ఉత్తరప్రదేశ్: ‘బహ్రాయిచ్ మత హింస’ కేసు నిందితులపై పోలీసుల కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images
‘బహ్రాయిచ్ మత హింస’ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు వెతుకుతున్న ఇద్దరు నిందితులు సర్ఫరాజ్, తాలిబ్‌లు కాల్పులలో గాయపడ్డారు.
గాయపడిన ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
పీటీఐ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఉన్న అయిదుగురు నిందితులు నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.
అక్టోబర్ 13న బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహం నిమజ్జనం సమయంలో జరిగిన వివాదంలో 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా హత్యకు గురయ్యారు.
బుల్లెట్ గాయాల కారణంగానే గోపాల్ మిశ్రా మృతి చెందినట్లు బహ్రాయిచ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు.
మిశ్రా హత్య తర్వాత బహ్రాయిచ్‌లో అల్లర్లు చెలరేగాయి. దుకాణాలతో పాటు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 55 మందిని అరెస్టు చేయగా, 11 వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ఆ కేసులో హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో నిందితులు కాల్పులు జరపగా, పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు నిందితులు గాయపడినట్లు పీటీఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది.
కాగా ఈ కేసులో ఇప్పటివరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు యూపీ అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ తెలిపారు.
‘కాల్పుల్లో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం అందింది’ అని అమితాబ్ యష్ తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల హెచ్చరిక
రామ్ గోపాల్ మిశ్రా పోస్టుమార్టం రిపోర్టు, హింసపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో బహ్రాయిచ్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
ఈ మేరకుపోలీసులు ఎక్స్‌లో "కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో మతపరమైన సంఘటనలకు సంబంధించి తప్పుదారి పట్టించే, అవాస్తవాలు ప్రసారం అవుతున్నాయి. అటువంటి ఖాతాలన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
బుల్లెట్ గాయాల కారణంగా రామ్ గోపాల్ మిశ్రా మరణించారని, దానికి సంబంధించిన ఇతర వాదనలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?
ఘటన జరిగిన ప్రాంతం మహసీ తహసిల్ పట్టణం పరిధిలోకి వస్తుంది. బహ్రాయిచ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా డీజేలో 'రెచ్చగొట్టే పాటలు' ప్లే చేయడంతో వివాదం మొదలైందని, దీనిపై ముస్లిం వర్గం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆరోపణలున్నాయి.
డీజేను ఆపేందుకు అవతలి పక్షం సిద్ధంగా లేకపోవడంతో వివాదం ముదిరిందని, ముస్లిం పక్షం అక్కడి డీజే సిస్టం వైర్‌ను తొలగించిందని సంఘటన రోజున అక్కడున్న పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వివాదం పెద్దదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభ్యంతరం వ్యక్తం చేసిన సర్ఫరాజ్ ఇంటిపైకి ఊరేగింపులో పాల్గొన్న రామ్ గోపాల్ మిశ్రా ఎక్కి, ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. అందులో.. రామ్ గోపాల్ మిశ్రా ఆకుపచ్చ జెండాను తీసివేసి, కాషాయ జెండాను ఎగురవేయడం కనిపిస్తుంది. ఈ సమయంలో ఇంటి లోపల నుంచి గన్ పేలింది, ఆ బుల్లెట్ తగిలి గోపాల్ మిశ్రా మరణించారు.
సర్ఫరాజ్ తండ్రి అబ్దుల్ హమీద్ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














