కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా పర్యటన: ‘మీరు మా రాజు కాదు, ఇది మీ భూమీ కాదు’ అంటూ ఆదివాసి ఉద్యమకారులు ఎందుకు నినదించారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కేటీ వాట్సన్, డేనియెలా రాల్ఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న కింగ్ చార్లెస్, రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం నాడు పార్లమెంట్ హౌస్ వేడుకల్లో పాల్గొన్నారు.
అక్కడ ఆయన తన ప్రసంగం ముగియగానే "మీరు మాకు రాజు కాదు" అంటూ ఇండిపెండెంట్ సెనెటర్, అబోరిజనల్ తెగకు చెందిన లిడియా థోర్ప్ నినాదాలు చేశారు.
రాజధాని కాన్‌బెర్రాలో జరిగిన ఈ వేడుకలో ఆమె ఒక నిమిషంపాటు అలా నినాదాలు చేస్తూ కనిపించారు. కార్యక్రమానికి అంతరాయం కలుగుతుండటంతో భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు.
‘‘మా జాతిపై మీరు మారణ హోమం సృష్టించారు. ఇది మీ రాజ్యం కాదు, మీరు మాకు రాజు కాదు’’ అని అరిచారు థోర్ప్.
లిడియా థోర్ప్ వ్యవహార శైలిపై పలువురు సెనెటర్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటు అబోరిజినల్ తెగకు చెందిన సీనియర్ నాయకురాలు ఆంటీ వయెలెట్ షెరిడాన్ మాత్రం కింగ్, క్వీన్‌లను ఆస్ట్రేలియాలోకి స్వాగతించారు. లిడియా థోర్ప్ నిరసనలపై స్పందించిన ఆమె, ఇది రాజును అగౌరవపరచడమేనన్నారు. తమ గురించి, తమ జాతి గురించి మాట్లాడే హక్కు లిడియాకు లేవని ఆమె స్పష్టం చేశారు.
‘‘రాజు ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు కీమోథెరపీ జరగుతోంది. ఆయనకు ఇలాంటిది ఎదురుకాకూడదు. ఆయన ఇక్కడికి రావడం అభినందనీయం. వారు రావడం ఇదే చివరిసారి కావొచ్చు’’ అని ఆమె అన్నారు.
ఈ తర్వాత ఎవరూ ఈ సంఘటన గురించి మాట్లాడకుండానే కార్యక్రమం ముగిసింది. తమను చూడటానికి వచ్చిన ప్రజలను కలుసుకునేందుకు రాజదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంగళవారం నాడు కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమైంది. సిడ్నీ ఒపెరా హౌస్ దగ్గర జరిగే కార్యక్రమానికి కింగ్ చార్లెస్ హాజరవుతున్న సమయంలో అబోరిజనల్ తెగకే చెందిన ఒక ఆందోళనకారుడు నిరసన వ్యక్తం చేశారు.
వేన్ వార్టన్ అనే ఆదిమ తెగల ఉద్యమకారుడు, కింగ్ చార్లెస్‌కు, బ్రిటీష్ క్రౌన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
వేన్ వార్టన్ కూడా లిడియా థోర్ప్ లాగానే ‘మీరు మాకు రాజు కాదు’ అని నినాదాలు చేశారు.
రాజును చూడటానికి వచ్చిన స్థానికులు వేన్ వార్టన్ నినాదాలకు ప్రతిగా ‘గాడ్ సేవ్ ద కింగ్’ (దేవుడు రాజును రక్షించుగాక) అంటూ నినాదాలు చేశారు.

లిడియా థోర్ప్ వైఖరిపై స్పందించిన ఆదివాసి ఉద్యమకారులు కొందరు ఆమె ధైర్యానికి మెచ్చుకోగా, మరికొందరు ఆదివాసి ప్రముఖులు మాత్రం ఇది ఒక రాజుతో వ్యవహరించాల్సిన వైఖరి కాదని అన్నారు.
థోర్ప్ వైఖరిని ఆదివాసి తెగ సీనియర్ నాయకురాలు ఆంటీ షెరిడాన్ విమర్శించగా, ఈ ఘటనపై బకింగ్‌హామ్ ప్యాలెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాన్‌బెర్రాలో రాజదంపతులను చూడటానికి తరలివచ్చిన ప్రజల గురించి మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేసింది.
