యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఎలా చంపేసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్రేమ్ బేకర్
- హోదా, బీబీసీ న్యూస్
గత ఏడాది అక్టోబరు 7 దాడుల తర్వాత గాజాలో కనిపించకుండా పోయిన హమాస్ సూత్రధారి యాహ్యా సిన్వార్ కోసం ఇజ్రాయెల్ బలగాలు ఏడాదికి పైగా వేటసాగిస్తున్నాయి.
61 ఏళ్ల యాహ్యా సిన్వార్ ఎక్కువ సమయం టన్నెల్స్‌లోనే గడిపేవారని, ఇజ్రాయెల్ నుంచి బందీలుగా తీసుకెళ్ళిన వారిని మానవ కవచాలుగా ఉంచుకుని, బాడీగార్డులతో ఉండేవారని అంటుంటారు.
కానీ, చివరకు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన జీవితం ముగిసిపోయినట్టు తేలింది. అయితే, అక్కడ బందీలు ఎవరూ కనిపించలేదు.
మరికొన్ని వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ, అసలు సిన్వార్ ఎలా మరణించారు? ఇజ్రాయెల్ ఈ దాడి గురించి ఏం చెప్పింది?


పరుగులు తీస్తుండగా కాల్పులు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు చెందిన 828వ బిస్లామాక్ బ్రిగేడ్ యూనిట్ రఫాలోని తాల్ అల్-సుల్తాన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తోందని, ఈ సందర్భంగా ముగ్గురు మిలిటెంట్లను గుర్తించి వారిని కాల్చి చంపామని తెలిపింది.
ఆ సమయంలో అక్కడ ప్రత్యేకంగా పరిగణించాల్సిన విషయం ఏమీ లేదని, సైనికులు, ఇతర బృందాలు గురువారం ఉదయం వరకు సంఘటనాస్థలానికి తిరిగి రాలేదని తెలిపింది.
ఆ తర్వాత మృతదేహాలను పరిశీలిస్తుండగా, హమాస్ నేతకు దగ్గరి పోలికలతో ఉన్న మృతదేహం కనిపించిందని, అనుమానాలుండడంతో మృతదేహాన్ని సంఘటనా స్థలంలోనే ఉంచి, ఒక వేలు తొలగించి టెస్టింగ్ కోసం ఇజ్రాయెల్ పంపించామని వెల్లడించింది.
ఆ ప్రాంతంలో భారీగా బలగాలు మోహరించి, అన్నీ పరిశీలించిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఇజ్రాయెల్ తరలించామని తెలిపింది.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సిన్వార్ ఉన్నట్టు తమకు తెలియదని, తాము మామూలుగానే ఆపరేషన్ కొనసాగించామని ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు.
ముగ్గురు వ్యక్తులు తప్పించుకునేందుకు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పరుగులు తీస్తుండగా వారిని గుర్తించిన బలగాలు వారిపై కాల్పులు జరిపాయని తెలిపారు.
ఆ భవనాల్లో ఒక వ్యక్తి ఒంటరిగా పరుగులు తీస్తుండగా డ్రోన్ గుర్తించిందని, తర్వాత ఆయన్ను హతమార్చామని, ఆ తర్వాతే ఆయనను సిన్వార్‌గా గుర్తించామన్నారు.
బందీల్లో ఎవరినీ సిన్వార్ మానవ కవచంగా ఉపయోగించుకోలేదని, అయితే ఆయన అక్కడి నుంచి వెళ్తున్న విషయం అనుచరులకు తెలియకపోవచ్చని లేదా ఆయన బాడీగార్డుల్లో ఎక్కువమంది చనిపోయిఉండొచ్చని ఐడీఎఫ్ వెల్లడించింది.
