5G సేవలు మన దేశంలో ఎందుకింత ఆలస్యం?

5జీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనాలో 356.. అమెరికాలో 296.. ఫిలిప్పీన్స్‌లో 98.. దక్షిణ కొరియాలో 85 నగరాల్లో 5జీ సేవలు ఎప్పుడో మొదలైపోయాయి.

వీటితో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్, కెనడా, థాయిలాండ్, స్వీడన్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్, భూటాన్, కెన్యా.... ఇలా సుమారు 72 దేశాల్లోని 1947 నగరాల్లోఈ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ప్రముఖ నెట్ వర్క్ టెస్టింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కంపెనీ VIAVI ఈ ఏడాది జనవరిలో ఓ నివేదికలో వెల్లడించింది.

నిజానికి మన దేశంలోనూ ఈ సేవలు 2020లోనే మొదలు కావాల్సింది.

భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్‌టీఎల్ టెలికాం సంస్థలకు ట్రయల్ రన్‌కు కేంద్రం ఎప్పుడో అనుమతినిచ్చింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆయా సంస్థలు ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశాయి కూడా.

5 జీ

ఫొటో సోర్స్, Getty Images

అయినా ఎందుకింత ఆలస్యం?

ఈ విషయంలో మొట్టమొదట చెప్పుకోవాల్సింది కోవిడ్.

మహమ్మారి కారణంగా అప్పటికే టెలికాం కంపెనీలు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడంలో ఆలస్యమయింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం 5 జీ స్పెక్ట్రం వేలాన్ని కనీసం 2021లోనైనా మొదలుపెట్టే అవకాశం ఉందని భావించినప్పటికీ అది కూడా జరగలేదు.

మరోవైపు కోవిడ్ కారణంగా ఓ వైపు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, అదే సమయంలో స్పెక్ట్రం వేలంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో యూనిట్ ధర 492 కోట్ల రూపాయలగా పేర్కొనడం కూడా భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో సహా అప్పటికే భారీ ఎత్తున బకాయిలున్న వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు భారం అనిపించింది.

ఇదే విషయాన్ని కొద్ది నెలల క్రితం ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ కూడా కేంద్రానికి తెలియజేసింది. వీలైనంత త్వరగా స్పెక్ట్రం వేలం ప్రక్రియను ప్రారంభించాలని సూచిస్తూనే... ప్రపంచంలో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులో ఉన్న ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో 5జీ స్పెక్ట్రం ధరలు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా తన నివేదికలో పేర్కొంది.

5 జీ

ఫొటో సోర్స్, Getty Images

3300 మెగాహెర్ట్జ్ నుంచి 3600 మెగాహెర్ట్జ్ విభాగంలో ఒక్కో యూనిట్ ధర 492 కోట్ల రూపాయలుగా పేర్కొనడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు బ్రిటన్‌తో పోల్చితే 7 రెట్లు, ఆస్ట్రేలియాతో పోల్చితే 14 రెట్లు, స్పెయిన్‌తో పోల్చితే 35 రెట్లు, ఆస్ట్రియాతో పోల్చితే 70 రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఇది టెలికాం రంగంపై దీర్ఘ కాలంలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి తెలియజేసింది.

ఇక మరో విషయం 5జీ నెట్ వర్క్‌లో కీలకమైన ఫైబర్ నెట్‌వర్క్ లైన్లు. 2021లో CRISIL రిసెర్చ్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం దేశంలో అప్పటికి కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. అంటే ఇంకా మరో 70శాతం మేర ఈ నెట్‌వర్క్ అందుబాటులోకి రావాల్సింది. ప్రతి టెలికాం సంస్థ 100 శాతం ఫైబర్ నెట్క్‌వర్క్‌ను కలిగి ఉండాలంటే వచ్చే 2 ఏళ్లలో కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అన్ని రకాల ఖర్చులు కలుపుకొని కనీసం కిలోమీటరుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

5 జీ

ఫొటో సోర్స్, Getty Images

కేంద్రం ఇప్పుడేం చేసింది?

