కనిష్క విమానం పేలుడు కేసులో నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని తామే హత్య చేశామని ఒప్పుకున్న నిందితులు

రిపుదామన్ సింగ్ మాలిక్‌, కనిష్క బాంబు దాడి, కెనడా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2022లో హత్యకు గురైన రిపుదామన్ సింగ్ మాలిక్‌
    • రచయిత, పాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

1985లో ఎయిరిండియా విమానం ‘కనిష్క’ను బాంబుతో పేల్చివేసిన కేసులో నిర్దోషిగా తేలిన రిపుదామన్ సింగ్ మాలిక్‌‌ను హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

ఈ కేసులో సెకండ్ డిగ్రీ మర్డర్‌‌‌గా ఈ హత్యకు పాల్పడినట్లు టన్నర్ ఫాక్స్, జోస్‌ లోపెజ్‌ అనే ఇద్దరు నిందితులు కోర్టులో పిటిషన్లు వేశారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేకుండా ఇతరుల ప్రోద్బలంతో చేసే హత్యలను సెకండ్ డిగ్రీ మర్డర్ అంటారు.

ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసుగా బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్టులో వీరి కేసు విచారణకు వస్తున్న దశలో ఇద్దరూ నేరాన్ని అంగీకరిస్తూ పిటిషన్లు వేశారు.

కేసు విచారణ సందర్భంగా న్యూ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు రూంలో ఫాక్స్, లోపెజ్ మధ్య ఘర్షణ జరిగింది. వాంకోవర్ సన్ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం...నిందితులు ఇద్దరు పరస్పరం పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. వారిని విడిపించి నేల మీద కూర్చొబెట్టి సంకెళ్లు వేశారు పోలీసులు.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘చేసింది మేమే, కాంట్రాక్ట్ ఇచ్చింది వేరే’

కెనడియన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్-సీబీసీ రిపోర్టు మేరకు...సెకండ్ డిగ్రీ మర్డర్ పిటిషన్ అంటేనే వారికి ఆటోమేటిక్‌గా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అయితే, పెరోల్ దరఖాస్తు చేసుకోవడానికి వాళ్లు ఎంతకాలం పాటు శిక్ష అనుభవించాలి అన్నదే ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

2022 జూలై 14న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో కారులో ఉన్న మాలిక్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఓ కాలిపోయిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

నిందితులు ఒప్పుకున్న స్టేట్‌మెంట్ ప్రకారం....మాలిక్‌ను హత్య చేయడానికి ఫాక్స్, లోపెజ్‌లు కాంట్రాక్టు తీసుకున్నారు. అయితే, వారికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అన్నదానికి సరైన ఆధారాలు లేవు.

వారిద్దరూ పోలీసులకు సహకరించి అసలు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అన్న విషయాన్ని బయటపెట్టాలని మాలిక్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

“ఎవరైతే హత్యకు కాంట్రాక్ట్ ఇచ్చారో వారు చట్టం ముందు నిలబడేంత వరకు ఈ కేసు అసంపూర్తిగా ఉన్నట్లే” అని మాలిక్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు.

1985లో ఎయిరిండియా విమానంపై జరిగిన బాంబు దాడిలో కేసులో రిపుదామన్ సింగ్ మాలిక్ 2005లో నిర్దోషిగా విడుదలయ్యారు.

ఇంతకు ఆ కేసు ఏంటి..? ఆ కేసుతో మాలిక్‌కు ఉన్న సంబంధాలు ఏంటి..?

కనిష్క విమాన శకలాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కనిష్క విమాన శకలాలు

1985లో ఏం జరిగింది?

23 జూన్ 1985లో లండన్ మీదుగా కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం ‘కనిష్క’ ఐరిష్ కోస్ట్ వద్ద గాలిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది చనిపోయారు. వీరిలో 268 మంది కెనడా పౌరులు, 24 మంది భారతీయులు ఉన్నారు.

కూలిపోయిన ఈ విమానం కోసం చాలాకాలం అన్వేషణ సాగగా, 131 మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలినవి దొరకలేదు.

చనిపోయిన కెనడా పౌరులలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారు. భారతీయుల బంధువులు కూడా ఉండటంతో ఈ ప్రమాద ఘటన భారతదేశంలో కూడా విషాదం నింపింది.

కెనడా, ఖలిస్తాన్, భారత్, అజైబ్ సింగ్ బగ్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిపుదమన్ సింగ్ మాలిక్, అజైబ్ సింగ్ బగ్రీ

దాడుల వెనుక ఎవరున్నారు?

కనిష్క ఉగ్రదాడి సమయంలోనే, జపాన్‌లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో మరో పేలుడు జరిగింది. ఈ ఘటనలో లగేజ్ హ్యాండిల్ చేసే ఇద్దరు జపాన్ దేశస్తులు మృతిచెందారు. ఈ పేలుడుకు, కనిష్క పేలుడుకు సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.

బ్యాంకాక్ కు వెళ్తున్న మరో ఎయిరిండియా విమానాన్ని పేల్చడమే లక్ష్యంగా కుట్ర పన్నారని, అయితే ఈ బాంబు ముందుగానే పేలిందని దర్యాప్తుతో తేలింది.

