లో 76 డాలర్ల దగ్గరే ఉంది.
నిజానికి ఇది పాజిటివ్ న్యూస్ అయినా, ఇతర కారణాల వల్ల రూపాయి పడిపోవడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్య లోటు
విదేశాలకు ఎన్ని ఉత్పత్తులు, సేవలు ఎగుమతి చేసుకుంటున్నాం? ఇతర దేశాల నుంచి ఏ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాం? అనే రెండింటి మధ్య ఉన్న తేడానే వాణిజ్య లోటు.
అంటే, రూ.100 ఎగుమతి చేసి, రూ.110 దిగుమతి చేసుకుంటున్నామంటే రూ.10 వాణిజ్య లోటు ఉందని అర్థం.
అలానే ఇప్పుడు ఇండియా ట్రేడ్ డెఫిసిట్ సెప్టెంబర్‌లో 20.78 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఆగస్టులో ఉన్న 29.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే బాగా తగ్గింది. అయినా ఇది చాలా పెద్ద లోటుగానే పరిగణించాలి.

ఫొటో సోర్స్, Getty Images
బలపడుతున్న డాలర్
రూపాయి పడిపోవడానికి కారణాల్లో ఒకటి అమెరికన్ డాలర్. యూఎస్ డాలర్‌ను ప్రపంచమంతా రిజర్వ్ కరెన్సీగా ఉంచుకుంటారు. అంటే ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు, ఏ దేశం దగ్గర ఎక్కువ యూఎస్ కరెన్సీ, గోల్డ్ ఉంటుందో వాళ్ల కరెన్సీకే విలువ ఎక్కువని అనుకోవచ్చు.
సాధారణంగా యూఎస్ కరెన్సీలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండకపోవడంతో పాటు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కావడంతో ప్రతీ దేశం యూఎస్ డాలర్‌ను తమ ఖజానాలో ఉంచుకుంటుంది.
అయితే, యూఎస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సున్నా స్థాయి దగ్గర ఉన్న వాళ్ల వడ్డీ రేట్లను ఇటీవలి ఏళ్లలో 5 శాతానికి పెంచింది. అనూహ్యంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచి, ఇబ్బందులు పడుతోంది అమెరికా.

