మొబైల్ ఫోన్ కోసం వెళ్లి తలకిందులుగా బండరాళ్ల మధ్య చిక్కుకున్న మహిళ

ఫొటో సోర్స్, NSW Ambulance
- రచయిత, ఫ్లోరా డ్రురీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన మెటిల్డా క్యాంప్‌బెల్ అనే మహిళ బండరాళ్ల మధ్య పడిపోయిన తన మొబైల్ ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఈ నెల ఆరంభంలో స్నేహితులతో కలిసి హైకింగ్‌కు వెళ్లారు మెటిల్డా.
హైకింగ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో మెటిల్డా మొబైల్ ఫోన్ జారి, బండరాళ్ల మధ్య ఇరుకైన ప్రదేశంలో పడిపోయింది.

ఫొటో సోర్స్, NSW Ambulance
పడిపోయిన మొబైల్ ఫోన్‌ను అందుకునేందుకు ప్రయత్నించిన ఆమె, ప్రమాదవశాత్తు జారిపోయి బండరాళ్ల మధ్యనున్న నెర్రెలాంటి ఇరుకైన ప్రదేశంలో ఇరుక్కుపోయారు.
తలవంచి మొబైల్‌ను అందుకుంటూ అంతే తలకిందులాగా బండ రాళ్ల మధ్యలోకి వెళ్లిపోయారామె.
ఆమెను రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో వారు ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారం ఇచ్చారు.
ఎమర్జెన్సీ సిబ్బంది వచ్చిన తర్వాత కూడా చాలాగంటలపాటు ఆమెను బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు.
సుమారు ఏడు గంటలపాటు మెటిల్డా అలా రాళ్ల మధ్య తలకిందులుగా వేలాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, NSW Ambulance
ఆమెను రక్షించేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది దాదాపు 500 కేజీల బరువున్న బండరాయిని తొలగించాల్సి వచ్చింది.
‘‘నా 10 సంవత్సరాల ఉద్యోగ అనుభవంలో ఇంత కష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనలేదు.’’ అని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన పారమెడిక్ పీటర్ వాట్స్ అన్నారు.
రెస్క్యూ సిబ్బంది వచ్చే వరకు స్నేహితులు ఆమెను రక్షించేందుకు దాదాపు గంటపాటు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
అంబులెన్స్ సర్వీస్ విడుదల చేసిన ఫోటోలలో రాళ్ల మధ్యనున్న సందులో ఆమె అరికాళ్లు బయటకు కనిపిస్తూ ఉన్నాయి.
తనను రక్షించిన రెస్క్యూ సిబ్బందికి మెటిల్డా థ్యాంక్స్ చెప్పారు.
‘‘వాళ్లు నిజంగా నా ప్రాణాలను రక్షించారు’’ అన్నారామె.
కేవలం ఒకట్రెండు చిన్నపాటి గాయాలతో మెటిల్డా బయటకు వచ్చారు. ఈ మొత్తం ఘటన సుఖాంతమైనా, మెటిల్డా మొబైల్ ఫోన్ మాత్రం దొరకనేలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














