షాపూర్జీ సక్లత్‌వాలా: టాటాల వారసుడు కమ్యూనిస్టుగా ఎలా మారారు, గాంధీతో ఎందుకు విభేదించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షెర్లియాన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
షాపూర్జీ సక్లత్‌వాలా భారతదేశంలో ప్రసిద్ధ వ్యాపారవేత్తలైన టాటాల వంశానికి చెందినవారు. ఆయన తండ్రి పత్తి వ్యాపారి. సక్లత్‌వాలా కథ భిన్నమైనది. ఆయన జీవితంలోని ప్రతి మలుపులో పోరాటం, పట్టుదల, ధిక్కారం కనిపిస్తాయి.
ఆయన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడానికి బదులుగా ఓ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ తనదైన మార్గంలో సాగిపోయారు. ప్రభావవంతమైన రాజకీయవేత్తగా ఎదిగారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లతో లాబీయింగ్ చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో విభేదించారు.
అయితే, వ్యాపారవేత్తల కుటుంబంలో జన్మించిన సక్లత్‌వాలా భిన్నమైన మార్గాన్ని ఎలా ఎంచుకున్నారు? బ్రిటన్ తొలి ఆసియా ఎంపీగా ఎలా ఎదిగారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఆయనకు తన కుటుంబంతో ఉన్న సంక్లిష్ట బంధాల్లానే ఉంటాయి.


ఫొటో సోర్స్, Getty Images
ఎస్‌ప్లాండె హౌస్‌లో...
సక్లత్‌వాలా టాటా గ్రూపు వ్యవస్థాపకుడైన జంషెడ్జీ నుసీర్వాన్‌జీ టాటా మనవడు. సక్లత్‌వాలా తల్లిదండ్రులు దోరాబ్జీ, జెర్‌బాయి.
జంషెడ్జీ నుసీర్వాన్‌జీ టాటా చిన్న కుమార్తె జెర్‌బాయి. సక్లత్‌వాలాకు 14 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం ముంబయిలోని జెర్‌బాయి సోదరుడు (ఈయన పేరు కూడా జంషెడ్జీనే)తో కలిసి నివసించడానికి ముంబయిలోని ఎస్‌ప్లాండె హౌస్‌కు మారింది.
సక్లత్‌వాలా చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు.
దీంతో మేనమామ జంషెడ్జీనే సక్లత్‌వాలాను పెంచి పెద్ద చేశారు.
"జంషెడ్జీ ఎప్పుడూ షాపూర్జీని ఇష్టపడేవారు. చిన్న వయసులోనే ఆయనలోని సామర్థ్యాలను గుర్తించారు. షాపూర్జీ సక్లత్‌వాలా పెద్దయ్యాక కూడా ఆయనపై జంషెడ్జీ ప్రత్యేక శ్రద్ధ వహించారు’’ అని సక్లత్‌వాలా కుమార్తె సెహ్రీ తన తండ్రి జీవిత చరిత్ర ‘ది ఫిఫ్త్ కమాండ్‌మెంట్’లో రాశారు.
అయితే, జంషెడ్జీకి సక్లత్‌వాలాపై ఉన్న ప్రేమ ఆయన పెద్ద కుమారుడు దోరాబ్, ఇతర సోదరులకు కోపం తెప్పించేది.
‘‘వారి మధ్య చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా విభేదాలు కొనసాగాయి. అవి ఎప్పటికీ చెరిగిపోలేదు’’ అని సెహ్రీ రాశారు.
దోరాబ్ ఈ విభేదాలతోనే టాటాల వ్యాపార సామ్రాజ్యంలో సక్లత్‌వాలా పాత్రను తగ్గించేలా చేశారని, ఫలితంగా సక్లత్‌వాలా కొత్త మార్గాన్ని అనుసరించడానికి ఇదొక ప్రేరణగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్లేగు తెలిపిన పేద, ధనిక తేడా..
కుటుంబంలోని ఇబ్బందులతోపాటు 1890 చివరలో ముంబయిని కుదిపేసిన బ్యుబోనిక్ ప్లేగు మహమ్మారి సృష్టించిన వినాశనం కారణంగా కూడా సక్లత్‌వాలా ప్రభావితమయ్యారు.
ఈ మహమ్మారి పేదలు, శ్రామిక వర్గాలను ఎంతగానో నష్టపరిచింది. అదే సమయంలో తన కుటుంబంతో సహా సమాజంలోని సంపన్నులు దీని ప్రభావానికి గురికాకపోవడాన్ని ఆయన గమనించారు.
ఆ సమయంలో సక్లత్‌వాలా కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నారు. విప్లవవాద భావాలతో రష్యా నుంచి పారిపోయి వచ్చిన శాస్త్రవేత్త వాల్డెమర్ హఫ్కిన్‌తో సక్లత్‌వాలా కలిసి పనిచేశారు. హాఫ్కిన్ ప్లేగుకు టీకాను అభివృద్ధి చేశారు. సక్లత్‌వాలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు ఈ టీకా తీసుకునేలా ఒప్పించారు.
