ఎవరీ వికాస్ యాదవ్? ఈయనపై అమెరికా చేసిన ఆరోపణలతో భారత్, అమెరికా సంబంధాలు ఏం కానున్నాయి..

ఫొటో సోర్స్, Getty Images
న్యూయార్క్‌లో అమెరికా పౌరుడి హత్యకు కుట్ర పన్నారంటూ వికాస్ యాదవ్ అనే భారతీయుడిపై అభియోగాలను నమోదు చేసినట్టు అమెరికా న్యాయ విభాగం అక్టోబరు 17న ప్రకటించింది.
అమెరికా పౌరుడు, సిక్కు వేర్పాటువాద నేత గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు విఫలయత్నం చేశారంటూ ఈ కేసు నమోదైంది.
పన్నూ హత్యకు కుట్ర పన్నడంలో వికాస్ యాదవ్ కీలక పాత్ర పోషించారని అమెరికా అధికారులు చెబుతున్నారు.
వికాస్ యాదవ్ భారత ప్రభుత్వ ఉద్యోగి అని అమెరికా న్యాయ విభాగం చెబుతుంటే, ఆయన తమ ఉద్యోగి కాదని భారత ప్రభుత్వం అంటోంది.
ఈ కేసులో ఇప్పటికే భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా అమెరికా అధికారుల కస్టడీలో ఉన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఏం చెప్పింది?
అమెరికాలో గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారంటూ వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తాలపై అక్కడి అధికారులు అభియోగం మోపారు. అమెరికన్ చట్టాల ప్రకారం, ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు కూడా వీరిపై మోపారు. దీనికి గరిష్ఠంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
అభియోగాలను వెల్లడించిన అమెరికన్ అటార్నీ జనరల్ మెరిక్ బి గార్లాండ్ మాట్లాడుతూ, అమెరికన్ పౌరులకు హాని కలిగించడానికి, వారి నోరు నొక్కేందుకు ప్రయత్నించే ఎవరినైనా జవాబుదారీగా ఉంచడానికి న్యాయ శాఖ తన వంతు కృషి చేస్తుందని చెప్పారు.
అమెరికా గడ్డపై భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడిని హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నినట్లు గత ఏడాది అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికన్ అటార్నీ డామియన్ విలియమ్స్ తెలిపారు.
కానీ, గుప్తా ఒక్కరే ఈ పని చేయలేదని, ఈయనతోపాటు వికాస్ యాదవ్ అనే భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర కూడా ఉందని, కిరాయి హంతకుడిని నియమించుకోవాలని, గుప్తాకు వికాస్ ఆదేశాలు ఇచ్చారని విలియమ్స్ చెప్పారు.
అమెరికా పౌరులకు హాని తలపెట్టే వారందరికీ ఈ కేసు ఒక హెచ్చరిక లాంటిదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, US Justice Department
ఎవరీ వికాస్ యాదవ్?
అమెరికా మోపిన అభియోగాల మేరకు వికాస్ యాదవ్ అలియాస్ అమానత్ భారత ప్రధాని కార్యాలయంలో భాగమైన భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. క్యాబినెట్ సెక్రటేరియట్‌లో భాగమైన భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో యాదవ్ పనిచేశారని అమెరికా తెలిపింది.
వికాస్ యాదవ్ తన హోదాను "సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్"గా పేర్కొన్నారని, ఆయన బాధ్యతలలో "సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ మేనేజ్‌మెంట్‌లు" ఉన్నాయని అమెరికా న్యాయ విభాగం తెలిపింది.
వికాస్ యాదవ్ తాను పనిచేసే కార్యాలయం చిరునామాను రా (రీసర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్) ప్రధాన కార్యాలయం ఉన్న న్యూ దిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌గా పేర్కొన్నట్టు అమెరికా అధికారులు తెలిపారు.
భారత్‌లోని అతిపెద్ద పారామిలటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్)లోనూ యాదవ్ పనిచేశారని అమెరికా తెలిపింది. అక్కడ తన పదవి అసిస్టెంట్ కమాండెంట్‌గా యాదవ్ చెప్పారని అమెరికా పేర్కొంది.
