అమరావతి డ్రోన్ షో: 5,500 డ్రోన్లు ఎలాంటి విన్యాసాలు చేశాయంటే..

అమరావతి డ్రోన్ షో
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

అమరావతిలో మంగళవారం నిర్వహించిన డ్రోన్‌ షో ఆకట్టుకుంది. కృష్ణా తీరంలోని పున్నమీ ఘాట్‌లో సాయంత్రం ఆకాశవీధిలో 5 వేలకు పైగా డ్రోన్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.

రాష్ట్ర డ్రోన్‌ కార్పొరేషన్‌, కేంద్ర పౌర విమానయాన శాఖతో కలిసి అక్టోబర్ 22, 23 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌– 2024’ పేరిట జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి డ్రోన్ షో

డ్రోన్ల క్యాపిటల్‌గా అమరావతి: చంద్రబాబు

మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... దేశ డ్రోన్‌ రాజధానిగా ఏపీని, డ్రోన్‌ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో డ్రోన్‌ హబ్‌ కోసం 300 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు.

అక్కడ డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు దగ్గరగా ఉంటుందనీ అక్కడ డ్రోన్ల తయారీ పరిశ్రమలకు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

అమరావతి డ్రోన్ షో
ఫొటో క్యాప్షన్, డ్రోన్లతో విమానం ఆకృత్రి ఆవిష్కరణ

రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్‌ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. నాలెడ్జ్‌ ఎకానమీలో ఈ డ్రోన్‌ సదస్సు ఒక ‘గేమ్‌ ఛేంజర్‌’ అన్నారు.

నిపుణులు, పారిశ్రామిక వేత్తల సూచనలు తీసుకొని 15 రోజుల్లోనే డ్రోన్‌ పాలసీని ఆవిష్కరిస్తామని తెలిపారు.

ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సుమారు లక్షన్నర మంది వరద బాధితులకు ఆహారం కలుషితం కాకుండా, వృథా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించామని సీఎం చెప్పారు.

అయితే, చంద్రబాబు ప్రచార జిమ్మిక్కుల్లో ఈ డ్రోన్ షో ఒకటని వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అమరావతి, చంద్రబాబు, డ్రోన్ షో, విజయవాడ, పున్నమీ ఘాట్, రామ్మోహన్ నాయుడు, భారతదేశం
ఫొటో క్యాప్షన్, డ్రోన్లతో ఆవిష్కరించిన జాతీయ పతాకాన్ని చూస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

డ్రోన్‌ మార్కెట్‌ను ప్రమోట్‌ చేస్తా: చంద్రబాబు

డ్రోన్ల తయారీదారులకు అంబాసిడర్‌గా ఉంటానని, డ్రోన్‌ మార్కెట్‌ను ప్రమోట్‌ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

డ్రోన్‌ల తయారీ, వినియోగంలో అత్యాధునిక సాంకేతికత, విప్లవాత్మకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన సేవలతో పాటు వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ, రవాణా, ఆరోగ్యం, పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో డ్రోన్‌ల వినియోగంపై ఈ సమ్మిట్‌లో సమీక్షించారు.

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరైన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌కు సందర్శకులతో సహా సుమారు 5 వేల మంది హాజరయ్యారు.

అమరావతి, చంద్రబాబు, డ్రోన్ షో, విజయవాడ, పున్నమీ ఘాట్, రామ్మోహన్ నాయుడు, భారతదేశం
ఫొటో క్యాప్షన్, లేజర్ షో

ఆకాశంలో సప్తవర్ణ చిత్రాలు

మంగళవారం సాయంత్రం విజయవాడ పున్నమీ ఘాట్‌లో మొత్తం ఏడు థీమ్ చిత్రాలను డ్రోన్లతో ప్రదర్శించారు.

భారీ బోయింగ్‌ విమానం, ధ్యానబుద్ధుడు, గ్లోబ్, డ్రోన్‌.. తదితర చిత్రాలను ఆవిష్కరించారు.

