ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన యాహ్యా సిన్వార్ వారసుడెవరు?

Ismail Haniya, Yahya Sinwar

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వార్
    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, బీబీసీ న్యూస్

హమాస్‌తో జరుగుతున్న పోరాటంలో యాహ్యా సిన్వార్‌ను అంతమొందించడం ఇజ్రాయెల్ సాధించిన అతిపెద్ద విజయం.

ఆయన మరణం హమాస్‌కు కోలుకోలేని దెబ్బ, ఆయన హమాస్‌ను ఒక పోరాట శక్తిగా మార్చారు.

ఆయన ఏదో ఒక వ్యూహాత్మకమైన ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో మరణించలేదు, దక్షిణ గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దళాలతో యథాలాపంగా జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

సిన్వార్‌ హతం కావడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికులపై ప్రశంసలు కురిపించారు, అయితే ఇది యుద్ధానికి ముగింపు కాదని స్పష్టం చేశారు.

“మనకు హాని చేసేవాళ్లకు ఏం జరుగుతుందో ఈ రోజు మనం మరోసారి స్పష్టం చేశాం. ఈ రోజు మనం మరోసారి చెడుపై మంచి సాధించిన విజయాన్ని ప్రపంచానికి చూపించాం. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు’’ అన్నారు నెతన్యాహు.

హమాస్‌ను సైనిక, రాజకీయ శక్తిగా నాశనం చేయడం.. బందీలను క్షేమంగా తీసుకురావడమే తన లక్ష్యమని నెతన్యాహు గతంలో చాలాసార్లు చెప్పారు.

42,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించి, గాజాను ధ్వంసం చేసినా, ఒక సంవత్సరం యుద్ధకాలంలో ఆయన ఆ రెండూ సాధించలేకపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సిన్వార్

ఫొటో సోర్స్, Getty Images

యాహ్యా సిన్వార్ 1962లో గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించారు. 1967 పశ్చిమాసియా యుద్ధంలో ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన వయస్సు ఐదేళ్లు.

ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం పొందిన 1948 యుద్ధంలో ఇజ్రాయెల్ దళాల కారణంగా పారిపోయిన, నిరాశ్రయులైన 7,00,000 మంది పాలస్తీనియన్లలో ఆయన కుటుంబమూ ఉంది.

ఆయన తన 20లలో ఉన్నప్పుడు.. నలుగురు పాలస్తీనా ఇన్‌ఫార్మర్‌లను చంపినందుకు ఇజ్రాయెల్ సిన్వార్‌ను దోషిగా తేల్చింది. 22 సంవత్సరాలు జైలులో ఉన్న సిన్వార్ హీబ్రూ భాష నేర్చుకుని, శత్రువులను అధ్యయనం చేసి, వాళ్లతో ఎలా పోరాడాలో నేర్చుకున్నారు.

ఆయన జైలులో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ఆయన దంతాలు, డీఎన్‌ఏ నమూనాలు తీసుకుంది.. అందుకే మరణించిన వెంటనే ఆయనను గుర్తించగలిగారు.

ఇజ్రాయెల్ ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హమాస్ చేతితో బందీలుగా ఉన్న వాళ్ల కోసం ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులు

2011లో తమ సైనికుడు గిలాద్ షాలిత్ విడుదల కోసం ఇజ్రాయెల్ 1,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వారిలో సిన్వార్ ఒకరు.

గత సంవత్సరం అక్టోబరు 7న సిన్వార్, ఆయన మనుషులు చేసిన దాడులలో ఇజ్రాయెల్ ఘోరంగా దెబ్బ తినింది. ఆ దాడుల్లో దాదాపు 1,200 మంది ఇజ్రాయెలీలను చంపడమో, బందీలుగా చేసుకోవడమో జరిగింది.

గాజాలో బందీలుగా ఉన్న 101 మంది కుటుంబాలు, తమ వాళ్లను రప్పించడానికి చర్చలు చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఈ బందీలలో సగం మంది ఇప్పటికే చనిపోయి ఉండవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.