ఈ ఉగ్రదాడి వెనుక సిక్కు వేర్పాటు వాదులే ఉన్నారని 1984లో అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో జరిగిన సిక్కుల ఊచకోత ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ దాడులు చేశారని కెనడా దర్యాప్తు అధికారులు తేల్చారు.

ఉగ్రదాడి జరిగిన కొన్ని నెలల తర్వాత నిషేధిత తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సంస్థ నాయకుడు తల్వీందర్ సింగ్ పర్మార్, ఎలక్ట్రీషియన్ ఇంద్రజీత్ సింగ్ రియాత్‌లను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది.

పర్మార్‌పై భారత్‌లో అప్పటికే హత్యకేసులు ఉన్నాయి. కెనడాలోనే దాక్కున్న పర్మార్‌‌ను తమ దేశానికి అప్పగించాలని 1980ల సమయంలో కెనడా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఉగ్రదాడి తరువాత అరెస్టైన పర్మార్‌, నాటకీయ పరిణామాల మధ్య విడుదలయ్యారు. ఆ తరువాత భారత్‌కు వచ్చారు. 1992లో భారత పోలీసుల కాల్పుల్లో ఆయన మరణించారు.

ఈ బాంబు దాడితో సంబంధం ఉందని పేర్కొంటూ కెనడాలోని సిక్కుల వేర్పాటు వాది, వ్యాపారవేత్త అయిన రిపుదమన్ సింగ్ మాలిక్‌, బ్రిటిష్ కొలంబియాకు చెందిన మిల్ వర్కర్ అజైబ్ సింగ్ బగ్రిలను 2000 సంవత్సరంలో కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

కానీ 2005లో ఇద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. వీరిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారి విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నాయని తీర్పు ఇచ్చిన సమయంలో న్యాయమూర్తి అన్నారు.

ఘోరమైన విమానయాన ఉగ్రదాడిగా పేర్కొన్న ‘కనిష్క’ విమాన పేలుడులో ఒక్క రియాత్‌ను మాత్రమే దోషిగా గుర్తించారు. జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన బాంబు పేలుడులోనూ రియాత్‌కు ప్రమేయం ఉందని పేర్కొంటూ 1991లో పదేళ్ల జైలు శిక్ష విధించారు.

కనిష్క విమానంపై దాడి కేసులో రియాత్‌ను 2003లో కెనడా న్యాయస్ధానం దోషిగా తేల్చి మరో ఐదేళ్లు శిక్ష విధించింది. 2000లో కెనడా అధికారులు అరెస్ట్ చేసిన మాలిక్, బగ్రీలపై విచారణ జరిగిన సందర్భంలో రియాత్‌ వారికి సంబంధించి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అదనంగా జైలు శిక్ష అనుభవించాడు.

కనిష్క విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కనిష్క విమానం మృతులకు 2015లో శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కెనడా దర్యాప్తుపై విమర్శలు ఎందుకు వచ్చాయి?

ఉగ్రదాడిని ముందే పసిగట్టడంలోనూ, దాడి జరిగాక చేపట్టిన దర్యాప్తులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కెనడా అధికార యంత్రాంగంపై విమర్శలు ఉన్నాయి.

ఉగ్రదాడి కేసులో అరెస్టైన మాలిక్, బగ్రీలను నిర్దోషులుగా విడుదల చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు పోరాటం మొదలుపెట్టారు.

దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం 2006లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పబ్లిక్ ఎంక్వైరీకి ఆదేశించింది.

2010 వరకు సాగిన దర్యాప్తులో ఈ విమాన దాడికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలో చాలా విషయాలు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించాయి.

ఎయిరిండియా విమానంపై దాడికి కుట్ర జరుగుతోందని కొన్ని నెలల ముందే కొన్ని వర్గాల నుంచి పోలీసులకు సమాచారం కూడా వచ్చిందని నివేదికలో ఉంది.

కెనడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వాంకోవర్‌లో ఉండే పర్మార్, రియాత్‌ల కదలికలపై నిఘా ఉంచారని, దాడికి కొన్ని వారాల ముందు వారిద్దరూ అడవిలోకి వెళ్లిన సమయంలో వారిని వెంబడించిన ఏజెంట్‌కు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని పేర్కొన్నారు. అయితే అది అంత ముఖ్యం కాదని భావించినట్లు ఏజెంట్లు పేర్కొన్నారని నివేదికలో ఉంది.

1990లో దర్యాప్తులో కీలకంగా ఉన్న ఇద్దరు సిక్కు జర్నలిస్టులు లండన్, కెనడాల్లో హత్యకు గురయ్యారు.

2000లో మాజీ కెనడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కెనడా పోలీసులకు ఇవ్వాల్సిన 150 గంటల నిడివి ఉన్న అనుమానితుల కాల్ డేటా టేపులను తానే నాశనం చేసినట్లు తెలిపారు. ఇన్‌ఫార్మర్‌ల గుర్తింపుని బహిర్గతం చేయకుండా ఉండటానికి ఈ పని చేసినట్లు పేర్కొన్నారు.

2010లో దర్యాప్తు నివేదిక బయటకు వచ్చాక, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ బాధిత కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)