టీచర్, పశువుల డాక్టర్, బ్యూటీషియన్ చేతుల్లో గన్స్ ఎందుకున్నాయి?

ఫొటో సోర్స్, BBC/James Cheyne
యుక్రెయిన్‌లోని బుచా నగరంపై చీకటి పరుచుకోగానే ఇబ్బడి ముబ్బడిగా రష్యన్ డ్రోన్ల దాడులు మొదలవుతాయి. ఈ దాడుల నుంచి నగరాన్ని రక్షించేందుకు సాహసవంతులైన మహిళలు వీధుల్లోకి వస్తారు.
ధైర్యవంతులైన మహిళా స్వచ్ఛంద కార్యకర్తల బృందం పేరు బుచా విచెస్. ఇందులోని మహిళలు యుక్రెయిన్ గగనతల రక్షణ యూనిట్‌లో భాగం. దేశంలోని ఎక్కువ మంది పురుషులు యుద్ధక్షేత్రానికి వెళ్లడంతో ఈ మహిళా యూనిట్ గగనతల రక్షణ కోసం పోరాడుతోంది.
యుక్రెయిన్ ప్రధాన రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంలో భాగంగా రష్యా అనేక డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ దాడులను ‘విచెస్ ఆఫ్ బుచా’ బృందం ఎదుర్కొంటోంది. డ్రోన్లను కూల్చేస్తోంది.
చీకటిపడిన తరువాత ఈ పని చేయాల్సి రావడంతో వీరంతా పగటిపూట టీచర్లు, డాక్టర్లు, బ్యూటీషియన్లుగా తమ పాత్ర నిర్వహిస్తూనే రాత్రివేళ దేశం కోసం నడుం బిగిస్తున్నారు.


ఫొటో సోర్స్, BBC/James Cheyne
‘నా వయసు 51, బరువు 100 కిలోలు’
యుక్రెయిన్ దళాలు ఈ ప్రాంతాన్ని 2022 మార్చి చివరిలో విముక్తం చేసిన తరువాతే ఇక్కడ రష్యన్ దళాలు చేసిన హత్యలు, అపహరణలు, హింసాత్మక దాడుల గురించి ప్రపంచానికి తెలిసింది.
‘‘నా వయసు 51. బరువు 100 కిలోలు. పరుగెత్తలేను. వారు నన్ను వెనక్కి పంపుతారని అనుకున్నాను. కానీ నన్ను వారు డ్రోన్లను ధ్వంసం చేసే బృందంలోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది’’ అని పశువైద్యురాలు వాలెంటీనా చెప్పారు.
ఈ పనిలోకి రావడానికి తనను ప్రోత్సహించిన స్నేహితుల గురించి, యుద్ధంలో మృతి చెందిన మిత్రుల గురించి ఆమె మాట్లాడారు.
‘‘నేను ఈ పని చేయగలను’’ అని వాలెంటీనా చెప్పారు. ‘‘ఈ కిట్ చాలా బరువుగా ఉంది. అయినా సరే, మేం ఈ పని చేయగలం’’ అని అన్నారు.
ఇంతలో ఆ ప్రాంతమంతటికీ ఎయిర్ అలర్ట్ జారీ అయింది. వాలెంటీనా బృందం వెంటనే తమ స్థావరం నుంచి ఆ చీకట్లోనే పికప్ ట్రక్కులో బయల్దేరారు. ఆ టీంలోని నలుగురు సభ్యులు తమ ఆయుధాలతో బయటకు దూకారు.

ఫొటో సోర్స్, BBC/James Cheyne
‘పురాతన ఆయుధాలు’
బుచా విచెస్ దగ్గరున్న మెషిన్‌గన్స్ చాలా పాతవి. కొన్ని 1930ల నాటివి. రెడ్ స్టార్స్ ముద్రించిన మందుగుండు సామాగ్రి పెట్టెలు అయితే సోవియట్ రోజులవి.