ఆయన కౌంటర్ ఇంటెలిజెన్స్, యుద్ధానికి సంబంధించిన శిక్షణలతో పాటు, పారాట్రూపర్ ట్రైనింగ్ కూడా పొందారని అమెరికా తెలిపింది.

ఫొటో సోర్స్, US DEPARTMENT OF JUSTICE
నిఖిల్ గుప్తా ఎవరు?
53 ఏళ్ల నిఖిల్ గుప్తా అలియాస్ నిక్ భారత పౌరుడని, వికాస్ యాదవ్‌కు సహచరుడని అమెరికా తెలిపింది.
అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొన్నట్టు వికాస్ యాదవ్ తదితరులతో జరిపిన సంభాషణల్లో నిఖిల్ గుప్తా తెలిపినట్టు అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.
గురుపట్వంత్ సింగ్ పన్ను కేసులో అమెరికా న్యాయ విభాగం నిఖిల్ గుప్తాపై హత్యాయత్నం కింద అభియోగాలు నమోదు చేసింది.
నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు 2023 జూన్ 30న అరెస్టు చేశారు. తర్వాత ఆ రెండు దేశాల మధ్యనున్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం ఆయనను అమెరికాకు అప్పగించారు.

ఫొటో సోర్స్, screen grab
వికాస్, నిఖిల్ మధ్య సంబంధం ఏంటి?
అమెరికాలో పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తాను 2023 మేలో వికాస్ యాదవ్ నియమించుకున్నారని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది.
అమెరికా అధికారులు మోపిన అభియోగాల ప్రకారం, ‘‘వికాస్ యాదవ్ సూచనల మేరకు నిఖిల్ గుప్తా అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ)లో ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా పన్నూను హత్య చేయడానికి ఓ హిట్‌మ్యాన్‌ను నియమించుకున్నారు. ఈ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గుప్తాను అండర్ కవర్ డీఈఏ అధికారి అయిన హిట్‌మ్యాన్‌కు పరిచయం చేశారు. నిఖిల్ గుప్తా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పన్నూను చంపడానికి హిట్‌మ్యాన్‌కు లక్ష అమెరికన్ డాలర్లు ఇవ్వడానికి వికాస్ యాదవ్ అంగీకరించారు.’’
వికాస్ యాదవ్, నిఖిల్ గుప్తా 15 వేల అమెరికన్ డాలర్లను నగదు రూపంలో హిట్ మ్యాన్‌కు అడ్వాన్స్‌గా అందించేందుకు 2023 జూన్ 9న తమ సహచరుడిని పంపారని, ఆయన ఆ డబ్బును మాన్‌హట్టన్‌లో హిట్‌మ్యాన్‌కు అందచేశారని అభియోగాలలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
‘కుట్ర’ ఎలా జరిగింది?
పన్నూకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని 2023 జూన్‌లో నిఖిల్ గుప్తాకు వికాస్ యాదవ్ అందించారని అమెరికా అధికారులు చెబుతున్నారు.
‘‘ఇందులో న్యూయార్క్ నగరంలోని పన్నూ ఇంటి చిరునామా, ఆయనకు సంబంధించిన ఫోన్ నంబర్లు, రోజువారీ కార్యకలాపాల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నిఖిల్ గుప్తా హిట్‌మ్యాన్‌కు చేరవేశారు. హత్యకు కుట్ర ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని వికాస్ యాదవ్ నిఖిల్ గుప్తాను కోరినట్లు అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఆ ప్లాన్ వివరాలను, పన్నూపై నిఘా పెట్టిన సమయంలో తీసిన ఫొటోలను వికాస్ యాదవ్‌కు నిఖిల్ గుప్తా పంపించారు. పన్నూను వీలైనంత త్వరగా హత్య చేయాలని హిట్‌మ్యాన్‌ను నిఖిల్ గుప్తా కోరారు. అయితే భారత ప్రధాని అమెరికా అధికారిక పర్యటన సమయంలో మాత్రం ఈ హత్య జరగకూడదని చెప్పారు’’ అని అమెరికా పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన 2023 జూన్ 20న ప్రారంభం కావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, FB/VIRSA SINGH VALTOHA
‘ఇప్పుడు ముఖ్యమైన విషయం ఇదే’
భారత ప్రధాని 2023 జూన్ 18న అమెరికా పర్యటనకు రెండు రోజుల ముందు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఓ గురుద్వారా దగ్గర ముసుగులు ధరించిన వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేశారు.