సిన్వార్, ఆయన మనుషులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించడానికి కారణమైన భద్రతా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి, తనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ విచారణను నిరవధికంగా వాయిదా వేయడానికే నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని పొడిగిస్తున్నారని చాలామంది ఇజ్రాయెలీలు భావిస్తున్నారు.

అయితే ఆ ఆరోపణలను నెతన్యాహు ఖండిస్తున్నారు. గాజాలో హమాస్‌పై 'పూర్తి విజయం' సాధిస్తేనే ఇజ్రాయెల్ భద్రతకు హామీ అని ఆయన అంటున్నారు.

సిన్వార్ మరణంతో ఇజ్రాయెలీల వేడుకలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిన్వార్ మరణంతో ఇజ్రాయెలీల వేడుకలు

ఇతర వార్తా సంస్థలలాగా, ఇజ్రాయెల్ బీబీసీని చాలా అరుదుగా తప్ప గాజాలోకి అనుమతించదు, అదీ సైన్యం పర్యవేక్షణలోనే.

సిన్వార్ జన్మస్థలమైన ఖాన్ యూనిస్ శిథిలాల మధ్య, బీబీసీ తరఫున కొందరు ఫ్రీలాన్సర్లు పాలస్తీనియన్లతో మాట్లాడగా వారు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

"ఈ యుద్ధం సిన్వార్, హనియే, మిషాల్ లేదా ఇంకే నాయకుడిపైనా ఆధారపడలేదు" అని డాక్టర్ రమదాన్ ఫారిస్ అన్నారు.

"ఇది పాలస్తీనా ప్రజలను నిర్మూలించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం. ఈ సమస్య సిన్వార్ కన్నా చాలా పెద్దది"

సిన్వార్‌ మరణంతో కొంతమంది బాధపడుతున్నారని, మరికొందరిలో ఎలాంటి ప్రతిస్పందనా లేదని అద్నాన్ అషూర్ అన్నారు.

"వాళ్లకు కావాల్సింది మేం మాత్రమే కాదు. వాళ్లకు మొత్తం పశ్చిమాసియా కావాలి. వాళ్లు లెబనాన్, సిరియా, యెమెన్‌లపైనా దాడి చేస్తున్నారు. ఇది 1919 నుంచి, 100 సంవత్సరాలకు పైగా మాకు, యూదులకు మధ్య జరుగుతున్న యుద్ధం" అన్నారు.

సిన్వార్ మరణం హమాస్‌పై ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. "అలా జరగదని ఆశిస్తున్నాను. హమాస్ అంటే కేవలం సిన్వార్ ఒక్కరే కాదు, అది ప్రజల సమస్య" అన్నారు.

గాజాలో యుద్ధం కొనసాగుతోంది. ఉత్తర గాజాపై జరిగిన దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మరణించారు. తాము హమాస్ కమాండ్ సెంటర్‌పై దాడి చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనేకమంది క్షతగాత్రులు సాధారణ పౌరులని వైద్యులు తెలిపారు.

ఇజ్రాయెల్ మరింత ఆహార, సహాయ సామగ్రిని అనుమతించాలని అమెరికా చెప్పిన తర్వాత పారాచూట్‌ల సహాయంతో వాటిని తిరిగి సరఫరా చేయడం ప్రారంభమైంది.

1990ల నుంచి హమాస్‌కు చెందిన ప్రతి నాయకుడూ ఇజ్రాయెల్ చేతిలో మరణించారు. కానీ ఎప్పుడూ మరో వారసుడు పుట్టుకొస్తూనే ఉన్నారు. సిన్వార్‌ను అంతమొందించి, ఇజ్రాయెల్ వేడుకలు చేసుకుంటున్నా.. హమాస్ చేతిలో ఇప్పటికీ ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు, అది ఇప్పటికీ పోరాడుతోంది.

వీడియో క్యాప్షన్, హమాస్ టాప్ లీడర్‌ను హతమార్చినప్పటికీ గాజాలో తమ యుద్ధం ఆగదన్న ఇజ్రాయెల్ ప్రధాని

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)