భారత దౌత్యవేత్త గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్న సిక్కు కార్యకర్తలు

కారులో భారత దౌత్యవేత్త
ఫొటో క్యాప్షన్, గ్లాస్గోలోని గురుద్వారా బయట భారత దౌత్యవేత్తను అడ్డుకుంటున్న సిక్కు కార్యకర్తలు

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా దగ్గర భారత దౌత్యవేత్తను సిక్కు ఆందోళనకారులు అడ్డుకున్న ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.

స్థానిక సిక్కుల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి చర్చించేందుకు విక్రమ్ దొరైస్వామిని గురుద్వారా వద్దకు ఆహ్వనించారని, అయితే అక్కడికి వెళ్లాక ఆయనను కొంతమంది ఆందోళనకారులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చిందని భారత హైకమిషన్ తెలిపింది.

గురుద్వారాను భారతీయ అధికారులు సందర్శించడంపై చాలా కాలంగా నిషేధం ఉందని సిక్కు గ్రూప్ ఒకటి తర్వాత ప్రకటించింది.

కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడి హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనే ఆరోపణల తర్వాత వివిధ దేశాల్లోని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనేందుకు “ విశ్వసనీయమైన ఆధారాలు” ఉన్నాయన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

దౌత్యవేత్తను అడ్డుకుంటున్న ఆందోళనకారులు
ఫొటో క్యాప్షన్, దౌత్యవేత్త కారు వద్దకు వెళుతున్న సిక్కు కార్యకర్తలు

బ్రిటన్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న విక్రమ్ దొరైస్వామి స్కాట్లాండ్‌లోని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే గ్లాస్గో సంఘటన జరిగింది.

గ్లాస్గోలోని అల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలో ఆయన కారు ఆగగానే ముగ్గురు సిక్కు కార్యకర్తలు కారు దగ్గరకు వెళుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆందోళనకారుల్లో ఒకరు ఆయన కారు డోరు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన లోపలే కూర్చుని ఉండటం కనిపిస్తోంది.

“మీరు వెళ్లిపోవడం మంచిది” అని మరో ఆందోళనకారుడు ఆయనతో చెప్పారు.

దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

“భారత దౌత్యాధికారులు అధికారిక హోదాలో గురుద్వారాలను సందర్శించడంపై దీర్ఘకాలంగా ఉన్న నిషేధాన్ని కొంతమంది కార్యకర్తలు కాపాడారని సిక్కు సంస్థల ప్రతినిధిగా ఉన్న జాతీయ సిక్కు యువకుల సమాఖ్య ఒక ప్రకటన విడుదల చేసింది.

“వాళ్లు రాకుండా అడ్డుకునేందుకు, కొన్ని ప్రశ్నలు అడిగేందుకు మేము వెళ్లాం. అయితే వాళ్లు చాలా వేగంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు” అని దౌత్యవేత్త వాహనాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు చెప్పారు.

తాము దాడి చేసేందుకు వెళ్లలేదన్నారు.

‘అవమానకర సంఘటన’

గురుద్వారా కమిటీ దౌత్యవేత్తను ఆహ్వనించిందని హై కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం తెలిపింది. ఆ కమిటీలో సిక్కు నాయకులు, గురుద్వారా నిర్వాహకులు కూడా ఉన్నారని వెల్లడించింది.

“ఆందోళనకారులు అధికారులను బెదిరించారు. తిట్టారు. వారితో వాగ్వాదం, గొడవ జరక్కుండా ఉండేందుకే హై కమిషనర్, కాన్సుల్ జనరల్ ఆ ప్రాంతం నుంచి వచ్చేశారు’’ అని హై కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఇది అవమానకర సంఘటన అని, దీని గురించి విదేశాంగ శాఖకు, స్థానిక పోలీసులకు నివేదించినట్లు తెలిపింది.

ఈ ఘటనను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రి అన్నే మేరీ ట్రెవిలాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

“విదేశీ దౌత్యవేత్తల భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశం. అదే సమయంలో తమ దేశంలో ప్రార్థనా మందిరాలు అందరికీ అందుబాటులో ఉంచాలి” అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

ఈ సంఘటనను తాము ఖండిస్తున్నట్లు గ్లాస్గో గురుద్వారా కమిటీ ప్రకటించింది. తమ ఆహ్వానం మేరకు వచ్చిన దొరైస్వామి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది.

“గురుద్వారా అన్ని మతాలు, అన్ని వర్గాలు, అందరినీ స్వాగతిస్తుంది. మా సిద్ధాంతాలు, నమ్మకాల పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం” అని చెప్పింది.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గురుద్వారా దగ్గర కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమకు రిపోర్ట్ వచ్చిందని స్కాట్లాండ్ పోలీసులు చెప్పారు.

“ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విచారణ జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి” అని పోలీసు విభాగం ప్రతినిధి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)