తమ కోసం తరలివచ్చిన వేలాదిమందిని చూసి రాజ దంపతులు చలించిపోయారని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఘటన తర్వాత స్పందించిన లిడియా థోర్ప్ ‘నేను రాజుకు ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చాను’ అని తన చర్యలను సమర్ధించుకున్నారు.
ఆస్ట్రేలియా కామన్‌వెల్త్ దేశం. ఇక్కడ బ్రిటన్ రాజును దేశాధినేతగా వ్యవహరిస్తారు. అయితే, రాచరికాన్ని వదిలేయాలన్న డిమాండ్ ఇటీవల ఆస్ట్రేలియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సెనెటర్ లిడియా థోర్ప్ విక్టోరియా రాష్ట్రం నుండి ఎన్నికైన ఇండింపెండెంట్ సెనెటర్. స్థానిక అబోరిజనల్ తెగకు చెందిన మహిళ. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆదిమవాసులకు మధ్య ఒక ఒప్పందం జరగాలని చాలాకాలంగా వాదిస్తున్న వారిలో లిడియా ఒకరు.
ఒకప్పటి బ్రిటీష్ కాలనీలైన వాటిలో ఒక్క ఆస్ట్రేలియా తప్ప మిగిలిన అన్నిదేశాలు స్థానిక తెగలతో ఒప్పందాలు చేసుకుని పాలన సాగిస్తున్నాయి.
తమ సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగలు, టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులు స్పష్టం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
"మీకు సార్వభౌమాధికారం కావాలంటే మీరు ఇక్కడి వారై ఉండాలి. కింగ్ ఇక్కడివారు కాదు’ అని లిడియా థోర్ప్ స్పష్టం చేశారు.
ఆదిమవాసులతో శాంతి ఒప్పందం గురించి చర్చించేలా పార్లమెంటుకు కింగ్ చార్లెస్ సూచించాలని ఆమె డిమాండ్ చేశారు.
"మనం పాలించుకోగలం. మెరుగైన దేశంగా తీర్చిదిద్దుకోగలం. కానీ, వలస పాలకులకు ఎట్టిపరిస్థితుల్లో తలవంచేది లేదు. ఆయన గొప్పగా చెబుతున్న ఆయన పూర్వీకులు ఇక్కడ సామూహిక హత్యలు, మారణహోమాలకు బాధ్యులు’’ అని థోర్ప్ అన్నారు.
స్థానిక తెగలకు చెందిన వేషధారణలో వచ్చిన సెనెటర్ థోర్ప్, దివంగత క్వీన్ ఎలిజబెత్ II ఈ ప్రాంతాన్ని వలస రాజ్యంగా మార్చారని ఆరోపించారు.
2022లో సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా ఆమె ఇవే వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, PA Media
ఆదిమవాసులు, టోర్రెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులు, ఇతర జనాభాకు మధ్య వైద్య, విద్య, ఆర్ధిక రంగాలలో అసమానతలను ఎలా పరిష్కరించాలనే అంశం ఆస్ట్రేలియాలో సుదీర్ఘ చర్చగా నలుగుతోంది.
ఇక్కడి మూలవాసులకు రాజకీయ హక్కుల కల్పించాలన్న అంశంపై జరిగిన రిఫరెండమ్‌లో వారికి రాజకీయ హక్కులను నిరాకరిస్తూ మెజారిటీ ఆస్ట్రేలియన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా రాచరికం నుంచి విడిపోయి గణతంత్ర రాజ్యంగా అవతరించాలా వద్దా అన్నదానిపై దశాబ్దాలుగా చర్చ జరిగింది. 1999లో దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ఏకైక మార్గం ఇదే. అయితే ఇది వీగిపోయింది.
నిరుడు మూలవాసుల గుర్తింపుపై రిఫరెండం విఫలమైన తర్వాత, ఆల్బనీస్ ప్రభుత్వం ఈ అంశంపై రెండోసారి ఓటింగ్ నిర్వహించబోమని తేల్చేసింది .
కింగ్ చార్లెస్ ఏడాది కాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లడం తొలిసారి. అనారోగ్యం కారణంగా గత పర్యటనలతో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువ రోజులు ఇక్కడ పర్యటిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