ఈ మెషిన్‌గన్‌కు అంతర్గత కూలింగ్ వ్యవస్థ లేకపోవడంతో, వాటిని చల్లబరిచేందుకు ఈ బృందంలోని ఏకైక మగవ్యక్తి సెర్హి మంచినీళ్ల బాటిల్‌లోని నీటిని దానిపై చల్లారు. ఇది యుక్రెయిన్ పరిమిత వనరుల అవస్థను తెలుపుతోంది.
అందుకే మరిన్ని ఆయుధాలు కావాలని తన మిత్రదేశాలను యుక్రెయిన్ పదేపదే కోరుతోంది.
అయినా ఆ పాత ఆయుధాలు బాగానే పనిచేస్తున్నాయని, వాటితోనే మూడు డ్రోన్లను కూల్చివేశామని మహిళలు చెప్పారు.
‘‘నా పని శబ్దాలు వినడమే. అది కాస్త ఇబ్బందికరమైన పనే. కానీ మేం చీమ చిటుక్కుమన్నా వినగలిగే ఏకాగ్రతతో ఉండాలి’’ అని వాలెంటీనా చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/James Cheyne
‘పాఠాలు చెబుతా, యుద్ధమూ చేస్తా’
వాలెంటీనా స్నేహితురాలు ఇన్నా వయసు కూడా 50కి పైనే ఉంటుంది. ఆమెకు ఇది మొదటి మిషన్.
‘‘అది చాలా భయం గొలుపుతోంది. అయినా బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులం కదా... ఈ భయం ఓ లెక్క కాదు. డ్రోన్లను పడగొట్టడం కష్టం కాదు. మూడుసార్లు నేను ఆ పని చేశాను. ఈ మెషిన్‌లో నా పేరు చెర్రీ’’ అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఆమె ఓ లెక్కల టీచరు కూడా. ఆమె తన స్థావరం నుంచి బయటకు వచ్చి పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పి వస్తుంటారు.
‘‘నా కారులో బట్టలు, చెప్పులు, లిప్‌స్టిక్ పెట్టుకుని ఉంటాను. వారికి పాఠాలు చెప్పగానే వెంటనే తిరిగి వచ్చేస్తాను’’ అని ఇన్నా చెప్పారు.
‘‘మగవాళ్లందరూ యుద్ధానికి వెళ్లారు. యుక్రెనియన్ మహిళలు చేయలేని పని ఏముంది? మేం ఏదైనా చేయగలం’’ అని ఆమె అన్నారు.
ఈ స్వచ్ఛంద కార్యకర్తల బృందంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలియదు. కానీ రష్యా ప్రతి రోజూ రాత్రి పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ప్రయోగిస్తుండటంతో పెద్ద పెద్ద నగరాలకు, పట్టణాలకు వీరు అదనపు రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
ఈ బృందం ఉన్న ప్రదేశంలో యులియా తన టాబ్లెట్‌లో రెండు డ్రోన్ల జాడను గుర్తించారు. కానీ అవి దూరంగా పొరుగు ప్రాంతంలో ఉన్నాయి. వాటి వల్ల బుచాకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ వాటి వల్ల పూర్తిగా ప్రమాదం తొలగిపోయే దాకా మెషిన్‌గన్లతో సిద్ధంగా ఉండాలి.

ఫొటో సోర్స్, BBC/James Cheyne
‘మహిళల వల్ల అవుతుందా?’
వలంటీర్ల కమాండర్ ఆండ్రీ వెర్లాటీ. ఆయన ఇటీవలే యుద్ధం తారస్థాయిలో ఉన్న తూర్పు డాన్సాస్ ప్రాంతంలోని పోక్రోవ్స్క్ నుంచి తిరిగి వచ్చారు. ‘‘అక్కడ పేలుళ్లు నిరంతరాయంగా జరుగుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.
