గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు నిఖిల్ గుప్తా సుపారీ ఇచ్చారా? చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న ఈ నిందితుడి తరఫు లాయర్ బీబీసీతో ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ సీనియర్ రిపోర్టర్
అమెరికా పౌరసత్వం ఉన్న సిక్కు వేర్పాటు వాది గురుపట్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగిందని 2023 అక్టోబరులో అమెరికా ఆరోపణలు చేసింది.
ఈ కుట్రలో భారత పౌరుడు నిఖిల్ గుప్తా పేరును వెల్లడిస్తూ, అతడికి భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు అందాయని, టార్గెట్‌ను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా సుపారీ ఇచ్చినట్లుగా ఆరోపించింది అమెరికా. ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ పోలీసులు నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లో జైలులో ఉన్నారు నిఖిల్ గుప్తా. ఆయన తరఫున కేసు వాదిస్తున్న పెట్ర్ స్లెపిచ్కాతో బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ మాట్లాడారు.
అమెరికా మోపిన నేరాభియోగాలు, కేసు వివరాల గురించి ఆయన వివరించారు.
నిఖిల్ గుప్తాకు ఆ కేసుకు సంబంధం లేదని, నిఖిల్ గుప్తా అరెస్టులో పొరపాటు జరిగి ఉండవచ్చన్న అంశంపై అక్కడి చెక్ రిపబ్లిక్ న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తానని ఆయన చెప్పారు.
ఇంకా ఆయన ఏయే విషయాలు చెప్పారు?

పొరపాటు జరిగుండొచ్చు..
రిపోర్టర్: మీ క్లైంట్ నిఖిల్ గుప్తా ఇప్పుడు ఎక్కడున్నారు?
చెక్ రిపబ్లిక్‌లోని పాంక్రాక్ జైలులో ఉన్నారు.
రిపోర్టర్: చెక్ రిపబ్లిక్ న్యాయస్థానాల్లో ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకుని మీ వాదనలు ఉండనున్నాయి?
పెట్ర్: ఇప్పటికి మా ఢిఫెన్స్ ఏంటంటే, నిఖిల్ గుప్తాకు అమెరికాలో నమోదైన కేసుకు సంబంధం లేదు. ఆయన ఎత్తు, బరువుకు సంబంధించిన పోలికల వల్ల పొరపాటున ఆయనను అరెస్ట్ చేసి ఉండవచ్చన్నది నా అభిప్రాయం. ఇది వ్యక్తిని గుర్తించడంలో జరిగిన తప్పిదం కావచ్చు.
రిపోర్టర్: అప్పగింత విచారణల్లో అవకాశాల గురించి చెప్తారా?
పెట్ర్: చెక్ రిపబ్లిక్ అప్పగింత విచారణలో మొత్తం నాలుగు దశలుంటాయి. మొదట మున్సిపల్ కోర్టు, ఆ తరువాత హైకోర్టు, మూడవది కాన్సిస్ట్యూషనల్ కోర్టు, నాలుగోది న్యాయశాఖ నిర్ణయం.
ప్రస్తుతం మున్సిపల్ కోర్టులో విచారణ పూర్తయింది . మేం హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
రిపోర్టర్: మున్సిపల్ కోర్టు తీర్పు ఏమని వచ్చింది? అమెరికాకు నిఖిల్ గుప్తాను అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతించిందా?
పెట్ర్: అమెరికాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. అందులో పేర్కొన్న దాని ప్రకారం నిఖిల్ గుప్తాను విచారణ నిమిత్తం అమెరికాకు అప్పగిస్తారు. అది చట్టరీత్యా మొత్తంగా వారికి అప్పగించినట్లు కాదు.
రిపోర్టర్: ఈ కేసు కొనసాగడానికి ఎంత కాలం పడుతుందో మాకేమైనా చెప్పగలరా?
పెట్ర్: ఇప్పుడే చెప్పలేం. ఇదంతా చెక్ రిపబ్లిక్ అధికార యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది.
