కూల్ డ్రింక్స్ తాగినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? తరచూ తాగితే ఏమవుతుంది?

శీతల పానీయం తాగుతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ దేశం పీఆర్
    • హోదా, బీబీసీ కోసం

"చిన్నూ, మామయ్య వాళ్లు అరగంటలో ఇంటికి వస్తున్నారట. షాపుకెళ్లి వేడి వేడి మిరపకాయ బజ్జీలు మూడు ప్యాకెట్లు, రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకురా. చల్లగా ఉండేదే తీసుకురా." "ఒరేయ్, మాంచి బిర్యానీ ఆర్డర్ చేసినపుడు చేతిలో కూల్ డ్రింక్ లేకపోతే ఎలా? అది కూడా ఆర్డర్ చేయ్..."

"ఎండలో పడి వచ్చావ్! ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్ ఉంది తాగు పో.."

"నాన్న, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కోక్, ఇంకేం వద్దు ప్లీజ్.."

"పొద్దున ఇంట్లో టిఫిన్ తయారు అవలేదు. చిప్స్ తిని, కూల్ డ్రింక్ తాగేసి వద్దాం పద.."

"జిమ్ చేశాక కూల్ డ్రింక్ తాగకపోతే దాహం ఎలా తీరేది?"

ఇవి మన ఇళ్లలో, ఆఫీసులో, స్కూళ్లలో ప్రతి రోజూ వినబడే, మాట్లాడుకునే మాటలే. కూల్ డ్రింక్స్‌నే నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్, శీతల పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్ అని రకరకాలుగా పిలుస్తాం. అది ఏ రకం డ్రింక్ అయినా అన్నింటిలో ఉండేవి ఒకే రకం పదార్థాలు.

సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకి రావాలంటే ఆ పానీయంలో ఆల్కహాల్ అసలు ఉండకూడదు. ఆల్కహాల్ ఉంటే వాటిని హార్డ్ డ్రింక్స్ అంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కూల్ డ్రింక్స్

ఫొటో సోర్స్, Getty Images

సాఫ్ట్ డ్రింక్స్‌లో ఏముంటుంది?

దేశంలో ప్రజలు సాప్ట్ డ్రింక్స్‌ను ముఖ్యంగా దాహం తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. వాటి వ్యాపార ప్రకటనల్లో కూడా జనాల దాహం తీర్చడమే ముఖ్య అంశంగా కనబడుతుంది.

మన శరీరంలో నీళ్లు తక్కువైనపుడు (అలిసిపోయినపుడు, చెమట రూపంలో ఆవిరైనపుడు, నీళ్ల విరేచనాలు, వడదెబ్బ.. తదితర సందర్భాల్లో) మనకు చాలా దాహం వేస్తుంది. దాహం వేయడం, తీరడం అనే భావనను మెదడులోని హైపోథాలమస్ గ్రంథి నియంత్రిస్తుంది. ఆ సమయంలో శరీరానికి సరిపడా నీరు తాగితే దాహం తీరుతుంది.

కానీ, సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడు శరీరానికి అవసరమైన నీరు అందకుండానే దాహం తీరుతుంది. దీని వల్ల మన శరీరంలో నీటి శాతం తక్కువై బీపీ తగ్గడం, ముఖ్య అవయవాలకు రక్త సరఫరా తగ్గడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ రావడం, కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంది.

దాదాపు అన్ని రకాల శీతల పానీయాల్లోనూ 90 నుంచి 99% నీరే ఉంటుంది. ఆ నీళ్లతో పాటు కార్బన్ డయాక్సైడ్, చక్కెర, కృత్రిమ రంగులు, కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ అధిక పీడనం వద్ద నీళ్లలో కలపడం వల్ల ఆ వాయువు చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటుంది.

ఈ బుడగల నీరు నోట్లో పోసుకోగానే, మనకు చల్లని నీళ్లతో వచ్చే స్పర్శ లాంటి అనుభూతి కలుగుతుంది. అందుకే చల్లగా లేని సోడా నీళ్లు తాగినా కూడా దాహం తీరినట్టుగా అనిపిస్తుంది. చల్లగా ఉంటే ఆ స్పర్శ మరింత మధురంగా ఉంటుంది. తొందరగా దాహం తీరుతుంది.