ఫొటో సోర్స్, macrotrends.net
పైన ఉన్న డేటా చూస్తే అర్థమవుతుంది. 2021లో కూడా సున్నా స్థాయిల దగ్గరే ఉన్న అమెరికా వడ్డీ రేట్లు 2024 సెప్టెంబర్ వరకూ 5.3 శాతంగా ఉన్నాయి. ఈ మధ్యే వడ్డీ రేట్లను తగ్గించింది ఫెడ్.
గత పదహారేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో వడ్డీ రేట్లు లేవు. ఇన్‌ఫ్లేషన్ కూడా అదే స్థాయిలో పెరగడంతో అమెరికన్ సిటిజన్స్ అల్లాడిపోయారు. బాండ్ రేట్లు కూడా గణనీయంగా పెరగడంతో డాలర్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత బలపడింది. ఇది పరోక్షంగా రూపాయిని మరింత బలహీనపర్చింది.
తుర్కియే లిరా, బ్రెజిలియన్ రియాల్, అర్జెంటినా పెసో, వియత్నమీస్ డాంగ్, హంగేరియన్, సౌత్ కొరియన్ ఒన్ వంటివన్నీ కూడా రూపాయి కంటే దారుణంగా ఎఫెక్ట్ అయిన కరెన్సీల జాబితాలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్లు
ఈక్విటీ మార్కెట్లు రికార్డ్ స్థాయి నుంచి సుమారు 5 శాతం వరకూ కరెక్ట్ అయ్యాయి.
చైనా విపరీతంగా పెంచిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలతో పాటు అక్కడ మళ్లీ వృద్ధి మెరుగవుతోందనే అంచనాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు కొద్దిగా ఓవర్ వాల్యూడ్ అనే అంచనాలు ఉండటంతో పాటు కాస్త చీప్‌గా లభిస్తున్న చైనా మార్కెట్ల వైపు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) పరుగులు తీస్తున్నారు.
అక్టోబర్ 20 వరకు ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం, ఎఫ్‌పీఐలు సుమారు రూ.77,701 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మి సొమ్ము చేసుకున్నారు. కోవిడ్ టైమ్‌లో అంటే 2020 మార్చిలో వీళ్లు అమ్మిన మొత్తం స్టాక్స్ విలువ రూ.61,972 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే రికార్డ్ స్థాయిలో ఫారిన్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి వైదొలిగి, ఆ లాభాలతో చైనా వైపు వెళ్తున్నారని అర్థమవుతోంది.
‘సెల్ ఇండియా, బై చైనా’ అనే నినాదం ఇప్పుడు ప్రపంచ ఎఫ్‌పీఐల్లో ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ చైనా గణాంకాలపై ఇంకా స్పష్టత లేదు.
అయితే, భారత్‌లోని దేశీయ సంస్థాగత మదుపరులు ఈ పరిస్థితులను ముందే అంచనా వేసి సుమారు రూ.2 లక్షల కోట్ల క్యాష్‌తో సిద్ధంగా ఉన్నారు.
మార్కెట్లో ఇలాంటి అనిశ్చితి వస్తే, కుప్పలుగా నిధులను కుమ్మరించడానికి రెడీ చేసుకున్నారు. అయినప్పటికీ ఫారిన్ ఔట్ ఫ్లోస్ ఎప్పటికైనా మన రూపాయిని బలహీనపరుస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
రూపాయి విలువ పడిపోతే లాభం ఎవరికి?
ఎవరైతే విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేస్తారో వాళ్లందరూ లాభపడతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ఇది లాభం.
ఎందుకంటే వీళ్లంతా డబ్బులు డాలర్లతో తీసుకుంటారు కాబట్టి రూపాయి క్షీణించే కొద్దీ లాభాలు ఎక్కువగా వస్తాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా యూఎస్‌లో ఉన్న వాళ్లు, భారత్‌కు డబ్బు రెమిట్ చేసేటప్పుడు అధిక ప్రయోజనాన్ని పొందుతారు.
రూపాయి విలువ తగ్గితే భారత్‌లోకి మళ్లీ నిధుల ప్రవాహం పెరగొచ్చు. టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. ఎగుమతిదారులు మరింత కాంపిటీటివ్ రేట్లకు విదేశీ కంపెనీలకు వస్తువులు, సేవలను అమ్మి మార్కెట్ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టం ఎవరికి?
రూపాయి పతనం మొదలైంది అంటే దేశంలో ఉన్న సామాన్యులంతా తనకు తెలిసో తెలియకో కచ్చితంగా ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటారు.
ఉదాహరణకు క్రూడాయిల్ దిగుమతి కోసం మనం డాలర్లలో చెల్లించాలి కాబట్టి రూపాయి ఎంతగా పడిపోతే మనం అంత ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి. దీంతో కంపెనీలకు నష్టాలు పెరిగి, రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి. దీంతో నష్టాలను భరించలేక, ప్రభుత్వం కూడా సరేనంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు కొండెక్కి కూర్చుంటాయి. దీంతో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు.
అందుకే మొదటి దెబ్బ సామాన్యులపైనే పడుతుంది. ఇది పరోక్షంగా వడ్డీ రేట్లు పెంచేందుకు కారణమవుతోంది. అప్పులు తీసుకున్న వాళ్లంతా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్లు, కెమెరాలు, ఇతర వస్తువుల రేట్లు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ఖరీదవుతుంది. విదేశాల్లో చదువు భారమవుతుంది. ఇక్కడి నుంచి పిల్లలకు ఫీజుల నిమిత్తం పంపే వాళ్లు మరింతగా ఇబ్బంది పడతారు.
విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే కెమికల్స్, వైద్య పరికరాల రేట్లు పెరుగుతాయి.
ప్రభుత్వం, ఆర్బీఐ ఏం చేయలేవా?
గ్లోబలైజ్డ్ ఎకానమీల్లో డిమాండ్ - సప్లైకే మొదటి ప్రాధాన్యం. ఆయా దేశాల అత్యున్నత బ్యాంకుల పాత్ర కొంత పరిమితంగా ఉంటుంది.
ఆర్థికంగా గతంలో పోలిస్తే భారత్ ఇప్పుడు కొంత పరిపుష్టంగా ఉన్నా అది రూపాయి నిలబడటానికి ఊతమివ్వలేకపోతోంది.
ముఖ్యంగా విదేశీ ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు ఈ దేశంలో 700 బిలియన్ డాలర్ల వరకూ ఉన్నాయి. ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు ఈ నిధులు భారత దేశానికి, రూపాయికి పరిపుష్టిగా పనిచేస్తాయి.
మార్కెట్లో డాలర్ డిమాండ్ తీవ్రంగా వచ్చి, రూపాయికి ఇబ్బంది వస్తోందని అనుకున్నప్పుడు మాత్రమే ఆర్బీఐ డాలర్లను విక్రయించి, పరిస్థితి మరింత దిగజారకుండా చూస్తుంది. అయితే ఇది ఫారెక్స్ నిల్వలను వేగంగా కరిగించేస్తుంది. అందుకే ఆర్బీఐ పాత్ర కూడా పరిమితమనే చెప్పొచ్చు.
సాధ్యమైనంతగా విదేశీ నిధులను మన దేశంలోకి పెట్టుబడుల రూపంలో తెచ్చుకోవడం, వస్తు, సేవల ఎగుమతి, సంస్కరణల కొనసాగింపు వంటివి నిరంతరం చేస్తూ ఉండాలి. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి.

చూశారుగా... రూపాయి పతనం మనందరి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో. అందుకే ఇన్‌ఫ్లేషన్, క్రాస్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటూ మన పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి.
ఒకప్పటి మాదిరి పాసివ్ ఇన్వెస్టర్‌గా ఉంటే కష్టపడాల్సి ఉంటుంది. యాక్టివ్ ఇన్వెస్టర్‌గా, ఇన్ఫార్డ్ - స్మార్ట్ ఇన్వెస్టర్‌గా ఉన్నప్పుడే ఫైనాన్షియల్‌గా కూడా సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాం.
(గమనిక ఈ సమాచారం అంతా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలైనా ఆర్థిక నిపుణులను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