ఆయన 200 మందితో కూడిన సంచార గగనతల రక్షణ బృందాలను పర్యవేక్షిస్తున్నారు. రాత్రివేళ వీరు గస్తీ నిర్వహిస్తారు. నిజానికి వీరిలో చాలామందికి మిలిటరీ సేవలు అందించేందుకు అర్హత లేదు. కానీ ఎక్కువమంది సైనికులు అవసరమవడంతో యుక్రెయిన్ చట్టంలో చేసిన మార్పుల కారణంగా కల్నల్ పరివారంలో చాలామంది హఠాత్తుగా యుద్ధానికి అర్హత సాధించారు.
‘‘నా పరివారంలో 90 శాతం మంది సైన్యంలోకి వచ్చారు’’ అని చెప్పారు.
‘‘మొదట్లో మహిళలను తీసుకుందామనే మాట జోక్‌లా అనిపించింది. వారిపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఆ పరిణామం నిజంగా పెద్దమార్పు తీసుకువచ్చింది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/James Cheyne
వారాంతాలలో శిక్షణ
ఈ మహిళలు తమ వారాంతాలను విస్తృతమైన సరిహద్దు సైనిక శిక్షణలో గడుపుతారు. మేం అక్కడకు వెళ్లినరోజు భవనంపై దాడి చేయడం గురించిన మొదటి శిక్షణ పొందుతున్నారు. వారు ఓ ఫామ్ హౌస్ శిథిలాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు తుపాకులు పట్టుకుని ముందుకు సాగారు.
కొంతమంది ఇతరుల కంటే చాలా సౌకర్యంగా కదులుతూ కనిపించారు. కానీ మిగిలిన మహిళల నిబద్ధత, వారి ఏకాగ్రత చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వారు ఈ పనిని లోతైన కారణాలతో మనస్ఫూర్తిగా ఎంచుకున్నారు.
"జీవితం మారిపోయింది, మా ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. కానీ ఈ యుద్ధం త్వరగా ముగిసేందుకు సాయపడటానికే నేను ఇక్కడ ఉన్నాను"అని ఒక మహిళ చెప్పారు.
ఆఫీసు మేనేజర్‌గా పనిచేస్తూ ఈ బృందంలో చేరిన అన్య వయసు 52 ఏళ్లు. సైనిక శిక్షణ తమను రాటుదేల్చిందని చెప్పారు.
"రష్యా ఆక్రమణ సమయంలో నేను ఎవరికీ సాయపడలేనప్పుడు. నన్ను నేను రక్షించుకోలేనప్పుడు నా ఉనికికి అర్థం లేదనిపించింది. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అని ఆమె తెలిపారు.
ఈ మహిళలు తాము చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నారని శిక్షకులు చెప్పారు. కానీ ఆరోజు రాత్రి శిక్షణా స్థావరంలో ఒళ్లు జలదరించే కథను ఒక మహిళ పంచుకున్నారు.
బుచాను స్వాధీనం చేసుకున్న తరువాత, రష్యన్ దళాలు ఇంటింటికీ వెళ్ళడం ప్రారంభించాయి. వాళ్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడ్డారు. తరువాత ఒకరోజు వారు పిల్లలను చంపడానికి వస్తున్నారనే వదంతులు వ్యాపించాయి.
‘‘రష్యన్లను ఎప్పటికీ క్షమించకూడదని ఆరోజే నిర్ణయించుకున్నాను’’ అని ఆ మహిళ చెప్పారు.
ఆమె చెప్పిన వివరాలు నేనిక్కడ పంచుకోలేను. కానీ రష్యన్ సైనికులు ఎవరూ రాకపోవడంతో ఆమె నిర్ణయం అమలు పరచాల్సిన అవసరం రాలేదు. కానీ అప్పటి క్షణాలు ఈ మహిళను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
తనను, తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించడానికి శిక్షణా పద్ధతులు నేర్చుకున్నప్పటి నుంచి ఆమె మొదటిసారిగా కొంత ఊరట చెందారు.
"ఇక్కడికి రావడం చాలా సహాయపడింది" అని ఆమె చెప్పారు. "ఇకపై నేనెప్పుడూ బాధితురాలిలా కూర్చోను, అంతగా భయపడను" అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