ఎప్పటికప్పుడు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న 5జీ స్పెక్ట్రం వేలానికి ఎట్టకేలకు కేంద్ర క్యాబినెట్ జూన్ 14న ఆమోదం తెలిపింది. జులై చివరి నాటికి మొత్తం 72,097.85 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రం వేలానికి అధికారిక ముద్ర వేసింది.

మొత్తంగా 20 ఏళ్ల కాల వ్యవధికి ఈ వేలం వేయనున్నారు.

ఇందులో అత్యల్పంగా 600 మెగా హెర్ట్జ్ నుంచి అత్యధికంగా 26 గిగాహెర్ట్జ్ వరకు వివిధ విభాగాల్లో ఫ్రీక్వెన్సీ బాండ్లకు స్పెక్ట్రం వేలం వేయనున్నారు.

టెలికాం రంగంలో సంస్కరణలతో పాటు ఈ వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు అనేక ఆప్షన్లను కూడా కేంద్రం తీసుకొచ్చింది.

అందులో భాగంగా.. తొలిసారిగా ముందస్తు చెల్లింపులు అనే నిబంధనను ఎత్తేసింది.

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

అంటే వేలంలో విజేతలుగా నిలచిన బిడ్డర్లు ముందుగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సినవసరం లేదు. మొత్తం ధరను 20 సమాన వాయిదాల్లో 20 ఏళ్లలో చెల్లించవచ్చు.

అయితే ప్రతి ఏటా ఆరంభంలోనే చెల్లింపులు పూర్తి చేయాలి.

అలాగే బిడ్డరు 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రంను అవసరం లేదనుకుంటే తిరిగి ఇచ్చేసే ఏర్పాటు కూడా చేస్తున్నారు. అప్పుడు మిగిలిన వాయిదాలను చెల్లించాల్సినవసరం లేదు.

అలాగే ధరల విషయంలో కూడా ట్రాయ్ గతంలో కొన్ని సూచనలు చేసింది. 2018లో పేర్కొన్న ధరలతో పోల్చితే 30 నుంచి 40 శాతం 5జీ ఎయిర్ వేస్ ధరల్ని తగ్గించాలని పేర్కొంది. అంటే 3300-3670 మెగాహెర్ట్జ్ విభాగంలో మెగాహెర్ట్జ్ ధర 317 కోట్లుగా నిర్ణయించాలని సూచించింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 2018లో ప్రభుత్వం ఇదే విభాగంలో ఒక మెగాహెర్ట్జ్ ధరను 492 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది.

వీడియో క్యాప్షన్, ఈ కారు పది నిమిషాల్లో విమానంలా మారిపోతుంది

ఇకపై ఏం జరగనుంది?

అన్నీ అనుకున్నట్టు జరిగితే హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కొల్‌కతా, చెన్నై, పూణె, లఖ్‌నవూ, గుర్‌గ్రామ్, జామ్ నగర్, గాంధీనగర్, బెంగళూరు, చండీగఢ్ తదితర నగరాల్లో సెప్టెంబర్ నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనాల ప్రకారం 2026 నాటికి దేశంలో 5జీ సబ్ స్క్రిప్షన్లు 35 కోట్లకు చేరనున్నాయి. అంటే అప్పటికి దేశంలోని మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో 27 శాతం అని చెప్పవచ్చు.

అలాగే ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే 2025 నాటికి 5జీ ఆధారిత ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర రంగాలలో సుమారు 2కోట్ల 20 లక్షల మంది నైపుణ్యం కల ఉద్యోగుల అవసరం ఉంటుంది.

ఎ గ్లోబల్ కంపెనీ ఫర్ ఆడియన్స్ మెజర్మెంట్, డేటా అండ్ ఎనాలిటిక్స్ – నీల్సన్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం 2021 డిసెంబర్‌ నాటికి దేశంలో 64.6కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో వారి సంఖ్య 90 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. అందుకు ప్రధాన కారణం 5జీ సేవలు అందుబాటులోకి రావడమేనని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)