గురుపట్వంత్ సింగ్ పన్నూకు నిజ్జర్ సహచరుడని, పన్నూ మాదిరిగానే సిక్కు వేర్పాటువాద ఉద్యమ నాయకుడని, భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారని చెబుతారు.
నిజ్జర్ హత్య జరిగిన మరుసటి రోజు 2023 జూన్ 19న నిజ్జర్ కూడా తమ లక్ష్యమని, తమకు చాలా లక్ష్యాలు ఉన్నాయని నిఖిల్ గుప్తా హిట్‌మ్యాన్‌తో చెప్పినట్టు అమెరికా కోర్టులో దాఖలు చేసిన అభియోగాలలో అధికారులు పేర్కొన్నారు.
నిజ్జర్ హత్య దృష్ట్యా పన్నూను చంపేందుకు ఇక వేచి చూడాల్సిన పని లేదని నిఖిల్ గుప్తా చెప్పినట్టు ఆ అభియోగాలలో తెలిపారు.
వికాస్ యాదవ్ 2023 జూన్ 20న నిఖిల్ గుప్తాకు పన్నూ గురించి ఒక వార్తా కథనాన్ని పంపి, ‘‘ఇప్పుడిదే ముఖ్యమైన విషయం’’ అని అన్నారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
‘ఇరు దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?’
ఈ మొత్తం వ్యవహారం భారత్, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని బీబీసీ అనిల్ త్రిగుణాయత్‌ను అడిగింది. అనిల్ పలు దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు.
‘‘ఈ సమయంలో ఈ వ్యవహారం ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. ఇలాంటి వాటికంటే తమ మధ్య సంబంధాలే కీలకమైన విషయమని రెండు దేశాలకూ తెలుసు’’ అని చెప్పారు.
"ఇది ఈ సమయంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని అనుకోవడం లేదు. ఈ ఘటనల కంటే తమ మధ్య ఉన్న విస్తృత సంబంధాలే ముఖ్యమని రెండు దేశాలకు తెలుసు. అయితే, సార్వభౌమ సూత్రాలను ఉపయోగించి తీవ్రవాదులు, వేర్పాటువాదులకు రక్షణ కల్పిస్తున్నట్టు అమెరికన్లకు బాగా తెలుసు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలి. మన వ్యూహాత్మక భాగస్వాములు మన భద్రతా సమస్యలను పట్టించుకోకపోతే, వాటిని మనమే చూసుకోవాలి. కానీ ఇది భారత్ విధానం కాదు’’ అని ఆయన చెప్పారు.
‘‘కేవలం అనుమానం ఆధారంగా ఇతర దేశాలపై బాంబులు వేసి వాటిని ధ్వంసం చేసే అమెరికా, ఇతరులు మాత్రం ఏమీ చేయకూడదని కోరుకుంటూ ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ వికాస్ యాదవ్‌ను అప్పగిస్తుందా?
ఈ మొత్తం వ్యవహారం తరువాత వికాస్ యాదవ్‌ను భారత్ అమెరికాకు అప్పగిస్తుందా అనేది ఓ పెద్ద ప్రశ్న.
అమెరికా, భారత్‌ల మధ్య 1997లో నేరస్థుల అప్పగింత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కింద వికాస్ యాదవ్‌ను అప్పగించాలని భారత్‌ను అమెరికా కోరవచ్చు.
‘‘నా అవగాహన మేరకు రెండు దేశాలు ఈ కేసును కోర్టు బయట పరిష్కరించుకోవాలి. లేదంటే ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తుంది’’ అని ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ చెప్పారు. ఆయన న్యూ దిల్లీలోని అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్‌లో స్టడీస్ అండ్ ఫారిన్ పాలసీ విభాగానికి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
‘‘ఏ దేశం కూడా తన మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని అప్పగించాలని కోరుకోదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయంపై అమెరికా, భారత్ మరో దారిని వెతకాలి. అంతిమంగా ఇవన్నీ రాజకీయపరమైన నిర్ణయాలు’’ అని ఆయన చెప్పారు.
