మహాసముద్రాలనే భగభగ మండేలా చేసిన ఉల్క గురించి తెలుసా?

40-60 కి.మీల వెడల్పు ఉండే గ్రహశకలం ఢీకొట్టడంతో 500 కి.మీల బిలం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూమిని ఢీకొట్టిన ఉల్క (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, జార్జినా రన్నర్డ్, క్లైమెట్, సైన్స్ రిపోర్టర్
    • హోదా, బీబీసీ న్యూస్

2014లో కనుక్కున్న అతిపెద్ద ఉల్క గురించి అనేక విషయాలు బయటికొస్తున్నాయి.

ఈ ఉల్క కారణంగా మానవ చరిత్రలోనే అతిపెద్దదైన సునామీ సంభవించిందని, సముద్రాలు భగభగ మండిపోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దాదాపు 300 కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం కంటే, ఈ అంతరిక్ష శిల(స్పేస్ రాక్) 200 రెట్లు పెద్దదని అంచనా వేశారు.

రాళ్ల ముక్కలను పరిశీలించి, ఉల్క ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సుత్తి, ఉలి తీసుకుని దక్షిణాఫ్రికాలో గ్రహశకలం ఢీకొట్టిన ప్రాంతానికి వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జీవజాల అభివృద్ధికి ఉపయోగపడ్డ ఉల్క

భారీ ఉల్క ప్రభావంతో భూమిపై విధ్వంసం మాత్రమే జరగలేదని, మనిషి జీవితం వృద్ధి చెందడానికీ ఇది ఉపయోగపడిందన్న ఆధారాలు శాస్త్రవేత్తల బృందానికి లభించాయి.

‘‘తొలుత భూమి ఏర్పడినప్పుడు చాలా శకలాలు అంతరిక్షం చుట్టూ ఎగురుతున్నాయని, అవి భూమిపై కూలిపోతాయని మనకు తెలుసు’’ అని కొత్త పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నద్జా డ్రాబన్ చెప్పారు.

ఇలాంటి భారీ ఘటనల ప్రభావం భూమిపైన, మనిషి జీవితంపైన చాలా ఉందని, క్రమేణా అది వృద్ధి చెందిందని మనకిప్పుడు ఆధారాలు లభించాయని ఆమె తెలిపారు.

66 మిలియన్ సంవత్సరాల కిందట డైనోసార్లు అంతరించిపోయేలా చేసిన గ్రహశకలం గురించి మనకు బాగా తెలుసు. అది 10 కిలోమీటర్ల వెడల్పు ఉండేది. దాదాపు ఎవరెస్ట్ పర్వతమంత ఎత్తు ఉండేది. కానీ, ‘ఎస్‌2 ఉల్క’ దానికన్నా చాలా పెద్దది. ఈ ఉల్క 40 నుంచి 60 కిలోమీటర్ల వెడల్పు ఉంది. దీని ద్రవ్యరాశి 50 నుంచి 200 రెట్లు ఎక్కువ.

భూమి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఈ భారీ ఉల్క ఢీకొట్టింది. అప్పుడు భూమి చాలా విభిన్నంగా కనిపించేది. మొత్తం నీళ్లతో ఉన్న ప్రాంతంలా ఉండేది. సముద్రాన్ని ఆనుకుని కొన్ని ఖండాలు మాత్రం ఉండేవి. భూమి ఏకకణాలతో ఉండే సూక్ష్మజీవులతో నిండి ఉండేది.

గ్రహశకలం ఢీకొట్టిన ప్రాంతం

ఫొటో సోర్స్, Nadja Drabon

ఫొటో క్యాప్షన్, రాళ్ల అవశేషాలు పరిశీలించడానికి ప్రొఫెసర్ డ్రాబన్ వెళ్లిన ప్రాంతం

రాళ్ల సేకరణ

తూర్పు బార్బెర్టన్ గ్రీన్‌బెల్ట్‌లోని ప్రాంతం, భూమ్మీద ఉల్కల అవశేషాలు ఉన్న పురాతన ప్రాంతాల్లో ఒకటి.

ప్రొఫెసర్ డ్రాబన్ తన సహచరులతో కలిసి మూడుసార్లు అక్కడికి వెళ్లారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో వెళ్లగలిగినంత మేర డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. అక్కడి నుంచి మిగిలిన ప్రాంతానికి బ్యాక్‌ప్యాక్‌లు తగిలించుకుని పైకి ఎక్కారు.

ఏనుగులు, ఖడ్గమృగాల వంటి జంతువుల నుంచి, జాతీయ పార్కులోని వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేందుకు వీలుగా రేంజర్లు మెషిన్ గన్లతో శాస్త్రవేత్తల బృందం వెంట వెళ్లారు.

గ్రహశకలం ఢీకొనడం వల్ల ఏర్పడిన చిన్న చిన్నరాతి శకలాల కోసం వారు వెతికారు. సుత్తి ఉపయోగించి వందల కిలోల రాళ్లను సేకరించి, వాటిని వెంట తీసుకొచ్చారు. ఆ రాళ్లను, శకలాలను పరిశోధనల కోసం ల్యాబ్‌కు పంపారు.

