'వీక్షణం' రివ్యూ : ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసే యువకుడి కథ

వీక్షణం

ఫొటో సోర్స్, Youtube/Adityamusic

ఫొటో క్యాప్షన్, రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా నటించిన ‘వీక్షణం’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

‘దృశ్య కావ్యం’, ‘ద గ్రేట్ ఇండియన్ సూసైడ్’ వంటి సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో రామ్ కార్తీక్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

క‌శ్వితో రామ్ కార్తీక్ జంటగా నటించిన ‘వీక్షణం’ (The observer is the observed) సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వీక్షణం

ఫొటో సోర్స్, Youtube/Adityamusic

కథ ఏంటి?

అర్విన్ (రామ్ కార్తీక్) బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. అతనికి చిచి (శ్రీనివాస్ ) స్నేహితుడు, నారి (షైనింగ్ ఫణి ) అత్త కొడుకు.

అర్విన్‌కి తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ.

ఈ రకమైన మనస్తత్వం వల్ల అతను, అతనితో పాటు చిచి, నారి కూడా ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు అన్నదే ఈ సినిమా కథ.

అర్విన్ పాత్రలో రామ్ కార్తీక్ నటించారు. ఇంతకముందు ఆయన నటించిన సినిమాల కంటే ఇందులో ఎంగేజింగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారు.

నేహ పాత్రలో కశ్వి నటించారు. చిత్రం శ్రీను, పింగ్ పాంగ్ సూర్య, నక్షత్ర నయన కూడా ఈ సినిమాలో ఉన్నారు. మొత్తంగా వీరంతా తమ పాత్రల పరిధిలో జోష్ ఫుల్‌గానే కనిపించారు.

పాటలు -సంగీతం:

ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. వాటిల్లో సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో, మనసును మీటే లవ్ సాంగ్స్ బాగున్నాయి.

సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీకి కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టి ఈ పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు.

మూడో పాట హీరో కేరెక్టర్ గురించి చెబుతుంది. క్యాచీ లిరిక్స్‌తో టైటిల్ సాంగ్ పర్లేదనిపించింది. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

వీక్షణం

ఫొటో సోర్స్, Youtube/Adityamusic

తెలుగుతనం అద్దినా..

మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది.

కథ కొత్తది కాదు. హీరోని పరిచయం చేసే సన్నివేశంలోనే అక్కడ 'Rear Window' సినిమా పోస్టర్ కనిపిస్తుంది.

రియర్ విండో, ది వుమెన్ ఇన్ ది విండో, స్టాకర్ లాంటి హాలీవుడ్ సినిమా కథలను పోలిన కథ ఇది. దానికి తెలుగుతనం అద్దినా ఒరిజినాలిటీ లోపించడంతో కొంత నప్పని భావన కలుగుతుంది.

ఇప్పటికే ఒకే రకమైన కథలతో సినిమాలు తీసినా హిట్ కొట్టినవి చాలానే ఉన్నాయి.

కామెడీ, లవ్ లాంటివి మన చుట్టూ జరుగుతూ ఉండేవే కనుక అవి ఒకేలా ఉన్నా, ప్రాంతాన్ని బట్టి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వగలరు. కానీ మిస్టరీ ఎలిమెంట్ అంటేనే ముందు ఊహించకుండా ఉండగలిగేలా స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ, ఈ సినిమాలో అది లోపించింది.

కులం గురించి పెట్టిన సన్నివేశాలు కూడా కావాలని అతికించినట్టే ఉంది.

వీక్షణం

ఫొటో సోర్స్, Youtube/Adityamusic

సీరియస్ ఎలిమెంట్స్ :

ఇకపోతే మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో ఏదో ఒక మానసిక రుగ్మత కథలో ఉండటం ఒక ఫార్ములాగా మారిపోయింది. అలాంటిదే ఈ సినిమాలోనూ ఉంది. అదే ఓడీఆర్ (ఆడ్ రియాక్టింగ్ డిజార్డర్).

అలాగే కథలో కులం, ఆధునిక జీవితం అక్కా, తమ్ముడిని ఎలా ప్రభావితం చేశాయి అనే అంశం కూడా ఉంది. కానీ ఇంత సీరియస్ ఎలిమెంట్స్‌ను కథతో ఇంకా బలంగా కనెక్ట్ చేస్తే బాగుండేది.

హీరో ప్రేమకు ఈ మిస్టరీ ఎలిమెంట్ కనెక్ట్ చేయడం కొంతవరకు ఫరవాలేదనిపించింది. కథకు తగ్గ సీరియస్ వాతావరణాన్ని, కొన్ని కొత్త ఎలిమెంట్స్‌ను సెకండ్ హాఫ్‌లో తీసుకురావడం కొంతవరకు సినిమాను నడిపించాయి.

సాధారణమైన లవ్-కామెడీ స్టోరీకి థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా కలిసి ఉన్న సినిమా ఇది. కథ పరంగా కొన్ని సాంకేతిక లోపాలున్నా, ఎనర్జిటిక్ నటన వలన, సెకాండాఫ్‌లో ప్రీ క్లయిమాక్స్ నుంచి కొత్త కొత్తగా అనిపించడం వల్ల సినిమా ఫరవాలేదనిపించింది. కొత్తగా సినిమా తీయాలని చాలా స్టైల్స్ ఒకే సినిమాలో ప్రయోగించినదే ఈ 'వీక్షణం'.

వీక్షణం

ఫొటో సోర్స్, Youtube/Adityamusic

ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్ :

1) పాత్రల నటన

2) రామ్ కార్తీక్ -కశ్వి స్క్రీన్ కెమిస్ట్రీ

3) కార్తీక్, షైనింగ్ ఫణి, శ్రీనివాస్ కాంబినేషన్

4) సంగీతం

మైనస్ పాయింట్స్ :

1) కథలో ఒరిజినాలిటీ లోపించడం

2) సాంకేతిక లోపాలు

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)