ఆ తర్వాత జాతీయ జెండాతో పాటు ఐసీఏఓ (ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌) లోగోను ప్రదర్శించారు. మొత్తం 5,500 డ్రోన్లతో ఆకాశంలో ఈ సప్తవర్ణ చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి.

20 నిమిషాల పాటు డ్రోన్ షో జరిగింది. ఆ తర్వాత లేజర్‌ షో నిర్వహించారు.

అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమం
ఫొటో క్యాప్షన్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు

‘దేశంలో ఇదే అతిపెద్ద డ్రోన్‌ షో’

డ్రోన్‌ షోలో ఎగిరిన 5,500 డ్రోన్లన్నీ ఢిల్లీకి చెందిన బోట్‌లాబ్‌ స్టార్టప్‌ సంస్థవేనని ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు సరితా అహ్లావత్‌ బీబీసీకి తెలిపారు.

పున్నమీ ఘాట్‌ వద్ద ఆమె బీబీసీతో మాట్లాడుతూ దేశంలోనే ఇది అతిపెద్ద డ్రోన్‌ షో అని చెప్పారు. గాల్లో ఎగిరిన డ్రోన్లు పది కిలోమీటర్ల వరకు కనిపిస్తాయన్నారు.

దేశీయ టెక్నాలజీతోనే ఈ డ్రోన్లను తయారు చేశామని సరిత చెప్పారు.

అమరావతి, చంద్రబాబు, డ్రోన్ షో, విజయవాడ, పున్నమీ ఘాట్, రామ్మోహన్ నాయుడు, భారతదేశం
ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులకు గిన్నిస్ రికార్డు పత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందించారు.

డ్రోన్ల షోలో గిన్నిస్‌ రికార్డ్‌

ఒకేసారి 5,500 డ్రోన్లతో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ప్రదర్శన నిర్వహించలేదని గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. సీఎం చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు పత్రాలను వారు అందించారు.

ఈ డ్రోన్ల ప్రదర్శన 5 విభాగాల్లో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది.

డ్రోన్లతో అతిపెద్ద ప్లానెట్ ఫార్మేషన్, అతిపెద్ద విమానం, అతిపెద్ద జాతీయ జెండా, అతిపెద్ద బుద్ద విగ్రహం, అతిపెద్ద ఏరియల్ లోగో ఆవిష్కరణ విభాగాల్లో 5 గిన్నిస్ రికార్డులు దక్కాయి.

అమరావతి, చంద్రబాబు, డ్రోన్ షో, విజయవాడ, పున్నమీ ఘాట్, రామ్మోహన్ నాయుడు, భారతదేశం, వైసీపీ

ఫొటో సోర్స్, Challa Madhusudan Reddy/faebook

ఫొటో క్యాప్షన్, ‘డ్రోన్ల సదస్సు అంతా చంద్రబాబు నాయుడి ప్రచార కార్యక్రమం’ అని వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి విమర్శించారు.

‘చంద్రబాబు కొత్త పబ్లిసిటీ జిమ్మిక్కు’

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార జిమ్మిక్కుల్లో ఇప్పుడు డ్రోన్లు భాగమయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంలోనే డ్రోన్ల వినియోగం ఇప్పుడే మొదలుపెట్టినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 -24 మధ్య పది వేల మందికి పైగా డ్రోన్లపై శిక్షణ ఇచ్చి, ఉపాధి కూడా కల్పించామని ఆయన తెలిపారు.

దేశంలో పెరుగుతున్న డ్రోన్ల వినియోగం

గత కొన్నేళ్లుగా దేశంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతోంది. డ్రోన్ల మార్కెట్‌ను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చింది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులను పెంచారు.

వ్యవసాయ పనుల కోసం డ్రోన్లను కొనే రైతులకు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కిసాన్ డ్రోన్ స్కీం‌ను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)