‘‘ఈ కేసులో అమెరికా చట్టాలకు సంబంధించిన సూక్ష్మాంశాలు కూడా ఉంటాయి. ఆ పరిధిలో దేన్ని అంగీకరించాలనే విషయం తప్పనిసరిగా రాజకీయ ప్రశ్న అవుతుంది" అని ఆయన చెప్పారు.
అనిల్ త్రిగుణాయత్ మాట్లాడుతూ.. "ఈ విషయంలో అమెరికన్లు ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుని, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కానేకారని చెబితే, అమెరికన్లు దాన్ని ఏ మేరకు ముందుకు తీసుకువెళతారో చూడాలి’’ అని అన్నారు.
ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ గతంలో ముంబయి దాడుల కేసులో నిందితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా నిరాకరించింది.
మరి, వికాస్ యాదవ్ విషయంలోనూ భారత్ అదే పని చేయగలదా?
ప్రొఫెసర్ హర్ష్ పంత్ దీనిపై మాట్లాడుతూ, "విషయాన్ని సంక్లిష్టం చేయవచ్చు. ఆలస్యమూ చేయవచ్చు. దారి కూడా మళ్లించవచ్చు. లేదంటే సందర్భాన్నీ మార్చివేయవచ్చు. అమెరికాకు అప్పగించకుండా నేరస్థుల అప్పగింత ఒప్పందానికి చట్టపరమైన భాష్యాలూ చెప్పొచ్చు’’ అని తెలిపారు.
కానీ, అదే సమయంలో, దర్యాప్తుకు సహకరిస్తున్నామని భారత్ చాలా త్వరగా చెప్పింది కాబట్టి, ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రొఫెసర్ పంత్ చెప్పారు.
"అమెరికన్లు కూడా దీనిని అంగీకరించారు. ఇది కెనడా పరిస్థితికి భిన్నమైనది’’ అని పంత్ తెలిపారు.
భారత్ ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, THING
అమెరికా విచారణకు సహకరిస్తున్నట్టు భారత్ చెప్పింది. భారత్ తీరుతో సంతృప్తి చెందినట్టు అమెరికా కూడా చెప్పినట్టు ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది.
అమెరికా న్యాయ విభాగం పేర్కొన్న వ్యక్తి ఇకపై ఎంతమాత్రం భారత ప్రభుత్వ ఉద్యోగి కారని వికాస్ యాదవ్ పేరు ప్రస్తావించకుండా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.
‘‘అవును... సంబధిత వ్యక్తి భారత ప్రభుత్వంలో భాగం కాదు. ఆయన ఉద్యోగి కారు. ఇంతకు మించి మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జైస్వాల్ చెప్పారు.
దీనికి సంబంధించిన ఉన్నతస్థాయి విచారణ కమిటీ సభ్యులు అమెరికాకు వెళ్లారని జైస్వాల్ చెప్పారు.
భారత్‌తో అమెరికా పంచుకున్న విషయాలపై విచారణ జరపడానికి 2023 నవంబర్‌లో ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
‘‘మేం అమెరికా చెప్పిన విషయాలను తీవ్రంగా పరిగణించాం. అమెరికాతో సంప్రదింపుల్లోనూ ఉన్నాం. ఉన్నతస్థాయి విచారణ కమిటీకి సంబంధించిన ఇద్దరు సభ్యులు అమెరికాకు వెళ్లి, అక్కడి అధికారులతో సమావేశమయ్యారు’’ అని జైస్వాల్ తెలిపారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రా చీఫ్ సమంత్ గోయల్ తదితరులకు వ్యతిరేకంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో గురుపట్వంత్ సింగ్ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశారు.
తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆ కేసులో ఆరోపించారు. కేసులో పేర్కొన్న వ్యక్తులకు అమెరికా కోర్టు సమన్లు జారీచేసింది.
‘‘ఇది పూర్తిగా అన్యాయమైన కేసు’’ అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. పన్నూకు అక్రమ సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయం ఇది స్పష్టం చేస్తోందని తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