కానీ, నిజంగా మన శరీరానికి కావాల్సినంత నీరు మనకు అందదు. అంటే అవసరమైన స్థాయిలో నీళ్లకు బదులు తక్కువ పరిమాణంలో డ్రింక్ తాగుతాం. దీంతో దాహం తీరుతుంది కానీ శరీరానికి నీరు సరిపోదు.

కూల్ డ్రింక్

ఫొటో సోర్స్, Getty Images

పళ్లకూ సమస్యే

ఈ బుడగల నీరు (సోడా) వల్ల మన శరీరానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? సాధారణంగా నీళ్ల పీహెచ్ విలువ న్యూట్రల్ గా pH 7 ఉండాలి కానీ కార్బన్ డయాక్సైడ్ కలపడం వల్ల ఆ విలువ pH3 నుంచి pH 4 వరకు తగ్గిపోతుంది.

సోడా నీళ్లు ఆరోగ్యంగా ఉండేవారు తాగితే, శ్వాస ద్వారా, కిడ్నీల ద్వారా అందులో ఉండే CO2 బయటకి వెళ్లిపోతుంది.

అయితే, మనం ఎంత ఆరోగ్యవంతులమైనా సరే దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మన పళ్లకు ఫాస్ఫోరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ వంటివి తగిలితే వాటిపై ఉండే ఎనామిల్ కరిగిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి పళ్లు పుచ్చిపోతాయి. ఆమ్లాలతో పాటు చక్కెర కూడా ఉంటే ఆ బాక్టీరియాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి.

మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. మనందరం ఏమీ కలపని సోడా నీళ్ల కంటే తియ్యగా ఉండే కూల్ డ్రింక్సే ఎక్కువ ఇష్టపడతాం. వీటిల్లో ఉండే అధిక చక్కెర శాతం, ఫ్లేవర్స్, యాసిడ్, కెఫీన్.. ఇవన్నీ మనం వాటికి అలవాటు పడేలా చేస్తాయి.

చక్కెర

ఫొటో సోర్స్, Getty Images

చక్కెరతో చిక్కులెన్నో..

సాఫ్ట్ డ్రింక్స్‌‌లో ఉండే అత్యంత ప్రమాదకర పదార్థం చక్కెర లేదా దాని ప్రత్యామ్నాయాలుగా వాడే కృత్రిమ చక్కెర (ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్) చక్కెరకు, కృత్రిమ చక్కెరకు… తంబాకు/పొగాకుకు ఉండే లక్షణాలు ఉంటాయి. అంటే.. తాగగా తాగగా అదొక వ్యసనంలా మారే అవకాశం ఉంటుంది.

చక్కెర మనం రోజూ వాడే పదార్థమే కదా, అందులో అంత ప్రమాదం ఏముంటుంది? అనుకోవడం తప్పు. ఎందుకంటే, 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే, అందులో 250 కోట్ల మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నారు. 89 కోట్ల మందికి ఊబకాయం ఉంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక బరువుతో ఉన్నారు. దాదాపు 4 కోట్ల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉండాల్సిన దాని కంటే బరువు ఎక్కువగా ఉన్నారు. దీనికి జంక్‌పుడ్స్, కూల్ డ్రింక్స్ అధిక వినియోగమే కారణమంటూ వాటి వినియోగాన్ని పరిమితం చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఒక్క కూల్ డ్రింకులో 250-300 మి.లీ. ద్రవం ఉంటుంది. అందులో దాదాపు 8-10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. అంటే, ఒక్క బాటిల్ కూల్ డ్రింక్ తాగిన ప్రతిసారీ 45-50 గ్రాముల చక్కర తింటున్నట్టే!

