వారంలో దాదాపు 90 కాల్స్, బాంబు బెదిరింపులతో విమాన ప్రయాణికుల్లో భయం.. అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత విమానయాన సంస్థలే లక్ష్యంగా నకిలీ బాంబు బెదిరింపులు పెరుగుతుండటం విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
గతవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో వెచ్చటి దుస్తులు ధరించిన ప్రయాణికులు, చల్లని గాలిలో కెనడాలోని మారుమూల నగరమైన ఇకల్యూట్‌లో ఎయిర్ ఇండియా విమానం నుంచి కిందకు దిగడం కనిపించింది.
ముంబయి నుంచి అమెరికాలోని షికాగోకు వెళ్తున్న ఈ బోయింగ్ 777 విమానంలో 211 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు బెదిరింపు కారణంగా అక్టోబర్ 15 ఉదయం ఈ విమానం రూట్ మార్చాల్సి వచ్చింది.
“మేము 200 మంది ప్రయాణికులం ఉదయం 5 గంటల నుంచి విమానాశ్రయంలో చిక్కుకున్నాం. ఏం జరుగుతుందో, ఏం చేయాలో తెలియడం లేదు” అని హరిత్ సచ్‌దేవా అనే ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
విమానాశ్రయ సిబ్బందిని ఆయన ప్రశంసిస్తూనే, ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అంతగా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలియని, మారుమూల ప్రాంతానికి వెళ్లిన ప్రయాణికుల నిరాశ, ఆందోళనను సచ్‌దేవా పోస్ట్ ప్రతిబింబిస్తుంది. కొన్ని గంటల తర్వాత ఒక కెనడియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఆ ప్రయాణికులను షికాగోకు తీసుకెళ్లడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆన్‌లైన్‌లో ‘బెదిరింపు’ పోస్టు రావడంతో విమానాన్ని ఇకల్యూట్‌కు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఒకే రోజు 41 బెదిరింపులు..
గతవారం విమానాలకు దాదాపు 90 బెదిరింపులు వచ్చాయి. వీటి ఫలితంగా విమానాల మళ్లింపులు, రద్దులు, జాప్యాలు జరిగాయి. జూన్‌లో ఒకే రోజు 41 విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి, దాంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచారు.
2014, 2017ల మధ్య విమానాశ్రయాలకు 120 నకిలీ బాంబు హెచ్చరికలు వచ్చాయి. అందులో దాదాపు సగం దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలైన దిల్లీ, ముంబయిలకు వచ్చాయి. అలాంటి బెదిరింపుల సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగింది.
విమానయాన సంస్థలు లక్ష్యంగా, విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించే ఇటీవలి చర్యలపై విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
"ఇవన్నీ దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి దుర్మార్గమైన, చట్టవిరుద్ధమైన చర్యలు ఆందోళన కలిగించే విషయాలు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఇలా చేస్తున్నారు?
విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకునే బూటకపు బాంబు బెదిరింపులు చాలావరకు హానికరమైన ఉద్దేశం, పలువురి దృష్టిని ఆకర్షించడం, మానసిక ఆరోగ్య సమస్యలు, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం లేదా చిలిపితో ముడిపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
2018లో ఇండోనేషియాలో విమాన ప్రయాణికులు బాంబులపై వేసుకున్న జోకులు విమాన అంతరాయాలకు దారితీశాయి. ఫ్లైయర్లు (విమాన ప్రయాణికులు) కూడా దోషులుగా తేలారు. గత సంవత్సరం బిహార్‌లోని విమానాశ్రయంలో తన చెక్-ఇన్ లగేజీ తప్పిపోవడంతో విసుగు చెందిన ఒక ప్రయాణికుడు బూటకపు బాంబు హెచ్చరికతో కాల్ చేసి, స్పైస్‌జెట్ విమానాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌ను ఈ ఘటనలు దెబ్బతీస్తాయి. భారత పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గత ఏడాది 15 కోట్ల మందికి పైగా దేశీయ ప్రయాణాలు చేశారు. 33 అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా 150కి పైగా ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి ప్రతిరోజూ 3,000కు పైగా విమానాలు దేశంలోకి వస్తాయి, బయలుదేరుతాయి.
అక్టోబర్ 14న భారత విమానయాన సంస్థలు రికార్డు స్థాయిలో 4,84,263 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ, గతవారం విమానాలకు నకిలీ బెదిరింపులు చాలా పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 700 కంటే తక్కువ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలు సర్వీస్‌లో ఉన్నాయని, మరో 1,700 విమానాలకు ఆర్డర్ చేశారని కన్సల్టెన్సీ సంస్థ సిరియమ్‌కు చెందిన రాబ్ మోరిస్ తెలిపారు.
"ఇవన్నీ ఖచ్చితంగా భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందించే వాణిజ్య విమానాల మార్కెట్‌గా మారుస్తాయి" అని మోరిస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
బెదిరింపులతో భారీ నష్టాలు..
