‘స్టార్ లింక్’ ఇండియాలోకి ప్రవేశిస్తే ఇంటర్‌నెట్ సేవల ధరలు తగ్గుతాయా, అంబానీకి ఫోన్ చేస్తానని ఎలాన్ మస్క్ ఎందుకు అన్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశపు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌కోసం ఇద్దరు సంపన్నులు ఎలాన్ మస్క్, ముఖేశ్ అంబానీ మధ్య పోటీ తీవ్రంగా మారుతోంది.
బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలంపాట ద్వారా కాకుండా పాలనాపరంగా కేటాయిస్తామంటూ గతవారం ప్రభుత్వం చేసిన ప్రకటన వీరి మధ్య పోరాటం వేడెక్కేలా చేసింది.
ముఖేశ్ అంబానీ సమర్థించిన స్పెక్ట్రమ్ వేలం విధానాన్ని గతంలో మస్క్ విమర్శించారు.
శాటిలైట్ పరిధిలో ఉన్న ఏ ప్రాంతంలోనైనా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు.
దీని ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా, అంటే టెలిఫోన్ లైన్స్, కేబుల్స్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఇంటర్‌నెట్ సేవలను అందించవచ్చు. దీని ద్వారా డిజిటల్ అంతరాలను చెరిపేయచ్చు.
స్పెక్ట్రమ్ ధరల గురించి భారతీయ టెలికాం నియంత్రణ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. వాణిజ్య శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
భారత దేశంలో 2025 నాటికి శాటిలైట్ ఇంటర్‌నెట్ వాడే వారి సంఖ్య 20 లక్షలకు చేరుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేసింది.
శాటిలైట్ ఇంటర్‌నెట్ స్పెక్ట్రమ్ కోసం ముఖేశ్ అంబానీకి చెందిన జియోతో పాటు అరడజను సంస్థలు పోటీ పడుతున్నాయి. దీంతో మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది.
టెలికామ్ రంగాన్ని శాసించేందుకు రిలయన్స్ జియో స్పెక్ట్రమ్ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీ లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ అస్ట్రా అనే శాటిలైట్ ఆపరేటర్‌తో కలిసి పని చేస్తోంది.
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ‘లోఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ) శాటిలైట్లను ఉపయోగిస్తోంది. ఇవి వేగంగా సేవలను అందించేందుకు భూ ఉపరితలం నుంచి 160 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎస్ఈఎస్ ‘మీడియం ఎర్త్ ఆర్బిట్’ (ఎంఈఓ) శాటిలైట్లను ఉపయోగిస్తోంది. ఇవి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. వీటి ధర కూడా ఎక్కువ.
శాటిలైట్ల నుంచి వచ్చే సంకేతాలను భూమి మీద ఉన్న రిసీవర్లు గ్రహించి ఇంటర్‌నెట్ డేటాను అందిస్తాయి.
స్టార్‌లింక్ సంస్థకు 'లో ఎర్త్ ఆర్బిట్'లో 6,419 శాటిలైట్లతో లింక్ ఉంది. ఈ సంస్థకు వంద దేశాల్లో 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత్ దేశంలోనూ స్టార్‌లింక్ సేవలను ప్రారంభించాలని మస్క్ 2021 నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ నియంత్రణ విధానాల వల్ల ఆలస్యం జరుగుతోంది.
స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశిస్తే , విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని అనేక మంది చెబుతున్నారు.
అంతే కాకుండా మోదీ ప్రభుత్వ విధానాలు అంబానీ లాంటి కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం అనుకూలంగా ఉన్నాయనే అపవాదును తొలగించుకోవచ్చు. సూటు బూటు సర్కారు అనే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టడానికి సాయపడుతుంది.


ఫొటో సోర్స్, Getty Images
మస్క్‌ను పోటీ నుంచి తప్పించే వ్యూహం
వేలం పాట ద్వారా స్పెక్ట్రమ్ కేటాయించడం వల్ల లాభం వస్తుందని గతంలో నిరూపితమైనా, ఈసారి కేటాయింపులు పాలనాపరంగా చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని భారత ప్రభుత్వం చెబుతోంది.
“శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం పాట ద్వారా కేటాయించలేరు.ఇలా చేయడం వల్ల ఖర్చులు , ఆర్థిక హేతుబద్దత, వ్యాపారంలో పెట్టుబడులు వంటివాటిపై ప్రభావం పడుతుంది” అని కౌంటర్ పాయింట్ రీసర్చ్‌లో సాంకేతిక విశ్లేషకుడు గరెత్ ఒవెన్ చెప్పారు. పాలనాపరంగా కేటాయింపులు జరపడం వల్ల అర్హులైన సంస్థలకు పారదర్శకంగా సమానంగా పంపిణీ చేయవచ్చు. దీనివల్ల స్టార్‌లింక్ భారత దేశంలోని పోటీలో ప్రవేశించేందుకు ఓ అవకాశం దక్కుతుంది.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రజలకు నేరుగా ఎలా అందించాలనే దానిపై చట్టపరమైన విధానాలు లేకపోవడంవల్ల పోటీ పారదర్శకంగా ఉందని చెప్పేందుకు వేలం పాట తప్పని సరి అని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వాదిస్తున్నారు.
అక్టోబర్ తొలి వారంలో రిలయన్స్ టెలికాం నియంత్రణ సంస్థకు రాసిన లేఖలను బీబీసీ పరిశీలించింది. “ ఉపగ్రహ ఆధారిత, భూమి మీద బ్రాడ్‌బ్యాండ్ సేవలు నెట్‌వర్క్ అందుబాటు విషయంలో అందరికీ సమాన అవకాశాలు ఉండే పరిస్థితిని సృష్టించాలని” ఆ లేఖల్లో పదే పదే కోరారు.
“శాటిలైట్ టెక్నాలజీస్ విషయంలో ఇటీవలి ముందడగులు శాటిలైట్ సేవలు, భూమి మీద నెట్ వర్క్‌ల హద్దుల్ని కొంత చెరిపేశాయి” అని రిలయన్స్ తెలిపింది. “శాటిలైట్ ఆధారిత సేవలు భూమి మీద నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావు” అని రిలయన్స్ స్పష్టం చేసింది.
భారతీయ టెలికాం చట్టాల ప్రకారం స్పెక్ట్రమ్ కేటాయింపులు వేలం ద్వారా మాత్రమే జరపాలని, ‘ప్రజా ప్రయోజనాలు, ప్రభుత్వ విధులు లేదా సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల వేలాన్ని నిరోధించే సందర్భాల్లో మాత్రమే పాలనాపరమైన కేటాయింపులు అనుమతించవచ్చని” రిలయన్స్ రాసిన ఒక లేఖలో పేర్కొంది.
“శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయించే అధికారం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌కు ఎప్పుడో ఇచ్చారని ఎలాన్ మస్క్ “ఎక్స్”లో పోస్ట్ చేశారు. డిజిటల్ టెక్నాలజీ విషయంలో ఐక్య రాజ్యసమితి ఏర్పాటు చేసిన విభాగం ఇంటర్‌నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ( ఐటీయూ). ఇందులో భారత దేశానికి సభ్యత్వం ఉంది. ఈ సంస్థ నియమావళి మీద భారత్ కూడా సంతకం చేసింది.
శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ముఖేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
దీనిపై ఎలాన్ మస్క్ ఎక్స్‌లో స్పందించారు. “నేను ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి భారత ప్రజలకు ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు స్టార్ లింక్‌ను అనుమతించడం ఇబ్బంది అవుతుందా అని అడుగుతాను” అని అందులో పేర్కొన్నారు.
ప్రభుత్వమే పాలనాపరంగా స్పెక్ట్రమ్ కేటాయించే విధానాన్ని ముఖేశ్ అంబానీ వ్యతిరేకించడాన్ని వ్యూహాత్మక ముందడుగు కావచ్చని ఒవెన్ చెప్పారు.
మస్క్‌ను “పోటీలో లేకుండా చేయడానికి” ఆయన సిద్ధమయ్యారని వేలం నిర్వహించడం ద్వారా భారత మార్కెట్ నుంచి స్టార్‌లింక్‌ను ఆదిలోనే అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ మార్కెట్‌పైనే అందరి దృష్టి
వేలం పాటకు ముఖేశ్ అంబానీ మాత్రమే కాకుండా మరి కొన్ని సంస్థలు మద్దతిస్తున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో కస్టమర్లకు సేవలు అందించాలనుకునే కంపెనీలు “మిగతా అందరి మాదిరిగానే టెలికామ్ లైసెన్స్‌లు తీసుకుని స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాలని” భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్ చెప్పారు.
భారతీయ టెలికామ్ మార్కెట్‌లో సునీల్ మిత్తల్ నాయకత్వంలోని ఎయిర్‌టెల్, అంబానీ కలిసి దేశంలోని 80శాతం టెలికాం మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయి.
ఇలాంటి ప్రతిఘటన “అంతర్జాతీయ సంస్థలకు ఖర్చులు పెంచే లక్ష్యంతో చేపట్టిన రక్షణాత్మక చర్య, దీన్ని బెదిరింపుగా కూడా చూడాలి” అని టెలికమ్యూనికేషన్స్ నిపుణుడు మహేష్ ఉప్పల్ చెప్పారు.
