'పిండం లింగ నిర్ధరణ'ను చట్టబద్ధం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎందుకు అంటున్నారు?

- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'పిండం లింగ నిర్ధరణ' చట్టబద్ధతపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వీ అశోకన్ చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది.
‘’30 ఏళ్లయింది, చట్టం ఏం చేసింది? లింగ నిష్పత్తిని మెరుగుపరచగలిగిందా? ఈ చట్టం కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపి ఉండవచ్చు’’ అని అక్టోబర్ 20న (ఆదివారం) గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో అశోకన్ వ్యాఖ్యానించారు. దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘’ప్రస్తుతం ఉన్న చట్టాన్ని రద్దు చేసి, పిండం లింగాన్ని నిర్ధరించే చట్టాన్ని తీసుకురావాలి. ఆడపిల్ల అయితే, ఆమె ఈ ప్రపంచంలోకి వచ్చేలా చూడాలి’’ అని అశోకన్ బీబీసీతో చెప్పారు.
అబార్షన్‌కు చాలామంది బాధ్యులని, అయితే పీసీ- పీఎన్డీటీ (ప్రీ-కాన్సెప్షన్ అండ్ ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్) యాక్ట్ ప్రకారం కేవలం డాక్టర్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
పీసీ- పీఎన్డీటీ చట్టం ప్రకారం.. గర్భధారణ సమయంలో పిండం లింగాన్ని నిర్ధరించడం చట్టవిరుద్ధం. ఈ చట్టాన్ని1994లో తీసుకొచ్చారు. అయితే, ఇది అమలులోకి వచ్చి దశాబ్దాలు గడిచినా దేశంలో లింగ నిష్పత్తి సమానం కావడం లేదని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
సామాజిక అవగాహనే ఉత్తమం: అశోకన్
వైద్యులకు ఈ చట్టం ఇబ్బంది కలిగిస్తోందని, ఏ గైనకాలజిస్టుతోనో, రేడియాలజిస్టుతోనో మాట్లాడితే వారు ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెబుతారని అశోకన్ అన్నారు. లింగ నిర్ధరణ రెండు నుంచి ఐదు శాతం మంది డాక్టర్లు చేస్తారేమో, కానీ వైద్య ప్రపంచం మొత్తం ఈ కారణంగా ఇబ్బందులకు గురవుతోందన్నారు.
కొన్ని ప్రాంతాలలో చట్టాల కంటే సామాజిక అవగాహనే మెరుగైన ఫలితాలనిచ్చిందని అశోకన్ అభిప్రాయపడ్డారు.
పీసీ- పీఎన్డీటీ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి 2003లో సవరించారు. ఈ చట్టం ఉద్దేశం పిండం లింగ నిర్ధరణ పరీక్షలను నిలిపివేయడం, తద్వారా భ్రూణహత్యలను అరికట్టడం. అదే సమయంలో ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష కూడా విధిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ వైద్యులను వెనకేసుకు రావొద్దు: వర్షా దేశ్‌పాండే
ఐఎంఏ ప్రెసిడెంట్ పదవికి ఒక గౌరవం ఉందని, దాన్ని గుర్తుంచుకొని అశోకన్ మాట్లాడాలని వర్షా దేశ్‌పాండే బీబీసీతో చెప్పారు.
మహారాష్ట్రలో బాలికల భవిష్యత్తు కోసం వర్షా దేశ్‌పాండే 'లేక్ లడ్కీ అభియాన్' అనే ఎన్జీవోను నడుపుతున్నారు. పీసీ- పీఎన్డీటీ రెండు కమిటీలలోనూ వర్ష సభ్యురాలు.
డాక్టర్‌ని కేసులో ఇరికిస్తున్నారని భావిస్తే ఫిర్యాదు చేయవచ్చని, వైద్యులు పిండ లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తారనేది వాస్తవమని వర్ష అన్నారు.
చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేస్తున్న అధికారులు, వైద్యులను వెనకేసుకు రాకుండా, వారికి వ్యతిరేకంగా ఐఎంఏ ప్రెసిడెంట్ గళం విప్పాలని ఆమె సూచించారు.
ఈ లింగ నిర్ధరణ పరీక్షకు చట్టబద్ధత కల్పిస్తే మహిళలు క్యూ కడతారని వర్ష అన్నారు. గర్భిణీలు పిండాన్ని తొలగించుకునేందుకు మందులు వేసుకుని అధిక రక్తస్రావంతో చనిపోతారని లేదా అబార్షన్ చేయించుకుంటారని ఆమె హెచ్చరించారు.
మందులు సులభంగా అందుబాటులో ఉంటున్నాయని, ఇప్పుడు కూడా నకిలీ వైద్యులు అక్రమంగా నడిపిస్తున్న క్లినిక్‌లలో రహస్యంగా ఈ పరీక్షను నిర్వహించి, అబార్షన్ చేస్తున్నారని వర్ష గుర్తుచేస్తున్నారు.
డాక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్)కు చెందిన ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ అంటున్నారు.
ఐఎంఏ ప్రెసిడెంట్ కేవలం డాక్టర్ల గురించే ఆలోచిస్తున్నారని, మహిళల కోణంలో కూడా చూడాలని ఆయన సూచించారు. ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ ఐఐపీఎస్ సర్వే రీసెర్చ్, డేటా అనలిటిక్స్ హెడ్ కూడా.
చట్టంపై సందేహాలు ఏమిటి?
''ఈనాటికీ సమాజంలో చాలా చోట్ల మగబిడ్డను కనాలని కోడళ్లపై ఒత్తిడి ఉంటుంది. మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే తర్వాత పుట్టేది ఎవరో లింగ నిర్ధరణ చేస్తున్నారు. అబార్షన్‌లు చేయిస్తున్నారు" అని ఎస్‌కే సింగ్ అన్నారు.
1991లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తిలో స్వల్ప మెరుగుదల కనిపించింది. 1991లో 1,000 మంది అబ్బాయిలకు 926 మంది అమ్మాయిలు ఉండగా, 2011లో ఈ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 943 మంది అమ్మాయిలకు పెరిగింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4లో ప్రతి 1,000 మంది పురుషులకు 919 మంది మహిళలు ఉండగా, సర్వే-5లో బాలికల సంఖ్య 929గా ఉంది (0-5 సంవత్సరాల పిల్లల లింగ నిష్పత్తి డేటా ప్రకారం).
అయితే, డాక్టర్ ఆర్‌వీ అశోకన్ మాత్రం ఈ పెరుగుదల చాలా తక్కువని, ఆడ భ్రూణహత్యలను నిరోధించడంలో పీసీ- పీఎన్డీటీ చట్టం ప్రభావవంతంగా లేదని ఆరోపించారు.
"ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ రెండు వారాల కిందట ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది" అని ఆయన అన్నారు.
అయితే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే.. పిండం లింగం తెలిసిన తర్వాత దంపతులు అబార్షన్‌కు మొగ్గు చూపితే ఎలా? ఈ భ్రూణహత్యలను ఎలా అరికడతారు? ఎందుకంటే ఇలాంటి అబార్షన్లు చేస్తున్న అనేక క్లినిక్‌లు అక్రమంగానే నడుస్తున్నాయి. దీనికి అశోకన్ బదులిచ్చారు.
డేటాను ప్రభుత్వానికి పంపాలి: అశోకన్
డాక్టర్ ఆర్‌వి అశోకన్ మాట్లాడుతూ "అల్ట్రాసౌండ్ ప్రక్రియ తర్వాత, మీరు దాని రిపోర్టును డేటాబేస్‌లో అప్‌లోడ్ చేయాలి. అక్కడ ఎఫ్ ఫారం కూడా నింపాలి. ఈ డేటా ప్రభుత్వానికి వెళుతుంది. ఎప్పటికప్పుడు గర్భిణీ, పిండం ఆరోగ్యానికి సంబంధించి చెకప్‌లు ఉన్నాయి. దీంతో ఒకవేళ మధ్యలో గర్భస్రావమైనా ఎందుకు అలా జరిగిందో తెలుస్తుంది" అని అన్నారు.
