‘మా పౌరుడి హత్యకు కుట్రపన్నారు’ అంటూ భారత అధికారిపై అమెరికా అభియోగాలు

అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ బీ. గార్లాండ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ బీ. గార్లాండ్

న్యూయార్క్‌లో అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో ఒక భారతీయ ప్రభుత్వ అధికారిపై అమెరికా న్యాయ విభాగం అభియోగాలను నమోదు చేసింది.

‘హత్యాయత్నానికి కుట్ర’, ‘మనీ లాండరింగ్’ అభియోగాల కింద భారత ప్రభుత్వ ఉద్యోగి 39 ఏళ్ల వికాస్ యాదవ్‌పై అభియోగాలను నమోదు చేసినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది.

వికాస్ యాదవ్ అనే ఆ అధికారి అమానత్‌ అనే పేరుతో కూడా సుపరిచితులని ప్రకటన విడుదల చేసింది.

వికాస్ యాదవ్‌తో పాటు ఈ హత్యాయత్నం కుట్ర కేసులో 53 ఏళ్ల నిఖిల్ గుప్తా అనే వ్యక్తికి కూడా ప్రమేయమున్నట్లు అమెరికా న్యాయ విభాగం ఆరోపించింది.

నిఖిల్ గుప్తాను ఇప్పటికే అమెరికాకు అప్పగించడంతో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, వికాస్ యాదవ్ పరారీలో ఉన్నట్లు అమెరికా చెబుతోంది.

వికాస్ యాదవ్‌ను మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా పేర్కొంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎవరినీ అమెరికా న్యాయవిభాగం వదిలిపెట్టదు. వారి పదవి లేదా అధికారంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటుంది’’ అని అమెరికా అటార్నీ జనరల్ వెరిక్ బీ గార్లాండ్ చెప్పారు.

‘‘గత ఏడాది అమెరికా పౌరుడి హత్యకు కుట్రపన్నిన భారత ఉద్యోగి వికాస్ యాదవ్, ఆయన భాగస్వామి నిఖిల్ గుప్తా ప్లాన్‌ను మేం భగ్నం చేశాం’’ అని తెలిపారు.

అమెరికా పౌరులపై హింసకు పాల్పడే ఏ ప్రయత్నాన్ని అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహించదని చెప్పింది.

అయితే, గురుపట్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో అమెరికా న్యాయ విభాగం పేర్కొంటోన్న వ్యక్తి, భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ గురువారం వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

అసలేంటి కేసు?

సిక్కులకు ప్రత్యేక దేశం కోసం ఉద్యమిస్తున్న ఒక అమెరికా పౌరుడిని న్యూయార్క్‌లో హత్యచేసే కుట్రను అడ్డుకున్నట్లు అంతకుముందు అమెరికా వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించి భారత పౌరుడు నిఖిల్ గుప్తాపై ఆరోపణలు మోపారు. ఆరోపణ పత్రంలో అతడికి ఒక భారత ప్రభుత్వ ఉద్యోగి ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపించారు.

లక్ష డాలర్ల(రూ.83.32 లక్షలు)తో నిఖిల్ గుప్తా ఓ హిట్‌మ్యాన్‌ను ఈ హత్య కోసం నియమించుకున్నట్లు అప్పట్లో అమెరికా వెల్లడించింది.

ఈ హిట్ మ్యాన్‌ కూడా అండర్ కవర్ ఫెడరల్ ఏజెంట్ అని అప్పట్లో ప్రాసిక్యూటర్లు తెలిపారు.

అయితే, ఇంతకీ హత్యాయత్నం ఏ వ్యక్తి మీద జరిగిందన్నది తాజా కోర్టు పత్రాల్లో పేర్కొనలేదు. అమెరికా మీడియా మాత్రం అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న సిక్కు వేర్పాటువాది అయిన గురుపట్వంత్ సింగ్‌ పన్నూ పైనే హత్యాయత్నం జరిగిందని ఈ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో చెప్పింది.

ఈ విషయంలో అమెరికా వ్యక్తంచేసిన భద్రతాపరమైన ఆందోళనలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఇదివరకే భారత ప్రభుత్వం వెల్లడించింది.

అభియోగపత్రం దాఖలు చేసిన వెంటనే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల స్థాయిలో లేవనెత్తినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ విషయంలో భారత అధికారులు ‘విస్మయం, ఆందోళన’ వ్యక్తం చేసినట్లు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)