ఒక మనిషికి తను చేసే శారీరక శ్రమను అనుసరించి రోజుకి 1,600 నుంచి 2,800 కేలరీలు అవసరం అవుతాయి. రోజులో చాలాసేపు కూర్చుని ఉండేవాళ్లు రోజుకి 1,600 కేలరీల ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

పొలం పని చేసే వారికి, ఇటుకలు ఎత్తడం లాంటి బరువు పనులు చేసేవారికి దాదాపు 3,000 కేలరీలు అవసరం పడతాయి. మనిషి ఎత్తు, బరువును బట్టి ఈ కేలరీల అవసరం ఎక్కువ, తక్కువ అవుతూ ఉంటుంది.

చక్కెర నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక్క గ్రాము చక్కెర నుంచి 4 కేలరీలు అందుతాయి.

పోషకాలు కాదు కేలరీలు మాత్రమే..

మన రోజువారీ ఆహారంలో చక్కెర అసలు ఒక్క శాతం కూడా అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత్‌లోని ఎన్ఐఎన్ వంటి సంస్థలు చెబుతున్నాయి.

కొన్ని రకాల ఆహార పదార్థాలలో పోషక విలువలు ఏమీ ఉండవు, కేవలం కేలరీలు మాత్రమే ఇచ్చే పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని జంక్ ఫుడ్ అంటాం. మైదాతో చేసే బ్రెడ్, పిజ్జా, బర్గర్, కేక్, కూల్ డ్రింక్స్… ఇలాంటివన్నీ ఈ కేటగిరీలోకే వస్తాయి.

మామిడి, నారింజ, స్ట్రాబెర్రీ అని ఫ్రూట్ జ్యూస్ ల పేరుతో, ORSL పేరుతో రకరకాల కంపెనీ కూల్ డ్రింకులు దొరుకుతున్నా అవి పేరుకి మాత్రమే ఫ్రూట్ జ్యూస్ లు, అందులో ఉండే పండ్ల రసం శాతం 5 శాతానికి మించట్లేదు. ఉన్నదంతా చక్కెర, బుడగల నీళ్లు మాత్రమే అని ఆ బాటిల్ వెనక్కి తిప్పి అందులో ఉండే పదార్థాల జాబితా చూస్తే అర్థమవుతుంది.

అసలు చక్కెర మన రోజువారీ ఆహరంలో తీసుకోకూడదు, ఒకవేళ వాడినా, చక్కెర నుంచి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఒక్క గ్రాము చక్కెర నుంచి 4 కేలరీలు అందుతాయి. అంటే మన శరీరంలోకి 5 నుంచి 10 శాతం కేలరీలు ఒక చిన్న బాటిల్ కూల్ డ్రింక్ తాగితే వచ్చేస్తాయి.

మనం రోజూ తాగే టీ/కాఫీలో వేసుకునే చక్కెర మళ్లీ ఇలాంటి వాటికి అదనం. పిజ్జా, బర్గర్, నూడుల్స్ తో పాటు తినే కెచప్, సాస్ లో కూడా 25-30% శాతం చక్కెరే ఉంటుంది. వాటిల్లో ఉప్పు కూడా ఉంటుంది.

ఉప్పగా ఉన్న ఆహారం తింటే దాహం ఎక్కువగా వేస్తుంది. ఎందుకంటే మన శరీరానికి ఆ ఉప్పుని బ్యాలెన్స్ చేయడానికి, మూత్రం ద్వారా బయటకి పంపడానికి నీళ్లు కావాలి. కానీ అదే పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ లతో కూల్ డ్రింక్ తక్కువ ధరకే ఇస్తారు. వారు ఇవ్వకపోయినా తాగాలి అనిపించి మనమే కొనుక్కుంటాం. ఇలా వాళ్ల వ్యాపారం బాగా సాగుతుంది, కానీ మన ఆరోగ్యం దెబ్బ తింటుంది.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Getty Images

నిద్రలేమికి కారణం

అధిక చక్కెర వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్త పోటు, షుగర్ వ్యాధి, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. రోజూ కూల్ డ్రింక్ తాగడం వల్ల చాలా మందికి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాలేయంలో కొవ్వు శాతం పెరిగి (నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ వల్ల) ఫాటీ లివర్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూల్ డ్రింక్ వల్లనే వస్తాయా అంటే అవును అంటున్నారు శాస్త్రవేత్తలు.