బాంబు బెదిరింపులను అందుకుంటున్న విమానయాన సంస్థలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. ఆ సమయంలో విమానం గాలిలో ఉంటే దాన్ని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలి. ఇలాగే గతవారం ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాకు, సెప్టెంబర్‌లో ముంబయి నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే విస్తారా విమానాన్ని తుర్కియేకు మళ్లించారు.
కొన్నిసార్లు బాంబు బెదిరింపులను ఎదుర్కొన్న విమానాలకు భద్రత కల్పించడానికి ఫైటర్ జెట్‌లను పిలుస్తున్నారు. గత వారం బ్రిటన్‌లోని నార్‌ఫోక్ మీదుగా వెళ్లిన ‘ఎయిర్ ఇండియా’ విమానం, అలాగే సింగపూర్ వెళుతున్న ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ విమానానికి అలాగే చేశారు. ఆ విమానాలకు రక్షణగా బ్రిటన్, సింగపూర్ యుద్ధవిమానాలు వెళ్లాయి.
విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులు దిగిపోతారు. అనంతరం సామగ్రిని, క్యాటరింగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియకు చాలా గంటలు పట్టవచ్చు. అదే సమయంలో డ్యూటీ అవర్ పరిమితుల కారణంగా సిబ్బంది విమానాలలో పనిచేయలేరు. ఫలితంగా మిగతా సిబ్బందిని భర్తీ చేయాలి. ఇది మరింత ఆలస్యమయ్యేలా చేస్తుంది.
ఇవన్నీ భారీ ఖర్చు, నెట్‌వర్క్ చిక్కులు కలిగిస్తాయని విమానయాన నిపుణుడు సిధరత్ కపూర్ చెప్పారు.
"ఆలస్యమైన లేదా దారి మళ్లించిన ప్రతీ విమానం చాలా నష్టపోతుంది. ఎందుకంటే నేలపైనే ఉండే విమానాలు డబ్బును కోల్పోతాయి. విమానాల ఆలస్యాలు కూడా రద్దులకు దారితీస్తాయి, షెడ్యూల్‌లు మారిపోతాయి" అని సిధరత్ కపూర్ చెప్పారు.
అనామక సోషల్ మీడియా ఖాతాల నుంచి బాంబు బెదిరింపులు పెరగడంతో బాధ్యులను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ బెదిరింపుల వెనుక కారణాలు అస్పష్టంగా ఉన్నాయి.
ఇది ఒక వ్యక్తి, ఒక గ్రూపు లేదా వ్యక్తులు ఒకరిని చూసి మరొకరు చేస్తున్నారా? అనేది ఖచ్చితంగా తెలియదు.
నాలుగు విమానాలను టార్గెట్ చేసిన 17 ఏళ్ల యువకుడు..
నకిలీ బాంబు బెదిరింపులు చేయడానికి సోషల్ మీడియా ఖాతాను సృష్టించిన 17 ఏళ్ల స్కూల్ డ్రాపౌట్‌ను పోలీసులు గతవారం అరెస్టు చేశారు.
అతను ఇలా చేయడానికి గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఆ యువకుడు నాలుగు విమానాలను లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. వీటిలో మూడు విదేశాలకు వెళ్లే విమానాలు. ఇందులో రెండు విమానాలు ఆలస్యమయ్యాయి, ఒకదాన్ని దారి మళ్లించారు. మరొకటి రద్దు చేశారు.
కొన్ని బెదిరింపులు లండన్, జర్మనీల నుంచి వచ్చి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షలున్నాయా?
ఈ నకిలీ బెదిరింపులు చేసే వారిని గుర్తించడం పెద్ద సవాలు.
విమానాశ్రయ భద్రత లేదా సేవలకు అంతరాయం కలిగించే బెదిరింపులకు భారత చట్టంలో జీవిత ఖైదు ఉన్నప్పటికీ, ఈ శిక్ష నకిలీ బెదిరింపులకు చాలా పెద్దది కావొచ్చు. దీంతో కోర్టులలో నిలబడకపోవచ్చు.
దోషులను నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చడంతో పాటు ఐదేళ్లు జైలుశిక్ష పడేలా కొత్త చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోందని కథనాలు చెబుతున్నాయి.
ఈ నకిలీ బెదిరింపులు ప్రయాణికులకు చాలా ఆందోళన కలిగిస్తాయి.
బెదిరింపుల కారణంగా బుక్ చేసుకున్న విమానంలో వెళ్లాలా? వద్దా? అని అడగడానికి తన ఆంటీ ఫోన్ చేశారని ఒక ఏవియేషన్ కన్సల్టెంట్ గుర్తుచేసుకున్నారు. రైల్లో రావాలా? అని ఆమె అడిగారని తెలిపారు. ‘’దయచేసి విమానంలో వెళ్లడం కొనసాగించండి’’ అని సలహా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
ఈ బెదిరింపులు జీవితాలను అస్తవ్యస్తం చేస్తూ భయాలనూ సృష్టిస్తున్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