సిన్వార్ కమాండర్‌గా మరణించలేదని, తప్పించుకోడానికి పరుగులు తీస్తూ కాల్పుల్లో చనిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు. ఆయన ఎవ్వరి కోసం చనిపోలేదని, తననుతాను రక్షించుకునే క్రమంలో చనిపోయారని అన్నారు. తమ శత్రువులందరికీ ఇది స్పష్టమైన సందేశమని యోవ్ గల్లంట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సిన్వార్‌ను చంపేశాం’
గాజాలో సిన్వార్ చనిపోయారా లేదా అన్నది పరిశీలిస్తున్నామని తొలుత గురువారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలకే హమాస్ నాయకునితో దగ్గర పోలికలు ఉన్న ఓ వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి. ఆయన తలపై తీవ్రమైన గాయాలున్నాయి.
ఈ సమయంలో మరణించిన ముగ్గురు ఎవరన్నది నిర్ధరించలేమని ఇజ్రాయెలీ అధికారులు చెప్పారు.
కాసేపటికే హమాస్ నాయకుణ్ని తాము చంపినట్లు తమకు నమ్మకం కలుగుతోందని ఇజ్రాయెల్ వర్గాలు బీబీసీకి చెప్పాయి. అయితే మరణాన్ని ధ్రువీకరించేముందు అవసరమైన అన్ని పరీక్షలూ చేయాల్సిన అవసరముందని తెలిపాయి.
అయితే ఆ పరీక్షలకు ఎక్కువ సమయం పట్టలేదు. సిన్వార్‌ను చంపేశామని గురువారం సాయంత్రానికి ఇజ్రాయెల్ ప్రకటించింది.
శత్రువును గట్టి దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అయితే గాజాలో యుద్ధం పూర్తికాలేదని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, IDF
కదలికలను కట్టడి చేసి...
సిన్వార్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరగలేదని ఐడీఎఫ్ చెప్పింది. అయితే సిన్వార్ కదలికలపై నిఘా వర్గాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని వారాలుగా ఆపరేషన్ చేస్తున్నామని తెలిపింది.
రఫా దక్షిణ ప్రాంతంలో సిన్వార్ సంచరిస్తున్న సమాచారం తెలిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని తమ బలగాలు చుట్టుముట్టాయని, తర్వాత నెమ్మదిగా ఆయనను సమీపించాయని ఐడీఎఫ్ వివరించింది.
ఏడాది కాలం నుంచి ఇజ్రాయెల్ సిన్వార్ కోసం వేట సాగిస్తోంది. మొహమ్మద్ డేఫ్, ఇస్మాయిల్ హనియే వంటి హమాస్ నేతల మరణంతో సిన్వార్‌పై ఒత్తిడి పెరిగింది. హనియేను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. 2023 అక్టోబరు 7 నాటి దాడుల కోసం ఉపయోగించిన స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
ఇటీవలి వారాల్లో తాము చేపట్టిన ఆపరేషన్‌లు యాహ్యా సిన్వార్ కార్యకలాపాలను కట్టడి చేశాయని, ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ బలగాలు ఆయన్ను గుర్తించి హతమార్చాయని ఐడీఎఫ్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
‘ఇది లక్ష్యం మాత్రమే, ముగింపు కాదు’
సిన్వార్‌ను చంపడం తమ ప్రధాన లక్ష్యం మాత్రమేనని ఇజ్రాయెల్ అన్నది. గత ఏడాది అక్టోబరు 7 దాడుల సూత్రధారిగా ఆయన్ను ప్రకటించింది. హమాస్ నేతలను వరుసగా హతమార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటున్నప్పటికీ... హమాస్ బందీలుగా ఉంచిన 101 మందిని రక్షించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు.
‘‘ప్రియమైన బందీల కుటుంబాలకు ఒక విషయం చెబుతున్నా. యుద్ధంలో ఇది కీలకమైన సమయం. మీ అందరి ఆప్తుల కోసం, మన ఆప్తుల కోసం, వారందరినీ సురక్షితంగా ఇంటికి తెచ్చేందుకు బలగాలను పూర్తిస్థాయిలో ప్రయోగిస్తూనే ఉంటాం.’’ అని నెతన్యాహు అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