కూల్ డ్రింక్స్ లోని అధిక కెఫీన్ శాతం వల్ల యుక్త వయసు వారు కూడా నిద్రలేమికి గురవుతున్నారని ఇంకో అధ్యయనం చెబుతోంది.

పట్టణాలలోని మాల్స్ నుంచి మొదలు పెడితే పల్లెల్లోని కిరాణా కొట్టు వరకు ఈ కూల్ డ్రింకులు వచ్చేశాయి.

రెండేళ్ల లోపు పిల్లలకు అసలు ఏ ఆహార పదార్థంలోనూ చక్కెర వాడకూడదని ఆరోగ్య సంస్థలు చెబుతుంటే, వాళ్లని స్ట్రా వేసుకుని మరీ కూల్ డ్రింకులు తాగమని తల్లిదండ్రులే ప్రోత్సహించే పరిస్థితి చూస్తున్నాం.

పసి పిల్లల చేతుల్లో పండ్లు, సున్నుండలు, వేరుశెనగ పప్పుండలకు బదులుగా ఉప్పు కుమ్మరించిన చిప్స్, చక్కెర కుమ్మరించిన కూల్ డ్రింకులు కనిపిస్తున్నాయి.

పోషక విలువలున్న పళ్లు, కూరగాయల కన్నా ఇవి చాలా చవకగా అందుబాటులో ఉండే సరికి, పేదవారు కూడా వీటినే ఆశ్రయించి ఊబకాయం బారిన పడుతున్నారు.

చక్కెర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక కేజీ చక్కెర ఉత్పత్తికి అవసరమయ్యే చెరుకు సాగు చేయాలంటే 1500 నుంచి 2000 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి.

‘నీటిని మింగేస్తున్నాయి’

ఇన్ని దుష్ప్రయోజనాలు ఉన్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని కనీసం స్కూళ్లలో, కాలేజీలలో అయినా అమ్మకాలు బ్యాన్ చేయాలని ఎన్నో సంస్థలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలపైన అధికంగా పన్నులు వేయాలని, అలా చేస్తే వాటి కొనుగోలు, వాడకం తగ్గుతాయని డబ్ల్యూహెచ్ఓ, ప్రజా సంఘాల ఆశ.

ఇవన్నీ ఒకెత్తైతే, ఈ కూల్ డ్రింకులకు వాడే ప్లాస్టిక్ బాటిళ్లు, అందులో ఉండే చిన్న బుడగల తాకిడికి విడుదలయ్యే మైక్రో ప్లాస్టిక్కులు, నీటి ప్రమాణాలు (పెస్టిసైడ్ శాతం, కెమికల్స్, మినరల్స్, మొదలైనవి), ఆ నీటి వనరుల కోసం జరిగే ప్రజా పోరాటాలు మరో ఎత్తు.

ఆయా కంపెనీల వాళ్లు చెప్పే లెక్కల ప్రకారం ప్రతి లీటర్ కూల్ డ్రింక్ ఉత్పత్తికి కనీసం రెండు లీటర్ల నీళ్లు అవసరం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 20 ఏళ్ల క్రితం ఇది ఒకటికి నాలుగుగా ఉండేది. వీటి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి ఏమాత్రం మేలు జరగడం లేదు. పోషకాలు ఏమాత్రం లేని చక్కెర కోసం పండించే చెరుకు, మొక్కజొన్న (హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కోసం) వంటి మొక్కల వల్ల పంట భూమి సారం కోల్పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం ఒక కేజీ చక్కెర ఉత్పత్తికి అవసరమయ్యే చెరుకు సాగు చేయాలంటే 1,500 నుంచి 2,000 లీటర్ల నీళ్లు ఆ మొక్కలకి సరఫరా చేయాల్సి ఉంటుంది.

(గమనిక: ఇది అవగాహన కోసం అందిస్తున్న సమాచారం మాత్రమే. మీ వ్యక్తిగత డాక్టర్ల సూచనలతో మాత్రమే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)