"ప్రస్తుతం పిండం లింగాన్ని వెల్లడించనప్పుడు అది ఆడపిల్ల కాబట్టే అబార్షన్ జరిగిందని మీరెలా చెప్పగలరు?" అని అశోకన్ ప్రశ్నిస్తున్నారు.
"పిండం డేటాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినపుడు బాలికల భద్రత పట్ల వారి బాధ్యత పెరుగుతుంది. ఆడ భ్రూణహత్యలను తగ్గించడానికి ఒక క్రియాశీల మార్గం ఉంటుంది. భ్రూణహత్య నేరం, కానీ పిండం గుర్తించడం కాదు" అని అన్నారు.
ఎస్.కె.సింగ్ మాట్లాడుతూ.. ‘‘పీసీ-పీఎన్డీటీ చట్టం కారణంగా గత దశాబ్దన్నర కాలంలో లింగ నిష్పత్తిలో చోటు చేసుకున్న మెరుగుదల.. ప్రెసిడెంట్ ప్రతిపాదనతో తిరగబడే ప్రమాదం ఉంది. ఇది నేరపూరిత ఆలోచన, డాక్టర్ అశోకన్ వైద్యులను మాత్రమే రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఇద్దరు ఆడపిల్లలున్న మహిళల్లో 63 శాతం మంది మూడో బిడ్డను కోరుకోవడం లేదు. దక్షిణాదిలో ఇది 80 శాతం, ఉత్తరాదిలో 60 శాతంగా ఉంది. మనకు చట్టం సాయంగా ఉంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బేటీ బచావో బేటీ పఢావో ప్రభావం?
"డబ్బుల కోసం వైద్యులు పిండం లింగ నిర్ధరణ చేస్తారు. పిండాన్ని మాత్రం ప్రభుత్వం రక్షించాలి, ఇదెక్కడి లాజిక్?" అని ప్రొఫెసర్ ఎస్‌కే సింగ్ ప్రశ్నిస్తున్నారు.
మహిళా సాధికారతపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ లోక్‌సభలో తన నివేదికను సమర్పిస్తూ.. బేటీ బచావో బేటీ పఢావో పథకం కింద 80 శాతం నిధులను వినియోగించినట్లు పేర్కొంది.
‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ పథకం లక్ష్యం పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడం, లింగ ఆధారిత వివక్షను తొలగించడం, మహిళలకు సాధికారత కల్పించడం.
తొలుత రూ.100 కోట్ల నిధులు కేటాయించగా ఎప్పటికప్పుడు ఆర్థిక కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. సమాజంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు సమాన హక్కులు ఇవ్వాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కానీ మూలాలు చాలా లోతుగా ఉన్నాయి, ఆలోచనలు పూర్తిగా మారడానికి సమయం పడుతుంది.
పీసీ-పీఎన్డీటీ చట్టం వల్ల హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడిందని వర్షా దేశ్‌పాండే అంటున్నారు.
"బేటీ బచావో, బేటీ పఢావో మంచి నినాదం. ఆడపిల్లలకు సాధికారత లభిస్తే సమాజంలో మార్పులు వస్తాయి. ఇది చాలా పెద్ద పని, అయితే వైద్యులే ఎందుకు బాధ్యత వహించాలి" అని డాక్టర్ అశోకన్ ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్దకు ప్రతిపాదన తీసుకువెళతామని, ఒకవేళ ప్రభుత్వం చట్టాన్ని మార్చకూడదనుకుంటే, కనీసం వైద్యులను శిక్షించే పాయింట్లనైనా తొలగించాలని అశోకన్ కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














