‘అవును, కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు నా కొలీగ్స్ ప్రయత్నించారు’

ఫొటో సోర్స్, @HCI_Ottawa
తనపై, భారత ప్రభుత్వంపై కెనడా చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని కెనడాలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ అన్నారు. కెనడా చేసిన ఆరోపణలకు ఎలాంటి చట్టపరమైన ఆధారాలు లేవన్నారు.
2023 జూన్‌లో జరిగిన ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో సంజయ్ కుమార్ వర్మతో పాటు భారత్‌కు చెందిన మరికొందరు దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించింది.
కెనడా వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన భారత్, తమ దౌత్యవేత్తలను ఆ దేశం నుంచి ఉపసంహరించుకుంది. అలాగే, భారత్‌లోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత ప్రభుత్వం బహిష్కరించింది.
భారత హైకమిషనర్‌ను, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని కెనడా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.


ఫొటో సోర్స్, X/VIRSA SINGH VALTOHA
‘రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు’
సంజయ్ కుమార్ వర్మ కెనడాకు చెందిన సీటీవీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై, భారత ప్రభుత్వంపై వచ్చిన పలు కీలక ప్రశ్నలు, ఆరోపణలపై సమాధానాలు చెప్పారు.
కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ మద్దతుదారులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.
‘‘ప్రొ-ఖలిస్తాన్ అనేది కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(సీఎస్ఐఎస్)కు విలువైన ఆస్తి’’ అని సంజయ్ కుమార్ అన్నారు.
‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మాపై ఆరోపణల చేసింది. నేను చేస్తున్న ఆరోపణ కూడా అలాంటిదే. నేను దీనికి ఎలాంటి ఆధారాలు చూపించడం లేదు’’ అని సంజయ్ కుమార్ వర్మ చెప్పారు.
మీరు ఎలాంటి తప్పూ చేయనప్పుడు, కెనడా అధికారులకు ఎందుకు సహకరించడం లేదు? అని సంజయ్ వర్మను సీటీవీ ప్రతినిధి ప్రశ్నించారు.
‘‘దీనిపై మాకు ఆధారాలు కావాలి. కానీ, దురదృష్టవశాత్తు మాకు ఎవరూ ఎలాంటి ఆధారాలు ఇవ్వడం లేదు. ఏ రుజువులు మాతో పంచుకున్నా, అవి చట్టపరంగా ఆమోదయోగ్యమైనవిగా ఉండాలి. కెనడా మాదిరిగానే భారత్ కూడా చట్టబద్ధమైన పాలనతో నడిచే దేశం. నాకు రుజువులు చూపించకుండా నేనెలా నా తరఫున వాదించుకునేది?’’ అని సంజయ్ వర్మ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు’
నిజ్జర్ రహస్య స్థావరాల గురించి మీరేమైనా సమాచారాన్ని సేకరించారా? అని వర్మను ఇంటర్వ్యూలో అడిగారు.
అలాగే, కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కదలికలను గమనిస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై కూడా పలు ప్రశ్నలు సంధించారు.
‘‘భారత హైకమిషనర్‌గా, నేను అలాంటి పనులు చేయలేదు. అవును, కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు నా కొలీగ్స్ ప్రయత్నించారు. ఇది పూర్తిగా మా దేశ భద్రతకు సంబంధించినది’’ అని సంజయ్ వర్మ అన్నారు.
‘‘నేను వార్తాపత్రికలను చదువుతాను. పంజాబీ అర్థం చేసుకుంటాను. సోషల్ మీడియా పోస్టుల ద్వారా వారేం చేస్తున్నారో తెలుసు. ఏ హత్యల్లో కూడా భారత ప్రభుత్వ ప్రమేయం లేదని నేను పూర్తి గ్యారెంటీ ఇస్తాను. నిజ్జర్ లేదా మరెవరి హత్యనైనా సరే నేను ఖండిస్తాను’’ అని చెప్పారు.
