హైదరాబాద్‌లో ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్.. చైనా తరువాత ఇక్కడే - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని మొట్టమొదటి 5జీ ఆవిష్కరణల ప్రయోగశాల (ఇన్నోవేషన్ ల్యాబ్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో మొబైల్ టెలీ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మంగళవారం ప్రకటించిందని ఈనాడు తన కథనంలో తెలిపింది.
ఇప్పటికే ఉన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో దీనిని ప్రారంభించినట్లు పేర్కొంది.
చైనా తర్వాత తమ సంస్థ విదేశాల్లో ఏర్పాటు చేసిన తొలి ఆవిష్కరణల ప్రయోగశాల ఇదేనని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 5 జీ అభివృద్ధిని దీని ద్వారా వేగవంతం చేయనున్నట్లు తెలిపింది.
భారత్‌తో పాటు మధ్య ప్రాచ్య ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, ఐరోపా దేశాలకు సంబంధించిన ఆవిష్కరణల కార్యక్రమాలను ఇక్కడే కొనసాగిస్తామని వెల్లడించింది.
మొబైల్ ఫోన్ల కెమెరా, పవర్, బ్యాటరీ సామర్థ్యాలకు సంబంధించి మరో మూడు ప్రత్యేక ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా మార్చడానికి, సరికొత్త, అధునాతన పరిజ్ఞానాలను రూపొందించడానికి ఇది దోహదపడుతుందని ఒప్పో ఉపాధ్యక్షుడు, పరిశోధన, అభివృద్ధి కేంద్రం విభాగాధిపతి తస్లీమ్ ఆరిఫ్ వెల్లడించారు.
దీని ద్వారా రాష్ట్రంలోని సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దేశంలోనే మొదటిదైన ఒప్పో 5జీ ఆవిష్కరణల ప్రయోగశాల ఏర్పాటు ద్వారా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ భారీ పెట్టుబడులకు పూర్తిగా సానుకూలమని దీంతో మరోసారి నిరూపితమైందని అంటూ ఒప్పో సంస్థను అభినందించారు.
ఈ ప్రయోగశాల ద్వారా పర్యావరణ ఆవిష్కరణలకు నమ్మకమైన గమ్యంగా హైదరాబాద్ నిలుస్తోందని తెలిపారని ఈ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, facebook/apcmo
ఆంధ్రప్రదేశ్‌లోప్రతి గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్
పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పినట్లు సాక్షి ఒక కథనంలో పేర్కొంది.
ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని స్పష్టం చేసినట్లు ఈ కథనంలో రాశారు.
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్‌లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్ కూడా చేయాలి.
పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది.
ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్‌లోతెలుగుకు అధికార భాష హోదా ప్రకటించిన మమత కేబినెట్
పశ్చిమ బెంగాల్‌లో తెలుగుకు అధికార భాష హోదా ఇస్తూ మమతా బెనర్జీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
అంతేకాకుండా..తెలుగువారిని తమ రాష్ట్రం లో భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించింది.
‘మినీ ఆంధ్రా’గా పేరొందిన ఖరగ్‌పూర్‌లోని తెలుగువారిని ఆకర్షించి, వారి ఓట్లను పొందేందుకే దీదీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నట్లు ఈ వార్తలో రాశారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్నారు.
ఖరగ్‌పూర్ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరింట తెలుగువాళ్లే కౌన్సిలర్లు. వివిధ పార్టీల్లో మనవాళ్లు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు.
తెలుగుకు అధికార భాష హోదా ఇవ్వాలని అక్కడి ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
కేబినెట్ నిర్ణయాన్ని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు. బెంగాల్‌లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఉందని ఈ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 2021లో డబ్బు గురించి మీ ఆందోళనలు దూరం చేసే ఐదు మార్గాలు ఇవే
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