"వారి దృక్పథాలలో చాలా సారూప్యం ఉండేది. ఆదర్శవాద వృద్ధ శాస్త్రవేత్తకు, యువ, దయగల విద్యార్థికి మధ్య ఉన్న ఈ సన్నిహిత సంబంధం, షాపూర్జీకి బలమైన నమ్మకాలు కలగడానికి కారణమైంది’’ అని సెహ్రీ రాశారు.
షాపూర్జీ సక్లత్‌వాలా జీవితంపై బలమైన ప్రభావం చూపిన మరో బంధం వెయిట్రెస్ సాలీ మార్ష్. ఆమెను 1907లో సక్లత్‌వాలా వివాహం చేసుకున్నారు. సాలీ మార్ష్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. మొత్తం 12 మంది సంతానంలో మార్ష్ నాలుగో కుమార్తె. మార్ష్ కుటుంబంలోని అందరూ కష్టపడితే తప్ప వారి కడుపు నిండేది కాదు.
సంపన్న కుటుంబానికి చెందిన సక్లత్‌వాలా మార్ష్‌తో ప్రేమలో పడ్డారు. మార్ష్ ద్వారా ఆయన బ్రిటన్ కార్మికవర్గంలోని కల్లోలాలను తెలుసుకోగలిగారు. పాఠశాల, కళాశాలలోని జెసియట్ ప్రీస్ట్, నన్స్ కారణంగానూ తన తండ్రి, ప్రభావితమయ్యారని సెహ్రీ రాశారు.
సక్లత్‌వాలా 1905లో బ్రిటన్‌కు వెళ్లాక, పేదలు, అణగారిన వర్గాలకు సాయం చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1909లో లేబర్ పార్టీలో చేరిన ఆయన, 12 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
భారత దేశంలోనూ, బ్రిటన్‌లోనూ శ్రామికవర్గ హక్కుల గురించి ఆయన లోతుగా ఆలోచించేవారు. సామ్రాజ్యవాదం పేదరికాన్ని నిర్మూలించలేదని, సామ్యవాదంతో మాత్రమే పేదరిక నిర్మూలన జరగడంతో పాటు, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం దక్కుతుందని విశ్వసించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘డియర్ కామ్రేడ్ గాంధీ’
సక్లత్‌వాలా ఉపన్యాసాలకు మంచి ఆదరణ లభించడంతో ఆయన అనతికాలంలోనే ప్రసిద్ధి పొందారు. 1922లో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికై దాదాపు ఏడేళ్ల పాటు ఎంపీగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన భారత స్వాతంత్య్రం కోసం తీవ్రంగా వాదించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ బ్రిటిష్-ఇండియన్ ఎంపీ ఆయనను ప్రమాదకరమైన "రాడికల్ కమ్యూనిస్టు"గా అభివర్ణించారు.
బ్రిటన్‌లో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన భారత్‌లో పర్యటించారు. దేశంలోని కార్మికవర్గం, యువజాతీయవాదులు తమను తాము నిరూపించుకోవాలని, స్వాతంత్య్రోద్యమానికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన పర్యటించిన ప్రాంతాలలో భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి సహాయపడ్డారు.
కమ్యూనిజంపై సక్లత్‌వాలాకు ఉన్న గట్టి అభిప్రాయాల కారణంగా, తమ ఉమ్మడి ప్రత్యర్థిని ఓడించే విషయంలో ఆయన మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో తరచూ విభేదించేవారు.
వారిద్దరూ ఎలాంటి అభిప్రాయాలనైనా స్వేచ్ఛగా చెప్పేవారని, ‘డియర్ కామ్రేడ్ గాంధీ’ అని సంభోదిస్తూ గాంధీకి సక్లత్‌వాలా రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, ప్రజలు ఆయనను మహాత్మా అని పిలవడాన్ని కూడా సక్లత్‌వాలా వ్యతిరేకించారు.
వీరిద్దరూ ఎప్పుడూ ఒక అంగీకారానికి రానప్పటికీ, ఒకరితో ఒకరు సుహృద్భావంతో ఉండేవారు. బ్రిటిష్ పాలనను పడగొట్టాలనే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు.

ఫొటో సోర్స్, Picryl
చల్లారని స్వాతంత్య్ర కాంక్ష
భారతదేశంలో సక్లత్‌వాలా ఉద్వేగభరిత ప్రసంగాలు బ్రిటిష్ అధికారులను కలవరపరిచేవి. 1927లో ఆయనను మాతృదేశానికి (భారత్‌కు) ప్రయాణించకుండా నిషేధించారు. 1929లో ఆయన బ్రిటిషు పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోల్పోయారు. కానీ, భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం కొనసాగించారు.
సక్లత్‌వాలా 1936లో మరణించే వరకు బ్రిటిష్ రాజకీయాల్లోనూ, భారత జాతీయోద్యమంలో ఓ ప్రముఖ వ్యక్తిగా కొనసాగారు. లండన్‌లోని ఒక శ్మశానవాటికలో ఆయన తల్లిదండ్రులు, జంషెడ్జీ టాటా సమాధుల పక్కనే సక్లత్‌వాలాను ఖననం చేశారు. తద్వారా ఆయనను టాటా వంశం, వారి వారసత్వతంతో ఏకం చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