‘‘భారత్, కెనడాల మధ్య వివాదానికి సంబంధించిన మూలాన్ని మేం కనుగొనాలి. దీని కోసం మాకు కెనడా ఆధారాలు ఇవ్వాలి. మా ఆధారాలను కూడా మేం అందిస్తాం. కెనడాకు మేం 26 పత్రాలు ఇచ్చాం. వాటి పరిస్థితి ఏమైంది?’’ అని సంజయ్ కుమార్ వర్మ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Justice Department
‘అభివృద్ధి చెందిన దేశాల ఆదేశాలతో పనిచేసే కాలం పోయింది’
అమెరికాలో జరిగిన సంఘటన గురించి భారత్‌కు తెలియగానే, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంజయ్ కుమార్ వర్మ తెలిపారు.
భారత్- అమెరికా సంబంధాలపై మాట్లాడే అధికారం తనకు లేదన్నారు.
ఓ అమెరికా పౌరుడి హత్యకు కుట్ర పన్నారని, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ భారత పౌరుడు వికాస్ యాదవ్‌పై అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా న్యాయ శాఖ ఇటీవల ప్రకటించింది.
2023లో న్యూయార్క్ నగరంలో అమెరికా పౌరుడు, సిక్కు వేర్పాటువాద నేత గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు విఫలయత్నం చేశారంటూ ఈ కేసు నమోదైంది.
పన్నూ హత్యకు కుట్ర పన్నడంలో వికాస్ యాదవ్ కీలక పాత్ర పోషించారని అమెరికా అధికారులు ఆరోపించారు.
వికాస్ యాదవ్ భారత ప్రభుత్వ ఉద్యోగి అని అమెరికా న్యాయ శాఖ చెప్పగా.. భారత్ మాత్రం ఆయన తమ ప్రభుత్వ ఉద్యోగి కాదని అంటోంది.
‘‘అభివృద్ధి చెందిన, పశ్చిమ దేశాలు చెబితే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు చేసే రోజులు పోయాయి. చట్టబద్ధమైన పాలన సాగించే దేశం మాది. ఒకవేళ కెనడా మాకు ఎలాంటి ఆధారాలను సమర్పించకపోతే, ఈ ఆరోపణలకు ఆధారం ఏంటి?’’ అని సంజయ్ కుమార్ వర్మ ప్రశ్నించారు.
కెనడాలో నివసించే ఖలిస్తాన్ మద్దతుదారులు భారత పౌరులు కాదని, వారు కెనడా పౌరులని సంజయ్ అన్నారు. మరో దేశ సమగ్రతకు, సౌర్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు తమ పౌరులను ఏ దేశమూ ప్రోత్సహించకూడదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వివాదం వల్ల ఇరు దేశాల మధ్యనున్న వాణిజ్యం, కమ్యూనికేషన్, విద్య, సాంస్కృతిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడదని ఇంటర్వ్యూ చివరిలో సంజయ్ కుమార్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్- కెనడాల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి?
2023 జూన్‌లొ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో సర్రేలోని ఓ సిక్కు గురుద్వారా బయట ముసుగులు ధరించిన ఇద్దరు సాయుధులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. కెనడాలోని వాంకోవర్‌లో గురు నానక్ సిక్కు గురుద్వారాకు నిజ్జర్ అధ్యక్షుడు.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు అధినేతగా నిజ్జర్ పనిచేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు ఆపరేటింగ్, నెట్‌వర్కింగ్, ట్రైనింగ్, ఆర్థిక సాయాన్ని అందించడంలో ఆయన సాయపడేవారనే ఆరోపణలు ఉన్నాయి.
నిజ్జర్ హత్య ‘టార్గెటెడ్ ఎటాక్’గా కెనడా పోలీసులు ఆరోపించారు. ఈ ఘటన కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో గతంలో అన్నారు.
నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనే ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు కెనడా పార్లమెంట్‌లో ట్రూడో చెప్పారు.
2023 అక్టోబర్‌లో 40 మంది కెనడా దౌత్యవేత్తలకు ఉన్న దౌత్యపరమైన మినహాయింపును భారత్ రద్దు చేసింది.
దీనివల్ల భారత్‌లోని కెనడా రాయబార కార్యాలయంలో పనిచేసే మూడింట రెండు వంతుల మంది సిబ్బంది భారత్‌ను వీడాల్సి వచ్చింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