రిపోర్టర్: మీ క్లైంట్ అమెరికా అండర్ కవర్ ఏజెంట్‌తో సంభాషిస్తున్న ఆధారాలు వీడియో కాల్స్ రూపంలో ఉన్నాయని అమెరికా ప్రాసిక్యూషన్ చెప్తోంది.
పెట్ర్: అందుకు సంబంధించిన ఆధారాలేవీ మాకింకా అందలేదు. చెక్ రిపబ్లిక్ కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో అమెరికన్ ఏజెంట్ వాంగ్మూలం మాత్రమే ఉంది. మరేం లేదు.

ఫొటో సోర్స్, EPA
రిపోర్టర్: మీ క్లైంట్ వద్ద టార్గెట్‌ల జాబితా ఉందని, బహుశా నాలుగు లేదా ఐదు టార్గెట్స్ ఉన్నాయని, అంతేకాకుండా, ఆయన 15 వేల డాలర్లు సిద్ధం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, అమెరికన్ కేసులో భాగమని చెబుతున్న ఫొటో కూడా ఉందని అంటున్నారు. దీనిపై మీ స్పందనేంటి?
పెట్ర్: నాకైతే అందులో కొంత డబ్బు, ఫొటో తప్ప నాకు మరింకేమీ కనిపించలేదు. ఆ ఫొటో ఎక్కడ తీశారనేది ఎవరూ గుర్తించలేరు. అంటే, ఆ ఫొటో అమెరికాలోదా, చెక్ రిప్లబిక్‌లోదా లేదా పాకిస్తాన్‌లో తీసిందా అనేది ఎవరూ గుర్తించలేరు. అమెరికన్ ఏజెంట్ ఇచ్చిన వాంగ్మూలాన్నే గుప్తా వ్యతిరేక ఆధారాలుగా చెప్పారు. అది తప్ప మాకేం కనిపించలేదు.
రిపోర్టర్: అప్పంగిత విచారణపై చెక్ రిపబ్లిక్ న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చని మీరు భావిస్తున్నారు?
పెట్ర్: న్యాయస్థానాలకు అమెరికన్ ఏజెంట్ ఇచ్చిన వాంగ్మూలం సరిపోతుంది. సాధారణంగా అమెరికన్లు అప్పగింత విచారణకు కోరే సమయంలో వారి ఏజెంట్ల వాంగ్మూలాలను మాత్రమే పంపిస్తుంటారు.
రిపోర్టర్: అయితే, గతంలో చెక్ రిపబ్లిక్ న్యాయస్థానాలు అలాంటి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకునే, అప్పగింత విచారణలపై తీర్పులిచ్చాయా?
పెట్ర్: అవును. అది నిజం.
రిపోర్టర్: మీ కేసుపై మీరు ఎంత మేరకు విశ్వాసంగా ఉన్నారు?
పెట్ర్: న్యాయస్థానం తొలి తీర్పు అనంతరం, మేం రెండో నేరారోపణకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నాం (నవంబర్‌లో వెల్లడైంది). అందులో నేరానికి సంబంధించిన చాలా సమాచారం లభించింది కాబట్టి, మేం మా వ్యూహాలను మారుస్తాం.
అయితే, వారు ఈ నేరారోపణను ఎందుకని బహిర్గతం చేశారు?
ఓ విధంగా అది రాజకీయ కేసుగా కూడా అనిపిస్తోంది. అలాగైతే, మాకూ మంచిదే, చెక్ రిపబ్లిక్ న్యాయస్థానాలు దానిపై ఏం చెబుతాయో చూడాలి.
రిపోర్టర్: నిఖిల్ గుప్తా భారత్‌లో ఏ ప్రాంతానికి చెందిన వారు? ఏం చేస్తుంటారు?
పెట్ర్: ఆయన దిల్లీకి చెందినవారని అనుకుంటున్నాను.
రిపోర్టర్: అయితే, కొన్నిచోట్ల నిఖిల్‌గుప్తా ట్రేడర్ అని, మరికొన్ని చోట్ల ఎగుమతి, దిగుమతి వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, మరోచోట హస్తకళల వ్యాపారంలో ఉన్నాడని రాశారు.