ప్రొఫెసర్ డ్రాబన్ తన లగేజ్‌లో అత్యంత విలువైన రాతి ముక్కలను ఉంచారు.

‘‘భద్రతా సిబ్బంది నన్ను ఆపారు. నేను వారికి సైన్స్ ఎంత ఉత్తేజకరమైందో పెద్ద ఉపన్యాసం ఇచ్చాను. వాళ్లకు విసుగు వచ్చి, నన్ను వెళ్లనిచ్చారు’’ అని డ్రాబన్ చెప్పారు.

ఎస్ 2 ఉల్క భూమిలోకి తీవ్రస్థాయిలో చొచ్చుకొచ్చినప్పుడు ఏం జరిగిందో, దాన్ని శాస్త్రవేత్తల బృందం మరోసారి చేసి చూసింది. అది 500 కిలోమీటర్ల బిలాన్ని ఏర్పరిచింది. రాతి శకలాలు ఊహించలేనంత వేగంగా బయటకు వచ్చి, భూమి చుట్టూ ప్రయాణించే ఓ మేఘంలా ఏర్పడ్డాయి.

శాస్త్రవేత్తల బృందానికి రేంజర్ల రక్షణ

ఫొటో సోర్స్, Nadja Drabon

ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్తల బృందం

రాళ్లు కరిగి వర్షంలా పడితే..

‘‘వర్షం కురిసే మేఘాన్ని ఓ సారి ఊహించుకోండి. కానీ ఆ మేఘం నుంచి నీటి చుక్కలకు బదులు కరిగిన రాళ్లు ఆకాశం నుంచి వర్షంలా కురుస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి’’ అని ప్రొఫెసర్ డ్రాబన్ చెప్పారు.

భూగోళాన్ని ఓ భారీ సునామీ చుట్టముట్టి, సముద్రపు అడుగు భాగాన్నిచీల్చివేసి, తీరప్రాంతాలను ముంచెత్తింది.

ఆ సునామీతో పోలిస్తే 2004లో హిందూమహాసముద్రంలో వచ్చిన సునామీ చాలా చిన్నదని ప్రొఫెసర్ డ్రాబన్ అన్నారు.

ఆ ఉల్కాపాతం శక్తికి...భారీస్థాయిలో ఉత్పత్తయిన వేడి సముద్రాలు భగభగ మండేలా చేసింది. ఆ వేడి తీవ్రతకు పదుల మీటర్ల నీరు ఆవిరైపోయింది. గాలిలో ఉష్ణోగ్రతలు సైతం వంద డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగిపోయాయి.

దీనివల్ల ఆకాశం నల్లగా మారిపోయి, దుమ్ముతో నిండిపోయింది. సూర్యరశ్మి ప్రసరించలేకపోతే భూమి మీద, నీటిలో కిరణజన్య సంయోగ క్రియ మీద ఆధారపడ్డ జీవజాలం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది.

రాళ్లపై పరిశోధనలు

ఫొటో సోర్స్, Nadja Drabon

ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్తల బృందం పరిశీలించిన రాయి

ఫాస్ఫరస్, ఐరన్ ఉనికి

ప్రొఫెసర్ డ్రాబన్, ఆమె బృందం తర్వాత కాలంలో ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. ఈ ఉల్కాపాతం వల్ల సాధారణజీవులకు అవసరమైన ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు బయటపడ్డాయని రాతి ఆధారాల పరిశీలనలో తేలింది.

జీవజాలం ఎంత వేగంగా ధ్వంసమైందో అంతే వేగంగా తిరిగి పునర్ నిర్మితమైందని, వృద్ధి చెందిందని డ్రాబన్ చెప్పారు.

‘‘మనం ఉదయాన్నే బ్రష్ చేసుకుంటాం. దానివల్ల మన నోటిలోని 99.9శాతం బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ సాయంత్రానికి మళ్లీ బ్యాక్టీరియా వస్తుంది. ఇదీ అలాంటిదే’’ అని ఆమె చెప్పారు.

ఇలాంటి భారీ ఘటనల వల్ల భూమిపై జీవనానికి అవసరమైన ఫాస్ఫరస్ వంటివి ఏర్పడ్డాయని తాజా పరిశోధనల్లో తేలింది.

భూమిని తుడిచిపెట్టేసే సునామీ కూడా ఐరన్‌తో ఉన్న నీటిని సముద్రపు లోతుల నుంచి ఉపరితలంపైకి తీసుకొచ్చి, సూక్ష్మజీవులకు అదనపు శక్తిని అందిస్తుంది.

భూమి తొలినాళ్లలో దాన్ని ఢీకొట్టిన గ్రహశకలాల వల్ల జీవుల మనుగడకు ప్రయోజనం కలిగిందన్న శాస్త్రవేత్తల అభిప్రాయానికి తాజా పరిశోధనలు మరింత ఊతమిస్తున్నాయని ప్రొఫెసర్ డ్రాబన్ చెప్పారు.

‘‘ఉల్కాపాతం జరిగిన తర్వాత భూమిపై జీవజాలానికి మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతోంది’’ అని ఆమె తెలిపారు.

తాజా పరిశోధనకు సంబంధించిన అంశాలను సైంటిఫిక్ జర్నల్ పీఎన్‌ఏఎస్‌లో ప్రచురించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)