‘‘తక్షణ పోటీ లేకున్నా, శాటిలైట్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం (భారతదేశంలో) భూమి మీద నెట్‌వర్క్‌తో భారీ స్థాయిలో సేవలు అందిస్తున్న టెలికాం సంస్థలు శాటిలైట్ సేవల వల్ల త్వరలో పోటీ ఎదురు కావచ్చని భయపడుతున్నాయి. మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని సవాలు చేస్తాయోమోనని ఆందోళన చెందుతున్నాయి” అని చెప్పారు.
భారత మార్కెట్ విస్తృతి ఎక్కువ. భారతీయ జనాభాలో దాదాపు 40 శాతం మంది ప్రజలకు, అందులోనూ గ్రామీణ ప్రాంతాల వారికి ఇంటర్‌నెట్ అందుబాటులో లేదని కన్సల్టింగ్ సంస్థ ఈవై పర్థినాన్ తెలిపింది.
చైనాలో 109 కోట్లకు పైగా ఇంటర్‌నెట్ వాడకందారులు ఉన్నారు. భారత్‌లోని 75 కోట్ల మందితో పోలిస్తే చైనాలో 34 కోట్లమంది వినియోగదారులు ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ ఆన్‌లైన్ ట్రెండ్స్‌ను ట్రాక్ చేసే డేటారిపోర్టల్ చెబుతోంది.
అంతర్జాతీయ సగటు 66.2శాతంతో పోలిస్తే, భారతదేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య వెనుకబడి ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఈ గ్యాప్ తగ్గుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
సరసమైన ధరలకు అందిస్తే, శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఈ ఖాళీని కొంత వరకు పూరించగలదు. అంతే కాకుండా ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) విషయంలో సాయపడుతుంది.
భారత దేశంలో ధరలే కీలకం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో మొబైల్ డేటా చాలా చౌక. ఒక గిగాబైట్‌కు 7 పైసలేనని ప్రధాని మోదీ చెప్పారు.
“భారత్‌లోని టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. మస్క్ దగ్గర చాలా డబ్బుంది. ఇండియన్ మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ఆయన కొన్ని ప్రాంతాలలో ఒక ఏడాది పాటు ఉచిత సేవలను అందించకుండా ఉండరని చెప్పడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదు అని టెక్నాలజీ అనలిస్ట్ ప్రశాంతో కె రాయ్ చెప్పారు.
కెన్యా, సౌతాఫ్రికాలో స్టార్‌లింక్ ఇప్పటికే ధరలను తగ్గించింది.

ఫొటో సోర్స్, AFP
స్టార్‌లింక్ తక్కువ ధరకు ఇంటర్‌నెట్ అందిస్తుందా?
ఈవై పార్థినన్ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న ధరలతో పోలిస్తే స్టార్‌లింక్ వసూలు చేస్తున్న చార్జీలు 10 రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోతే స్టార్‌లింక్ ఇండియన్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడటం చాలా కష్టం అవుతుంది.
స్టార్‌లింక్ నిర్వహిస్తున్న ‘లోయర్ ఎర్త్ ఆర్బిట్’ శాటిలైట్లు ‘మిడ్ లెవల్ ఎర్త్ ఆర్బిట్’ శాటిలైట్లు మాదిరే గ్లోబల్ కవరేజ్ ఇవ్వాలంటే వాటి ప్రయోగం, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.
స్టార్ లింక్ విషయంలో భారతీయ ఆపరేటర్ల భయాలు నిరాధారమైనవి కావచ్చు.
“భూమి మీద ఆపరేట్ చేయగలిగే నెట్‌వర్క్ లేకపోతే తప్ప ఆపరేటర్లందరూ పూర్తిగా శాటిలైట్ వైపు మళ్లరు. జనసాంద్రత అంతగా లేని ప్రాంతాల్లో తప్పితే, శాటిలైట్‌తో పోల్చుకుంటే భూతల నెట్‌వర్క్‌లు చౌక” అని ఒవెన్ చెప్పారు.
తొలుత మార్కెట్‌లోకి రావడం ద్వారా లభించే అవకాశాన్ని అందుకోవాలని మస్క్ భావిస్తూ ఉండవచ్చు. అయితే “శాటిలైట్ మార్కెట్ అభివృద్ధి చాలా నిదానంగా ఉంటుంది”
మొత్తం మీద శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవల వ్యాపారంలో ప్రపంచంలోని ఇద్దరు సంపన్నుల మధ్య పోరాటం నిజంగా ప్రారంభమైంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