పెట్ర్: ఆయన బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారి.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
రిపోర్టర్: గుప్తా కుటుంబం మొదట్లోనే సుప్రీం కోర్టుకు వెళ్లకుండా, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వెళ్లారు?
పెట్ర్: ఈ ప్రశ్నకు ఆయన కుటుంబ సభ్యులు బదులివ్వాలి. నేను కాదు.
రిపోర్టర్: మీరు భారత్‌లో ఉన్న మీ క్లైంట్ కుటుంబానికి కూడా సలహాలు ఇస్తున్నారా?
పెట్ర్: లేదు. నాకు భారత ప్రభుత్వం గురించి కానీ, భారత చట్టాల గురించి కానీ తెలీదు.
రిపోర్టర్: మీ లీగల్ ఫీజును ఎవరు చెల్లిస్తున్నారు? నిఖిల్ గుప్తానా? లేక భారత ఎంబసీనా?
పెట్ర్: లేదు. ఎంబసీతో నాకు ఒప్పందం ఉంది. నాకు తెలిసినంతవరకు ఎంబసీ నాతో మాట్లాడాలని అనుకోవడం లేదు.
రిపోర్టర్: అంటే, దీనర్థం ఎంబసీ నుంచి ఆయనకు కూడా అనుకున్నంత మద్దతు లభించలేదా?
పెట్ర్: నేనైతే జైలులో ఉన్న గుప్తా పరిస్థితిపై భారత ఎంబసీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఒకసారి ఈ విషయంపై ఎంబసీ కార్యాలయానికి వెళ్లినప్పుడు రెండు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది.
రిపోర్టర్: భారత ప్రభుత్వం అమెరికా ఆరోపణలను ఖండించి, మీ క్లైంట్‌కు మద్దతుగా నిలవకపోవడం పట్ల మీరు నిరాశ చెందారా?
పెట్ర్: నేను భారత అధికార యంత్రాంగం లేదా చెక్ రిపబ్లిక్ లేదా అమెరికన్ అధికార యంత్రాంగం.. ఇలా ఎవరి పట్ల నిరాశ చెందలేదు. అలాంటివి ఉండవు.
రిపోర్టర్: ప్రస్తుతం భారత్ పోషిస్తున్న పాత్ర పట్ల నిఖిల్ గుప్తా ఏ అభిప్రాయంతో ఉన్నారు?
పెట్ర్: నిఖిల్ గుప్తా నాకంటే భిన్నమైన మనస్తత్వం ఉన్నవాడు. నేను ప్రొఫెషనల్‌గా నా బాధ్యతలపై దృష్టి పెడుతున్నాను కాబట్టి, ఈ కేసుపై ఆయన అభిప్రాయాల గురించి అడగలేదు.
రిపోర్టర్: భారత ప్రభుత్వంతో సంబంధాలపై ఆయన ఏమైనా చెప్పారా?
పెట్ర్: అలాంటి సమాచారమేమీ లేదు. అమెరికా నేరారోపణ నుంచే నాకు సమాచారం తెలిసింది.
రిపోర్టర్: ప్రస్తుతం జైలులో ఉన్న గుప్తా పరిస్థితేంటి?
పెట్ర్: పాంక్రాక్ ప్రిజన్‌కు చెక్ పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం జైలులో గుప్తా ప్రాణాలకు ముప్పు ఉంది.
రిపోర్టర్: ఎవరి నుంచి ముప్పు?
పెట్ర్: ఎవరికీ తెలీదు. ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని అనుకుంటున్నాను.
రిపోర్టర్: ఆయన భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా? వాటిపట్ల ఆయన తృప్తి చెందారా?
పెట్ర్: అవును. ఆయన సురక్షితంగానే ఉన్నారు. చెక్ రిప్లబికన్ కారాగారాల్లో ఖైదీలకు భద్రత ఉంటుంది.
దీనిపై మరింత సమాచారం కోసం అటు చెక్ రిప్లబిక్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని, ఇటు విదేశాంగ మంత్రిత్వ శాఖను బీబీసీ సంప్రదించింది. అయితే, వారి నుంచి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














