దానా: దూసుకొస్తున్న తుపాను, ఏయే రాష్ట్రాలకు ముప్పు?

దానా తుపాను

ఫొటో సోర్స్, Sudipta Das/NurPhoto via Getty Images

    • రచయిత, ప్రభాకర్ మణి తివారీ
    • హోదా, బీబీసీ కోసం

దానా తుపానును ఎదుర్కొనేందుకు పశ్చిమబెంగాల్, ఒడిశా సిద్ధమయ్యాయి.

తుపాను కారణంగా రైలు రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల సహా రెండు వందలకు పైగా రైళ్లు రద్దయ్యాయి.

తీర ప్రాంతాలలో నివసించే దాదాపు మూడు లక్షల మందిని ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రెండు రాష్ట్రాల్లోని కోస్తా జిల్లాల్లో పాఠశాలలకు అక్టోబర్ 25 వరకు సెలవులు ప్రకటించారు. వైద్యులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నానికే తీరప్రాంత పర్యటక ప్రదేశాలైన తూర్పు మేదినిపూర్ జిల్లాలోని దిఘా, తాజ్‌పూర్, శంకర్‌పూర్, డైమండ్ హార్బర్‌లోని అన్ని హోటళ్లలోని ప్రజలను ఖాళీ చేయించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగాళాఖాతంలో అల్ప పీడనం

ఫొటో సోర్స్, Sanjay Das

తీరాన్ని తాకేది ఎప్పుడు?

"దానా తుపాను బుధవారం రాత్రి తీవ్రంగా మారింది. గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయం మధ్య 120 కి.మీ. వేగంతో, 100-110 kmph గాలులతో కూడిన తీవ్రమైన తుపానుగా కదులుతోంది" అని భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

తుపాను ప్రభావం వల్ల ఒడిశాలోని బాలేశ్వర్, మయూర్‌భంజ్, భద్రక్, కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్, కెందుఝర్, జాజ్‌పూర్, కటక్, దేంకనల్, ఖోర్డా, పూరీ జిల్లాల్లోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మేదినీపూర్, ఝర్‌గ్రామ్, హౌరా, హుగ్లీ, కోల్‌కతా, బంకురా జిల్లాలలో కుడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను కూడా వెనక్కి పిలిపించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలను మైకుల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బాధితుల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంటాయని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

రోడ్లను మూసివేశాం: మమతా బెనర్జీ

దానాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసిందని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ విలేకరులకు తెలిపారు.

ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. తీరప్రాంతాల నుంచి లక్షలాది మందిని సహాయక శిబిరాలకు తరలించే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా యంత్రాంగాలు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేశాయి.

"తుపానును దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 26 వరకు ఈ తొమ్మిది జిల్లాలలోని అన్ని రోడ్లను మూసేశాం. తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవటానికి బాధితుల కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు తెరిచాం. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి" అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

ఒడిశా పూరీ

ఫొటో సోర్స్, Sanjay Das

ఫొటో క్యాప్షన్, పూరీలోని జగన్నాథ ఆలయంలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేశారు.

పూరీ నుంచి పర్యటకులు వెనక్కి..

ఒడిశాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయిన పూరీలో పర్యటకులను వెనక్కు పంపారు. ముందస్తు బుకింగ్‌లు ఉన్న వారికి కూడా ప్రవేశం నిలిపేశారు.

పూరీ నుంచి మూడు వేల మందికి పైగా పర్యటకులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపినట్లు ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి చెప్పారు.

ప్రస్తుతం పూరీలోని హోటళ్లన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. వచ్చే నాలుగు రోజులు అన్ని హోటల్ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని పర్యటకులను మంత్రి కోరారు.

రాష్ట్రంలో 14 జిల్లాల్లోని పాఠశాలలకు అక్టోబర్ 25 వరకు సెలవులు ప్రకటించారు. తుపాను నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కూడా వాయిదా పడింది.

అక్టోబర్ 25 వరకు వైద్యులందరికీ సెలవులు రద్దు చేసినట్లు ఒడిశా ఆరోగ్య మంత్రి బిజయ్ మహాపాత్ర తెలిపారు.

రాష్ట్రంలోకి ఇలాంటి తుపానులు వస్తూనే ఉన్నాయని, అందుకే ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెండెంచెల ప్రోటోకాల్‌ను ఏర్పాటుచేసిందని తెలిపారు.

పూరీలోని జగన్నాథ ఆలయం మూసివేశారు, భక్తులకు ప్రవేశం నిలిపివేశారు. అయితే ఆలయంలో నిత్య పూజలు మాత్రం కొనసాగుతాయి.

సముద్రం

ఫొటో సోర్స్, Sanjay Das

ఫొటో క్యాప్షన్, తాజా తుపానుకు ఖతార్ దేశం ‘దానా’ అని పేరు పెట్టింది.

‘దానా’ అంటే..?

గత రెండు నెలల్లో భారత తీరాన్ని రెండు తుపాన్లు తాకాయి. ఒకటి దానా తుపాను కాగా, మరొకటి ఆగస్టు చివరిలో వచ్చిన 'ఆసనా' తుపాను.

తుపానుల కోసం రూపొందించిన ప్రమాణాల ప్రకారం ఖతార్ దేశం ఈ తుపానుకు ‘దానా’ అని పేరు పెట్టింది. 'దానా' అంటే అరబిక్‌లో 'ఉదారత' అని అర్థం.

2000లో ప్రపంచ వాతావరణ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ ఆధ్వర్యంలో తుపానులకు పేర్లు పెట్టడం ప్రారంభమైంది.

ఈ గ్రూపులో తొలుత భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మియన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు ఉండగా, 2018లో ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్‌లు చేరాయి.

ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వాతావరణ సంస్థ తుపాను పేర్ల జాబితాను మారుస్తుంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)